|
|
‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
తెలుగు వ్యాసప్రస్థానంలో స్వామినీన ముద్దునరసింహనాయని గారి ‘హిత సూచని’ ఒక మైలురాయి. 1862 లో అచ్చయ్యింది. రచన అంతకు ముందెప్పుడో జరిగింది. ఎందుకంటే నరసింహం గారి మరణానంతరం అచ్చుకెక్కిన పుస్తకం అది. వ్యాసం ఇందులో ప్రమేయం అనే పేరుతో ఉంది. అప్పటికింకా వ్యాసానికి వ్యాసం అనే పేరు రాలేదు.
వ్యావహారిక భాషలో వెలువడ్డ వ్యాసాలివి. ఇది తెలుగులో మొదటి వ్యాససంపుటిగా పరిగణింపబడుతోంది. ఆధునిక విద్యా విజ్ఞానాలు కలిగిన మనిషి హేతుపురస్సరంగా విద్య, వైద్యం, మంత్రం, రాక్షసులు, వివాహం మొదలైన విషయాల గురించి చేసిన ఆలోచనలు ఈ వ్యాసాలు. చరిత్ర కారులు ఈ రచనను ఆధునికత ప్రారంభరచనగా గుర్తించారు కాని ఇందులోని సాహిత్య విమర్శాంశను గుర్తించినట్టు లేదు. దీనిని ఆధునిక సాహిత్య విమర్శలో తొలి రచనగా కూడా గుర్తించవలసి ఉంది.
మనుష్యేతర జంతు సంజ్ఞాప్రమేయంలో నరసింహంగారు బంగారు ముంగిస కథను, కేకయ రాజు కథను తీసుకుని వాటిలోని సంఘటనల సాధ్యాసాధ్యాలను విశ్లేషణాత్మకంగా విచారించారు. ఆ కథల మూల లక్ష్యంగా మనం గ్రహించవలసిన విషయాలను, యథార్థాలని భ్రమించకుండా విడిచిపెట్టవలసిన విషయాలను విశదీకరించారు. జంతుజాలం మనుష్యులలాగా ఆలోచించగలదని, మనుష్యులతో మాట్లాడగలదని నమ్ముతున్న జనాన్ని ఉద్దేశించి రాసిన ప్రమేయం ఇది.
భారతంలో కనిపించే బంగారు ముంగిసకథను పరిశీలించిన పద్ధతి ఇలా ఉంది. ముందుగా కథను వివరంగా చెప్పా రు. పేద బ్రాహ్మణుడు అతని కుటుంబం తమకు తినడానికి ఏమీ లేని స్థితిలో చివరకు దొరికిన యవల పిండిని కూడా అతిథి సంతృప్తి కోసం త్యాగం చెయ్యడం, ఆ అతిధికి పాద్యం నిమిత్తం వాడిన నీటిలో తలను, ఒక పక్క శరీరాన్ని తడుపుకున్న ఒక ముంగిసకు ఆ భాగాలు బంగారంగా మారడం, తక్కిన శరీరాన్ని కూడా బంగారంగా మార్చుకోవడం కోసం ఆ ముంగిస వివిధ యాగ ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నించి విఫలం కావడం, ధర్మరాజు చేసిన అశ్వమేధం వద్ద కూడా ఫలితం పొందలేకపోవడం, ఆ ముంగిస అక్కడి విప్రులకు రాజుకు పేదబ్రాహ్మణుడి త్యాగం కన్న ఈ యాగాదులు మిన్నకావని చెప్పడం మొదలైన సంఘటనలన్నిటినీ చెప్పారు. తర్వాత ముంగిసకు మానవ భాష రావడం అసాధ్యమని, దాని శరీరం బంగారంగా మారడం కుదరని విషయమని విశ్లేషించారు ‘న్యాయానుగుణంగా ఆర్జించని సొత్తు ఎంత విస్తారముగా వ్యయము చేసినా న్యాయ కష్టార్జితము తాలూకు స్వల్ప భాగము యొక్క ధర్మముతో సమానము కానేరద’ నేది ఆ కథ నుంచి గ్రహించవలసిన నీతి అని వివరించారు.
అలాగే కేకయ రాజు కధావిమర్శ కూడా చేశారు. ఈ కథ వాస్తవంగా జరిగిందని అనేకులు నమ్ముతున్నారని, అప్పటి వాస్తవ ప్రపంచ మర్యాదకు విరుద్ధంగా ఉన్నప్పటికీ పూర్వయుగాలలో ఇటువంటి సంగతులు జరిగి ఉన్నట్టు చెబుతున్నారని అది తప్పని రాశారు.
