‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం
‘’ గోపీనాద్ ప్రత్యేకత
శ్రీ ఎరుకలపూడి గోపీ నాద రావు గారితో నాకు మూడేళ్ళ పరిచయమే ఉంది .ఒకటి రెండు సార్లు సరసభారతి ఉగాది కవి సమ్మేళనానికి వచ్చారు .మరో రెండుసార్లు రాలేకపోయారు .కాని విజయవాడ సభలలో తరచుగా కలుస్తాం .ముభావం గానే ఉంటారు .’ ‘’పని ఉండి రాలేక పోయాను సార్ ‘’అని ముందే ఆయన నా దగ్గరకొచ్చి సంజాయిషీలా చెప్పే సంస్కారం ఆయనది . సభల్లో నేను కొంచెం హడావిడి చేస్తాను .కాని ఆయన నిండుకుండ .తొణక్క బెణక్క బుద్ధిగా కూర్చుంటారు .ఇంతకు మించి పరిచయం లేదు .కాని సుమారు పదిరోజుల క్రితం తన రచన ‘’పద్య ప్రసూనాలు ‘’పంపి అందులో’’అభిప్రాయార్ధం ‘’అని అన్నారు .కనుక జాగ్రత్తగా చదివా .నేను పద్యాలు రాయను .ఛందస్సు రానివాడిని .నన్ను అభిప్రాయం కోరడం లో ‘’మతలబు’’ నాకు అర్ధం కాలేదు .రాయటానికి రెండు మూడు కారణాలు కనిపించాయి .మొట్టమొదటిది ఆయన మహారాష్ట్ర లోని పూనా లో ‘’కిర్కి ‘’లో పుట్టటం .అక్కడే మా తమ్ముడు మోహన్ ఆర్డినెన్స్ ఫాక్టరీ లో పని చేస్తూ కిర్కీ లోని ‘’సిపోరేక్స్ క్వార్టర్స్’’ లో ఉండటం .మేము 45ఏళ్ళ క్రితం ఒక వారం అక్కడే గడపి రావటం .రెండవది ఆయన మహా రాష్ట్రలో పుట్టి ,ఇంటర్ దాకా ఆంగ్ల మాధ్యమం లో చదివి ఆంద్ర ప్రాంతానికొచ్చి తెలుగు నేర్చి పద్యాలు అల్లటం .మూడవది ఆ పద్యాలు రసస్పోరకం గా ఆపాత మధురంగా ఉండటంఅనేక ప్రముఖ సాహిత్య సంస్థల పురస్కారాలు లభించటం .ఆయనకు పృథ్వి ఆరాధ్యమవటం ,దానిపైనున్న జీవరాసి పై ప్రేమస్పదనలు౦డటం ,జీవావరణ ,పర్యావరణాల పరి రక్షణ పై ద్రుష్టి ఉండటం ,దేవతల ఆశీస్సులు మానవ జాతికి అవసరమని భావించటం ,ఇలలో జన్మించిన మహాను భావులను సంస్మరించటం జీవన దాతలైన నదీ సాగరాల స్తుతి చేయటం అన్నీ చూస్తె ఈ’’ పద్య ప్రసూనమాల ‘’పృధ్వీ మాతకు అల౦కార మవటం నా దృష్టిలో ‘’ఆధునిక పృధ్వీ సూక్తం ‘’గా ఉండటం వలన నా భావాలను తెలియ జేయటానికి ‘’గోపీ నాద పృధ్వీ సూక్తం ‘’అన్నాను .
సీసాల గోపీనాధ కవి
గోపీనాధ రావు గారికి’’ సీసా’’లంటే మత్తు ఎక్కువ .’’సీ- సా ‘’బల్లపై ఊగినంత హాయిగా ఆటగా ఆయనకు సీసపద్యాలు పలుకుతాయి .పలకటం కాదు పదాలు వచ్చి కూర్చుని పొదగమని ప్రాధేయ పడతాయి .తర్వాత సార్ధకమై విలువను పొందుతాయి .ఏది రాసినా ఆయన రచనలో ఎక్కడా తడుముకోవటం ,తడబాటు ఉండదు .సరైన పదం అక్కడ చేరి తిష్ట వేస్తుంది .అది వాణి శ్రీ ప్రసాదమే .వాణీ నాధుడైన విరించి లా పద్య సృష్టి జరుగుతుంది .ధన్యులు ఆయన ..ఇందులో ఎన్నో సంస్థల అవార్డులు పొందిన కవిత లున్నాయి .అవి వారి పద్య పాటవానికి బహుమతులే .భావ సౌందర్యానికి అలంకారాలే .ఊహా సౌభాగ్యానికి ఊతాలే .కదిల్తే సీసం మెదిల్తే సీసం .అవి చెవిలో పోసిన సీసం లాకాకుండా మధురాతి మధురం గా ఉండటం ,శ్రీనాధుని పోకడ మనకు సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి .
