చరిత్ర సృష్టించిన నేతలు
- – ఎస్.కె. సిన్హా
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీలు ఇద్దరూ జాతి గుర్తుంచుకోవలసిన గొప్ప నేతలు. వివిధ రంగాల్లో దేశానికి వీరిద్దరూ చేసిన నిరుపమానమైన సేవ ఎన్నటికీ మరువలేనిది. వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని సమైక్యం చేయడమే కాకుండా ఏడాదికాలంలో ఉపఖండంగా గుర్తింపు తీసుకొచ్చారు. లేకపోతే దేశం మొత్తం 550 ముక్కలుగా విడిపోయి ఉండేది. హైదరాబాద్ సంస్థానం తప్ప మిగిలినవన్నీ శాంతియుతంగానే ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయాయి. హైదరాబాద్‌లో భారత సైన్యం పోలీసు చర్యను చేపట్టాల్సి వచ్చింది. కేవలం ఐదురోజుల్లోనే హైదరాబాద్ సైన్యం లొంగుబాటు పూర్తయింది. ప్రాణనష్టం కనిష్ఠ స్థాయిలోనే నమోదైంది.
కేవలం ఏడాదికాలంలో మొత్తం దేశాన్ని శాంతియుతంగా సమీకృతం చేయగలగడం నిజంగా మానవాళి చరిత్రలో అపూర్వఘట్టం. ప్రష్యాకు చెందిన బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో విజయం సాధించి గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుపడ్డాడు. 1824లో డెన్మార్క్‌తో ప్రారంభమైన యుద్ధం, ఆస్ట్రియాకు అటు తర్వాత 1871లో ఫ్రాన్స్‌కు పాకింది. అయితే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన భౌగోళిక ప్రాంతాన్ని ఏకీకరించడానికి బిస్మార్క్‌కు చాలా కాలం పట్టింది.
ఒక యుద్ధనేతగా ఇందిరాగాంధీ చేసిన సేవకు దేశ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేక స్థాన మే. ఆమె సాధించిన సైనిక విజయం అసామాన్యమైంది. 92వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఆ విజయంతో కోటిమంది జనాభాతో కూడిన బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. నిక్సన్-కిసింజర్‌ల ద్వయం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇందిరాగాంధీ ఈ విజయాన్ని సాధించడం గొప్ప విశేషం. ఇదే సమయంలో పాక్‌తో చైనా మైత్రి, పర్వత శిఖరాలకంటే సమున్నతంగా, లోతైన సముద్రాలకంటే మరింత లోతుగా కొనసాగుతున్న తరుణమది. అణు శక్తితో నడిచే విమానవహక నౌకతో సహా అమెరికా సప్తమవాహక దళం, హిందూ మహాసముద్రంలో మోహరించినా పాకిస్తాన్‌కు ఏవిధమైన ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ జలాంతర్గాముల రంగప్రవేశం చేయడమే అందుకు కారణం. అప్పట్లో భారత- సోవియట్ మైత్రి, సహకారం గొప్ప రక్షణగా నిలవడమే అందు కు కారణం.
ఇక శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాలు మంచుతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల, పర్వత రహదారులన్నీ మూసుకుపోయాయి. ఫలితంగా చైనా కలుగజేసుకోవడానికి వీల్లేకపోయింది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, పార్లమెంటులో మాట్లాడుతూ ఇందిరాగాంధీని అపర దుర్గగా అభివర్ణించారు. రెండువేల సంవత్సరాల క్రితం చంద్రగుప్త వౌర్యుడు, అలెగ్జాండర్ సైన్యాధిపతి సెల్యూకస్‌పై ఘనవిజయం సాధించిన తర్వాత, మనదేశానికి లభించిన తొలి విజయం ఇది. అప్పట్లో సెల్యూకస్ అఫ్గానిస్థాన్‌ను అలెగ్జాండర్ సామ్రాజ్యంలో కలిపేసాడు. తర్వాత మధ్య యుగాల కాలంలో పశ్చిమాసియా, యూరప్ ప్రాంతాలనుంచి వచ్చిన చొరబాటుదార్ల చేతిలో మన సైన్యాలు పదే పదే పరాజయం పాలయ్యాయి.
