|
|
అహో సాంద్ర భోజా!
కవితా ప్రసాద రాయా!!
కనులకై కలలెన్నో దాచినావు
కనుపాపవే నీవు ఏ కారడవి దాగినావు
మహార్వాటి నుంచి నువ్వు దిగొచ్చిన వాహనం
పద్యపు కులుకు జవరాళ్ళ బండి-
అవధాన మేఘం మీద
లోలోపలి ఉత్సవ వర్షమై, ఉన్నత హర్షమై,
నాలుగు కాలాలే నిలిచి వ్యవధానం లేకుండా
కవి హంసలు పిలుస్తున్నాయని
మానసరోవరాలు దాటి వెళ్లిపోయావు-
పద్యం నీకు తలచినపుడు నర్తించే పదాభినేత్రి
ఆశు శతక గంగ నీ వెను వెనుకే సాగంగా
నగర పుత్రుల, సగటు బతుకుల బూదె కుప్పలు
ముంచెత్తమన్నావు బహు జన్మ పావన మయంగా-
నువ్వు రాయలవైతే నీకోసం
మంత్రులు నిజంగానే మంత్రులయారు
మృదు హృదయ విద్యలో బండలు కరిగించడమే కాదు
బండి పరుగులు తీయించడమే కాదు
రాళ్ళకు పూల వాసనలు తెచ్చిన
రసదండి రాళ్ళబండి –
తాళ వృక్షాంత చంద్రమూర్తి
మేం తేరిపార చూసిన నీదు కీర్తి –
పద్యాలతో ఆడుకునే పిలగాడా!
ఏ స్వర్గ మైదానం పిలిచిందయా
శిశుర్వేత్తి పశుర్వేత్తి యాత్రలో
ఒంటరి పూల బుట్ట ఒకటి
రాళ్ళ బండిలో వేసుకు వెళ్ళిపోయావు
గగన రేఖల లోకంలోకి
నాలుగు పూల రేకలే తీసుకెళ్లావు
అవీ లోకపు ప్రేమ లేఖలని!
వదిలి వెళ్లావు మాకై నీ పద్యాల పూల తోట
కవిలోక గణపతీ, అవధాన స్థపతీ
కవితా రాజ ప్రాసాదాల
స్వేచ్ఛా విహారాల ప్రసాద రాజా!!
కొత్త లోకంలో నీ ఠికాణా
పద్యావధాన ప్రవాహాల షామియానా.
|