ఛందో వైవిధ్యం
విద్దెల దేవికి విన్నపాలు ,జన్మభూమికి కృతజ్ఞత ,లక్ష్య సిద్ధి ,భాష వేదన ,దుఖితుల జీవన దృశ్యం ,కలికల్మషాలు ,మేఘ సంస్తుతి ,వర్షం, హర్షం మొదలైన 69 శీర్షికలతో అల్లబడిన పద్య ప్రసూన మాల ఇది .దేనికదే సాటి .ప్రతి దానిలో గోపీనాధీయం దర్శన మిస్తుంది .దీర్ఘ చంపక ,ఉత్పల మాలలూ కూర్చి వాగ్దేవిని అలంకరించారు .సరదాగా ‘’ఆట వెలదుల’’తో ఆడుకొన్నారు . తేట గీతులతో సేద దీర్చా(రా)రు .
శారదా స్తుతి –ఎరుక గల కవి
‘’నిత్య సత్కావ్య నిర్మాణ నిష్ట నిమ్ము ‘’అంటూ పంచ భూతాత్మకమై శ్రేయమిమ్ము ,శుద్ధ చేతమ్ము నందించి వృద్ధి నిమ్ము ‘’అని’’ సకల కళా నీరద’’ శారదను ప్రార్ధించారు ముందుగా .స్వా౦తాన్ని వెలిగించే సంక్రాంతి (some క్రాంతి కాదు సంపూర్ణ క్రాంతి )ఇమ్మన్నారు .ఆత్మకు పరమాత్మ అండ కలిగించమని వేడారు .తనను గుర్తించి దరి చేర్చి వన్నె లద్ది భావ చిత్రాలకు భవ్యాక్షరా కృతులిచ్చి ,తెలుగు భాషను పూజించే దీక్ష నిమ్మని వేరొక చోట ప్రార్ధించి తన ఆరాటాన్ని అమ్మకు ఎరింగించారు . ‘’ఎరుక’’ గల కవి .కనుక ఎరుకల కూడి(పూడి)అని సార్ధక మైంది ఇంటిపేరు .
ప్రకృతి పాఠాలు
ప్రకృతిని చూసిఆత్మ శుద్ధి , పరహితం సమతామార్గం రుచిర సౌందర్యం వంటివి ఎన్నో నేర్చుకొన్నానని కృతజ్ఞత చెప్పారు .ప్రపంచీకరణం యాంత్రిక ఉన్మత్తం కలగ జేసిందని ,స్వేచ్చ మితిమీరి ద్వేషాలు పెచ్చరిల్లాయని ఆవేదన చెందారు .మతాల మధ్య మారణ హోమానికి కలత చెందారు .’’దైవీ దత్త మనోజ్ఞ ధాత్రి నొక దైత్య స్థావర స్థాయికి ‘’తీసుకురావటం బాధాకరం అన్నారు .సిరులన్నీ వస్తు చయ దాహాన్నిపెంచే శ్రీలే –‘’అంటూ పుణ్యం ఒక్కటే ‘’చిర సుఖ శాంతి నిచ్చేది యశేష విశేష ములున్న కల్మి’’అని బుద్ధి చెప్పారు .అంత్యకాలం లో అండగా నిలిచేది పుణ్యం ఒక్కటే అని నిర్ద్వందం గా చెప్పారు .అన్నీ చేజేతులా నాశనం చేసుకొంటున్న మానవుడికి ‘’సుకమొక స్వప్న లోకమున సోకే హృష్టి గ మారిపోయే ‘’అన్నారు .తృష్ణ మృగ తృష్ణ వంటిదని దాని వెంబడి పరిగెత్తితే ఆయాసప్రయాసమే తప్ప సుఖ శాంతులు ఉండవు .’’ధ్వజమై మానవ జాతి రక్షణ’’నిర్వర్తించే వారు లేరని ,ఇదంతామారిపోయి ‘ప్రేమ సంహిత మయి ,జీవ కోటి సుఖ హేతువు కావలె ‘’అని ఆశించారు .
