మూవీ మొఘల్‌ మరిలేరు

మూవీ మొఘల్‌ మరిలేరు

కేన్సర్‌తో రామానాయుడు కన్నుమూత
దాదాపు 5 దశాబ్దాల కెరీర్‌.. 13 భాషల్లో 140 చిత్రాల నిర్మాణం
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డ్‌
ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో స్థానం
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం.. నేడు అంత్యక్రియలు
తెలుగు సినిమా పెద్దదిక్కుల్లో ఆయన ఒకరు… ఘన విజయాలకు ఆయన ఓ చిరునామా.. సినీ నిర్మాతలకు ఆయన ఓ పెద్ద బాల శిక్ష… అమ్మానాన్నలు పెట్టిన పేరు… రామానాయుడు! సినీ పరిశ్రమ ఆయనకు పెట్టిన పేరు ‘మూవీ మొఘల్‌’! ఎన్నో ఘనతలు, మరెన్నో రికార్డులు, ఇంకెన్నో విజయాలు సొంతం చేసుకున్న ఆ స్టార్‌ ప్రొడ్యూసర్‌.. డి.రామానాయుడు (79) ఇక లేరు! నలుగురు సంగీత దర్శకులను… ఆరుగురు హీరోలను…. 14 మంది హీరోయిన్లను… 24 మంది దర్శకులను పరిచయం చేసిన… 13 భాషల్లో 140 చిత్రాల స్టార్‌ ప్రొడ్యూసర్‌!!
రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారాల్లో అడుగుపెట్టి చివరికి సినిమాల్లో స్థిరపడి.. ఆయన సాగించిన విజయ ప్రస్థానం ఆగిపోయింది. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న రామానాయుడు బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో… తెలుగు చిత్ర పరిశ్రమ మూగబోయినట్లయింది. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఖిన్నులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ‘మూవీ మొఘల్‌’కు నివాళులర్పించారు.
హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా 13 భారతీయ భాషల్లో 140 చిత్రాలు నిర్మించి.. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్‌ రికార్డు సాధించిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. మూవీ మొఘల్‌.. దగ్గుబాటి రామానాయుడు(79) ఇక లేరు! కొంతకాలంగా ప్రొస్టేట్‌ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు సురేశ్‌, వెంకటేశ్‌, కుమార్తె లక్ష్మి ఉన్నారు. ప్రజల సందర్శనార్థం గురువారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని రామానాయుడు స్టూడియోస్‌లో ఉంచి, మధాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని రామానాయుడు కుమారుడు వెంకటేశ్‌ తెలిపారు.
కారంచేడులో పుట్టి.. పెరిగి..
రామానాయుడు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కారంచేడు. 1936 జూన్‌ 6న దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. మూడేళ్ల పసి వయసులోనే మాతృమూర్తిని కోల్పోయారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన తొమ్మిదేళ్ల చిరు ప్రాయంలో పెద్ద మనసు ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచారు రామానాయుడు. భూదానోద్యమంలో భాగంగా 1945లో ఆచార్య వినోబా భావే కారంచేడుకు వెళ్లినప్పుడు.. ‘నా వంతుగా రెండున్నర ఎకరాలు ఇస్తాను’ అని ప్రకటించారు. కొడుకు మాటను మన్నిస్తూ ఆయన తండ్రి రెండున్నర ఎకరాల భూమిని ముగ్గురు వ్యవసాయ కూలీలకు పంచారు. ఆ తర్వాత.. ఒంగోలులోని బంధువుల ఇంట్లో ఉండి ఎ.బి.ఎం.హైస్కూల్‌లో చదువుకుని, ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. పాసయ్యారు. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు విజయవాడలో లయోలా కాలేజ్‌ స్థాపన నిమిత్తం విరాళాల వసూలు కోసం కారంచేడు వచ్చిన నిర్వాహకులకు వ్యక్తిగతంగా విరాళం ఇవ్వడమే కాకుండా, ఊళ్లో రెండు లక్షల రూపాయల విరాళాలు సేకరించి ఇచ్చారు. పర్యవసానంగా ప్రతిష్ఠాత్మక మద్రాస్‌ లయోలా కాలేజీలో ఆయనకు ఇంటర్మీడియట్‌ సీటు వచ్చింది. కానీ అక్కడ ఏడాది కంటే ఎక్కువ ఉండలేకపోయారు. రెండో సంవత్సరం చీరాల వి.ఆర్‌.ఎస్‌. అండ్‌ వై.ఆర్‌.ఎన్‌. కాలేజీలో చేరారు. బాల్య స్నేహితుల సావాసంతో చదువు మీద సరిగా దృష్టిపెట్టక పరీక్షల్లో తప్పారు. దాంతో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి వ్యవసాయంలో అడుగుపెట్టారు. 21వ ఏట.. తన మేనమామ యార్లగడ్డ నాయుడమ్మ కుమార్తె రాజేశ్వరిని 1957 నవంబర్‌ 2న వివాహమాడారు. మూడేళ్లు తిరిగేసరికి వారికి సురేశ్‌, వెంకటేశ్‌ జన్మించారు. కారంచేడులో ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్‌ జరగగా, ఓ ఎడ్లపందెం సీన్‌లో అక్కినేని నాగేశ్వరరావు డూప్‌గా నటించడమే కాక, అందులో కలెక్టర్‌ వేషం కూడా వేశారు. నటుడిగా ఆయన తెరమీద కనిపించిన మొదటి సినిమా అదే.
