ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని ‘ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ’ గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు?
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను, భావాలనే చెప్తూ పోయినపుడు అసలు ‘ఆత్మ’తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసం చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.
కథని ఎవరి చేత చెప్పించాలి అన్న విషయాన్ని ప్రతి కథారచయితా ఆలోచించి ఎంచుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రయోగాలూ చేస్తాడు. వృక్షాలూ జంతువులూ వచ్చి మనకి కథలు చెప్పడం జరుగుతూ వుంటుంది. అందుకు ఒక ప్రయోజనమూ ఉంటుంది. కథకుడు రాగద్వేషాలకు అతీతంగా సత్యాన్ని చెప్తున్నాడన్న నమ్మకాన్ని పాఠకుడికి కలిగించేందుకో, లేక పాఠకుడు కథలోని పాత్రలతో తాదాత్మ్యం చెందకుండా కథలోని సత్యాన్ని మాత్రమే గ్రహించే అవకాశాన్ని కల్పించేందుకో బహుశా రచయిత చెట్టునీ, పిట్టనీ కథకుడిని చేస్తాడు. ఒక్కొక్కసారి ‘ఆత్మలు’ చెప్తున్నట్లుగా కూడా కొన్ని కథలు వస్తూ వుంటాయి.వాటి ప్రయోజనం ఏమిటి? అంటే, ‘ఆత్మ’ ద్వారా కథ చెప్పించినందువల్ల ‘కథకి’ ఒనగూడే అధిక విలువ ఏమిటి? ఆ విషయాన్ని పరిశీలించే ప్రయత్నం ఈ వ్యాసం.
నా పరిశీలనకు నాలుగు కథలని తీసుకున్నాను. గొరుసు జగదీశ్వర రెడ్డి వ్రాసిన ‘బతుకుగోస’, సామాన్య వ్రాసిన ‘మహిత’, అరిపిరాల సత్యప్రసాద్‌ వ్రాసిన ‘ఊహాచిత్రం’, మండువ రాధ వ్రాసిన ‘చివరిపూవు’. ఈ కథలు మాత్రమే చర్చకు తీసుకోవడానికి కారణం ఇవి ప్రస్తుతం నాకు అందుబాటులో వుండడం, నేను చెప్పదలచుకున్న విషయాలను చెప్పేందుకు ఈ నాలుగు కథలూ సరిపోవడం. అంతే తప్ప నేను ఈ వ్యాసంలో చర్చిస్తున్న విషయాలు (గుణాలు, దోషాలు కూడా) ఈ నాలుగు కథలలో మాత్రమే ఉన్నాయని కానీ ఈ దృక్కోణంతో వ్రాసిన ఇతర కథలలో లేవని కానీ కాదు. అలాగే, ఈ వ్యాసంలో ఎత్తి చూపిన కొన్ని అంశాలు ఆయా కథారచయితలకి తెలియవనీ కాదు.
ఈ నాలుగు కథలలోనూ కథ మొత్తాన్ని లేదా కథలో కొంత భాగాన్ని ‘ఆత్మ’ చెప్తుంది. ‘బతుకుగోస’లో ఒక కంపెనీ మూసేసినందుకు నిరసనగా ధర్నా చేస్తూ కాల్పులలో చనిపోయిన కార్మికుడి ఆత్మ, ‘మహిత’లో అత్తగారింటిలో భర్త చేతిలో హత్య చేయబడిన పదహారేళ్ళ మహిత ఆత్మ, ‘ఊహాచిత్రం’లో ప్రస్తుతం వేస్తూ వున్న ఒక చిత్రం గురించిన ఆలోచనలతో పరధ్యానంగా స్కూటర్‌ నడిపి యాక్సిడెంట్లో చనిపోయిన చిత్రకారుడి ఆత్మ, ‘చివరిచూపు’ కథలో కరెంటు షాకుతో మరణించిన సూరి అనే త్రాగుబోతు ఆత్మా మనకి కథ చెప్తాయి.