సామాజిక స్పృహ
కవి ,కళాకారుడు ,శిల్పిఒకరేమిటి సకల వృత్తుల వారు సుఖమయ ఆనందమయ సంతృప్తికర జీవితం గడప లేక పోతున్నారని బాధ పడ్డారు .సామాజిక స్పృహ కు ఇవి అద్దం పట్టే రచనలే .’’జడముకుజీవ మండించు శాస్త్ర వేత్త –జీవనోపాధి లేక నిర్జీవమై ‘’పోతున్నందుకు హృదయ భారం తో నొచ్చుకొన్నారు ‘’తాడఘము ‘’లిడే వ్రుత్తికిన్ తాడనములు ‘’అని శాబ్దిక చమత్కారం చేశారు .ఈ నాటి చదువుల హైటెక్కు లగురించి ‘’ప్రతి ఇంట బీటేక్కు ,ప్రతి ఇంట ఎంటెక్కు ‘’అని మొదలు పెట్టి జనని భాష నేర్చే చదువు కనిపించటం లేదని ,ఆధునికత అందించే అభ్యుదయం లో మూల్యాలను త్రెంచే మూఢత అయిందని ,రోజు గడిస్తే చాలన్న భావం మానవ ప్రగతి కాదన్నారు .’’సాగర ఘోష ‘’కవిగా గరికపాటి వారు ప్రసిద్ధులు .వీరూ అదే శీర్షికతో సాగారాగ్రహానికి మానవ తప్పిదాలే నని చెబుతూ ‘’వృత్తుల రెక్కలన్ తొడిగి ,వృద్ధి నొసంగు విదేశ సీమ సం –పత్తుల కోసమై సుతులు వారధులు దాటు ‘’తున్నారని ఈ రోజుల్లో ‘’సింధువులు చెలంగి దైహికపు దూరం బెంచెను వారి వారికిన్ ‘’ అని సమకాలీన సత్యాన్ని చాటారు .ఎన్ని నదులొచ్చి చేరినా సముద్రం చెలియలి కట్ట దాటదు.మనవ ఆత్మ మాత్రం అంత సహనం విశాల మైనదికాదు .’’శోక వాహినీ క్రమ గతులన్ని మోయుచు స్తిరంముగా నుండుట సాధ్యమా ?’’అని మనస్తస్త్వాన్ని ఆవిష్కరించారు .
మానవీయ విలువలు
దయ, సానుభూతి ,సహవేదన, ప్రేమ, కరుణ , మానవీయత మానవులలో మృగ్యం అవటాన్ని జీర్ణించు కోలేకపోయారు గోపీనాధ కవి .’’బీడులలో మొక్క మొలిపించెడి ఆ వనమాలు లేరయా ?”’అని ప్రశ్నించి జనాన్ని ప్రేమగా చూసే దయాళువులు ,కూలిజనానికి రక్ష నిచ్చే వారు లేక ‘’పాడు వడెన్ , స్వతంత్ర పరిపాలన పాలక వర్గ భోజ్యమై ‘’అని విమర్శ చేన్నాకోల్ తో బాదేశారు .
