కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

కాశ్మీర్ ప్రజల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి

  • -స్వపన్ దాస్‌గుప్తా
  • 29/11/2014
TAGS:

జమ్ముకాశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం, ఏవిధమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం నిజంగా భారత ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటినట్టయింది. రాష్ట్ర ప్రజల్లో చొరబాట్లపై నెలకొనివున్న తీవ్ర వ్యతిరేకతను, ఈ ఎన్నికలు ధ్రువపరిచాయి. ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం విధించడం వల్ల, విశే్లషకులు తగిన ఆధారాల కోసం మీడియా రిపోర్టులపైనే ఆధారపడక తప్పదు. ఇవి విస్తృతంగా మూడు అంశాలను మనకు తెలియజేస్తున్నాయి. మొదటిది, ముఫ్తీ మహమ్మద్ సరుూద్ కుమార్తె మహబూబా ముఫ్తీ నేతృత్వలోని పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ కాశ్మీర్‌లోని 46 స్థానాల్లో లాభం పొందబోతున్నది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్, దాని సహచర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోవడం ఖాయం. రెండవది భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో బలోపేతమైందనేది స్పష్టమైంది. బహుశా జమ్ము ప్రాంతానికి చెందిన వ్యక్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు హురియత్ కాన్ఫరెన్స్‌తో తప్పనిసరి పరిస్థితుల్లో అంటీముట్టని విధంగా సంబంధాలు నెరపుతున్న వారు ప్రస్తుత ఓటింగ్‌లో పాల్గొనడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఇక చివరిగా గత సాధారణ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన మూడు లోక్‌సభ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విజయాన్ని నమోదు చేసుకోబోతున్నది. జమ్ములో భాజపా బలోపేతమయిందంటే..అక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పూర్తిగా దెబ్బతినడమే కారణం. ఇక లఢక్ ప్రాంతంలో భాజపా తన ఉనికిని చాలా శక్తివంతమైన రీతిలో చాటడమే కాకుండా, కాశ్మీర్ లోయలోని ఆ రు నియోజక వర్గాల్లో దూసుకుపోతున్నది.
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలున్నాయి. రాష్ట్రంలో సువిశాల ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీ స్థానాల్లో, భాజపా 44+ స్థానాల్లో ఎంతవరకు విజయాలను నమోదు చేస్తుందనేది ప్రశ్నార్థకం. జమ్ము, లఢక్ ప్రాంతాల్లో మొ త్తం స్థానాలను గెలుచుకున్నా, కాశ్మీర్ లోయలోని ఆరుస్థానాలను ఆశ్చర్యం కలిగించే రీతిలో కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 44+ చేరుకోవడం సాధ్యమవుతుందా అన్నది విశే్లషకులను వేధిస్తున్న ప్రశ్న. అయితే ఒక్కటి మాత్రం నిజం. పార్టీ పనితీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ భాజపా జమ్ము కాశ్మీర్ రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందనేది మాత్రం ముమ్మూటికీ నిజం. ఢిల్లీకి చెందిన ఒక విలేకరి కాశ్మీర్ లోయలో ఎన్నికల ప్రచార సరళిని కవర్ చేయడానికి వెళ్ళారు. కాశ్మీర్‌లోయలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లకోసం ప్రచారం చేయడం ఆమెను ఎంతో అబ్బుర పరచింది.‘‘ కొద్ది సంవత్సరాల క్రితం భాజపా అభ్యర్థులు ఆవిధంగా ప్రచారం చేసే పరిస్థితే ఉండేది కాదు. ఒకవేళ ధైర్యం చేసినా దాడికి గురి కావడమో కొన్ని సందర్భాల్లో ప్రాణహాని కూడా జరిగేది.’’
కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంభవించిన వరదలు విలయాన్ని సృష్టించినప్పుడు, సహాయ కార్యకలాపాల్లో పాల్గొన్న మన సైనికులు అందించిన సేవ లు, లోయ ప్రజల్లో భాజపా అభ్యర్థుల పట్ల వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి కారణమని చెప్పవచ్చు. మరో అభిప్రాయం ఏమంటే..మిగిలిన భారత ప్రజల మాదిరిగానే నూతన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశం కల్పించాలన్న భావన ప్రజల్లో బలంగా నాటుకొని పోవడం వల్ల కూడా కావచ్చు. పూర్తిగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాట్లో పెట్టడానికి నరేంద్ర మోదీ యత్నిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. అన్నింటికంటే ఆసక్తి కలిగించే అంశం మహబూబా ముఫ్తీ ఎన్నికల ప్రచారంలో స్మార్ట్ సిటీల గురించి మాట్లాడటం! నేషనల్ కాన్ఫరెన్స్ పాలనా రాహిత్యాన్ని ఒకపక్క ఎండగడుతూనే మరోపక్క స్మార్ట్ సిటీల ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడటం గొప్ప విశేషం.