వ్యవహారంలో ఆత్మ అనేమాటని మనం చాలారకాలుగా వాడుతూ వుంటాం. ఒక్కొక్కసారి మనసునే ఆత్మ అంటాం. ఇంకొకసారి మనసుకన్నా వెనుకనున్న ‘మరేదో’ అన్న అర్ధంలో ‘ఆత్మ’ అన్న పదాన్ని వాడతాం. మనిషికి మూడు శరీరాలు- స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు-ఉంటాయని చెప్పుకుంటాం. ఇందులో స్థూల శరీరానికి తప్ప మిగిలిన మూడింటికీ ‘ఆత్మ’ అనే మాటని మనం సంభాషణలలో కొంత అస్పష్టంగా వాడుతూ వుంటాం. సందర్భాన్ని బట్టి తగిన అర్థం తీసుకుంటూ వుంటాం.
మనుషులే కథ చెప్తున్నపుడు, మనుషుల సంభాషణలో ఆత్మ అనే పదం వాడినపుడు, ఈ అస్పష్టతలన్నీ కథలో ఉండవచ్చు. ఎందుకంటే మనం అలా అస్పష్టంగానే మాట్లాడుకుంటాం కాబట్టి. అయితే ఆత్మే కథ చెప్తున్నపుడు ఆ అస్పష్టతలు ఉండవచ్చునా? రచయిత దేనిని ‘ఆత్మ’ అంటున్నాడో, కథకుడిగా వ్యవహరిస్తున్న ‘ఆత్మ’ స్వరూపస్వభావాలు ఏమిటో మనకి స్పష్టంగా తెలియాలి కదా? ఇలాంటి కొన్ని కథలు చదివిన మీదట కొందరు రచయితలతోను పాఠకులతోను ఈ విషయంపై మాట్లాడిన మీదట అందరూ ఏకీభవిస్తున్న, భావిస్తున్న సామాన్య లక్షణాలు కొన్ని కనిపించాయి. అవి ఏమిటంటే, ఈ రకమైన కథలలో బ్రతికున్నపుడు ఉత్తమపురుష కథకుడిలో ఉన్న ‘మనసే’ అతను చనిపోయాక ‘ఆత్మ’ అవుతుంది. శరీరంతో బంధింపబడి లేదు కాబట్టి అది ఎక్కడికైనా ఎప్పు డైనా వెళ్ళిపోగలదు. అది కథలోని మిగతా పాత్రలకి కనబడదు. వినబడదు. దానికి మాత్రం అందరూ కనబడతారు, వినబడతారు. ఇవి ఇలాంటి అన్ని కథలలోనూ కనబడే ‘ఆత్మ’ లక్షణాలు. పాఠకులూ రచయితలూ కూడా అంగీకరించే సామాన్య లక్షణాలు. అప్పుడు మూడు విషయాలను గమనించవలసి అవసరమూ అవకాశమూ ఏర్పడుతుంది. 1. ఈ సౌలభ్యాన్ని రచయిత ఎంతవరకు ఉపయోగించుకున్నాడు? 2. ఎంత విచక్షణతో ఉపయోగించుకున్నాడు? 3. దానివలన కథకి ఏ ప్రయోజనాన్ని సాధించాడు? పైన చెప్పిన నాలుగు కథలనీ ఉదాహరణలుగా తీసుకుని ఈ మూడు విషయాలు పరిశీలిద్దాం.
కథలో ‘ఆత్మ’ తప్ప చెప్పలేని విషయమెంత?
ఆత్మ చెప్తున్న కథలు అయినప్పటికీ నిజానికి ఇవి ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథలే. కథకుడు తాను బ్రతికున్నపుడు జరిగిన విషయాలని, మరణించాక జరిగిన విషయాలని కలగలిపి చెప్పడం మనం వీటిలో చూస్తాం.
