. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29
14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్
పరస్పర విరోధభావాల లియో
‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు ,ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు,ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు ,అన్నిటా భగవంతుడే అని భావించేవాడు మహా గొప్ప వాడు ‘’.అని ఇరవై అయిదవ ఏటనే ఈ మహా వాక్యాలు రాసిన మహా రచయిత లియో టాల్ స్టాయ్.ఆయన నీతి మార్గామేమిటో దీనిలో కన్పిస్తుంది .యుద్ధము –శాంతి ,అన్నా కేరీనీనా అనే రెండు నవలలతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు .ఆయన చెప్పినవన్నీ ఆయనకే వర్తించటం బహు తమాషా .జూదం ,విలాసం ,అధికారం చెలా యించటం లో ఆయన చాలా చెడ్డవాడు .కీర్తికోసం తాపత్రయం ,తప్పు చేస్తున్నానని తెలిసినా అదే దారిలో నడవటం ఆయన బలహీనత .తోటి వారి పట్ల ప్రేమ ,దయ, సానుభూతి కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దైవం పై ఆరాధన, ఆయన రచనలన్నిటా చూపటం టాల్ల్ స్టాయ్ ని మహోన్నతుని చేసింది .తాను ఎవరైనా కానీ ఆయనే అన్నిటా ఉండటం ప్రత్యేకత .వీటికి తానె వ్యతి రికి అవటం పారడాక్స్ .విరుద్ధ భావాలు ఆయన నరనరానా వ్యాపించి ఉన్నాయి .సుఖం పై మోజు ,తిండిపై వ్యామోహం ఆత్మ తిరస్కారం అన్నిటా ఆయనే ముందు .లాజిక్ తో మేజిక్ చేసే దమ్మున్నవాడు .తనదే రైట్ అని ఇతరులను నమ్మించే పట్టుదల ఉన్నవాడు .ఆడవాళ్ళను చడపురుగులులాగా తిరస్కరించటం ఉన్నా రచనలో కాంతి ప్రసరించి మిరుమిట్లు గొల్పే చాకచాక్యమున్నవాడు .దూకుడు స్వభావం ఉన్నా ప్రపంచ కధకుల్లో అగ్రస్థానాన నిలచిన ఉత్తమ కధకుడు టాల్ స్టాయ్.సృజనాత్మక రచనలతో నైతికత స్థాయి పెంచిన దార్శనికుడు .1899 లో టాల్ స్టాయ్ తీవ్రంగా జబ్బు పడ్డప్పుడు మరో రష్యన్ కదకుడు చెకోవ్ ‘’ఆయన బతికి ఉన్నప్పుడు సాహిత్యం లో చెడు జుగుప్స ,కన్నీరు ,అనాగరక భావాలనన్నిటినీ దూరంగా పెట్టాడు .టాల్ స్టాయ్ రాకతో రచయితలు కావలసినవారికి మహదానందం ,తేలిక అయింది అన్నీ కస్టపడి టాల్ స్టాయ్ చేసి ఉంచాడు కనుక మా లాంటి రచయితల పని సులువైంది ‘’అన్నాడు .
తండ్రి దివాలా-తల్లితో మళ్ళీ మహా రాజ భోగం
కౌంట్ లియో నికోలావిచ్ టాల్ స్టాయ్ 28-8-1828 మాస్కో కు ముప్ఫై మైళ్ళ దూరం లో ఉన్న బహు సంపన్నమైన యాస్నాయ పోలియాన ఎస్టేట్ లో జన్మించాడు .అప్పటికి వీరి కుటుంబం లో ఇరవై తరాలు గడిచి పోయాయి .వీరిలో 17 వ శతాబ్దికి చెందిన ఆండ్రియో విచ్ టాల్ స్టాయ్ రష్యా రాజు’’ పీటర్ ది గ్రేట్ ‘’కు గొప్ప అభిమాని .టాల్ స్టాయ్ తండ్రి అదే రాచమర్యాదాలతో పెరిగాడు .నెపోలియన్ ను ఓడించిన యుద్ధ దళం లో సభ్యుడుకూడా .ఖైదీగా పట్టుబడి పారిస్ జైలు లో ఉండి ,విడుదలై వచ్చాక తండ్రి చనిపోయాడు .ఎస్టేట్ అప్పుల ఊబిలో కూరుకు పోయింది .అ అప్పులతో తనకేమీ సంబంధం లేదన్నాడు టాల్ స్టాయ్ తండ్రి .తల్లి పోషణ భారాన్ని మాత్రం స్వీకరించి ఆనాటి రష్యా సంపన్న కుటుంబీకుల మాదిరి బాగా డబ్బు ,సంపదా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .భార్య ధనికురాలేకాదు రాయల్ ఫామిలీకి చెందింది .ఆమె పేరు ప్రిన్సెస్ మార్యా నికోలా యేవ్నా వోల్ కోన్స్కి.అందగత్తె కాదు . భర్త కంటే అయిదేళ్ళు పెద్దదికూడా .పెళ్ళి నాటికి ఆమె వయస్సు ‘’ముప్పీ రెండు ‘’.ఐదు భాషలలో నిష్ణాతురాలు .యాస్నాయా పోల్యానా లో ఉన్న ఎనిమిది వందల శేర్ఫ్ లను, కౌలు దార్లను చాలా తేలికగా మేనేజ్ చేసే సామర్ధ్యం ఉన్నది .భర్త కు అయిదుగురు సంతానాన్ని ‘’కన్నది ‘’. అందులో లియో నాలుగోవాడు .చివర గా కూతురుపుట్టింది . .
