ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2

 

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -3(చివరిభాగం )

వాక్సిన్

యాభై అయిదు వయసులో పాశ్చర్ చాలా ప్రసిద్ధ వ్యక్తీ అయ్యాడు .క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యాడు .సాధించినవాటి గురించి ఎక్కువ ఆలోచించ రాదు అన్నది ఆయన సిద్ధాంతం .ఇంకా సాధించాల్సింది ఏంతో ఉన్నదన్న భావన తో శ్రమించేవాడు .ఇప్పుడు చూపు అంతా బాక్టీరియాలజీ మీదనే కేంద్రీకరించాడు .దీనికి కారణం గొర్రెలకు ఒక కొత్త ప్లేగు లాంటి జబ్బు వచ్చితుడిచుపెట్టుకు పోయాయి .వందలో ఇరవై ఈ వ్యాధికి గురై చనిపోయాయి .ఈ జబ్బును ‘’స్ప్లీనిక్ ఫీవర్ ‘’లేక యా౦త్రాక్స్అన్నారు .కొన్ని జిల్లాలలో చనిపోయిన గొర్రెల శాతం ముప్ఫై నుంచి నలభై దాకా ఉంది .దీనిపై అధ్యయనం చేయటానికి పాశ్చర్ ‘’చార్త్రేస్ ‘’కు వెళ్ళాడు .వ్యాధితో చనిపోయిన గొర్రెల కళేబరాలనుండి రక్తం తీసి గినియా పందులకు ,చిట్టెలుకలకు ఎక్కించాడు .,  మళ్ళీ దీనిపై వైద్య బృందం తీవ్రం గా విరుచుకుపడింది పాశ్చర్ మీద .పాశ్చర్ చేసిన ఈ ‘’జేర్మ్ ధీరీ ‘’ని వారు వ్యతిరేకించారు .మతాదిపతులూ వారికి వంతపాడారు .ఒక మినిస్టర్ గారు ఇంకొంచెం ముందుకు వెళ్లి పూర్వం ఈజిప్షియన్ లను శిక్షించటానికి భగవంతుడు ఇలాంటి ప్లేగు  వ్యాధినే కలిగించాడు అన్నాడు .దేనికీ చలించని పాశ్చర్ తానూ చేబట్టే ప్రక్రియలో రక్తం ఎక్కించబడిన జంతువులలో ‘’యాంటి బాడీస్ ‘’ఏర్పడి రోగకారక సూక్షం జీవులతో యుద్ద్ధం చేసి సంహరిస్తాయని చెప్పాడు .దీనిపై అనేక పరిశోధనలు చేశాడు .చివరికి ఒక కల్చర్ ను సాధించాడు .ఇందులో ఆ వ్యాధి కారకాలు చాలా స్వల్పం గా ఉండేట్లు రూపొందించాడు .ఇవి ఆజీవుల్ని చంపటానికి బదులు రక్షించటానికి తోడ్పడుతాయని రుజువు చేశాడు .ఈ వైరస్ ను ఒక వాక్సిన్ గా రూపొందించి గొర్రెల ప్లేగు వ్యాధికి గొప్ప మందు తయారు చేశానని ప్రకటించి తన లక్ష్యాన్ని నేర వేర్చుకొన్నాడు .

అరుదైన గౌరవం

1881లో ఈ సీరం ను యాన్త్రాక్స్ బారిన పడిన  25 గొర్రెలకు ఇంజెక్షన్ గా ఇచ్చాడు .అవన్నీ మళ్ళీ ఆరోగ్యాన్ని పొంది సజీవంగా నిలిచి వైద్య చరిత్రలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. పాశ్చర్ కల సాకారమైంది .పాశ్చర్ సాధించిన ఈ ఘన విజయం  సంపూర్ణమైనదేకాదు ,నవ్యాతి నవ్యమైనది .వైద్య చరిత్రనే తిరగ రాసిన అపూర్వ ఘట్టమై చరిత్రలో నిలిచి పోయింది .ఆయన్ను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు వచ్చి వీరాభిమానులై శిష్యులైపోయారు .ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ఘన విజయాన్ని గుర్తించి ‘’లీజియన్ ఆఫ్ ఆనర్ ‘’ఇచ్చి సత్కరించింది .ఫ్రెంచ్ అకాడెమీ లో ఏర్పడిన ‘’ఇమ్మో ర్టల్ సిర్కిల్ ‘’కు ఎన్నికయ్యాడు .ఈ సిర్కిల్ పాశ్చర్ ను  ప్రముఖ రచయిత అలేక్సాండర్ ద్యూమాస్ ను సందర్శించమని కోరితే ద్యూమాస్ తానె వచ్చి పాశ్చర్ సందర్శనం చేస్తానని చెప్పి వచ్చాడు .పాశ్చర్ కు కృత్రిమ పొగడ్తలు మెచ్చులూ మేహర్బానీలు నచ్చవు .వీటికి సహజం గా దూరంగా నే ఉంటాడు.

