|
కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్
మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా
పాక్ వల్లే ప్రశాంతంగా కశ్మీర్ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ
పైన్ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు… దాల్ సరస్సులో కమలం వికసించినట్లు… భిన్న ధ్రువాలు ఒక్కటైనట్టు… మంచుకొండల్లో కొత్త సూర్యోదయమైనట్టు… కశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. భిన్న ధ్రువాలైన రెండు పార్టీలు కలిసి నడిచిన సమయం ప్రజాస్వామ్య సౌరభాలను వెదజల్లింది! జమ్మూ కశ్మీర్‌లో పీడీపీతో కలిసి బీజేపీ తొలిసారి అధికారం చేపట్టింది.! 49 రోజుల గవర్నర్ పాలనకు ముగింపు పలుకుతూ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.
జమ్మూ, మార్చి 1: వివాదాస్పద అంశాలను పక్కనపెడుతూ.. ముఫ్తి మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, భారతీయజనతాపార్టీలు కలిసి కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే ఆడ్వాణీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పీడీపీ నేత ముఫ్తీ మహబూబా సయీద్ తదితర అతిరథ మహారథుల సమక్షంలో కశ్మీర్ 12వ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. ముఫ్తీతోపాటు ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నిర్మల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో సహా పీడీపీ-బీజేపీలకు చెందిన 25మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రుల్లో 13మంది పీడీపీకి చెందినవారు కాగా మిగిలినవారు బీజేపీ సభ్యులు. రాజకీయ నాయకుడిగా మారిన వేర్పాటువాది సజ్జద్ లోన్ బీజేపీ కోటాలో మంత్రిపదవి దక్కించుకోవడం గమనార్హం. కశ్మీర్ ప్రభుత్వం జమ్ము వర్సిటీలోని జొరావర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌పార్టీలు బహిష్కరించడం విశేషం. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీ.. ముఫ్తీ మహ్మద్ సయీద్‌ని, సజ్జాద్ లోన్‌ని ఆలింగనం చేసుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎం ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 370పై యథాతథ స్థితి కొనసాగించడం వంటి అంశాలతో కూడిన 16 పేజీల ఉమ్మడి ఎజెండాను విడుదల చేశారు. రాజ్యాంగం కల్పించిన మిగిలిన సదుపాయాల విషయంలో కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానాన్నే కొనసాగించేలా అంగీకారానికి వచ్చామన్నారు. కల్లోలిత ప్రాంతాలకు సంబంధించి ఆర్మీకి ప్రత్యేక అధికారాలు( ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఇచ్చే చట్టాన్ని తొలగించే అంశంపై పరిశీలన చేస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తేఈ చట్టాన్ని రద్దుచేస్తామంటూ ఎన్నికల సందర్భంగా పీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని రద్దు చేయడం కుదరదని బీజేపీ చెబుతూ వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది. తొలిసారి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారం చేపట్టింది. ఉపముఖ్యమంత్రి బాధ్యతను చేపట్టి రికార్డు సృష్టించింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన కశ్మీర్ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 70 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ 28 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 25 సీట్లను చేజిక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 13 కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. హంగ్ ఏర్పడడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు 49రోజుల గవర్నర్ పాలన అనంతరం.. బీజేపీ, పీడీపీలు ఒక అంగీకారానికి వచ్చి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం ముగిసింది.
ఇదో చరిత్రాత్మక అవకాశం: ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటు ఓ చరిత్రాత్మక అవ కాశమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలో ఏర్పాటైన పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారుకు ఆయన అభినందనలు తెలిపారు.
పాక్ వల్లే ప్రశాంతంగా కశ్మీర్ ఎన్నికలు: సీఎం ముఫ్తీ
జమ్మూ, మార్చి1: పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారును కొలువుతీరిన కొంతసేపటికే వివాదాస్పద వ్యాఖ్యలపర్వం మొదలైంది. పాకిస్థాన్, ఉగ్రవాదుల వల్లే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయంటే ఆ ఘనతను హురియత్, ఉగ్రవాదసంస్థలకు ఇవ్వాల్సిందే. ఇదే విషయాన్ని నేను ప్రధాని మోదీకి కూడా చెప్పాను’’ అని ముఫ్తి చెప్పారు. ‘‘దేవుడి దయవల్ల ఉగ్రవాద సంస్థలు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదు. ఒకవేళ వారు అలా చేసి ఉంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవి కావు’’ అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు అవతలి ప్రజలు కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహరించారంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రశంసించారు.
కశ్మీర్ ప్రభుత్వంలో మాజీ వేర్పాటువాది!
జమ్మూ: సజ్జద్ లోనె తండ్రి ప్రముఖ వేర్పాటువాది అబ్దుల్ ఘనీ లోన్. 2002లో ఆయన్ను హత్యచేశారు. అప్పటికి సజ్జద్ లోన్ (48) హురియత్ కాన్ఫరెన్స్ ముఖ్య నేతల్లో ఒకరు. కశ్మీర్ పోరాటంలో తాము ఎవరినైతే సమర్థించారో ఆ జిహాదీలే తండ్రిని కాల్చి చంపారు. ఈ ఘటన సజ్జద్ లోన్‌ను వేర్పాటువాద పంథా నుంచి ప్రజాస్వామిక పథంలోకి నడిపించింది. జమ్మూకశ్మీర్ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలో ఆయనను భాగస్వామిని చేసింది. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా.. సజ్జద్ లోన్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘‘ఇతర వేర్పాటువాదులు కూడా అనుసరించేందుకు వీలుగా నేను ఒక దారిని వేస్తు’’న్నానని సజ్జద్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై సీఎం సయీద్ వ్యాఖ్యానించారు. సజ్జద్ 1989లో వేర్పాటువాద రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పుడే ఆయన ఇంగ్లంగ్‌లోని కార్డిఫ్ కళాశాలలో పీజీ పూర్తి చేసుకొని బయటకొచ్చారు. అబ్దుల్ ఘనీ లోన్ కుమారుల్లో అతడు చిన్నవాడు. తండ్రి స్థాపించిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు, ఆయన మరణం తరువాత తిరుగులేని నేత అయ్యారు. లోయలో ఉగ్రవాద హింసను ఖండించి.. హురియత్ కాన్ఫెరెన్స్‌కే కాదు, సొంత అన్న, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు బిలాల్ ఘనీ లోన్‌కీ శత్రువుగా మారారు. పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం చొరవతోనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది సజ్జద్ వాదన. ఇదే నినాదంగా.. ఎదురీతలా సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం.. 2014 ఎన్నికల్లో మలుపు తిరిగింది. హంద్వారా నుంచి గెలిచి.. బీజేపీ కోటాలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలో చేరారు
|