కథనం మనసు నుండి ఆత్మకు మారడం (కథకుడు మనిషి నుండి శవంగా మారడం) అనేది కథ మొదట్లో జరగవచ్చు, మధ్యలో జరగవచ్చు చివర్లో జరగవచ్చు. ఎప్పుడు జరిగినప్పటికీ కథలో ఉత్తమపురుష కోణంలో కథ చెప్పబడితే ఏయే విషయాలు చెప్పే అవకాశముందో అవి మాత్రమే చెప్పినపుడు లేదా అవే ఎక్కువగా చెప్పినపుడు కథ ఈ సౌలభ్యాన్ని సరిగా వాడుకోనట్లే. ఆ కోణంలో చూసినపుడు, ఈ నాలుగు కథలలో బతుకుగోస, మహిత కథలు ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నాయని అనిపిస్తుంది. కథ చెప్తున్నది ఆత్మ అన్న విషయాన్ని బతుకుగోసలో కథ చివర్లోనూ, మహితలో కథ మధ్యలోనూ చెప్తారు. ఊహాచిత్రంలో కథ మొదట్లోనే చెప్తారు. అయినా ఊహాచిత్రంలో కన్నా మిగిలిన రెండు కథల్లోనే రచయితలు ‘ఆత్మ’ని సరిగా వాడుకున్నారు. ఎందుకంటే ఊహాచిత్రం కథలో ఎక్కువభాగం ‘మనసు’ కూడా చెప్పగలిగిన కథే. ఊహాచిత్రం కథలో ‘కథకి అవసరమైన భాగం’ ఆత్మ మాత్రమే చెప్పగలది కాదు. ‘ఆత్మ చెప్పిన భాగం’ కథకి నిజంగా అవసరమైనది కాదు. ఇక చివరిచూపు కథలో అయితే ‘ఆత్మ’ ప్రాధాన్యం అసలే లేదు. ఈ రెండు కథలూ ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని వాడుకుంటాయి.
ఎక్కువ శాతం కథ ఆత్మకి ఉన్న (ఉందనుకుంటున్న) సౌలభ్యాన్ని ఉపయోగించుకోనపుడు, ఎక్కువ భాగం కథ ఆ వ్యక్తి బ్రతికున్నప్పటి విషయాలను అప్పటి పరిస్థితులను, భావాలనే చెప్తూ పోయినపుడు, ఒక చిన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఆత్మని ప్రవేశపెట్టినపుడు, మరీ ముఖ్యంగా ఆ చిన్న అంశం కూడా నిజంగా కథకి అంత కీలకమైనది కానపుడు అసలు ‘ఆత్మ’తో కథ చెప్పించవలసిన అవసరమేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ప్రయోగం కోసం చేసిన ప్రయోగం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఆత్మ యొక్క కనీసపు లక్షణాలుగా రచయిత తీసుకునే కొన్ని విషయాలను పైన చెప్పుకున్నాం. రచయిత కనీసం వాటికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందనీ అనుకున్నాం. వాటిలో ఒకటి బ్రతికి ఉన్నప్పటి మనసునే చనిపోయాక ఆత్మ అంటున్నామన్న విషయం. రెండవది ఆత్మ శరీరంలో నుంచి బయటకి వచ్చింది కనుక ఇక దానికి శరీరం లేదన్న విషయం. ఈ అనుకోలుతో కథ చది వితే కథ చెప్తున్నది ఆత్మ అయినపుడు కొన్ని రకాల వాక్యప్రయోగాలు, వ్యక్తీకరణలు చేసే అవకాశం వుండదు. కానీ ఒక్క మహిత కథలో తప్ప మిగిలిన మూడు కథలలోనూ వాటిని రచయితలు విరివిగా చేశారు. బతుకుగోస కథలోని వాక్యాలు కొన్ని చూద్దాము.
‘లోపలికి అడుగేస్తుంటే… శరీరం కంపించింది’, ‘లేత్‌మిషన్‌ చేతికి తగిలింది.’, ‘తుళ్ళిపడ్డట్టు వెనక్కి తిరిగాను.’, ‘ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది.’- ఇవి బతుకుగోస కథలోని వ్యక్తీకరణలు. చివరి చూపు కథలో ‘ఆత్మ’ ప్రవేశించేది కథ చివర్లో. ఒక రెండు మూడు పేరాలు మాత్రమే ఆత్మ చెప్పే కథ వుంటుంది. ఆ చిన్న భాగంలో వ్యక్తీకరణలు ఇలా ఉంటాయి. ‘నా ఆత్మ ఏడుస్తోంది. నా గురించి ఒక్క మంచి మాట వినాలని తపన పడతా అక్కడక్కడే తిరుగుతోంది.’, ‘దిగులుతో నా మనశ్శరీరాలు రెండూ కుంచించుకుపోసాగాయి.’, ‘నన్ను క్షమించండి అని ముందుగా నేనే అందరితోనూ అనాలనుకున్నాను. ముఖ్యంగా నా పెళ్ళాంతో అనబోయేంతలో నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.’