హైడ్రోఫోబియాకు మందు

‘’సాధంచిన దానికి సంతృప్తిని చె౦దీ అదే విజయమనిఅనుకోకోయ్ ‘’అన్న శ్రీ శ్రీ పాటకు తగ్గట్లే పాశ్చర్ జీవిత విధానం ఉండేది .ఆనాడు అందర్నీ భయ పెట్టిన జబ్బు హైడ్రో ఫోబియా  .ఇది ఆంత్రాక్స్ కంటే ప్రమాదమై పోయింది .పిచ్చి కుక్క కరచిన వాడికి వారం రోజుల దాకా ఏ ప్రమాద లక్షణాలు కనిపించవు .ఆ తర్వాత లక్షణాలు బయటపడి దారుణం గా ఉంటాయి .స్థిరం గా ఉండలేక పోవటం ,ఊపిరి పీల్చలేకపోవటం లోపలి ఏదీ తీసుకోలేక పోవటం మింగుడు పడక పోవటం ,మూర్చ, అపస్మారకం మొదలైనవాటికి గురై చివరికి చనిపోవటం జరిగేది .దీనికి విరుగుడు కనిపెట్టాలనుకొన్నాడు పాశ్చర్ .ముందుగా రోగకారక క్రిమిని వేరు చేసి దానితో రోగ జీవుల్ని సమర్ధ వంతం గా చంపగలిగే కల్చర్ తయారు చేసే పనిలో పడ్డాడు . ఆయన దగ్గరకు రెండు పిచ్చి కుక్కల్ని తెప్పించాడు. వాటి పళ్ళను రంపాలతో కోయిన్చేశాడు .చాలా జాగ్రత్తగా తానె భయం లేకుండా మాలిమి చేసుకొన్నాడు . గినియా పందులకు కుందేల్లకుకు ఈ వ్యాధికారక  ‘’రేబిస్ ‘’ఇంజెక్షన్ ఇచ్చాడు .ఈ రేబిస్ వల్లనే పిచ్చికుక్క కరిచినపుడు విషం మానవ శరీరం లోకి ప్రవేశించి నీటి భయం అంటే హైడ్రో ఫోబియా ఏర్పడ్తుంది .పాశ్చర్ చేసిన సాహసాన్ని వర్ణించాడు ఒక బయాగ్రఫార్ ‘’ఒక రోజు పాశ్చర్ ఒక పిచ్చికుక్క నుంచి చొంగ (సలైవా )సేకరించే ప్రయత్నం లో ఉన్నాడు .ఇద్దరు  అసిస్టంట్ ల చేత ఒక పిచ్చెక్కిన బుల్ డాగ్ ను బాగా చొంగ కారుస్తుండగా బోనులో నుంచి బయటికి తీయించి ఒక టేబుల్ మీద దాన్ని పడుకో బెట్టించి తన పెదవులమధ్య  ఒక రబ్బరు గొట్టం కొనను ఉంచుకొని రెండవ కొనను ఆ పిచ్చి కుక్క మూతి దగ్గర పెట్టి దాని  ప్రమాద భరిత సలైవా ను పీల్చి ఒక గ్లాసులోకి పట్టాడు ‘’ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశమిది .

ఒక ఎదాదిదాకా తన ప్రయోగ ఫలితాలను బయట పెట్టలేదు సందిగ్ధం లో ఉన్నాడు 1885లోపిచ్చి కుక్క కాటుకు విపరీతం గా రక్తం కారుతున్న  ఒక ఆల్సేషియన్ కుర్రాడిని పాశ్చర్ లేబరేటరీకి తీసుకొచ్చారు .ఆకుర్రాడి పరిస్తితి చూసి పాశ్చర్ చలించిపోయాడు వణికి పోయాడు కూడా .ఇంతవరకు మనుషులకేవరికీ ఆపరేషన్ చేయలేదు పాశ్చర్ .తానూ తయారు చేసిన సీరం ప్రభావం ఏంతో తెలీదు .ఆపరేషన్ చేస్తే తర్వాత పరిస్తితి ఏమవుతుందో సందేహం .ఇక ఉపేక్షించి మీన మేషాలు లెక్క పెడుతూ కూర్చోవటం మంచిదికాదని ఆకుర్రాడి దయనీయ పరిస్తితికి ఏదో చేసి ప్రాణం కాపాడాలని నిశ్చయానికి వచ్చి తానూ సేకరించిన సీరం ను రోజుకు ఒకసారి వంతున పది రోజులు ఇంజెక్షన్ గా ఆకుర్రాడికి ఇచ్చాడు.ప్రతిరోజూ డోసు పెంచి చేశాడు .కుర్రాడి పని కొద్దిగా ఆశాజనకం గా కనపడింది . రాత్రులు  పాశ్చర్ కు కంటి మీద కునుకు ఉండేదికాదు .కుర్రాడు ఆయాసపదడేవాడు .చేతులారా వాడిని  చంపేస్తు న్నానేమోనని బాధ పడేవాడు .నెల రోజుల నిరంతర ప్రక్రియ వలన ఆ అబ్బాయి బతికి బయట పడ్డాడు .హైడ్రో ఫోబియాకు విరుగుడుగా గొప్ప మందు కనిపెట్ట గలిగానని అప్పుడు ధైర్యం గా ఉత్సాహం గా ప్రకటించాడు పాశ్చర్ మహాశయుడు .అదీ ఆయన సహనం ..

