యెర్ర బస్సు గాలి తుస్సు

ఎర్రబస్సు రివ్యూ! (18-Nov-2014)
దాదాపు ఐదేళ్ళ క్రితం ‘మేస్త్రి’లో కీలక పాత్ర పోషించిన దాసరి నారాయణరావు ఈ యేడాది ప్రారంభంలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్ బాబు మావగారికి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు… మళ్ళీ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దాసరి ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రూపొందించారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమాలో విష్ణు తాతగా దాసరికి కీ రోల్ ప్లే చేయడం విశేషం.

కథ విషయానికి వస్తే… చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన రాజేశ్ (మంచు విష్ణు)ని అన్నీ తానై తాతయ్య నారాయణ స్వామి (దాసరి నారాయణరావు) పెంచి ప్రయోజకుడిని చేస్తాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే రాజేష్ కు అమెరికా వెళ్ళాలన్నదే జీవితాశయం. ఆ ప్రయత్నంలో ఉండగానే శైలజ (కేథరిన్) అనే డెంటిస్ట్ తో తొలిచూపు ప్రేమలో పడతాడు. తాను యు.ఎస్. వెళ్ళే లోగా ఓ మూడు నెలల పాటు తన తాతయ్యను తన దగ్గరే ఉంచుకుని ఆయనతో ఆ విలువైన కాలాన్ని గడపాలని రాజేశ్ భావిస్తాడు. పాలకొల్లు నుండి తాతయ్యను హైదరాబాద్ తీసుకొస్తాడు. నగర జీవనం గురించి, సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏ మాత్రం అవగాహన లేని నారాయణ స్వామి ఇక్కడ అనేక తిప్పలు పడతాడు. ఎదుటి వాడి కష్టాన్ని తన కష్టంగా భావించే ఈ మనసున్న మొండి మనిషిని చాలా మంది అర్థం చేసుకోలేకపోతారు. ఒకానొక సమయంలో మనవడు కూడా అతన్ని అపార్థం చేసుకుంటాడు. ఆ విషయాన్ని గ్రహించిన నారాయణస్వామి తన తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే… నారాయణ స్వామి మంచి మనసును అతని చుట్టుపక్కల వాళ్లు గ్రహించారా? ముఖ్యంగా మనవడు తన తప్పును తెలుసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ!

తమిళంలో విమల్, లక్ష్మీమీనన్ జంటగా నటించిన ‘మంజాపై’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ రాజ్ కిరణ్ పోషించిన పాత్రను ఇక్కడ దాసరి ధరించారు. మానవ సంబంధాలు, అనుబంధాలు ఎక్కడైనా ఒక్కటే కాబట్టి… ఇది మన తెలుగువాళ్ళకూ నచ్చుతుందని దాసరి భావించారు. మరీ ముఖ్యంగా ఇందులోని తాత పాత్రను తాను పోషించే అవకాశం ఉండటంతో దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి ఆసక్తి చూపినట్టు అనిపిస్తుంది. ఆధునిక సాంకేతిక సదుపాయల గురించి నిన్నటి తరం వారు ఏ రకంగా పొరపాటు పడుతుంటారు, ముక్కుసూటిగా పోయే వారి మనస్తత్వం కారణంగా ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అనేది ఇందులో చాలా సునిశితంగా చూపించారు. అయితే… సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విష్ణు, డెంటిస్ట్ అయిన కేథరిన్ చీటికి మాటికి పోట్లాడుకోవడం అర్థం లేనిదిగా అనిపిస్తుంది. నాజర్ కూతురు ప్రేమించింది అతనికి సాయం చేసిన నారాయణస్వామి మనవడినే అనే విషయాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అతని గురించి అన్నీ ఆరాతీశానని చెప్పిన నాజర్… ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం! అయితే… ప్రథమార్ధంలోని చాలా సన్నివేశాలకు ద్వితీయార్ధంలో చక్కని ముగింపు ఇచ్చారు. దాంతో సినిమా చివరకు వచ్చే సరికీ ఓ రకమైన సంతృప్తి ప్రేక్షకుడికి కలుగుతుంది!
తాతామనవళ్ళుగా దాసరి, విష్ణు ఇద్దరు చక్కగానే నటించారు. అయితే సినిమా ప్రారంభ సన్నివేశాలలో మంచు విష్ణు డైలాగ్ డెలివరీ అంతా మోహన్ బాబు తరహాలో సాగడం చికాకు తెప్పిస్తుంది. కేథరిన్ దీ కాస్తంత ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. వైరు పాత్రలో రఘుబాబు చక్కగా నటించాడు. బ్రహ్మానందంపై తీసిన కాకుల కామెడీ సీన్ కంటే కూడా నెమలి కంటే కాకి ఎలా గ్రేట్ అంటూ దాసరి తీసుకున్న ప్రైవేట్ క్లాస్ బాగా పేలింది! దాసరి, సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కరుణాకర్ అర్థవంతమైన గీతాలను రాశారు, చక్రీ బాణీలు నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాలు చకచకా సాగకపోవడం ప్రధానమైన మైనస్! అలానే కృష్ణుడు, మేల్కొటే కామెడీ కూడా పెద్దంతగా పేలలేదు! ఓవర్ ఆల్ గా ‘ఎర్రబస్సు’ నిరుత్సాహాన్ని కలిగించదు కానీ మనలో కొత్త ఉత్సాహాన్నీ నింపదు!!