ఇటుకల వ్యాపారం చేద్దామని వెళ్లి..
ఇటుకల వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో మద్రాస్‌ వెళ్లారు రామానాయుడు. కానీ ఆ వ్యాపారంపై ఆసక్తి కలగలేదు. అప్పుడు సినీ రంగంపై దృష్టిపడింది. దర్శకుడు గుత్తా రామినీడు సలహాతో ఆయన దర్శకత్వం వహించిన ‘అనురాగం’ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం ద్వారా సినీ రంగంలో ప్రవేశించారు. అయితే టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ‘అనురాగం’ ఆర్థికంగా నిరాశపరిచింది. దీనికితోడు.. సినీ రంగంలోకి వెళ్లడాన్ని ఆయన తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆయనను ఒప్పించి భార్యా పిల్లలను తీసుకుని 1962 జూన్‌ 24న మద్రాస్‌లో కాపురం పెట్టారు. ‘అనురాగం’ తర్వాత భాగస్వాములు లేకుండా సొంతంగా సినిమాలు తియ్యాలని సంకల్పించి.. పెద్ద కుమారుడు సురేశ్‌ పేరు మీద 1963లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌ను నెలకొల్పారు. డి.వి.నరసరాజు చెప్పిన కథ నచ్చడంతో తాపీ చాణక్య దర్శకత్వంలో సినిమా తియ్యాలని సంకల్పించారు. ఆ కథకు ఎన్టీఆర్‌ అయితే సరిగ్గా సరిపోతారని భావించి, ఆయననుసంప్రదించారు. తన వద్ద సరిపడేంత పెట్టుబడి లేకపోయినా, ఎన్టీఆర్‌కు రెగ్యులర్‌ డిసి్ట్రబ్యూటర్‌ అయిన విజయా పిక్చర్స్‌ ఇచ్చిన అడ్వాన్స్‌తో సినిమా ప్రారంభించారు. అదే.. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ సినిమా. 1964 మే 21న విడుదలైన ఆ చిత్రం సూపర్‌ హిట్టవడంతో రామానాయుడు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు.
‘ప్రేమనగర్‌’ ఓ అధ్యాయం
1968లో తెలుగులో తను నిర్మించిన ‘పాప కోసం’ సినిమాను అదే ఏడాది తమిళంలో ‘కొళందై కాగ’ పేరుతో రీమేక్‌ చేసి, తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టారు రామానాయుడు. ఆ మరుసటి ఏడాది అక్కినేని నాగేశ్వరరావుతో తన తొలి సినిమా ‘సిపాయి చిన్నయ్య’ తీశారు. దాని తర్వాత కె.బాపయ్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘ద్రోహి’ సినిమా అట్టర్‌ఫ్లాపై ఆయన పెట్టుబడి రూ. 5 లక్షలను మింగేసింది. ఆర్థికంగా జీవన్మరణ సమస్య ఎదురైన సమయంలో.. ‘ప్రేమనగర్‌’ తీశారు. నవయుగ ఫిలిమ్స్‌ వద్ద రూ. 10 లక్షలు తీసుకుని, తను రూ. 5 లక్షలు పెట్టి, మొత్తం రూ. 15 లక్షలతో ఆ సినిమాని నిర్మించారు. 1971లో అది చాలా పెద్ద బడ్జెట్‌. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఆ సినిమా సెప్టెంబర్‌ 24న విడుదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో భయంకర తుఫాను. మూడు రోజుల పాటు కుండపోత వర్షం. రామానాయుడులోని ఆశలు ఆవిరవుతున్నాయి. ఆ సినిమా ఆడకపోతే, ఆర్థికంగా ఆయన కోలుకునే స్థితి లేదు. నాలుగో రోజు సినిమాకు సూపర్‌హిట్‌ టాక్‌ వచ్చింది. వర్షాలకు మించి వసూళ్ల వర్షం కురిసింది. అలా ఆయన కెరీర్‌లో మేలిమలుపుగా, ఓ గొప్ప అధ్యాయంలా నిలిచింది ‘ప్రేమనగర్‌’. సినిమానా, వ్యవసాయమా? తేల్చుకోవాల్సిన స్థితిలో ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో వేరే ఆలోచన చేయాల్సిన అవసరం ఆ తర్వాత ఆ యనకెప్పు డూ రాలేదు. ఆ చిత్రాన్ని శివాజీ గణేశన్‌తో ‘వసంత మాళిగై’ పేరుతో రీమేక్‌ చేసి, అక్కడా ఘన విజయం సాధించారు. అదే సినిమాని రాజేశ్‌ ఖన్నా, హేమ మాలిని జంటగా ‘ప్రేమ్‌నగర్‌’గా రీమేక్‌ చేసి, హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన, అక్కడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా ఒకే కథను మూడు భాషల్లో తీసి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ సినిమా నుంచి సురేశ్‌ ప్రొడక్షన్స్‌, అగ్ర సంస్థల జాబితాలో చోటు పొందింది. