పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని
హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని
సుశబ్దశోభిత సురభిళ సుమహారమని
వేదికలపై చమత్కారమై మెరసి
అనుభూతిని గుండె నిండా కురిసి
తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు
తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు
అతడు ‘కవితాప్రాద’ భాసురుడు
కవితాకాశంలో అస్తమించని ప్రతిభా భాస్కరుడు
జనతా హృదయావిష్కృత విజయశేఖరుడు.
‘రాళ్ళబండి’కి కవిత్వపు రత్నాలను ఎత్తి
ఊరూరా పద్యమై ఊరేగినవాడు.
నిత్యం పద్యమై ప్రవహిస్తూ
తీయని సంభాషణల్లో మెరుస్తూ
‘కందం’లో అందమైన జగణంగా నిలుస్తూ
నన్నయ్య వారసుడిగా ఈ తరాన్ని పలకరిస్తూ
అన్నయ్య నాగభైరవను మనసులో తలుస్తూ
లోకానికి కవిత్వాన్ని
నాలాంటి ఎందరికో దుఃఖాన్ని మిగిల్చి
‘లఘువు’లా మాయమయ్యాడు
రేపటి పద్యానికి ‘గురువు’గా నిలిచాడు
అవధాన విద్యకు ఆధునికతను జోడించి
పద్యానికి సరికొత్త పరిమళాన్ని అద్దినవాడు
స్నేహసౌజన్యాలకు మారుపేరై
కార్యనిర్వహణలో నూతన ఒరవడిని దిద్దినవాడు
అతడు నిత్యప్రససాద భాసురుడు
ఏ భుజకీర్తులూ లేని అచ్చమైన భూసురుడు
– డా. బీరం సుందరరావు
ఇంకొల్లు, ప్రకాశం జిల్లా