సాహిత్యానికి సంబంధించినంతవరకు ఆత్మ కథకుడైనపుడు ఆత్మ=మనసు=నేను అనుకున్నాము కనుక మళ్ళీ ఆ కథకుడు(ఆత్మ) ‘నా ఆత్మ’ అనడం, ‘నా మనశ్శరీరాలు’ అనడం సరి అయిన వ్యక్తీకరణ కాదనిపిస్తుంది.
ఇక ఊహాచిత్రం కథలోనయితే ఈ వైరుధ్యాలు, అస్పష్టతలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. ‘నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా… ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!’ ‘ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో!, …. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!’ వంటి మనిషికి కలిగే భావాలనే ఆత్మలకి కూడా కలిగినట్లుగా వ్రాయడంలో ఔచిత్యం లేదు. ఇటువంటి వాక్యాలు ఈ కథలో చాలా ఉంటాయి.
అలా కాదు. మనం తికమకలో ఉన్నట్లే ఆత్మలూ తికమకలో ఉంటాయి, పైగా అప్పుడప్పుడే ఆత్మగా మారినపుడు ఆ తికమక కొంచెం ఎక్కువగా వుంటుంది అని సమర్ధించుకోవచ్చు. లేక ఆత్మ అలాంటి వ్యక్తీకరణ చేసే అవకాశమూ నిజంగానే ఉండవచ్చు. కానీ అపుడు మళ్ళీ మొదటి ప్రశ్నే వస్తుంది. ఉత్తమపురుష కథనానికీ ఆత్మ కథనానికీ అసలేభేదమూ లేనపుడు…భావ వ్యక్తీకరణలో, పదప్రయోగంలో కించిత్తయినా వ్యత్యాసం చూపనపుడు ఆత్మతో కథ చెప్పించడం ఎందుకన్న ప్రశ్న. ప్రయోగం కోసమే ప్రయోగమూ అన్న ప్రశ్న.
ఆత్మ దృక్కోణంలో నడిచే కథకీ మాములుగా ఉత్తమపురుష దృక్కోణంతో నడిచే కథకీ ‘వ్యక్తీకరణ’లో, కథనంలో పెద్ద తేడా చూపడం లేదు రచయితలు. మరి ఎందుకు ఆత్మతో కథ చెప్పిస్తున్నారు? అని పరిశీలించి చూస్తే… ఈ కథలలో ఒక వ్యక్తి తను మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో జరిగే కొన్ని విషయాలు గమనించడం, వాటి గురించి ఆలోచించడం, కొన్ని భావాలకు లోనవడం, కొన్ని విషయాలు వ్యాఖ్యానించడం వుంటుంది. కథని ఆత్మతో చెప్పించినప్పటికీ వాస్తవానికి రచయితకీ మనకీ కూడా కావలసింది ఆత్మ యొక్క వ్యాఖ్యల నుంచి ఆత్మని అర్థం చేసుకోవడం కాదు. ఆత్మ యొక్క వ్యాఖ్యల ఆధారంగా కథలోని బ్రతికున్న పాత్రలని, బ్రతికి ఉన్నప్పటి కథకుడి మనసుని ఇంకొంత బాగా అర్థం చేసుకోవడం. అలా అర్థం చేసుకునేందుకు మనకి ఆత్మ యొక్క వ్యాఖ్యలు, కథనం ఉపయోగపడాలి. ఆ దృష్టితో ఈ కథలని చూద్దాము.