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తూ ‘మూవీ మొఘల్‌’గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకే కాదు.. భారతీయ సినిమాకు రామానాయుడు చేసిన సేవకు గుర్తుగా ఆయన్ను ఎన్నో పురస్కారాలు వరించాయి. అందులో ముఖ్యమైనవి.. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్‌ పురస్కారం. సినీ రంగానికి సంబంధించిన ఈ అత్యున్నత పురస్కారాన్ని ఆయన 2009లో అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. అలాగే.. రాజకీయనాయకుడిగా.. వ్యక్తిగా.. రామానాయుడు ఎన్నో సేవాకార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
ప్రముఖుల సంతాపం
స్టార్‌ ప్రొడ్యూసర్‌ రామానాయుడు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపసూచకంగా గురువారం షూటింగ్‌లు జరపకూడదని చిత్ర పరిశ్రమ.. థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు.
ప్రతిభకు పట్టం
ప్రతిభ ఎక్కడున్నా గ్రహించి, వెలుగులోకి తీసుకువచ్చిన మంచి మనిషి రామానాయుడు. ఇరవై నాలుగు మంది దర్శకులను, ఆరుగురు హీరోలను, పద్నాలుగు మంది హీరోయిన్లను, నలుగురు సంగీత దర్శకులను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆయన సంస్థలో వందమందికి పైగా హీరోలు, 130 మంది వరకు హీరోయిన్లు నటించారు. నిర్మాతగా ఆయన అన్ని వ్యవహారాలూ చూసుకున్న చివరి చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా’. వెంకటేశ్‌, పవన్‌కల్యాణ్‌ కలిసి నటించగా, సురేశ్‌ నిర్మించిన ‘గోపాల గోపాల’ చిత్రానికి ఆయన సమర్పకుడు.
ఈ భాషల్లో సినిమాలు..
తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, భోజ్‌పురి, అస్సామీ, పంజాబీ, ఇం గ్లిష్‌ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించారు.
ఆయనలో నటుడు
తాను నిర్మించిన దాదాపు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సీన్‌లో కనిపించడం రామానాయుడుకు అలవాటు. అత్యధిక సినిమాల్లో ఒకటి లేదా రెండు సన్నివేశాల్లో కనిపించే చిన్న పాత్రలు వేసిన ఆయన.. ‘హోప్‌’ అనే సినిమాలో ప్రధాన పాత్రనూ చేసి మెప్పించారు. బయటి నిర్మాతలు చాలా మంది ఆయనను తమ సినిమాల్లో నటించమని అడిగినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. బయటి బేనర్‌లో ఆయన నటించిన ఒకే ఒక్క చిత్రం ‘దాగుడు మూతలు’. అప్పట్లో సీనియర్‌ నటి శాంతకుమారి ‘‘ఒరేయ్‌.. నాయుడు, నా మాట వినరా. హీరోగా చెయ్యరా. నీది హీరో ముఖంరా’’ అని ఎన్నిసార్లో పోరుపెట్టినా, ఆయన నవ్వి ఊరుకున్నారు.
స్టూడియోల అధినేత..
చిత్రసీమలో నిర్మాతగా తను సంపాదించిన డబ్బును, అదే చిత్రసీమలో ఖర్చుపెడుతూ, పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషిచేశారు రామానాయుడు. 1984లో సురేశ్‌ మూవీస్‌ అనే డిసి్ట్రబ్యూషన్‌ సంస్థను ప్రారంభించి, పంపిణీదారునిగా మారారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లో ఐదెకరాల కొండ ప్రాంతాన్ని తొలిచి రామానాయుడు స్టూడియోస్‌ను కట్టారు. స్ర్కిప్ట్‌ పట్టుకుని ఈ స్టూడియోకు వచ్చే నిర్మాత చేతికి తొలి కాపీ వచ్చేవరకూ అన్ని సదుపాయాలనూ ఇందులో కల్పించారు. ఈ స్టూడియోకు ఐదు కిలోమీటర్ల దూరంలో నానక్‌రామ్‌గూడలో రామానాయుడు సినీ విలేజ్‌ పేరుతో మరో స్టూడియో ఏర్పాటుచేశారు. విశాఖపట్నంలోనూ ఓ పెద్ద స్టూడియోను నెలకొల్పారు.