నా బంగారు తల్లి రివ్యూ!

‘ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా’ సినిమాతో అంతర్జాతీయంగా దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా సునీత కృష్ణన్ కు చక్కని గౌరవం ఉంది. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘నా బంగారుతల్లి’! ప్రేక్షకుల ముందుకు రావడానికంటే ముందే ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి. అలానే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు లభించాయి. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం, నాగార్జున సతీమణి అమల సినిమా విడుదలకు సహకరించడం, సునీతా కృష్ణన్ కోరిక మేరకు వందలాది మంది స్వచ్ఛందంగా విరాళాలను అందించడంతో ‘ఖచ్చితంగా ఇది మంచి సినిమా’ అనే భావన చాలామందిలో కలిగింది!

కథ లోకి వెళితే… దుర్గా (అంజలీ పాటిల్) బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్ లో స్కూల్ ఫస్ట్ రావడమే కాదు… ఆ జిల్లాలోనే ఎయిత్ ర్యాంక్ సంపాదించుకుంటుంది. అయితే ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రి శ్రీనివాసన్ (సిద్ధిక్) కే దక్కుతుందని, తనతో పాటు ఆయన్నీ సత్కరించమని స్కూల్ యాజమాన్యాన్ని కోరుతుంది. తమ ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్ళి డిగ్రీ చదవాలన్నది దుర్గ కోరిక. కానీ తండ్రి మాత్రం తమని వదిలి దూరంగా ఉండొద్దని చెబుతుంటాడు. తన కళ్ళముందు ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించలేని మనస్తత్వం దుర్గది. తండ్రి తరహాలోనే ఈ అమ్మాయి కూడా సమాజాన్ని ఉద్ధరిస్తోందంటూ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అయినా… ఆ మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు పోతూ ఉంటుంది దుర్గా. తన స్నేహితురాలి పెళ్ళిలోనే దుర్గ మనసుకు నచ్చని వ్యక్తి తారసపడతాడు. పెద్దల అంగీకారంతో విజయ్ ( రత్న శేఖర్)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లో డిగ్రీ చదవడానికి దుర్గకు అవకాశం లభిస్తుంది. తండ్రి అప్పటికే హైదరాబాద్ లో ఉండటంతో… తల్లిని ఒప్పించి… సిటీకి ఒంటరిగా బయలుదేరుతుంది. అయితే… సిటీ చేరిన దుర్గ జీవితంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి, ఈ చదువుల తల్లి ఎలాంటి ఇబ్బందుల్ని, అనూహ్య సంఘటనలను ఎదుర్కొందన్నది మిగతా కథ!

హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ కోవకే చెందిన కమల్ హాసన్ ‘మహానది’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఉంది. ఈ సినిమా మొదలు కాగానే… ‘మహానది’లా ఉందే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ సమయానికి కథ ఊహించని మలుపు తిరిగి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అలానే క్లయిమాక్స్ కూడా చాలా అర్థవంతంగానూ… సహజంగానూ ఉంది! ఇలాంటి కథలను తెరకెక్కించడానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు… మంచి మనసు, గట్టి పట్టుదల ఉండాలి. అవి రెండూ తమకు ఉన్నాయని రాజేశ్ టచ్ రివర్, సునీత కృష్ణన్ నిరూపించుకున్నారు. కథనంలో కొన్ని లోపాలు ఉన్నా… ఎంపిక చేసుకున్న కథ… నటీనటుల అభినయం మనల్ని సినిమాలో లీనమయ్యేట్టు చేస్తాయి. ముఖ్యంగా దుర్గ పాత్రను అంజలీపాటిల్ అద్భుతంగా పోషించింది. జాతీయ అవార్డుల కమిటీ అందుకే ఆమెకు ప్రత్యేక పురస్కారం అందించిందనిపిస్తుంది. అలానే ఆమె తండ్రి పాత్ర పోషించిన సిద్ధిక్ కూడా తన నటనతో మెప్పించాడు. నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును అందుకున్న శాంతను మోయిత్రా గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! పాటల్లోని సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. పేరుకు ఇది తెలుగు సినిమానే, చిత్రీకరణ కూడా అత్యధిక భాగం హైదరాబాద్ లోనే జరిగింది, అయినా… పరిచయం ఉన్న ముఖాలు రెండు మూడు కూడా లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన మైనస్! అంజలీ పాటిల్ వంటి నటి తెలుగులో దొరక్కపోవచ్చు… కానీ మిగిలిన పాత్రలకైనా ఇక్కడి వారిని తీసుకుని ఉంటే… మరింతగా తెలుగు ప్రేక్షకులలోకి ‘నా బంగారు తల్లి’ చొచ్చుకుని పోయి ఉండేది! అలా చేయకపోవడం వల్ల డబ్బింగ్ సినిమానేమో అనే భావన ప్రేక్షకులకు కలుగుతోంది! ఏదేమైనా రాజేశ్ టచ్ రివర్, సునీతా కృష్ణన్ కృషిని, పట్టుదలను అభినందించాలి!

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.