బాల్యం –పరాయి పెంపకం
టాల్ స్టాయ్ రెండేళ్లప్పుడు తల్లిని ,తొమ్మిదో ఏట తండ్రినీకోల్పోయాడు . బంధువుల మహిళలే పెంచారు ఇంటి దగ్గర ట్యూషన్ ఏర్పరచి చదివించారు .బాగా చదివి టీచర్ల మెప్పు పొందాడు .మనిషి అందం గా ఉండడు.అది మనసులో కెలుకుతూ ఉండేది .వయసు పెరిగినకొద్దీ పెడసరం గా ,గర్విష్టిగా మారాడు.వీటితో పాటు ఆత్మ పరిశీలనా దృష్టీ పెరిగింది .అందంగా ఉండే తండ్రిపోలిక రాకుండా అందవిహేనురాలైన తల్లి పోలిక వచ్చినందుకు మనసులో ఎప్పుడూ బాధ పడేవాడు .దీనితో సిగ్గు వచ్చి మనుషులకు దూరంగా ఉండేవాడు . అంతరాత్మ ప్రబోదానికి లోనై హుందా తనం లేకుండా ఉండేవాడు .వీటివలన స్నేహితులను సంపాదించుకోలేక పోయాడు .తనకున్న కొన్ని ప్రత్యేకతల వలన అతి కొద్దిమందిమాత్రమే టాల్ స్టాయ్ కి సన్నిహితులు కాగలిగారు .
విద్య
లియోకు గార్డియన్ గా వ్యవహరించిన అలేక్సాండ్రియా- లియో 13వ ఏట చనిపోయింది .దీనితో ఆంట్ పెలగేయా వీరి కుటుంబాన్ని తన స్వగ్రామం కజాన్ కు మార్చింది .లియో కజాన్ యూనివర్సిటి లో చేరి ,టౌన్ లో బాగా పేరు ప్రఖ్యాతులు పొందాడు 17 ఏళ్ళకే .దసరా బుల్లాడి లాగా డ్రెస్ ల గొడవే కాని అందాల రాముడిలాగా అడ పిల్లలను ఆకర్షించలేక పోయాడు .పెళ్లి అయినవారితోకాని , కాని వర్జిన్స్ తో కాని ‘’లవ్వాయణం’’లాగించలేదు .డబ్బు, అధికారం ,రాజరికం ఉన్నవాడు కనుక ‘’పడుపు కత్తేల ‘’తో పడక సుఖం అనుభవించేవాడు .19 ఏళ్ళప్పుడే సుఖాన్ని కొనుక్కోన్నానని డైరీలో రాసుకొన్నాడు .దీనిఫలితమైన ‘’గనేరియా ‘’తగులు కొని బాధ పడ్డాననీ నిజాయితీగా డైరీలో నోట్ చేశాడు .రెండో సంవత్సరం చదువు పూర్తికాకుండానే యూని వర్సిటీ వదిలేశాడు .చాలా తక్కువ మార్కులు రావటం, అక్కడ తను నేర్చుకొన్నది అతి తక్కువ అని భావించటమే నిష్క్రమణకు కారణం .తాను ఉండాల్సినది తన ఎస్టేట్ అయిన యాస్నయా పోల్యానా లో మాత్రమె అనే భావం బలమైనది .అక్కడికి వెళ్లి తన సమర్ధత చూపించి గొప్ప లాండ్ లార్డ్ గా రుజువు చేసుకోవాలనుకొన్నాడు .వేదాంత పరమైన ఆలోచనలూ దీనికి దోహదం చేశాయి .తనకు నచ్చిన రీతిలో ప్రయోజనాత్మకమైన అర్ధ వంతమైన జీవితం గడపాలనుకొన్నాడు టాల్ స్టాయ్ .
టాల్ స్టాయ్ ఎస్టేట్
తన ఎస్టేట్లో సెర్ఫ్ ల విస్తరణ ప్రారంభించాడు .దీనికోసం డబ్బు చాలాఖర్చు పెట్టాడు .అప్పుల్లో చిక్కుకొన్నాడు .ఇదికాదు అనుకోని మరో కొత్త విధానం ప్రవేశ పెట్టటం చేతులు కాల్చుకోటం మళ్ళీ మరోదానికి పాకులాట ఇలా గడిచింది ఎస్టేట్ లో .తనమనోభావాలన్నిటినీ డైరీలో భద్రం చేశాడు .లోపల్లోపల యెంత కుమిలిపోయే వాడో అవి చదివితెతెలుస్తుంది .