రాజకీయాల్లోనూ..
చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమానికి ఆకర్షితులైన ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి, టీడీపీలో చేరి 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి చేతిలో ఓటమి పాలవడంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.
రేపు వస్తానో రానో..
రామానాయుడు స్టూడియోస్‌.. కొండలు పిండి కొట్టి కట్టిన ఆయన కర్మభూమి! సినీ రంగాన్ని నమ్ముకుని వచ్చే ఎంతో మంది కార్మికులకు ఉపాధినిచ్చిన బతుకు సీమ!! అందుకే ఆ స్టూడియో అంటే రామానాయుడు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మంగళవారం ఆయన స్టూడియోకు వెళ్లారు. ‘ఇక్కడికి రావడం ఇదే చివరిసారి’ అన్నంత ఇదిగా అణువణువూ కలియదిరిగారు. సిబ్బంది అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘రేపు వస్తానో రానో.. ఇక్కడికి రావడం ఇదే చివరిసారేమో’నని ఆయన తమతో అన్నారంటూ స్టూడియో సిబ్బంది కంటతడి పెడుతున్నారు. అంతేకాదు.. నమ్మిన బంటులా ఇంతకాలం తన వెంట ఉన్న డ్రైవర్‌, ఇతర సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవాలని పెద్ద కుమారుడు సురేశ్‌బాబుకు రామానాయుడు చెప్పినట్లు తెలుస్తోంది!!
అదే మహమ్మారి..
కేన్సర్‌.. సినీ పరిశ్రమలో ప్రముఖులను వరుసగా కబళిస్తూ వస్తున్న ఈ మహమ్మారే మూవీ మొఘల్‌ మరణానికీ కారణమవడం గమనార్హం. పాతతరం నటుడు కాంతారావు మొదలు.. అక్కినేని నాగేశ్వరరావు, వడ్డే రమేశ్‌, ఈవీవీ, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్‌, వీబీ రాజేంద్ర ప్రసాద్‌, గణేశ్‌ పాత్రో ఇలా ఎందరో సినీ ప్రముఖులు కేన్సర్‌కు బలైన సంగతి తెలిసిందే!!
సినీ దిగ్గజాన్ని కోల్పోయాం : ప్రముఖుల నివాళి
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుకు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీరంగాల దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి చలన చిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. భారత చిత్రసీమకు వెలలేని సేవలందించారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినిమాలు తీయడమేగాక ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అనేక భాషలలో శతాధిక చిత్రాల నిర్మాణంతో ప్రపంచ గుర్తింపు పొందిన రామానాయుడు మృతి యావత్‌ సినీ ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ప్రజాభిమానం ఆయనను అమరుడిగా నిలుపుతాయని పేర్కొన్నారు. తెలుగులోనే కాకుండా కన్నడ భాషలోనూ చిత్రాలు నిర్మించి, తమ రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కొనియాడారు. సినీ పరిశ్రమతోపాటు ప్రజాసేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయమని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. సినీరంగంతోపాటు టీడీపీకి కూడా తీరని లోటని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. రామానాయుడు సినీరంగానికి పెద్దబాల శిక్షలాంటివారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. అలాగే ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని మరో ఇద్దరు మంత్రులు బండారు దత్తాత్రేయ సుజనా చౌదరి అన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, అయ్యన్న పాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, మృణాళిని, పి.నారాయణ, తోపాటు ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రామానాయుడు మృతిపై సంతాపం ప్రకటించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్రశాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎందరికో మార్గదర్శకుడిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తిగా ప్రతిపక్ష వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ కొనియాడారు. సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును పోగొట్టుకున్నదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెలిపారు. ఐదు దశాబ్దాలు పరిశ్రమకు ఎనలేని సేవచేశారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. రామానాయుడు మృతి పరిశ్రమలకు తీరని లోటని ఏపీ శాసనమండలి టీడీపీ విప్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు.
తెలుగు ప్రజల గౌరవం పెంచిన వ్యక్తిగా మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. చిత్రసీమ మూగబోయిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. కళామతల్లికి ఎనలేని సేవలు చేశారని చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. సినీ ప్రపంచం ఒక లెజెండ్‌ను కోల్పోయిందని పశ్చిమగోదావరి జిల్లాలో సినిమా షూటింగ్‌లో ఉన్న హీరో శ్రీకాంత్‌, హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు, నిర్మాత అంబికా కృష్ణ అన్నారు.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.