తెలుగు భాషపై మక్కువ
తెలుగు భాషా సంస్కృతుల పట్ల అపార ఆరాధనా భావం ఉన్న ‘’రావుకవి’’ నేటి భాష దుస్తితికి చింతించారు ,.’’తెలుగు తనజాతి గుర్తింపు గనెను గాని –సొంత పేరును కోల్పడి చి౦తమునిగే ‘’అని ‘’అమ్మభాష గరళమై పోయిందని ,ఏ జాతి అయినా ‘’విధుల నాచరించిన జాతి వినుతికెక్కు –జాతి నిల్పున దొక్క భాషా విభూతి ‘’అని జాతి ని నిలబెట్టేది భాషా వైభవం విస్తృతి మాత్రమె నని ఘంటా పధం గా చెప్పారు .’’బోధన లేదు ఆంధ్రమున పోడిమి నిచ్చెడిశాస్త్ర బద్ధ సంశోధన లేదు తెల్గున ‘’అని బాధపడి ‘’రాస్ట్రాధిపు కార్య శాలలను సైతము వాడుక లేదు తెన్గుకున్ ‘’అని కుంగిపోయారు .దేశ భాషలలో తెలుగు లెస్స పోయి,’’తెలుగు less ‘’అవటం మింగుడుపడని వ్యవహారం అయింది ఆయనకు. ఆయనతో బాటు మనందరికీ కూడా .రత్నాలను వదిలి రాళ్ళను కోరుకొనే మానవ మనస్తత్వం ఆయనకు వింతగా తోచింది .స్వార్ధం వదిలి ,భావి తరం క్షేమం కోసం వ్యర్ధపు జీవిత విధానాలని త్యజించి ,జన్మ సర్వార్ధాన్ని గ్రహించి తే ‘’విశ్వ మంతటన్ తీర్ధపు క్షేత్రముల్ వెలసి ‘’దివ్య పరిస్తితులోస్తాయి అని హితవు చెప్పారు .
దిక్కు లేని దీన స్థితి
’’తూర్పులో కూర్పు ,ఆగ్నేయం లో ఆశ ,దక్షిణం (యామ్య దిశ )లో సంతోషం ఇచ్చేఊర్పు ,నైరుతిలో నచ్చే మార్పు ,పడమట పరితోషాల పేర్పు,వ్యాయవ్యం లో బతుకు పొల్పు ,ఉత్తరాన కరుణ తో నిండిన పిలుపు ,ఈశాన్యం లో మేలు వేల్పు ,పైన ఒప్పు ,కింద నేర్పు గోపీ గారికి కనిపించనే లేదు .ఆదుకోవటానికి ఇంకేది దిక్కు ?అని కలత చెందారు .
ఏదిఉన్నా లేకపోయినా మనిషికి జాతికి శీలం ముఖ్యం .’’శీలము చేతనే బ్రతుకు శ్రేయము నొందును ‘’అని ప్రేయస్సునోదిలి శ్రేయస్సు వైపుకు కదలమని బోధించారు .పూలను చూసి విద్య,చెట్లను చూసి బ్రతికే ధర్మం ,నేర్చుకోవచ్చు అని ‘’తరతమ భేదభావములు ,తామస భావనము ,స్వార్ధ నైజమున్ ‘’వదులుకొని వినాశం నుంచి బయటపడమని హితోపదేశం చేశారు .ఇవి జాతికి వ్యక్తికీశ్రేయోదాయకాలే కదా .కనుక ‘’గోపీ కవి ‘’సమాజ జాతి హితైక కవి కాదా ?
వియద్గంగకు విన్నపం చేస్తూ ఆమె అలిగి తే బతుకు నరకం అవుతుందని ,’’జలకణ మొక్క టోక్కటిగ సంకలనమ్మొనరించి గుండెలో నిలిపి –వసు౦ధరాస్థలికి నిర్మల వారి శుభాభి షేకముల్’’చేసే మేఘ ప్రసారం ప్రశస్తమైనది .ఇది తెలియని మూర్ఖులే ‘’పుడమి దేవత పాలిటి వైరులయ్యేడిన్ ‘’అని ప్రుద్వికి శత్రువులెవరో చెప్పారు .ఆమె అలౌకిక మహా గుణ శీల అని స్తుతించి ,ఆమె క్షమా అనే నీడనిచ్చి కరుణించి ‘’మిన్నువాక ‘’గా మారి సువర్ష దారలు కురియుమని ప్రార్ధించి పృధ్వీ తాపానికి ఉపశమనం వాంచించారు .