సాధారణంగా ప్రముఖ నేతల జయంతులే కాని వర్థంతులు జరుపుకోం. ఇందుకు జాతి పిత మహాత్మాగాంధీకి మినహాయింపు. ఇక నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాం ధీల జయంతులు మాత్రమే జరుపుకుంటు న్నాం కానీ వర్ధంతులను నిర్వహించడం లేదు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పుట్టిన రోజు. అదేరోజు ఇందిరాగాంధీ అంగరక్షకుల తూటాలకు బలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ 31ని ‘జాతీయ ఏక్తా దివస్’గా ప్రకటించింది. దేశం కోసం ఇందిర చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది చర్చించాల్సిన విషయం. ఆమె విషాదాంతం దేశానికి తీరని నష్టమే అయినప్పటికీ, అకాలీ సమస్యను పరిష్కరించడంలో అనుసరించిన విధానమే తన హత్యకు కారణమైంది. ఈ నేపథ్యంలో సర్దార్ పటేల్‌ను ‘్ఫట్‌నోట్’ స్థాయికి కుదించడం చరిత్రను అధిక్షేపించడం మాత్రమే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ…సర్దార్ పటేల్‌పై దృష్టి కేంద్రీకరించడం ఎంతో సముచితమైన చర్య. ఇదే సమయంలో ఇందిరాగాంధీ బలిదానాన్ని ఆయన ప్రస్తావించకుండా ఉండలేదు. ఆమె పుట్టిన దినమైన నవంబర్ 19ను, బంగ్లాదేశ్ యుద్ధంలో సాధించిన గొప్ప విజయానికి గుర్తుగా ‘రాష్ట్రీయ శక్తిదివస్’ పేరుతో జరుపుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడాన్ని విమర్శించడం ఏమాత్రం తగనిదని గుర్తించాలి.
జవహర్‌లాల్ నెహ్రూ జయంతి నాడు భారతీయ జనతాపార్టీ ఆయనకు గొప్ప నివాళులర్పించింది. కానీ కాంగ్రెస్ ప్రథమ కుటుం బం మాత్రం ఈ సందర్భంగా పేరు ఉచ్ఛరించకుండానే మోదీపై కటువైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగని పని. ఇందిరాగాంధీ చేసిన తప్పులను ఎవ్వరూ మరువలేరు. 1972 సిమ్లా చర్చల్లో జుల్‌ఫికర్ అలీ భుట్టో ఆమెను వంచించాడు. మనవద్ద అప్పట్లో ఉన్న రెండు ‘ట్రంప్ కార్డు’లైన 92వేల మంది పాక్ సైనికులను, ‘శాకర్‌గడ్ బల్జ్’ భూభాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చివేయడం చారిత్రక తప్పిదమైంది. నియంత్రణ రేఖనే అంతర్జాతీయ సరిహద్దుగా మార్చడానికి పాక్‌ను ఒప్పించడానికి అంతకు మించిన అవకాశం మనకు రాలేదు ఇక ముందు వస్తుందని చెప్పలేం కూడ. అత్యవసర పరిస్థితి విధించి, ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఆమె చేసిన తప్పు ఎన్నటికీ క్షమార్హం కాదు. ఆమె ఉద్యోగస్వామ్యాన్ని, పోలీసు వ్యవస్థను ధ్వంసం చేశారు. న్యాయవ్యవస్థ చివరికి సైన్యాన్ని కూడా రాజకీయమయం చేసిన ఘనత ఆమెదే. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతిపై ఇందిర వ్యాఖ్యానిస్తూ ‘‘అవినీతి అనేది అంతర్జాతీయంగా కొనసాగుతున్నదే’’ అంటూ సమర్ధించుకో జూశారు. కుటుంబ పాలనను ప్రవేశపెట్టి, ప్రజాస్వామ్యంలో ఫ్యూడల్ వ్యవస్థను సుస్థిరం చేసింది కూడ ఆమెనే!