అంతమాత్రం చేత రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రకియకు పెద్ద ఆటంకంగా మారిన 370వ అధికరణాన్ని తొలగించాలన్న భాజపా అభిప్రాయానికి రాష్ట్రంలో మద్దతు లభిస్తున్నదని కాదు. ఢిల్లీ మీడియా అనవసరంగా ఊహాజనితమైన వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిచ్చిందనే చెప్పాలి. మరో ఆసక్తికరమైన అంశమేమంటే..జమ్ము కాశ్మీర్‌ను ఇండియన్ యూనియన్‌లో పూర్తిగా విలీనం చేయాలన్న అంశంలో పూర్తి సానుకూల స్థితి ఉన్నదని చెప్పవచ్చు. ఇస్లామిక్ గుర్తింపును ఏమాత్రం చెక్కుచెదరనీయకుండానే భాజపా దీన్ని సాధించడం విశేషం. బహుకాలంగా జమ్ముకాశ్మీర్ రాజకీయ నిర్వాసితులకు ఆశ్రయంగా మారుతున్న మాట నిజం. వీరివన్నీ కృత్రిమ సంక్షోభానికి దారితీసే అజెండాలే. వీటిల్లో కొన్ని సమస్యలు కేవలం పాకిస్తాన్ కోణంలోవి. ఈ అన్యమనస్కత, ఆసక్తి అనేవి ఉగ్రవాదం కేంద్రంగా కలవి కావు. కానీ జాతీయ సమస్యలకు బహు పరిష్కారాల కేంద్రంగా కలవి. పరిపాలనా విధానాల్లో అద్భుతమైన మార్పు వస్తుందని, మానవహక్కుల ఉల్లంఘన పట్ల అది తీవ్ర ప్రతిస్పందనతో కూడినదై ఉంటుందని మరికొందరి భావన. అయితే వీరందరి పరిశీలనలు అప్రమాణికమైనవి కావు. కానీ జమ్ము కాశ్మీర్ గురించిన కొన్ని వాస్తవాలను గుర్తుంచుకోవాలి. అందులో మొదటిది కాశ్మీర్ లోయ భారత ప్రమాణాల ప్రకారం అభివృద్ధి చందనిది లేదా పేదరికంలో మగ్గుతున్న ప్రాంతం కాదు. దీనికి విరుద్ధంగా జమ్ము ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తమ ప్రాంతంలోని వనరులను అభివృద్ధికోసం వినియోగించడంలో వహిస్తున్న నిర్లక్ష్యానికి కారణం కేవలం ఢిల్లీ మాత్రమే! తాము వినయ విధేయతలతో ఉండటాన్ని ఢిల్లీ అలుసుగా తీసుకుంటున్నదన్న భావం జమ్ము ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక రెండవది కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్నది కాశ్మీర్ లోయ ప్రాంతం మాత్రమే. రాష్ట్రంలో అర్థవంతమైన అంతర్గత ఆదాయాన్ని సృష్టించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇక్కడి ప్రజలపై విధించే పన్నులు చాలా తక్కువ. వీరికిచ్చే సబ్సిడీల మొత్తం మరింత ఎక్కువ.
జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం వల్ల..ప్రభుత్వం పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తుందని లేదా అందిస్తున్న సబ్సిడీలను ఒకేసారి ఎత్తివేస్తుందని లేదా అభివృద్ధి నిధులను నిలిపివేస్తుందని ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చేయాల్సింది ఒకటుంది. అసలు ఖర్చు పెడుతున్న నిధులు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయనేదానిపై లోతైన ఆడిటింగ్ నిర్వహించాలి. జాతీయ జనజీవన స్రవంతిలో విలీనం కావడం విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే, జమ్ము కాశ్మీర్ పూర్తిగా వక్రించిన వ్యావహారిక సత్తావాదంతో నిండిపోయింది. దీని ఫలితంగా స్థానికంగా పెద్దలుగా చెలామణీ అయ్యేవారిలో చాలామంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడటం సాధారణమైపోయింది. ఈ అనైతిక రాష్ట్ర నాయకులు భారత్‌కు చేసిన నష్టం లెక్కించడం సాధ్యం కాదు.
గతంలో జరిగిన ఎన్నికలతో పోలీస్తే ఈసారి జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఎన్నికల విషయంలో సర్వే సర్వత్రా ప్రశంసలే వినవచ్చాయి. భాజపా రంగంలో ఉండటం, ఎన్నికలు బహిష్కరించాలన్న ప్రచారం లేకపోవడం మొత్తం పరిస్థితినే మార్చివేసింది. జమ్ముకాశ్మీర్‌లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం రాష్ట్రాన్ని భిన్న పథంలో నిర్మించాలి. ఇప్పటి వరకు ఉన్నదానికంటే భిన్న మార్గంలో పయనించాలి. అయినప్పటికీ అదనపు ప్రోత్సాహం చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సైన్యాన్ని తొలగించి, వారిస్థానంలో సుశిక్షితులైన పారామిలిటరీ దళాలను ఉంచడం శ్రేయస్కరం. దీన్ని ఒక్కసారి ప్రభుత్వం పరిశీలించాలి. కేవలం నియంత్రణ రేఖవద్ద మాత్రమే భారత సైన్యం చురుగ్గా పనిచేయాలి. చొరబాట్లను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.
ఎన్నికల ఫలితాలు వచ్చి, వీటిని జీర్ణం చేసుకున్న తర్వాత జమ్ము కాశ్మీర్‌పై ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించుకోవాలి.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.