జైకిసాన్ –జైజవాన్
రైతే రాజు ,అన్నదాత అనిపిలువ బడే హాలికుడిని పద్య సుమాలతో అర్చించారు .భూమి పుత్రుడైనా ,ఆవాసం లేక ,ఆకాశానికి ఆత్మీయుడైనా వికాసం లేక ,జలదేవతా భక్తుడైనా శుష్క జీవనం ,పవనానికి పరమాప్తుడైనా ఆశ్వసించలేక నిశ్వ సించి ‘’చిత్ర వధలకు చిక్కాడు క్షేత్ర జీవి ‘’అని రైతు పక్షాన నిలిచారు .కాలం అతన్ని కసిదీరా కాటేసింది అన్నారు .విఫల సేద్యం ‘’అరకాని వెన్ను విరిచింది ‘’అని ,’’మట్టి పూజారి ‘’ప్రార్ధనలన్నీ వట్టి పోయాయని సానుభూతి చూపారు .ఈ సందర్భం లో రాసిన పద్యం చాలా హృద్యంగా ఉంది –చూడండి –
‘’అ౦బు జాసను వోలె నన్నమ్ము సృష్టించు రైతుకు నిత్యమ్ము త్రాసమేల ? –ఘర్మ జలాభి షిక్త హరస్వరూపికిన్ భిక్షాటనా వస్థ శిక్షలేల ?-వసుమతికి హరిత వసనమ్ము లందించు హరి వంటి హలదారి కార్తి ఏల?’’అని రైతు కున్న త్రిమూర్తి స్వరూపాన్ని మహాద్భుతం గా వర్ణించిన తీరు , అయినా బాధలు తప్పని వేదనా అసదృశం అనిపించింది .రైతుకున్న చాలాపేర్లనిక్కడ సందర్భా శుద్ధితో చక్కగా వాడారు . .’’శతృ శేషం లేనట్టి శాంతి కోరి ,దేహం రక్త తీర్ధమైనా దేశం కోసం దేహాన్ని త్యాగం చేసే జవాన్ కు జై జై అన్నారు.
నవమానవ గుణాలు
‘’నవ మానవ గుణాలు ‘’వర్ణిస్తూ బాంధవ్యాలు పట్టు దప్పాయని ,అంతా అంధ వ్యాపనం గా ఉందన్నారు .వ్యక్తికీ వ్యక్తికీ అనుబంధం ఉంటె వజ్ర వైడూర్యాలు పోతాయా ,కూర్మితో నరజాతి ఉంటె గోమేధిక రాశి గుల్ల అవుతుందా,ఇచ్చి పుచ్చుకొంటే పుష్యరాగాలు హరించుకు పోతాయా ,ఒకరి క్షేమం మరొకరు కోరుకొంటే మరకతాలుకొండ తరిగి పోతుందా ,చేతులు కలిపితే కెంపు గుట్ట తరిగిపోతుందా ,మమత పూయిస్తే నీలాలు రాలిపోతాయా ,మంచిమాట మాట్లాడితే పగడాలు ముత్యాలు పారిపోతాయా అని అతి విలువను అతి విలువైన వజ్ర వైదూర్యాలతో పోల్చి సొగసుగా చెప్పి చివరికి ‘’మంచి పెంపారగన్ జేయు మనిషి తనము ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .
వేదనా వాసుదేవం –స్త్రీ శక్తికి చేయూత
గాయమే గేయమై ,ప్రతిగాయం జీవన కావ్యమౌతుందని షెల్లీ లాగా, కృష్ణ శాస్త్రి లాగా చెప్పారు .’’కామము లేమల ప్రాణ మానములనవలీలగా దోచే ‘’దుస్టకాలాన్ని చూసి వ్యధ చెంది చూస్తూ ఊరుకోవద్దని మహిళలకు హితవు చెప్పి ‘’సత్తువ కూడ దీయుచు ‘’అసంగతమైన అసభ్య ప్రేమలను అణచి వేసి శిక్షల పాలు చేయమని ధైర్యం బోధించారు .’’చక్కనౌ పొత్తుల నిచ్చు ప్రేమమును పొంది శుభమ్ముల నొందగావలేన్ ‘’అని పూర్తి ఆశా భావం కనబరచారు .
విహంగ వేదం
‘’విహంగ గానం’’ ఒక సూక్తి సుధ.స్వేచ్చ మూల్యాన్ని ,విశ్వ గానామృతాన్ని ,సహన ధర్మాన్ని ,ప్రేమశీలతను .విఘ్నాల దాడి నెదిరించే లక్షణం ,వివిధ వర్ణాలు ,విమల ప్రకృతి ,సహజ సుఖ జీవనం ,విశ్వ సందేశ వాహకత్వం ,వెతలకు వెరవని ధర్మం ,విహగ గతులలో గీపీనాధకవి దర్శించారు .ఇది ఒక అలౌకిక దర్శనమే .చివరికి ‘’–
విదిత సుర వాహనమ్ము లీ విహగ తతులు –అహిత మహి రక్షణన్ ,గోరు విహగ తతులు –వేదన మాన్పి రహి పెంచు విహగ తతులు –వేకువకు స్వాగతమ్ము పల్కు విహగ తతులు ‘’అని మానవులకు విహ౦గాలిచ్చే స్పూర్తిని మహా మహితాత్మకం గా చెప్పారు .
