|
గండిపేటకు గండం
|
|
హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ పరిరక్షణకోసం అమలులో ఉన్న జీవో 111ను మార్చి, పరిసర గ్రామాల్లో భూములకు మంచి విలువ వచ్చేట్టు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ జీవో ప్రకారం ఆ రెండు జలాశయాలకు 10కి.మీ. పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు కనుక, గ్రామాల్లో భూముల ధరలు పెరగడానికి వీలుగా జీవోని సవరించడానికి ప్రభుత్వం సంకల్పిస్తున్నది. తెలంగాణ తొలి ప్రభుత్వం చెప్పుకుంటున్న ఈ సంకల్పం సాధ్యాసాధ్యాలను అటుంచితే, ఈ దిశగా సాగే ఎటువంటి ప్రయత్నమైనా తెలంగాణ స్ఫూర్తికి విఘాతం కలిగించేదే అవుతుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు తన పార్టీలో చేరుతున్న సందర్భంగా కేసీఆర్ ఈ హామీని ఇచ్చినప్పటికీ, అది చేరుతున్నవారికీ, చేర్చుకుంటున్నవారికీ మధ్య జరుగుతున్న ఒక తాత్కాలిక రాజకీయ క్రీడగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ నాయకులు ఆ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఈ జీవో రద్దు కూడా ఒకటి. మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడు, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి, రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఈ జీవో విఘాతంగా ఉన్నదనీ, దానికి సవరణలు చేయిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చారు. గ్రామాల ఎంపిక విషయంలో శాసీ్త్రయత పాటించలేదనీ, ఈ 84 గ్రామాల్లో చాలా గ్రామాలు జీవో పరిధిలోకి రావనీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంలో కూడా కొత్తేమీ లేదు. అది సత్యమా, అర్థసత్యమా అన్న వివాదాన్ని పక్కనబెడితే, ఈ జీవో మీద కన్నెర్రచేసిన గత పాలకులు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసేవారు. దాదాపు ఈ రెండు దశాబ్దాల కాలంలో ఆ జీవోచుట్టూ అల్లుకున్న రాజకీయం, దానిని బలహీనపరచే ప్రయత్నాలు కూడా ఇలాగే మొదలయ్యేవి. కాకుంటే, తెలంగాణ నీటివనరుల పరిరక్షణ విషయంలో గత ప్రభుత్వాల వివక్షనీ, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా దునుమాడుతూ, ఇప్పుడు అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అదే దారిలో అడుగులు కదపడమే ఆందోళన కలిగిస్తున్నది. తమ ప్రాంతాల అభివృద్ధికి ఈ జీవో ప్రతిబంధకంగా మారిందనీ, దీన్ని సవరించాలని స్థానికులు చాలా ఏళ్ళనుంచి అడుగుతున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణమండలి (బయో కన్జర్వేషన్ జోన్)గా పరిగణిస్తూ 1996 మార్చిలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో సుమారు ఆరుమండలాల్లోని భూముల విలువ పెరగడానికీ, అభివృద్ధికీ ఆటంకంగా ఉందని వారి బాధ. ఈ పరిధికి అడుగుదూరంలో పుట్టుకొచ్చిన ఆకాశహార్మ్యాలు, చుక్కలనంటుతున్న ధరలు చూసినప్పుడు వారి ఆవేదనలో అర్థం ఉందనిపిస్తుంది. ఒకవైపు ఈ జీవోను అడ్డంపెట్టుకునే కారుచవుకగా భూములు సంపాదించి రిసార్టులు, ఫామ్ హౌస్‌లు కట్టుకున్నవారు ఉన్నారు. సాధ్యమైనన్ని గ్రామాలు