శేషప్పకవి సామాజిక చిత్రణ
- – తిరునగరి, 9392465475
- 24/11/2014
తెలుగు సాహిత్యంలో శతక వాఙ్మయానికి ఓ విశిష్టత ఉంది. ప్రతి శతక కర్త తన నాటి సమాజాన్ని తాను రచించిన శతకంలో ప్రస్తావించాడు. ఆ సమాజంలోని ఎగుడుదిగుళ్ళను ఎత్తిచూపించాడు. అప్పటి పాలకుల దుర్నీతినీ, దుశ్శాసనాల్నీ ఖండించాడు. ప్రజల బాధలను, వేదనలనూ ఎలుగెత్తి చాటాడు. అది నీతి శతకం కావచ్చు, భక్తి శతకం కావచ్చు. ఆ కాలంనాటి సమాజం పద్యాలలో కన్పిస్తుంది. తెలుగునాట ప్రశస్తికెక్కిన ‘నరసింహ శతకం’ శతక కర్త శేషప్ప కవి. ఈ కవి 1780-1800 ప్రాంతం వాడని సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. నరసింహ శతకంలో శేషప్ప నాటి సమాజాన్ని, ప్రజా జీవనాన్నీ కొన్ని పద్యాలలో ప్రస్తావించాడు. శేషప్ప కవి సమాజావలోకనాన్ని ఎత్తి చూపించడానికి అతని పద్యాలే నిత్య సత్యాలు.
అధిక విద్యావంతులప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జనవిరోధంబాయె
వదరుపోతుల మాట వాసికెక్కె
ధర్మవాసనపరుల్ దారిద్య్రమొందిరి
పరమ లోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి
దుష్టమానవులు వర్ధిష్టులైరి
పక్షివాహన! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె బాటుమాకు
భూషణవికాస శ్రీ్ధర్మపురి నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
కరీంనగరం జిల్లాలోని ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారిని సంబోధిస్తూ చెప్పిన శతకమిది. శేషప్ప తన కాలంనాటి వికృతులను, వైపరీత్యాలను పై పద్యంలో వివరించాడు. వ్యాఖ్యానం అవసరం లేనంత సరళభాష శేషప్ప కవిది. ప్రతి పాఠకుని మదిని కదిలించే పద్యం. విద్యావంతులు, సత్యవంతులు, ధార్మికులు, పుణ్యవంతులు బాధలు పడడం, పూర్ణశుంఠలు, వదరుబోతులు పరమలోభులు, దుష్టమానవులు వెలిగిపోవడం కాలవైపరీత్యమంటూ బలహీనులైన వారికి నీవే రక్ష అని దైవాన్ని ప్రార్థించాడు కవి.
‘జందెమింపుగవేసి సంధ్యవార్చిననేమి?
బ్రహ్మమందకకాడు బ్రాహ్మణుడు
తిరుమణి శ్రీచూర్ణగురురేఫలిడినను
విష్ణునొందకకాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిననేమి?
శంభునొందక కాడు శైవజనుడు
కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి?
యాశపోవకకాడు యతివరుండు
ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన
గురుని చెందక సన్ముక్తి దొరకబోదు
– అంటూ లౌకిక వేషాలు వేసే పరమధముల బండారాన్ని బయటపెట్టాడు. పరుల ద్రవ్యంమీద బ్రీతినొందిన వారిని, పరకాంతలనపేక్షపడే వారిని, సభలలోపల నిల్చి చాటి చెప్పేవాళ్ళను. పక్షపాత సాక్ష్యం పలికే వాళ్ళను, విష్ణుదాసులను వెక్కిరించేవాళ్ళను, ధర్మసాధువులను తిట్టేవాళ్ళను, ప్రజలను, జంతువులను హింసించే పాతకులను కవి నిందించిన తీరు (54వ పద్యం) అప్పటి సమాజంలో ఉన్న దుర్మార్గాన్ని తేటతెల్లం చేస్తుంది. వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వసిష్టుడు, వాల్మీకి, గుహుడు, శ్రీశుకుడు, శబరి వంటి మహాత్ములకు కులమేదని ప్రశ్నిస్తూ భగవంతుని కృపా పాత్రులకు కులం లేదని (74వ పద్యం) చెప్పాడు. తన నాటి వ్యవస్థలోని కులభేదాలను శేషప్ప ఖండించాడు.
మాన్యంబులీయ సమర్ధుడొక్కడుం లేడు
మాన్యముల్ చెరుప సమర్థులంత
యెండిన యూళ్ళగోడెరిగింపడెప్పుడు
పండిన యూళ్ళకు ప్రభువులంత
యితడు పేదయటంచు నెరిగింపడెవ్వడు
కలవారి సిరులెన్నగలరు చాల
దనయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు
బెరకాంత తప్పెన్న పెద్దలంత
యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి
ప్రభువు తప్పులటంచును పలుకవలెను (14వ పద్యం) – అంటూ నాటి సంఘంలోని అసమానతలను, అన్యాయాలను, అక్రమ పద్ధతులను తూర్పారపట్టాడు శేషప్పకవి.
నరసింహ శతకంలోని పద్యాలను నిశితంగా పరిశీలిస్తే, శేషప్పకవి తననాటి సమాజాన్ని ఎంతగా చూచాడో, అధ్యయనం చేశాడో గ్రహించవచ్చు. కొన్ని పద్యాలను మాత్రమే ఉదహరించాను. శతకాన్ని సాంతం చదివి ఆకళింపు చేసుకోవలసినవారు సహృదయులైన పాఠకులు.
‘నరసింహ శతకము ఇంత జనరంజకమగుటకు కారణములు కలవు. ఈతడు సామాన్య జనుడగుటచే జనసామాన్యమునకుగల కష్టనిష్ఠురములను గ్రహించినవాడు. వినయము వలన వివేకియగుటచే అపూర్వ విషయములనందుకొనక సామాన్య భావములనే సరసముగా, హృదయంగమముగా నొదుగునట్లు మనోజ్ఞ సీసపద్యములు చెప్పినాడు’ అన్నారు ఇతి శివశంకరస్వామి.