అంటే పురాణ కథలు కల్పిత సాహిత్యం అని, ఒక ధ్యేయంతో రచయితలు సాగించిన రచనలని అంటున్నారన్నమాట.
భారతాంతర్గతంగా ఉన్న పరీక్షిదుదంక తక్షకుల కథను మంత్రప్రమేయములో వివరంగా చర్చించారు. పరీక్షిత్తు మహారాజు చేసిన తప్పు, దానికి మునికుమారుడైన శృంగిచేత శాపానికి గురికావడం మొదలుకుని సర్పయాగ విరమణ వరకూ ఉన్న అన్ని ఘట్టాలను సంక్షిప్తంగా తెలియజేశారు. ఆ తర్వాత ఆ ఘట్టాలలోని హేతుబద్ధతను చర్చించారు. చివరగా ఆ కథ ద్వారా నేర్చుకోవలసిన నీతిని ప్రస్తావించారు. వేట ఒక వ్యసనమని అది తప్పు పనులను చేయిస్తుందని, ప్రభువైన వాడు నేరం పూర్తిగా విచారించకుండా శిక్షించడం తప్పని, తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు స్పందించడం న్యాయమని, జాతిలో ఒక్కడు తప్పుచేస్తే అది జాతి మొత్తానికి హానికరంగా పర్యవసించవచ్చునని వివరించారు. అయితే కథ కూర్పులోని అస్తవ్యస్థతలను ఉపేక్షించలేదు.
ఈ భాగంలో స్వామినీన వారు లేవనెత్తిన ప్రశ్నలు అనేకం. మచ్చుకు కొన్ని
1. తండ్రి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా తండ్రిని అవమానించాడన్నకోపంతో రాజును శపించిన శృంగి దుడుకు మనిషి. శాప ఉపసంహరణ చెయ్యమని చెప్పిన తండ్రి న్యాయబద్ధమైనకోర్కెను పాటించలేని వాడు, అటువంటి మనిషి తిట్టు అమోఘంగా ప్రవర్తించడం ఎలా సాధ్యం?
2. అతనికి ఆ సామర్థ్యం ఉన్నట్టయితే తక్షణం చనిపోయేటట్టు ఎందుకు శపించలేదు? వారం రోజుల వ్యవధి ఎందుకు ఉంచాడు?
3. భూలోకంలో అనేక సర్పాలు ఉండగా నాగలోక నివాసి అయిన తక్షకుడే కాటు వేయాలని ఎందుకు శపించాడు?
4. బతికి ఉన్న చెట్టును దానిపై ఉన్న పక్ష్యాదులతో సహా తన విషంతో భస్మం చెయ్యగలిగిన తక్షకుడు పరీక్షిత్తు ఉన్న ఒంటి స్తంభం మేడను దానిలో ఉన్న మనుష్యులందరితో సహా ఎందుకు భస్మం చెయ్యలేకపోయాడు?
5. సర్పయాగంలో ముందుగా తక్షకుడే చనిపోయేటట్టుగా రాజు ఎందుకు సంకల్పించలేదు?
మంత్రాలు లేవని వాదిస్తూ రాసిన ఈ వ్యాసం మూఢనమ్మకాలకు సంబంధించినదేగాని ఇందులో సాహిత్య విమర్శ కూడా ఉంది. నరసింహంగారి లక్ష్యం అది కావడం కాకపోవడంతో నిమిత్తం లేకుండానే ఇక్కడ సాహిత్య వస్తువిమర్శ జరిగింది. ఒక సాహిత్య రచనను ఏ విధంగా చదవాలి ఏమి స్వీకరించాలి అన్న వివేచన ఉంది.
శిల్పం, అలంకారం, రసం, వస్తువు, పాత్రలు, సంఘటనలు మొదలైనవన్నీ కలిసి సాహిత్యం తయారవుతుంది. వాటిలో ఏ అంశాన్ని విశ్లేషించినా అది సాహిత్య విమర్శ అవుతుంది. స్వామినీన వారు చేసింది పురాణ సాహిత్య వివేచన. ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’ వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యా ల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా కనిపిస్తారాయన.
– రెంటాల శ్రీవెంకటేశ్వరరావు
|