దీనినుంచి మినహాయించాలన్న ఒత్తిడి గతంలో మాదిరిగానే కొత్త పాలకులపై ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలోనే, జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు అందడమూ, నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా సర్వేచేసి జీవో వర్తింపచేసిన గ్రామాలన్నీ జలాశయాల ఎగువ ప్రాంతంలోకే వస్తాయనీ, దీనిని ఏమాత్రం సవరించినా జంటజలాశయాల అస్తిత్వం దెబ్బతింటుందని ఇటీవలే ఒక నివేదిక సమర్పించడమూ జరిగింది. అయినా ఇప్పుడు అందుకు భిన్నమైన ప్రతిపాదన బలంగా ముందుకు వస్తున్నది. పర్యావరణ వేత్తలు, భాగ్యనగర ప్రేమికుల చొరవ వల్ల, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా ఉండడంతో సాధ్యం కాలేదు కానీ, మినహాయింపుల పేరిట 111కు ఎగనామం పెట్టాలనే పాలకుల సంకల్పం నిజానికి ఎప్పుడో నెరవేరిపోయి ఉండేది. జంట జలాశయాలను ఈ జీవో బలంగా కాపాడుతున్నదని కానీ, పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు లేవని కానీ అనడం లేదు. జీవోని బలహీనపరచాలని చూసిన వరుస ప్రభుత్వాలు దాని అమలు విషయంలో ఎంతటి చిత్తశుద్ధి కనబరచివుంటాయో అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ప్రభుత్వాలే సెంటర్ ఫర్ డీఎన్‌ఎ ప్రింటింగ్ వంటి సంస్థలకు ఈ పరిధిలో అనుమతులు ఇచ్చాయి. అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనూ పర్యావరణ వేత్తలు కోర్టులకు ఎక్కారు. రేస్‌కోర్సు క్లబ్బులూ, ఫార్ములా వన్ రేస్ కోర్సులూ ఆ ప్రాంతాలను దున్నేయడానికి ఎంతో తపించాయి. న్యాయస్థానాలు అడ్డం పడినప్పుడల్లా భూమి వినియోగం నిర్వచనాన్ని మార్చడానికి ఏపీఐఐసీ తపించింది. ఈ విధంగా ఉల్లంఘనలు ఉన్నా, ఇప్పటికీ ఆ ప్రాంతాలు తమ అస్తిత్వాన్ని ఎంతో కొంత కాపాడుకుంటూనే ఉన్నాయి. సామాన్యుడి దాహార్తిని తీరుస్తున్న ఈ జంట జలాశయాలను రియల్ ఎస్టేట్ పడగనుంచి కాపాడుకోవడం పర్యావరణ ప్రియులకు ఆది నుంచి సమస్యగానే ఉంది. కాస్తంత ఊపిరి తీసుకుంటున్న దశలో ఇప్పుడు మళ్ళీ ఆ భయం మొదలైంది. జంటనగరాలకు మంచి నీటిని సరఫరా చేసే విషయంలో ఇప్పటికే, ఒకదాని తరువాత ఒకటి కొత్త ప్రాజెక్టులు నెత్తిన ఎత్తుకుంటూ, సుదూర ప్రాంతాలనుంచి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం, ఈ జంటజలాశయాలకు నీరు అందే మార్గాలను మరింత సుగమం చేయవలసింది పోయి భూమి ధరల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయంలో ఆందోళనలో ఉన్నవారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసింది పోయి నేరుగా జీవోనే సవరించాలనుకోవడం సముచితం కాదు. కాదూ కూడదని ముందుకు సాగిన పక్షంలో, సవరణలకు వీలులేదంటూ సర్వోన్నత న్యాయస్థానం 2000 సంవత్సరంలో ఇచ్చిన ఆదేశాలే పర్యావరణ వేత్తలకు శ్రీరామరక్ష. ఒకవైపు మూసీనదిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలన్న వాదన బలంగా ముందుకు వస్తున్న తరుణంలో ఇటువంటి ఆలోచనలను తెలంగాణ ప్రజలు ఆమోదించలేరని ప్రభుత్వం గమనించాలి. |
వీక్షకులు
- 1,107,673 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

