శ్రీమతి గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభ సభ
ఆత్మీయ మిత్రులు , కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ధర్మ పత్ని శ్రీమతి గుత్తికొండ రామ రత్నం గారి ప్రధమ వర్ధంతి సందర్భం గా ,సుబ్బారావు గారు ,వారికుమార్తెలు కలిసి ఏర్పరచిన ‘’గుత్తికొండ రామ రత్నం చారిటబుల్ ట్రస్ట్ ‘’మచిలీపట్నం ఆర్ .కే పాలస్ లో23-11-14-ఆదివారం ఆంద్ర ప్రదేశ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ ,హిందీ భాషా ప్రచారకులు శ్రీ యార్ల గడ్డ లక్ష్మీ ప్రసాద్ ,ప్రముఖ రచయిత శ్రీవిహారి ,కృష్ణా జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్ ఆత్మీయ అతిధిలుగా పాల్గొన్నసభలో ప్రారంభమైంది .బంధువులు ,ఆత్మీయులు ,సాహిత్య ప్రియులు సుమారు మూడొందల మంది పాల్గొని స్వర్గీయ రామ రత్నం గారి బహుముఖీనమైన సేవలను ప్రస్తుతించి సంతాపం ప్రకటించారు .ఆమె స్మ్రుతి చిహ్నం గా ట్రస్ట్ వెలువరించిన ‘’స్మ్రుతి గీతి’’అనే ఫోటో దృశ్యమాలికను శ్రీ లక్ష్మీ ప్రసాద్ ,డా పూర్ణ చంద్ రాసిన ‘’తెలుగే ప్రాచీనం ‘’అన్నపుస్తకానికి శ్రీమతి తుర్లపాటిరాజేశ్వరి శ్రీ మూర్తి దంపతులు చేసిన ఆంగ్లానువాదం ‘’Telugu –Antiquity’’గ్రంధాన్ని శ్రీ బుద్ధ ప్రసాద్ ఆవిష్కరించారు .వేదిక మీది పెద్దలే కాక సుబ్బారావు గారి అమ్మాయిలూ ముగ్గురూ ,వారి బన్ధువులు , సభలోని సాహితీప్రియులు కూడా రామ రత్నం గారి జీవిత విశేషాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఘన నివాళి అర్పించారు .ఏంతో హుందాగా ఆత్మీయం గా భోవోద్వేగం గా కన్నీటి పర్యంతంగా భారహృదయంతో ఇంతమంది పాల్గొని నిజమైన ఆత్మీయమైన శ్రద్ధాంజలి ఘటించటం అపూర్వమనిపించింది .వారందరి మాటల్లోని భావాన్ని మాత్రం పొందుపరుస్తున్నాను .

‘’శ్రీమతి రామ రత్నం గారు అర్ధాంగి అనే పేరు కు అసలైన నిర్వచనం .తాను కాలికరిగిపోతూ కూడా వెలుగు నిచ్చే కొవ్వోత్తి లాగా ఆమె 18సంవత్సరాలు గా తీవ్ర వ్యాధితో చిక్కి శల్యమై పోతున్నా ,ద్రవాహారం మాత్రమె తీసుకొని జీవిస్తున్నా ఏనాడు జీవితం పై విరక్తి పెంచు కోని వ్యక్తీ .నలుగురీ ఉపయోగపడాలన్న కోరికే ఆవిడను అంతకాలం జీవింప జేసింది .తన పిల్లలు మిగిలిన వారిపిల్లల లాగా ఉన్నత విద్య నేర్చి గొప్ప ఉద్యోగాలు చేసి స్వంతం గా నిలబడాలన్న ధ్యేయం తో వారిని పెంచి తీర్చి, దిద్ది సఫలమనోరధ అయింది .ఏదైనా మనసులో అనుకొంటే అది పూర్తీ అయ్యేదాకా నిద్రపోని కృషి ,పట్టుదల కల మహిళ.ఒక రకంగా ఆమె ‘’స్వయం సిద్ధ’’. భర్త సుబ్బారావు గారు సాహిత్యోపజీవి .ఆయన సాహిత్య వ్యాసం గానికి పూర్తీ సహకారం అందించి ,తన అనారోగ్యం మూలం గా ఆయన్ను వాటికీ దూరం కాకుండా చూసిన అపూర్వ మనస్తత్వం ఆమెది .ఆయనపుస్తక ముద్రణకు డబ్బు లేకపోతె తన మంగళసూత్రాన్ని అమ్మటానికి సిద్ధపడిన త్యాగ మూర్తి .భర్త ఆదాయానికి సాయపడాలని ఇంట్లోనే’’ గ్రుహ ప్రియ ‘’స్వీట్ షాప్ పెట్టి యెన్దరకో ఉద్యోగం కల్పించి,మంచి యాజమాన్యం తో పర్య వేక్షణతో నాణ్యమైన పదార్ధాలతో ,అందరింటే చవకగా అందిస్తూ ఆదాయాన్నెకాక అందరి అభిమానాన్ని షాపు పొందేట్లు చేసిన సమర్ధురాలు .అందుకే రోటరీక్లబ్ వారు ఆమెను ఉత్తమ పారిశ్రామిక వేత్తగా గుర్తించి ఘన సన్మానం చేశారు .