చివరిచూపు కథలో ఏమవుతుంది? మనం చనిపోయాక కొందరు మనకోసం ఏడుస్తారని, బ్రతికుండగా మన ప్రవర్తన సరిగా లేకపోయుంటే చనిపోయాక మన గురించి ఎవరూ ఒక మంచి మాట మాట్లాడరని, అపుడు మనం ఎవరికైనా క్షమించమని అడుగుదామనుకున్నా ఇక ఆ అవకాశం ఉండదనీ సూరి ఆత్మ తెలుసుకుంటుంది. అంతే. ఇది నిజానికి ఆత్మ చెప్తే తప్ప తెలియని విషయం, మనం ఆత్మగా మారితే తప్ప అర్థం కాని విషయం కాదు.
ఇక ఊహాచిత్రం కథలో రచయిత ఆత్మ గురించి సమాజంలో వున్న మామూ లు నమ్మకాలకన్నా కొన్ని విషయాలు అధికంగా వ్రాస్తారు. ఆత్మ వెళ్ళిపోవాలనుకుంటున్నప్పటికీ వెళ్ళలేక పోతోందనీ, దానిని ఏదో శక్తి ఇక్కడ ఆపుతోందనీ ఒక వాక్యం ఉంటుంది. ఆ శక్తి ఏమిటి? ఏదైనా బాహ్య శక్తా? దానిలోనే ఉన్న కోరికా? దాని కోరికే అయితే ఆ కోరిక ఏమిటో దానికి కూడా తెలియదా? ఇలాంటి విషయాలన్నీ అస్పష్టంగా వుంటాయి. ఆత్మ అంటే శరీరం నుంచి బయటకి వచ్చిన మనసు అన్న అర్థం వరకే కథలో తీసుకుంటే శాస్త్రచర్చలు చేయవలసిన అవసరం వుండదు. ఈ విషయం నిజానికి చివరిచూపు కథకి కూడా వర్తిస్తుంది. ఆ కథలో ‘నా ఆత్మ ప్రకృతిలో కలిసిపోయింది.’ అన్న చివరి వాక్యం చాలా ప్రశ్నలకి దారితీస్తుంది. మళ్ళీ ఊహాచిత్రం కథకి వస్తే అందులో ఈ క్రింది వాక్యాలు ఉంటాయి. ‘నాకు అక్కడ వుండబుద్ది కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది. భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది. పోలీసులు వచ్చారు. నా మొబైల్‌ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.’
ఇక్కడ ‘నేను’ ఎవరు? ‘అదే అనుకుంటా నా ఆత్మ ఆరాటం’ అని మనతో అంటున్నది ఎవరు? ఆత్మే కదా! ఆత్మ మళ్ళీ ‘నా ఆత్మ’ అనడం ఒక తికమక అయితే ఆ ‘ఆత్మ ఆరాటం’ ఏమిటో ఈ కథ చెప్తున్న ఆత్మకి స్పష్టంగా తెలియదనడం మరో తికమక. ‘కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.’ ఈ వాక్యం చదివితే బోలెడన్ని సందేహాలు వస్తాయి. తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని ‘ఆత్మలో వుండే ఆత్మకే తెలియని మరో ఆత్మ’ గురించి చెప్పి ఈ రచయిత ఎందుకు పరీక్షిస్తున్నాడు? – ఇవి నాకు కలిగిన సందేహాలలో కొన్ని మాత్రమే.
ఇక మహిత కథలో మాత్రమే కథకురాలు ఆత్మగా మారాక కొంత నిర్వికారంగా కథ చెప్పడం మనకు కనిపిస్తుంది. అయితే చిత్రంగా ఈ కథే మన మనసుని ఎక్కువగా కదిలిస్తుంది. పోస్టుమార్టం చేసిన డాక్టరు, తల్లి, తండ్రి, చనిపోయిన మహిత పొడుగాటి జడను తడుముతూ ఏడ్చిన మేనత్త – వీళ్ళందరి గురించీ మహిత ‘నిర్వికారంగా’ చెప్తుంటే… పదహారేళ్ళ పిల్ల అన్ని బాధలకీ అతీ తమైన స్థితికి బలవంతంగా నెట్టబడిందని అర్థమయిన మన గుండెల్లోకి ఆ పిల్ల బాధంతా…. ఇక మహితని అంటుకునే అవకాశం లేని ఆ బాధంతా గోడకి కొట్టిన బంతిలా వచ్చి చేరినట్లవుతుంది.
