కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్ యాత్రికుల సౌకర్యార్థం, హజ్ హౌస్ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్ విమానాశ్రయం వద్ద) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకై శాదీఖానాలు ఉర్దూ ఘర్‌లూ ప్రజల సొమ్ముతో అనేక పట్టణాల్లో కట్టింది.
రాష్ట్రంలోని క్రైస్తవులకై ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పూర్వపు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రభుత్వం నుండి సొమ్ముని పొంది, రాష్ట్రంలో ఆ సొమ్మునుపయోగించి, ఒక్కొక్క గ్రామానికి 2 లక్షలు ఇచ్చి 2013 వరకు చర్చిలను కట్టించింది. ప్రభుత్వపు సొమ్ముతో జెరూసలెంకు తీర్థయాత్ర తీసే ప్రతి క్రైస్తవునికి రూ.25,000 ధన సహాయం చేస్తోంది.
ఈ విధంగా రాజ్యాంగం ప్రకారం సెక్యులర్‌గా ఉండవలసిన ప్రభుత్వాలు, పన్నుల ద్వారా వసూలు చేసిన సొమ్మును, ముస్లిం, క్రైస్తవ మత పోషణకు, వ్యాప్తికి, దుర్వినియోగం చేస్తున్నాయి. కొంతమంది ముస్లిం ప్రభువుల పాలనలో, హిందువులపై జిజియా అనే పన్నువేసి, అలా వచ్చిన సొమ్మును ముస్లింల సంక్షేమం కోసం ఉపయోగించేవారు. స్వతంత్ర భారతంలో, సెక్యులర్ ప్రభుత్వాలు తిరిగి, పరోక్షంగా జిజియాను ప్రవేశపెట్టి, హిందువులు చెల్లించే పన్నులను పాక్షికంగా హైందవేతర మతస్తులకై ఉపయోగించడం గర్హనీయం.
ఇక హిందువులపై ప్రత్యక్ష వివక్షతను తిలకిద్దాం. క్రైస్తవుల చర్చ్‌లు, ముస్లింల మసీదులూ, ఆయా మతసంస్థల యాజమాన్యంతో, వారి పాలనలోనే ఉన్నాయి. కాని మంచి ఆదాయం ఉన్న హిందువుల దేవాలయాలు మాత్రం ప్రభుత్వపు యాజమాన్యం, పాలనలో ఉన్నాయి, ఈ సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి, దేవాదాయ ధర్మాదాయ శాఖలు వీటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, కమిషనర్లూ, ప్రభుత్వాధికారులు, కొన్ని దేవాలయాల ఇ.వోలు క్రైస్తవులు, ముస్లింలు కొంతమంది తమ మతమార్పిడిని కప్పిపుచ్చుకుని, రిజర్వేషన్ ద్వారా ప్రభుత్వోద్యోగం పొందినవారు. ఇలా హిందువుల దేవాలయాలు, హిందూసంస్థల అధీనంలో లేవు. భక్తులిచ్చే కానుకల రూపంలోని ఆదాయంలో కొంత శాతం ముఖ్యమంత్రి ఇష్టానుసారం కేటాయించడానికి కామన్ గుడ్ ఫండ్‌లో పడుతుంది. ముఖ్యమంత్రి క్రైస్తవులు, ముస్లింలు అయిఉండవచ్చు. సి.జి.ఎఫ్. నిధులు మసీదు, చర్చ్‌ల మరమ్మతులకు కట్టడాలకు ఇచ్చిన దృష్టాంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే హిందూమతాన్ని ద్వేషించి, దాన్ని మటుమాయం చేసే కార్యక్రమాలు చేపట్టే, హైందవేతర మతాల పుష్టికి, హిందూ భక్తులు తమ దేవుళ్ళకిచ్చే
సొమ్ము, మళ్లింపబడుతోంది. ఎంత అన్యాయం? ముస్లింలు, క్రైస్తవులు తమ తీర్థయాత్రలకు ప్రభుత్వపు సొమ్మును పొందుతుంటే, హిందూభక్తులు తమ సొమ్ముతో ప్రయాణం చేయాలి, తమ దేవుణ్ణి చూడటానికి టిక్కెట్ కొనుక్కోవాలి! ఎంత దారుణం! హిందువులకు పై చూపబడుతున్న వివక్ష, వారి సొమ్మును అన్యమతస్తులకై ఉపయోగింపబడటాన్ని కొంతవరకైనా తగ్గించాలంటే తక్షణం ఈ చర్యలు తీసుకోవాలి.
