అంతకంతకూ పెరుగుతున్న యాగంటి బసవన్న
- – దాసరి దుర్గాప్రసాద్
- 24/11/2014
సర్వకాల సర్వావస్థలలోనూ నిరాకారుడు నిస్సంగుడు అయన భగవంతుని ఉనికి గోచరిస్తుందిక్కడ. బోళాశంకరుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి తన భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నడుమ ఈ క్షేత్రం అలరారుతుంది. యాగంటి అతి పురాతన శైవ క్షేత్రం. చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడికోసం యాగంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. అతనికి ఓ రోజు ఓ పెద్దపులి కనిపించింది. అది సాక్షాత్తు శివుడే అని గ్రహించిన చిట్టెప్ప ‘నేగంటి శివుని నేగంటి’ అని ఆనందంగా అరిచాడు. దాంతో ఆ ప్రదేశానికి ‘నేగంటి’ అనే పేరు వచ్చి క్రమంగా అది ‘యాగంటి’గా రూపాంతరం చెందింది.
నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే యాగంటి దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. శివమహాదేవుడు ఈ క్షేత్రాన్ని తన నివాస స్థలంగా చేసుకోవడానికి కారణం ఇదే. యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయం అతి పురాతనమైనది. అడుగడుగూ ఆధ్యాత్మికానుభూతులతోపాటు విశేషమైన పౌరాణిక గాథలతో ముడిపడి ఉన్న క్షేత్రమిది.
15వ శతాబ్దంలో విజయనగర రాజైన హరిహర బుక్కరాయలు యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం వచ్చిన రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.
ఈ ఆలయానికి ముందు పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి దాటుకుని ముందుకి వెళితే అల్లంత దూరంనుంచే ఆలయ రాజగోపురం తేజో విరాజమానమవుతుంది. వివిధ దేవతామూర్తుల శిల్పాలతో ఇది అలరారుతుంది. మెట్లమీదుగా ఈ రాజగోపురాన్ని దాటి భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇక్కడ ఒకపక్క అలనాటి రాతి శాసనాలు, ఎదురుగా ధ్వజస్థంభము, దృష్టి మండపం మనకు గోచరిస్తాయ. ఈ మండపంలో శివలింగమొకటి ఉంది. గర్భాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఇక్కడ కొలువుదీరిన ఉమామహేశ్వరస్వామిని సాక్షాత్తు అగస్త్యుడు ప్రతిష్టించాడు. పానవట్టంపై ఉన్న లింగం మీద శివపార్వతుల మూర్తులున్నాయి. అగస్త్యుని అభీష్టం మేరకు ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివార్లు కొలువుదీరారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి. ఆ స్వామి ఇక్కడ మరోపక్క ఆలయ ప్రాంగణంలో కొలువుదీరాడు. శివుని అంశతో పుట్టిన వీరభద్రస్వామి సర్వాభరణ భూషితమై శోభాయమానంగా కానవస్తాడు. స్వామి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
వెనకవైపు భాగంలో కేదారేశ్వరస్వామి మందిరం ఉంది. ఈ కేదారేశ్వరస్వామి దర్శనం పంచమహాపాతకాలను దూరం చేస్తుంది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వరుడూ కొలువుదీరాడు.ఇక్కడి పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అంటారు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చిందంటారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో వుండడమేఇక్కడి విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయవౌతాయని అంటారు. ఇక్కడవేంకటేశ్వరస్వామి గుహ ఉంది. దీనిని చేరుకోవడానికి సోపాన మార్గం ఉంది. ఈ గుహలో అగస్త్యమహర్షి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. యాగంటిలో తొలుత ప్రతిష్టించాలనుకున్న విగ్రహమిదే. ఈ విగ్రహంలోని ఒక భాగం ఇప్పటికీ భిన్నమైనట్లు భక్తులు గమనించవచ్చు. దీనిని పక్కగా శంకర గుహ ఉంది. దీనిని రోకళ్ళ గుహ అని కూడా అంటారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ గుహలోనే తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని చెబుతారు. ఈ గుహలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం అచ్చెమ్మ విగ్రహంతోపాటు శంకర లింగాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.
యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో ఉన్న మరో ప్రధానాకర్షణ ఇక్కడున్న బసవన్న విగ్రహం. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఉదహరించిన నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ నంది విగ్రహం రోజురోజుకి పెరుగుతుంటుంది. ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.
ఇక యాగంటిలో కాకి కనిపించదు. కారణమేమిటంటే- పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యమహర్షి అక్కడ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సుచేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతారు.
ఈ ఆలయానికి కుడివైపువున్న కొండమీద దాదాపు నూట యాభై అడుగుల ఎత్తున అనేక ప్రకృతి సిద్ధమైన గుహలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి. 12మెట్లు ఎక్కి వెళ్తే ముందర అగస్త్య గుహవస్తుంది. అగస్త్యుడు ఇక్కడ చాలాకాలం తపస్సు చేసాడని ప్రతీతి. ఇదేకాక యాగంటిలో మరికొన్ని గుహలు ఉన్నాయి. ఓ విశేషమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే మహత్తర క్షేత్రం యాగంటి. ఇక్కడి శ్రీ ఉమామహేశ్వరస్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.
===============
యాగంటికి మార్గం
కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో బనగానపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం వుంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి కర్నూలు వరకు వచ్చి అక్కడ నుంచి బస్సులో చేరుకోవచ్చు. అలాగే బనగానపల్లి వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. వసతి సౌకర్యం: యాగంటిలో బస చేయడానికి వసతి సౌకర్యం వుంది. సత్రాలు, కాటేజీలు ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
===============