మహిత కథ చెప్తున్నపుడు శరీరం వుంది. ఇంకో క్షణంలో భర్త వచ్చి ఏం చేస్తాడో అత్త వచ్చి ఏం చేస్తుందో అన్న భయం, వారినుండి తనని తాను కాచుకోవలసిన కర్తవ్యం- ఇవన్నీ ఉన్నాయి. ఇంతలో ప్రాణం పోయింది. ఒక్కసారిగా ‘దృక్కోణం’ మారిపోయింది. ఒకరకమైన నిశ్చింత, నిదానం వచ్చాయి. ‘మహిత ఆత్మ’గా కథ చదువుతున్నపుడు మనం చుట్టూ వున్న మనుషుల్ని (కథలోని పాత్రల్ని) మరో దృక్కోణంతో చూడడం జరుగుతుంది. కొంత స్థిమితంగా నిర్వికారంగా గమనించడం జరుగుతుంది. చాలా చిన్నదే కావచ్చు కానీ ఇందులో ఒక తేడా వుంటుంది.
కథని ‘ఆత్మ’ చేత చెప్పించాలని రచయిత నిర్ణయించుకున్నపుడు వ్యక్తీకరణలో కూడా కొంత భేదాన్ని చూపగలిగితే, అందువలన కథకి ఒక ప్రయోజనాన్ని సాధించగలిగితే అపుడు ఆ కథ పాఠకులపై మరింత గాఢమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఆ ప్రయోగానికి సార్ధకత వుంటుంది.
– ధీర
దారిచూపు – ముకుంద రామారావు (16-Mar-2015)
దేనిని అందుకోవాలనో
ఆకాశం అనాదిగా అలా ఒంగిపోయి ఉంది
చూడటానికి పుస్తకం దగ్గరకు లాక్కున్నట్టు
ఆకాశాన్నీ లాక్కుంటే ఎంత బాగుండును
నిన్ను నన్ను
అమ్మ తొమ్మిది నెలలే మోసింది
పుట్టుకనుంచి గిట్టుకవరకే కాదు
తనలోకి చేరినా మోస్తోంది భూమి
నిన్నూ నన్నేనా
సమస్తాన్నీ తన నెత్తిన పెట్టుకుని
అవిశ్రాంతంగా సూర్య ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది
రోజుకొకమారైనా నిండుగా సూర్యదర్శనం చేయిస్తూనే ఉంది
అదేమిటో ఎప్పటికప్పుడు
కాళ్ళను కెలుకుతూ
తనలోకి రమ్మంటుంది భూమి
విన్నవారితో ఏమేమి మాటాడుతుందో
ఎన్నాళ్ళయినా
తనలోనే దాచుకుంటూ
ఎవరు మరచిపోయినా
భూమి మాత్రం గుర్తుంచుకుంటుందేమో
ఏ రక్తం అయినా చూడు
తాను ఎన్నడూ చూడని
ఎందరు బంధువులో దానికి
శరీరంలో ఆగకుండా ప్రవహించే
రక్తమే ఆత్మనా
ప్రవాహం ఆగిపోతే
గుంపులో ఒకరుగా ఉన్నా
తండ్రులు తెలియని కుక్కల్లా నిద్రలో
ఎక్కడైనా
ఎవరైనా
ఏదైనా
దారి దొరుకుతే
మనలోని నీటికి కూడా
సముద్రాన్ని చేరాలని ఉంటుందా
కిటికీ బయట
కవిత్వాన్ని చూపించకుండా
చెప్పిందల్లా పూవులా వింటూ
కంటి వైద్యుడు చదవమన్నదే చదవడం
పంటి వైద్యుడు చేయమన్నదే చేయడం
ఎంత ఇబ్బందో
నీకైనా నాకైనా
ఎన్నెన్ని మాయల్ని మాంత్రికుల్ని
దాటుకుంటూ వచ్చినా
చివరి మాంత్రికుని
రహస్య స్థావరానికి దారి
ఎవరూ చెప్పలేరా?
ముకుంద రామారావు
99083 47273
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.