బంధువులందరికీ ఆప్యాయతను పంచిపెట్టిన ఉత్తమా ఇల్లాలు .తన మనసులోని కోరికను భర్త గుర్తిన్చేట్లు ,ఆయన మనసెరిగి ప్రవర్తించిన సాధ్వి తాను మరణం అంచున ఉన్నా ఎవరికే కష్టం వచ్చినా ఆదుకొని ధైర్యం చెప్పి సముదాయించే స్తిత ప్రజ్ఞు రాలు . అయిదు నిముషాలలో మ్మృత్యువు కబళించ బోతోంది అని తెలిసి కూడా అమెరికా నుంచి కూతురు వచ్చినా ,ఆమె యోగ క్షేమ విచారణ కంటే ముందుగా కూతురు చేత హాస్పిటల్ లో తను సేవచేసిన నర్సులు ,వార్డ్ బాయ్ లకు కృతజ్ఞతాపూర్వకం గా డబ్బు ను ఇప్పించిన అపూర్వ నారీరత్నం శ్రీమతి రామ రత్నం .ఆమెకున్న మొక్క వోని ఆత్మ విశ్వాసం ,నమ్మకం ,పట్టుదల కార్య దీక్ష తమను ఇంతటి వారిని చేశాయని కుమార్తెలు అశ్రునయనాలతో జ్నప్తికి తెచ్చు కోవటం అందరిని కదిలించి వేసింది .మరణానికి సుమారు ఏడాది ముందు జగ్గయ్య పేట దగ్గరున్న ముత్యాల వద్ద ఉన్న శైవ క్షేత్రం లో దేవుడి మీద పెద్దగా నమ్మకం లేని భర్త సుబ్బారావు గారిని ఒప్పించి భార్యా భర్తలిద్దరూ పూనుకొని ఓపికగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి శివ లింగాన్ని ప్రతిస్టిం చారు. ఇది వారిద్దరి దాంపత్య జీవితం లో అపూర్వ సన్నివేశం .ఇంట్లో వ్యాధితో బాధ పడుతున్న భార్యను అన్నేళ్ళు చూస్తూ యెంత తల్లడిల్లి మనో వ్యధ చెందారో సుబ్బారావు గారు ?తలచుకొంటె గుండె చెరువవుతుంది .అయ్యో భర్తను ఇంత క్షోభ పెడుతున్నానే అని ఆ తల్లి యెంత మనో వేదనకు గురైందో ఊహించలేము .ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అన్యోన్యం గా ఆదర్శం గా జీవితం సాగించిన వారిద్దరూ అభినందనీయులు .’’ఆర్ .కే. పారడైజ్’’ లో జరిగిన ఈ సభ ను చూస్తె శ్రీమతి రామ రార్ణం గారు చేసిన గుప్తదానాలు ,సాంఘిక సేవ ,ధర్మా చరణ సాదు శీలత ,మనో నైర్మల్యం ,ప్రేమానురాగాలు ,మానవీయత ,అజాత శత్రుత్వం మనోబలం కార్య శూరత ఆమెకు తప్పక’’ పారడైజ్ ‘’అంటే స్వర్గ ప్రాప్తి కలిగిస్తుందని అని పించింది .
రామ రత్నం గారి పేర ఏర్పడిన ఈ దార్మి సంస్థ ముఖ్యం గా పేద బాలికల విద్యాభి వృద్ధికి,వారి కాళ్ళ మీద వారు నిలబడి స్తిరమైన ఆదాయాన్ని సంపాదిం చు కోవటానికి దోహద పడే సంస్థ అని నిర్వాహులు తెలియ జేశారు .సంస్థ దిన దిన ప్రవర్ధమానమై ,అర్హులు చేదోడుగా నిలిచి అభివృద్ధి చెందాలని వక్తలందరూ అభిలషించారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-11-14-ఉయ్యూరు

