‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

1-‘’నవ్య భవ్యాంధ్రప్రదేశ్ ‘’ — శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్

 

అన్ని అవమానాలు భరించి ,అన్నీ వదులుకొని వచ్చి

‘’హూద్ హూద్ ‘’భయంకర జల రాకాసి బారిన పడినా

మొక్కవోని ధైర్యం తో ,ఆత్మ విశ్వాసం తో

ప్రక్రుతి వైపరీత్యానికే వైపరీత్యం కల్గించి నిలబడి

కేరింతలు తుళ్ళింతల మధ్య తుళ్ళూరు లో

నవరాజధాని నిర్మాణం కోసం అహరహం శ్రమిస్తూ

ఆంద్ర తేజం మిన్ను ముట్టగా

తెలుగుజాతి ,భాషా ఒక్కటే నన్న ధ్యేయం తో సాగుతూ

నవ్య భవ్యాంధ్ర ను నిర్మించి ఎదురులేని జాతిగా ఎదుగుదాం .

 

2-నవ్యాంధ్ర ప్రదేశ్ –శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ –మచిలీ పట్నం

 

 విగ్రహాలను విధ్వంసం చేసినా నిగ్రహం తో భరించాం

 అడ్డుగోడలు కట్టుకున్న ఆనకట్టలు కట్టుకున్నా సహించాం

తొండముదిరితే ఊసర వెల్లి  అవుతుందో లేదోకాని

భజంత్రీ ముదిరితేనే మంత్రవుతాడని

అధిష్టానానికి సాస్టాంగం చేస్తూ మన అన్నమాట మరచి

ప్రజల ప్రతినిధులను ,మనవి చేసుకొనే వాడే ప్రజా ప్రతినిధులని  స్పష్టం చేసినా తల వంచాం

  కానీ తమ్ముడూ !

సిద్ధాంత కర్తలు భౌగోళికంగా విడగొట్టమంటే

మన రాజకీయ రాకాసి మూకలు రాద్దాంతం చేసి చేసి

మన మనసుల్ని ,మనుషుల్ని విడదీయటమే

అత్యంత బాధాకరం

రమ్య హర్మ్యాలు ,సుందర నగరాలను ,రాచ భోగాల రాజధాని

 తులతూగలేని  సంపదను సొంతం చేసుకోన్నాం

నా నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఆంద్ర పదం (ధం) దక్కించుటకు

నా కన్నిటి  కన్నా మిన్న .

గోలచేసి  దక్కించుకోటం  నీకు కొత్తేమీకాదు

నాకూ ఒదులుకొనే ఔదార్యమూ కొత్తకాదు .

కన్నడ వారి ‘’బళ్ళారి’’ నడుగు

తమిళుల ‘’మద్రాస్ ‘’ నడుగు

తమ్ముడూ ! నీది వేరుపడ్డ రాష్ట్రం కాదు

ఒకే వేరు నుండి పుట్టిన మరోకాండం

పేరేమిట౦టావా?

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన మధ్య వారధిలా

మన ఐకమక్యతకు సారదిలా

కలిపి ఉంచేది ,అవకాశాలు కలిపించేది

మన తెలుగు భాషే తమ్ముడూ !

 

3-నా పూర్వాంద్రే –ఈ నవ్యాంధ్ర –శ్రీ ఎల్ కే .మస్తాన్ వలీ –జువాలజీ లెక్చరర్ –నందిగామ

  ఎవరన్నారు నవ్యాంధ్ర అని

ఇది మన పూర్వాంధ్ర

మద్రాసీలను వీడిన తొలి ఆంద్ర

నవాబు పాలన బురఖా తొలగించి

‘’మనోడి’’వని  ఆలింగనం చేసి –ఆదరించాం

రెక్కలొచ్చిన గువ్వలు ఎగిరిపోక తప్పదు

అన్నరీతిగా నువ్వు వెళ్ళినా

నా పూర్వాంధ్ర యే ఈ నాటి నా నవ్యాంధ్ర .

పోయి౦దేమీలేదు మిగిలింది

నా పూర్వా౦ద్రే –ఈ నాటి నా నవ్యాంధ్ర .

 

4-నవ్యాంధ్ర ప్రదేశ్ –స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు –రిటైర్డ్ తెలుగు లెక్చరర్ –విజయవాడ

 

నవ వసంత మహోదయం –నవ జాగ్రుత శుభోదయం

నరనారీ హృదయాంతర-చైతన్యపు యుగోదయం .

వసుమతికే అందమైన –ఆభరణం భారతం

వసుధలో వన్నె కెక్కి –వర్ధిల్లును నిరంతరం .

అందులోన పొదగ  బడిన – ఆణిముత్యం ఈ రాష్ట్రం

తెలుగు వెలుగు లీనుతున్న –చెలువమ్ముల తోయ రుహం .