ఇక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విషయానికి వస్తే, దేశాన్ని ఏకీకరించడంతో పాటు ఎన్నో గొప్ప పనులు చేశారు. చంపరాన్‌లో నీలిమందు రైతులకు అనుకూలంగా మహాత్ముడు అహింసా ఉద్యమాన్ని చేపట్టగా, సర్దార్ పటేల్ అస్సాంలోని బార్డోలీలో అహింసా ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సర్దార్ బిరుదును పటేల్‌కు ప్రదానం చేసింది మహాత్ముడే. ఆల్ ఇండియా సర్వీసులను ఎత్తివేసి వాటి స్థానంలో సెంట్రల్ సర్వీసులు, స్టేట్ సర్వీసులను అమల్లోకి తీసుకొని రావాలని కాంగ్రెస్ భావించింది. అప్పట్లో ఐసిఎస్ మరియు ఐపిలపై తీవ్ర వ్యతిరేకత ఉండేది. స్వాతంత్య్రోద్యమ కాలంలో వీరిలో కొందరు అతిగా వ్యవహరించారన్న అపప్రధే అందుకు కారణం. అయితే అఖిల భారత సర్వీసులను కొనసాగిస్తామని సర్దార్ పటేల్ హామీ ఇవ్వడంతో ఐసిఎస్ మరియు ఐపి అధికార్లు కొనసాగడమే కాకుంగా బ్రిటిష్ ప్రభుత్వంలో మాదిరిగానే జీత భత్యాలను పొందారు. వీరి తర్వాత ఐఏఎస్, ఐపిఎస్ నియామకాలు జరిగాయి. అయితే వీరి జీతభత్యాలు తగ్గించినప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వం నాటి సదుపాయాలు మాత్రం యధాతథంగా కొనసాగించారు. కానీ దీనివల్ల దేశ విభజన సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. సీనియర్ స్థాయిల్లో ఉన్న బ్రిటిష్ అధికార్లు అకస్మాత్తుగా తమ పదవులను వదిలేసి వెళ్లిపోవడంతో, దేశ విభజన కాలంలో కొనసాగిన అరాచక పరిస్థితులను నియంత్రించడం కష్టసాధ్యమైపోయింది. సరీగ్గా ఇదే సమయంలో ఐఏఎస్ అధికార్లు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను నిర్భయంగా మంత్రులకు తెలియ జేయాలని పటేల్ స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అవి మంత్రుల ఉద్దేశాలకు విరుద్ధంగా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. అయితే అన్నీ విన్న తర్వాత మంత్రులు తీసుకున్న నిర్ణయాలను వినయ విధేయతలతో అమలు పరచాల్సిందేనని పటేల్ సివిల్ సర్వెంట్లకు నిర్మొహమాటంగా చెప్పాడు. అవినీతి మరక అంటని సచ్ఛీలుడు పటేల్. మరణించే నాటికి ఆయన బ్యాంక్ బ్యాలన్స్ కేవలం రూ. 237 మాత్రమే! ఆయన కుమారుడు లేదా కుమార్తె తండ్రి స్థాయిని తమకు అనుకూలంగా ఎన్నడూ మలచుకోవడానికి యత్నించలేదు. పటేల్ కుమార్తె, తండ్రి బాగోగులు చూసుకోవడంలోనే జీవితం గడిపింది. చివరకు అహమ్మదాబాద్‌లో దుర్భర దారిద్య్రంలో మరణించింది. అప్పట్లో మూడు తప్ప అన్ని ప్రావెన్షియల్ కమిటీలు సర్దార్ పటేల్‌ను ప్రధానిగా ఎన్నుకున్నాయి. ఆ మూడింటిలో రెండు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు, కేవలం ఒక్కటి మాత్రమే నెహ్రూకు మద్దతు పలికాయి. అయినప్పటికీ మహాత్ముడు నెహ్రూను దేశ తొలి ప్రధానిగా ఎంపిక చేశారు. సర్దార్ పటేల్ మ హాత్ముని ఆదేశాలను తలవంచుకొని పాటించారు. డిప్యూటీ ప్రధానిగా ఎంతో వినయ విధేయతలతో పనిచేశారు.
మరో మూడు వారాల్లో మరణిస్తాడనగా సర్దార్ పటేల్, అప్పటి ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాశారు. నిజంగా ఆ లేఖ, ఆయనలోని వ్యూహాత్మక దృష్టికి అద్దం పట్టింది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించడం వల్ల మనకు ప్రమాదం పొంచి ఉన్నదని అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. దురదృష్టమేమంటే నెహ్రూ ఈ లేఖనే పెడచెవిన పెట్టడం. దీని పర్యవసానం 1962లో చైనా చేతిలో భారత్ అత్యంత అవమానకరమైన ఓటమి పాలుకావడం. అటువంటి దార్శనికుడి పట్ల దేశ ప్రజల్లో చైతన్యం కలుగ జేయడానికి కృషి చేయడం మోదీ చేస్తున్న సముచిత కార్యం. తొలినాళ్లలో పటేల్‌పై తీసిన చిత్రం ఆధారంగా నూతన ప్రభుత్వం హడావుడిగా నూతన చిత్రాన్ని తీసింది. ఈ డాక్యుమెంటరీ దూరదర్శన్‌లో ప్రసారమైనా గొప్ప ప్రచారం లభించలేదు. కేవలం దీని ద్వారా సర్దార్‌కు ఇది పూర్తి న్యాయం చేసినట్టు కాదు. అటెన్‌బరో.. గాంధీపై చిత్రాన్ని తీసిన మాదిరిగానే, సర్దార్ పటేల్‌పై కూడా ఒక వాణిజ్యపరమైన చలన చిత్రాన్ని రూపొందించాలి. ఒక గొప్ప నాయకుడు దేశానికి చేసిన నిరుపమాన సేవను, ప్రజల మనోఫలకాలనుంచి తొలగించడానికి గతంలో కాంగ్రెస్ చేసిన యత్నాలన్నీ దీని ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి.