యుద్ధ అనుభవం –సెక్స్ అనుభవం
23 వయసులో ‘’జెంటిల్మన్ వాలంటీర్ ‘’అయ్యాడు సోదరుడు నికోలాయ్ అప్పటికే యుద్ధ సైనికుడు గా ఉన్నాడు .కకాసాస్ కు కేడేట్ గా వెళ్ళాడు .యుద్ధ కాంప్ లో ఉన్నా పాత అలవాట్లు మార్చుకోలేదు .సరైన విధానాలలో నడవ లేదు .జూదం ఆడి పోగొట్టుకొనిఅప్పుల అప్పారావు అవతారం ఎత్తి ఎస్టేట్ లో కొంత భాగం అమ్మాడు .కకాసియన్ అమ్మాయిలతో సెక్స్ జరిపి సుఖ వ్యాధి బాధించి తగ్గటానికి మందు పుచ్చుకొన్నాడు .తనకున్న మూడు దుర్గుణాలను వదిలించుకోటానికి తీవ్ర యత్నం చేస్తున్నట్లు గురూగారు డైరీలో రాసుకొన్నారు .ఆ మూడు మోహాలే జూదం ,ఇంద్రియ లోలత్వం ఆడంబరం (gambling sensuality and vanity )యుద్ధ భూమిలో ప్రత్యక్షం గా యుద్ధ భీభత్సాన్ని చూశాడు .శత్రువులపై తుపాకి గురిపెడుతుండగా ఒక బులెట్ వచ్చి తుపాకికి తగిలి దాదాపు ప్రాణం పోయేంత ప్రమాదం జరిగి బయటపడ్డాడు .ఇంకోసారీ ప్రమాదం అంచుమీద నుండి తప్పించుకొన్నాడు ప్రానాపాయాన్ని .అందుకే ధైర్య సాహసాలు చూపినందుకు సెయింట్ జార్జ్ క్రాస్ ను బహూకరించాలని ప్రభుత్వం న్ర్నయించింది మర్నాడు ఉదయమే బహుమతి ప్రదాన ఉత్సవం .కాని బాగా నిద్ర పోయి ఫంక్షన్ కు వెళ్ళలేక పోయాడు .అ అవార్డ్ ను ఇవ్వకుండా గార్డ్ హౌస్ కు పంపారు .సైనికుల౦దరితో చాలాకలుపుగోలుగా ఉండేవాడు .పొట్టి బుడం కాయలా ఉన్నా బలిస్టం గాఉండేవాడు . నేల మీద పడుకొని రెండు చేతులూ సాచి వాటిమీద ఇద్దరు సైనికులను నిల బెట్టుకొని పైకి లేపెవాడట అంతటి సామర్ధ్యం ఉండేది .గురూగారి ముక్కు చాలా వెడల్పు .పెదిమలు మొద్దుగా పెద్దగా ఉండేవి .కళ్ళు చిన్నవి.కాని ఆకళ్ళు మహా పవర్ ఫుల్ .ఎన్నోభావాలకు ఆలవాల౦గా ఉండేవి .నవ్వే పెదిమలతో అందరికీ ఆకర్షణీయం గా ఉండేవాడు టాల్ స్టాయ్ .
రచయిత టాల్ స్టాయ్
అప్పటికి ఇంకా రచన వ్యాసంగం పై ద్రుష్టి పెట్టలేదాయన .ఈవిషయాలు డైరీలో రాశాడు .తన ఆంట్ కు ఉత్తరం రాస్తూ ఆమె తనను నవల రాయమని కోరిన సంగతి గుర్తు చేశాడు .1852 జూలై లో ‘’కాంటెంపొరరి ‘’అనే ప్రముఖ సాహిత్య పత్రికా సంపాదకుడికి ‘’చైల్డ్ హుడ్ ‘’అని తాను రాసిన జీవిత చరిత్ర భాగాన్ని పంపాడు .వెంటనే అది ప్రచురణ పొంది అభిమానుల్ని సంపాదించింది .ఇరవై నాలుగేళ్ల ఈ కుర్ర రచయితను చూసి అతనిలో ‘’un known and remarkable talent ‘’ఉందని మెచ్చుకొన్నారు .కొద్దిగా కల్పన ఉన్నా అది టాల్ స్టాయ్ జీవితమే .అ తర్వాత ఏది రాసినా స్వీయ జీవిత చరిత్రయే అయింది .ఇప్పటికే గొప్ప శైలి అలవడింది. అది అంతటా హాయిగా ప్రవహించింది .సంఘటనలన్నీ యదార్ధమైనవే కావటం తో రియలిస్టిక్ రచయితగా మంచి గుర్తింపు వచ్చింది .
![]()
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-3-15 –ఉయ్యూరు
.