గుర్తింపు –గౌరవం

 

ఈ సంఘటన దేశమంతా ప్రచారమైపోయింది .ఇప్పటికే ఫ్రాన్స్ ప్రజల ఆరాధ్య దైవం అని పించుకొన్న లూయీ పాశ్చర్ ను అనేక విశేషణాలతో కీర్తించటం ప్రారంభించారుజనం .’’రక్షకుడు,ప్రాణదాత , .భయంకర వ్యాధుల పాలిటి కాల యముడు .చావునుండి తప్పించే దైవం ‘’ అన్నారు .దేశ విదేశాలలో పాశ్చర్ పేరు మారు మోగింది ఆయన కీర్తి దిక్కులదాకా విస్తరించింది .సైంటిస్టులు డాక్టర్లు అందరూ వచ్చి అభినందించారు .ఆయన్ను తమ ‘’మాస్టర్ ‘’అని గౌరవించారు .వారందరికీ ‘’అపోజిల్ ‘’గ అంటే ‘’ప్రవక్త ‘’గా ఉండమని ప్రాధేయ పడ్డారు ‘’ది న్యూ యార్క్ ట్రిబ్యూన్ ‘’ఒక కాలం రాయటం ప్రారంభించి వర్కింగ్ క్లాస్ పిల్లలకు ట్రీట్మెంట్ కోసం  పాశ్చర్ దగ్గరకు పారిస్ కు పంపింది .ఇంగ్లాండ్ నుంచి రేబిస్ బాధితులు వచ్చి పాశ్చర్ ఇల్లంతా నిండిపోయారు .అలాగే హగేరి ,స్పెయిన్ ,హాలండ్  రష్యా లనుండి వ్యాధి గ్రస్తులు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని జబ్బు నయమై నవ్వు ముఖాలతో స్వదేశాలు చేరే వారు .ఈ దేశాల వారికి తెలిసిన ఒకే ఒక ఫ్రెంచ్ మాట ఏమిటో తెలుసా ?’’పాశ్చర్ ‘’అన్న ఒకే ఒక్కమాట .అంతగా పాప్యులర్ అయ్యాడు పాశ్చర్ .

14-11-1887లో ‘’పాశ్చర్ ఇన్ ష్టిట్యూట్ ‘’ఏర్పడింది .ఎందరో దాతలు  ఎన్నో దేశాలు విరాళాలిచ్చి దానికి తోడ్పడ్డారు రష్యా ఏంతో ఆర్ధక సాయం అందించింది .బీద జనం లెక్కలేనంత మంది ముందుకొచ్చి విరాళాలు అందజేశారు .అయిదేళ్ళ తర్వాత పారిస్ లోని సార్బోనే దియేటర్ లో అసంఖ్యాకం గా అనేక సైంటిఫిక్ సోసైటీలవారు ,ఫ్రెంచ్ అకాడెమీ సభ్యులు  ,స్థానిక ప్రొఫెసర్లూ ,విదేశీ ప్రముఖులు హాజరై పాశ్చర్ ను ఘనం గా సన్మానించి ప్రతభా విశేషాలను కీర్తించారు .ఏంతో  మంది శ్లాఘిం చినా  అందులో లిస్టర్ చెప్పిన ’’శతాబ్దాల కాలం నుండి ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి కష్టాలకు తెర వేశావు .పుండ్ల కు చేసే చికిత్సకు కొత్తపద్ధతిని ప్రవేశ పెట్టావు .నీ నిరంతర పరిశోధన చీకటిలో ఇప్పటిదాకా మగ్గిపోయిన సర్జరీ పై కొత్త వెలుగులు ప్రసరింప జేశావు ‘’అన్నమాటలు చిరస్మరణీయాలుగా నిలిచిపోయాయి .ఉద్విగ్న భరితంగా ప్రసగించిన లిస్టర్ పాశ్చర్ దగ్గరకు వెళ్లి ఆప్యాయం గా కౌగిలించుకోవటం చారిత్రాత్మక ఘట్టమే అయింది .ఇద్దరూ పసి పిల్లలై ఆప్యాయాన్ని ఆత్మీయతను ప్రేమను ఆరాధన ను పంచుకొన్నారు .