తి.తి.దే, దే.ధ.శా లు హిందూభక్తులు సమర్పిస్తున్న ధన వనరులను, ప్రతి సంవత్సరం ఒక లక్షమంది హరిజనులను, గిరుజనులను, ఇతర బీద హిందువులను, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, ఉచితంగా వేంకటేశ్వరుని దర్శనం చేయించాలి, ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించాలి.
– సంవత్సరానికి కనీసం వెయ్యిమందిని అమర్‌నాధ్ యాత్రకు, దేవాలయ ఆదాయాన్ని వెచ్చించి పంపి తీసుకురావాలి.
– ప్రతి దళిత వాడల్లో, గిరిజన గ్రామాల్లో పట్టణాల్లోని మురికివాడల్లో, నివాసులు కోరిన దేవతకు, దేవునికి మందిరం కట్టి ఆ సముదాయంలోని వారినే అర్చకులుగా తీసుకుని, వారికి పూజా విధానంతో పాటు హిందూ ధర్మాన్ని బోధించి, తత్ప్రసార కర్తలుగా, బోధకులుగా శిక్షణ ఇవ్వాలి. వారికి, నెలకు కనీసం రూ.5,000/- జీతం ఇవ్వాలి. ధూపధీప నైవేద్య, పండుగల నిర్వహణకై, సంవత్సరానికి కనీసం, ప్రతి గుడికీ రూ.50,000/- ఇవ్వాలి.
-తి.తి.దే. పాలక మండలిలో, దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో హిందూ ధర్మరక్షణ, ప్రచారం, అనుష్ఠానమందు అంకితభావమున్న, రాజకీయమే వృత్తిగా లేని, గుణవంతులను, జ్ఞానసంపన్నులను, పాలనా దక్షణ, అనుభవం ఉన్న వారినే, సభ్యులుగా నియమించాలి.
– ఈ సంస్థల యొక్క ఆదాయ వ్యయపట్టికను, వార్షిక పాలన -నిర్వహణ -కార్యక్రమ నివేదికలను, ప్రచురించి, ప్రజలకందేట్లు చేసి, ప్రజాభిప్రాయాన్ని మన్నించే విధిని పై సంస్థలకు నియమించాలి.
చివరిగా, ప్రజాభిప్రాయాన్ని, విజ్ఞుల సలహాలను, సూచనలను ఆహ్వానించి, చట్టం ద్వారా హిందూ దేవాలయాల పాలన, యాజమాన్యం ప్రభుత్వం నుంచి వేరుజేసి, సవ్యమైన ధర్మసంస్థలకు అప్పజెప్పాలి. సిఖ్ పంధీయుల గురుద్వారాల యాజమాన్యం, పాలన, నిర్వహణ గురుద్వారా ప్రబంధక్ కమిటీలకు, అప్పజెప్పిన చట్టంను ప్రాతిపదికగా తీసుకుని, మరో సర్వాంగ సౌష్టవశాసనం, నియమాలను రూపొందించవచ్చు.
హిందూ బంధువులందరూ, ఈ విషయాలను రాజకీయ పార్టీలకు, నాయకులకు, శాసనసభ్యులకూ తెలియపరచి హిందువులకు, అన్యమతస్తులకున్న, స్వతంత్య్రాన్ని, సంఘటనా సౌకర్యాన్ని, వ్యవస్థనూ, సమకూర్చేలా అర్థించి, కార్యాన్వితం చేయాలి.