జగద్ధితం
ఉగాది లాంటి పర్వ దినాలు ‘’ఉర్వికి శాంతి సౌఖ్య మహితోపక్రుతుల్ ఘటించా’’లని మనసారా కోరుకొన్నారు .ఏదైనా ఆయనకు జగద్ధితం కావాలి .తర్వాతే ఏదైనా .మానవుడు యాంత్రిక జీవనం గడుపుతున్నాడని కుజగ్రహం పైకి కాలు దువ్వుతున్నాడని ‘’యంత్రములాయె మానవాత్మలున్ ‘’అని యంత్రితమైన మానవుని ఆత్మ ఎప్పుడు మేలు కొంటుందో? నని అన్నారు అంటే త్వరగా మేల్కోవాలని ఆశ .
దేశ భక్తి
భారత దేశమంటే పరమ ఆరాధనా భావం ఉన్న కవిగారు ‘’ఇన కిరణమ్ము ప్రప్రధమ మీ ధర ముద్దిడు తుంది ‘’అని మురిసిపోతారు ..తన సంగీతం విశ్వ మానవతకు నాట్యం నేర్పించాలని ,తన సంసర్గం తో జగము జ్ఞానైశ్వర్యం పొందాలని ,తన సందేశం చేత ఈశ్వర జ్ఞాన కాంక్ష లభించాలని విశ్వ చేతనాభావం తో కమనీయంగా కవిత చెప్పారు .భారత దేశ కార్మికులే స్వదేశ ,విదేశాలలో భర్మ్యరమ్య భవన నిర్మాణం చేస్తున్నారని ,’’భారత బుద్ధి జీవుల ప్రభావము చేతనే సర్వ దేశ వృద్ధి ‘’జరిగిందని మెచ్చుకొంటారు .అన్నిరంగాలలో భారతం అగ్రగామిగా వెలిగి పోతూఉండగా ‘’భారతారాధన మిన్ను ముట్టి అలరారెను విశ్వ మంత ‘’అని పొంగిపోయి ‘’నిష్ట యే మా ధనమన్న నా జనుల మాటలు నక్షర సత్యముల్ ‘’అని కీర్తించారు .జననీ జన్మ భూమిశ్చ స్వర్గా దపి గరీయసి ‘’అన్న శ్రీ రామవాక్యాన్ని గుర్తు చేశారు .
గ్రామ సౌభాగ్యం
‘’గ్రామమే అన్నపూర్ణ ప్రతి కర్షక బంధువు అన్నదాతయున్ –‘’అని చెప్పి ‘’పల్లె శ్రమైక్య జీవనారామము ,పంచ భూత పరిరక్షణ చక్రము ‘’అని గ్రామజీవనాన్ని కొనియాడి ‘’ఉల్లము దోచు ప్రక్రుతి సమున్నత ధామమే గ్రామ సీమ ‘’ అన్నారు .నరుడే భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొని నశిస్తున్నాడని ఆవేదన చెంది ‘’నరుడు కాలపు చక్రమ్ము నడత మార్చె.’’అని విచారించారు .