మధుర మధుర మంజుల –మకరందం మన రాష్ట్రం

చైతన్యపు ‘’చంద్రోదయ ‘’-దివ్య దీప్తి కిది నిలయం .

కవిగాయక వైతాళిక –కళారంగ ప్రముఖులకు

వివిధ శిల్ప చిత్రములకు –పేరుగన్న నిధానము .

ఘనమైన కూచిపూడి –నాట్యమ్ముల వెలయించి

విశ్వమంత మారు మ్రోగి –విజయ భేరి  మ్రోగిం పగ .

కృష్ణా గోదావరి పెన్నా-మహానదుల కల్పవల్లి

సేద్యమ్మున మేలు బంతి  -సిరు లంది౦చెడి తల్లి .

పదమూడు జిల్లాల –పదునైనది ఈ రాష్ట్రం

పసిడి కాంతి జగతి నింపి –వాసి గాంచు ఘన వజ్రం .

ఆంద్ర జాతి ప్రగతి అందుకొనే విఖ్యాతి

అన్నిరంగములను అద్భుతముగ

రాష్ట్ర ప్రగతి కోరి రాజిల్లె మన నేత

‘’చంద్ర బాబు ‘’అమిత శక్తి ధనుడు .

పదును బెట్ట గలడు పదమూడు రత్నాల

పట్టు బట్టి తాను ప్రతిన బూని

అంతరంగమందు ఆత్మీయతలు చింద

అందజేయు యశము నద్భుతముగ.

 

5-నవ్యాంధ్ర –నవ సమాజం –శ్రీ మైనేపల్లి  సుబ్రహ్మణ్యం –ఆకునూరు

 

తెలుగువాడు ఎదనున్నా వేలుగువాడే

రాష్ట్రమే చీల్చినా ,గుండెనే చీల్చినా

తనయడనేక నేరములు చేసినా తండ్రి మన్నించు నట్లు

తెలుగుతల్లి ముద్దు బిడ్డలం –ఆంధ్రులను ఆదరించు తల్లి

ప్రక్రుతి రహస్యం తెలీని పీఠభూమిగాడు

బాల్యమునే బలి తీసుకొనే బోరు బావులోడు

రాళ్లనే రతనాలుగా భావించే –తరుగు తోలు వాడు

వాపును చూసి బలమని నమ్మి తుష్కర దండయాత్రనే మరచినోడు

స్థాణువులైన శిల్పాలను కొల్లగోట్టినోడు

కొల్లాయి గట్టిన దిగంబర గాళ్ళకు –గురుశిష్య గుడుంబా ఘాటు కేక్కినోడు

ఆంధ్రుల ఆవకాయ రుచి ఏలరా?

తెలుగు తల్లి ముద్దు బిడ్డలం

అన్నిటా ఆరి తేరి నోళ్లం

నవ్యాంధ్ర నగుమోము ఆణిముత్యం కావాల

తెలుగువాడు ఏడనున్న వెలుగువాడు ,బతుకు వెలిగించువాడు కావాల.

 

6-వచ్చింది వచ్చింది ఉగాది –శ్రీమతి తాతినేని రామ కుమారి –క్షేత్రయ్య పద పరిషత్ –మొవ్వ

 

వచ్చింది వచ్చింది నవ వసంతం –మన్మధ నామ సుమ వసంతం

మన్మధ వసంతులేకమై వచ్చిన విశేష ఉగాది ఇది

వసంత మన్మదులు నవ్యాంధ్ర నిర్మాణం లో సహకరించాలి

ఎక్కడ చూసినా నవ్య వసంతా రామాలు విలసిల్లాలి

మన్మధుడు అదుపు తప్పక ప్రతి ఇంటా దాంపత్య శోభ పెంచాలి

ఉయ్యూరు లో వారం ముందే వచ్చింది వసంతం

గబ్బిట వారి కోకిల ముందే కూసి ఆహ్వానించింది

మనందరినీ కలిసి కవితా కోయిల స్వరాలు వినిపించ  మన్నది

నవ్యాంధ్ర సస్యశ్యామలాంధ్ర గా ,ఆధునిక శాస్త్ర  సాంకేతికాంద్రగా

విశ్వ వీధిలో వెలిగిపోవాలి –మన’’ చంద్రుడు’’ ఆచంద్ర తారార్కం పాలించాలి

తెలుగు భాష ,సంస్కృతీ భారతీయత అన్నిటా పురి విప్పి నాట్యమాడాలి .

 సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-15 –ఉయ్యూరు

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

  1. మాధవరాజు,సమ్మెట's avatar మాధవరాజు,సమ్మెట says:

    ఇందులోని కవితలన్నీ చాలా రసవత్తరంగా వున్నాయి.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.