టాక్సిన్స్ –యాంటి టాక్సిన్స్

రెండేళ్ళ తర్వాత పాశ్చర్ టాక్సిన్ యాంటి  టాక్సిన్ లపై పరిశోధన చేశాడు .డిఫ్తీరియా వ్యాధికి మందు కని పెట్టె ప్రయత్నం లో ఉన్నాడు .అకస్మాత్తుగా పాశ్చర్ కు ‘’యురేమిక్ పాయిజనింగ్ ‘’జరిగింది .రెండునెలలు చాలా ఇబ్బందిపడ్డాడు .చావుకు దగ్గరయ్యాడేమో నని పించింది. కొంచెం కుదుటపడ్డాక .డాక్టర్ల సలహా మేరకు  లేబరటరీకి వెళ్లి శిష్యుల పరిశోధనా ఫలితాలను తెలుసుకోనేవాడు .ఇక పాశ్చర్ పరిశోధనా శకం ముగిసి నట్లే .పాశ్చర్ ఇన్ ష్టి ట్యూట్ బయట లాన్ లో తాపీగా కూర్చునేవాడు .తన స్వగ్రామం విల్లెనీవ్ యిటాంగ్ కు వెళ్లి విశ్రాంతి జీవితం గడిపాడు .రేబీస్ పై ఇంకా పరిశోధన చేయాలి .

ప్రాణదాత మరణం

గుర్రపు శాలల్లో ఉంటూ డిఫ్తీరియా వ్యాధి మందుకోసమే ఆలోచించేవాడు అవే పరిశోధనాలయాలయ్యాయి .క్రమంగా ఆరోగ్యం తగ్గిపోతోంది .75 వచ్చేసరికి మృత్యు సమీపాన ఉన్నాడు ,మాట్లాడలేక పోతున్నాడు .సెప్టెంబర్ నాటికి తలకూడా కదల్చలేని బలహీనుడయ్యాడు .పాలకప్పు అందిస్తే తాగలేనని తల ఊపేవాడు .దిండుమీద వాలిపోయేవాడు .ఇరవై నాలుగు గంటలకాలం కోమాలో ఉండి28-9-1895జీవరాశికి ప్రాణదానం చేసిన ప్రాణదాత లూయీ పాశ్చర్73 వ ఏట  మరణించాడు .ఎనిమిది గ్రంధాలు రాశాడు .

కొన్నేళ్ళ తర్వాత ఫ్రెంచ్ ప్రజల హీరో ఎవరు అని ఒపీనియన్ పోల్ సేకరిస్తే లూయీ పాశ్చర్ మొట్ట మొదటి వ్యక్తిగా నియంత నెపోలియన్ అయిదవ వ్యక్తిగా నిలిచారు .అంతగా ప్రజా హృదయాలలో చోటు దక్కించుకొన్న చరితార్ధుడు పాశ్చర్ .ఫ్రాన్స్  జాతీయ నాయకుడుగా గుర్తింపు పొందాడు ‘’worship the spirit of  criticism. Without it ,every thing is fallible .It always has the last word’’ అన్న మహా వ్యక్తీ పాశ్చర్ .మానవ జీవితాన్ని రెండుమార్గాలు ప్రభావితం చేస్తాయి ఒకటి రక్తపాతం ,చావు .ఇవి ఎప్పుడూ వినాశానాన్నే కోరతాయి .దేశాలమధ్య విద్వేషాలు పెంచి ఎప్పుడూ యుద్దానికి సన్నద్ధం చేస్తాయి . .రెండవ మార్గం శాంతిమార్గం ఇందులో పని ఆరోగ్యం సృజన ,కొత్తమార్గాలు కనిపెట్టి మానవ ఉపయోగానికి తోడ్పడటం .ఉంటాయి .మొదటిమార్గం హింసాత్మక విజయం .రెండవది మానవాళికి మనశ్శాంతిని ,ఉపశాంతినీ కల్గించేది .ఇందులో ఏది చివరిదాకా నిలుస్తుందో దేవుడే చెప్పగలడు .కాని ‘’science will have tried ,by obeying the law of humanity to extend the frontiers of life ‘’ అన్నది శాంతికాముకుడు ,ప్రజా సంక్షేమంమూ కోరే లూయీ పాశ్చర్ అభిప్రాయం .అదే మానవాళికి శ్రేయోదాయకమైన మార్గం .

Image result for louis pasteur

Image result for louis pasteurImage result for louis pasteur

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-15- ఉయ్యూరు

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.