స్పూర్తి దాతల కు ప్రస్తుతి ప్రసూన మాల
జాతికి స్పూర్తి దాతలైన జాషువా ,మాడపాటి ,ప్రకాశం లను పద్య ప్రసూనాలతో పూజించి గౌరవించారు గీపీనాద్ రావు .జాషువా సమకూర్చిన కావ్య రత్నాలు తెలుగు గుండెలను పిండేశాయని పీడకాత్మలను పిప్పి చేశాయని చెప్పి ‘’మేదిని నేలెడి కీర్తి నొందె’’అని ఘన నివాళులర్పించారు .’’నిత్యము సంఘ సేవ ,అను నిత్యము సంస్కరణాభిలాష,నిత్యము సాహితీ కృషి ‘’చేసే మాడపాటి ఆంద్ర పితామహుడని స్త్రీ విద్యా పోషకుడని ,’’ప్రస్తుతించారు ‘’.సురవరమే’’ ప్రతాప రెడ్డి అని ,తెనుగు లిపిని సంస్క రి౦చాడని ,ఆంధ్ర చరిత్రరాసి ‘’సాంఘిక జీవన విధానాలను’’ వెలుగు లోకి తెచ్చాడని ,మెచ్చి’’ వైతాళికుడు’’ అనే పెద్దసార్ధక గౌరవాన్ని కల్పించారు .ఇక పీ .వీ .ఠీవి ని మెచ్చి ఆయన బహుభాషా ప్రతిభ ,లౌకికభావన ,రాజనీతి, జ్ఞానధనం ,దూరదృస్టి ,వాగ్ధాటి లకు అబ్బురపడ్డారు .’’గుండుకు గుండె చూపిన మొనగాడు ‘’ఆంధ్రకేసరి ప్రకాశం .’’మాతృ భూమికి తనువూ ,మనమ్ము ,సంపదలు ‘’త్యాగం చేసిన జాతిని మేలుకోల్పిన మహా నాయకుడన్నారు.యేసును అల్లాను కూడా పద్య పుష్పాలతో అర్చించారు .పరమత సహనాన్ని చాటి చెప్పారు గోపీనాద్ .
– జ్ఞానదీపారాధన
.. బయటి చీకట్లను పోగొట్టటానికే కాదు దీపం ‘’హృది దేహళి ‘’లో పెట్టాలని మనస్తాపం అనే మహాన్ధకారాన్ని దాంతో త్రుంచాలని కోరారు .’’దివ్వియ –జ్ఞానదీప్తికొక తిన్నని చిన్నియ ‘’అన్నారు పరమ భావుకం గా .’’చిత్తం చీకటింట బడి చేతన కోల్పోరాదు’’అని సందేశ మిచ్చారు .’’దివ్వె తో దివ్వె వెలిగించమని జ్ఞాన బోధ చేశారు .
కవి రవి
కవి కాలానికి రెండుకళ్ళు ,విశ్వ చేతనకు కదలిక ధర్మానికి నాల్గు కాళ్ళు,అని నిజం చెబుతూ ‘’కవిభావ దేవియై కవితాత్మరశ్మియై ,కావ్య భారతి ‘’తనను కాపాడాలని కమ్మని తెలుగు తన హృదయ స్పందనై జీవభాషై,వర్ధిల్లాలని వా౦చి౦చారు .చివరగా ‘’ పూర్వ పుణ్యమై ,నాజాతి జీవమై కాంతిల్లు తెంగు నన్ కావుగాత –నారాష్ట్ర తేజమై నా జీవ నాడియై కలి (ల)కాల మీ తెల్గు వెలుగు గాత’’ అని గోపీనాధకవి ఆశాభావం వ్యక్తం చేశారు . ఇదే మనందరి ఆకాంక్ష .అది తప్పక తీరగలదని ఆశిద్దాం .మరిన్ని పద్యకావ్యాలు రచించి ఆంద్ర సరస్వతిని అలంకరించాలని గోపీనాధ రావు గారిని కోరుతున్నాను .
ఈ పద్య సుమమాలను ‘’ యువ కవి పాదుషా ‘’శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారికి అంకితమివ్వటం, ‘’కవితా మడుగు ‘’ .రామడుగు వెంకటేశ్వర శర్మ గారు విపుల , మనోహర సమీక్ష చేయటం ,పుష్పగిరి సంస్థాన పండితులు శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు ఆశీఃపూర్వక ప్రశంసలు అందించటం అదనపు ఆకర్షణలు .
— డోర్ నంబర్ -23-17-8- బడి వీధి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-4-15 –ఉయ్యూరు


‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం -‘’పద్య ప్రసూనాలు ‘ పుస్తకం ప్రాప్తి స్థానం తెలియజెయ గోరెదను,
జాబాలిముని
LikeLike
శ్రీ గోపీనాధ రాగారు రాసిన ”పద్య ప్రసూనాలు ”లభించే చోటు
శ్రీ ఎరుకల పూడి గొపీ నాధ రావు
— డోర్ నంబర్ -23-17-8- బడి వీధి
సత్యనారాయణ పురం
విజయవాడ -11
సెల్ నంబర్ -98482-93119
LikeLike