నా దారి తీరు -95 బదిలీ ప్రహసనం

నా దారి తీరు -95

బదిలీ ప్రహసనం

సంవత్సరం మంగళాపురం లో పని చేసిన తర్వాత బుద్ధి మారి మళ్ళీ ట్రాన్స్ ఫర్ ప్రయత్నాలు శురూ చేశాను .ఎప్పుడూ నా ప్రయత్నాలేవో నేను చేసుకొనేవాడిని .పెనమకూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ సూరపనేని వెంకటేశ్వర రావు రిటైర్ అవుతున్నారని తెలిసి ,అక్కడికి వెడితే ఇంటికి దగ్గర గా ఉన్నట్లు ఉంటుందనే ఆశ పుట్టింది. పుర్రెకు పురుగు తొలచినట్లు అదే ఆలోచన మనసులో సుళ్ళు తిరిగింది .అనుకోకుండా అప్పటికే నాకు శిష్యుడు పెనమకూరు వాడు వల్లూరు కరణం అయిన పెనమకూరు ప్రభాకర రావు కు నేను బదిలీ ప్రయత్నాలు తెలిశాయి అదీకాక నా చిన్ననాటి స్నేహితుడు కనకవల్లి వాడు మారేపల్లి చలపతి బావ మరది కీ తెలిసి ప్రభాకర రావు ద్వారా ప్రయత్నిస్తే పని జరుగుతుందన్నాడు .సరే అనుకొన్నా. ఎవరికీ చెప్పలేదు .దీనికి ఎలా ప్రారంభించాలో తెలియక గుంజాటన పడ్డా. ఇంతలో ప్రభాకర రావు సలహా ప్రకారం ఉయ్యూరు మండలం మాజీ అధ్యక్షుడు ,నాకు హైస్కూల్ లో క్లాస్ మేట్ దిరిసెం ప్రభాకరరావు చెబితే చైర్మన్ కోటేశ్వర రావు గారు తప్పక బదిలీ చేస్తారని చెప్పారు .ఇంకేముంది నా పని యిట్టె అయిపోతుందని పించింది .ప్రభాకరరావు ఉయ్యూరు గూడెం లో ఉంటాడు .ఎప్పుడూ అటు వెళ్ళే పని లేని నేను అక్కడికి వెళ్లి వచ్చిన పని చెప్పా .’’అదెంత పని ప్రసాద్ గారూ .నేనున్నాగా .పని అయిపోయినట్లే అనుకోండి .మనం అందరం కలిసి రుద్రపాక వెళ్లి  పిన్నమనేని ని కలిసి చెబుదాం .ఆయన కాదనరు .మనిద్దరం క్లాస్ మేట్స్ కదా హామీ ఇస్తున్నాను అన్నాడు ‘’.యెగిరి గంతేసినట్లయింది .రొట్టె విరిగి నేతిలో పడిందని పించింది  ముతకగా చెప్పాలంటే ‘’ముడ్డిమీద గుడ్డ నిలవ లేదు ‘’.

మోసం గురో

ఒక రోజు నేను ఇద్దరు ప్రభాకర రావు లు ,ఉయ్యూరు సమితి మాజీ అధ్యక్షుడు మొవ్వా మోహనరావు అందరం కారు లో రుద్రపాక వెళ్లి చైర్మన్ కోటేశ్వర రావు గారిని కలిశాం .వాళ్ళందరూ నన్ను పెనమకూరు కు ట్రాన్స్ ఫర్ చేయమని అడిగారు .తప్పకుండా చేద్దాం . మేస్టారిని  ముందు లాంగ్ లీవ్ పెట్టమనండి .ఒక నెల తర్వాత జాయినింగ్ పర్మిషన్ అప్ప్లైచేయమనండి .నా పని తేలికవుతుంది .’’అన్నారు .సరే అని చెప్పి  అటునుంచి అటు బందరు జిల్లా పరిషత్ ఆఫీస్  కు వెళ్లి పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ను కూడా అందరం కలిసి  ,నేను లీవ్ పెట్టబోతున్నట్లు చెప్పి గుమాస్తా శేషగిరి రావు గారికీ చెవిలో వేసి ‘’ప్రసన్నం ‘’చేసుకొని ,అందరం హోటల్ కెళ్ళి ఫుల్ గా ‘’మెక్కి ‘’సాయంత్రానికి ఉయ్యూరు చేరుకొన్నాం .దీనికి నాకు అయిన ఖర్చు ఆనాడే రెండు వేల రూపాయలు .ఇంత భారీగా నేనెప్పుడూ ట్రాన్స్ఫర్ కోసం ఖర్చు చేసి ఉండలేదు .గుండె గుభేల్ మంది . చేతులు అప్పటికే కాల్చుకోన్నాను .ఇక ఆకులవలన లాభం లేదని మనసులో అనిపించింది .నేను మంగళాపురం వెళ్లి లాంగ్ లీవ్ కు అప్ప్లై చేశా .

ఇక్కడి నుంచి కదం అడ్డం గా తిరిగింది .పెనమకూరు కమ్మ టూరు .రిటైర్ అయింది కమ్మ హెడ్ మాస్టారు .కమిటీ ప్రెసిడెంట్ వెంకట నారాయణ గారు అదే కులం .అడుసుమిల్లి సూర్యనారాయణ   కాంగ్రెస్ వాడు ఆయనదీ అదే కులం .అలాంటిది మనకు చెప్పకుండా ఒక బాపనోడు పెనమకూరు రావటమా ?అని వీళ్ళంతా కూడా బలుక్కోన్నారని తెలిసింది .రోజూ జిల్లాపరిషత్ కు వెళ్లి కాంప్ ఆఫీసర్ ను గుమాస్తాలను చైర్మన్ గారినికలిసే ‘’నాయుడు ‘’అనే కమ్మ తెలుగు మేష్టారు ఇక్కడ కింగ్ మేకర్ .పెనమకూరులో పని చేస్తున్నాడు .ఆయనకు తెలీకుండా ఈ ప్రాంతం  లో ఏ ట్రాన్స్ ఫరూ జరగదు .అతనే వెళ్లి ఆర్డర్ తెచ్చేంత చొరవ ఉన్నవాడు .ఉయ్యూరులో ఫైనాన్స్ నడపటం చైర్మన్ గారి గుడివాడ చిట్ ఫండ్ వ్యవహారాలూ చూడటం వలన అతనికి ఇంఫ్లుఎన్స్  ఎక్కువ .అతని చుట్టూ ఎప్పుడూ అరడజను మంది మేస్టార్లు పరి వేష్టించి ఉంటాడు .నాయుడు నాకూ మిత్రుడే .అతనిభార్య జి రంగయ్య గారు అని గరికపర్రు కు చెందిన ఉయ్యూరులో మాతో పాటు పని చేసిన  ఆయన గారి కూతురే. ఆ అమ్మాయి నా స్టూడెంట్ కూడా . నేను పెనమకూరు ప్రెసిడెంట్ నుకాని ,స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ ను కాని అసలు కలవనే లేదు అక్కడికి రావాలని ఉందని వాళ్లకు తెలియ జేయలేదు .అది ఒక రకం గా వాళ్లకు అవమానం అని పించవచ్చు .అంతకు ముందు కూడా సైన్స్ మాస్టారిగా నేను కమిటీ వారికి తెలియకుండా విస్సన్న పేటనుండి మూడు నెలల్లోనే బయటపడి పెనమకూరు వచ్చాను .అది వాళ్ళను కెలక వేస్తూనే ఉండి ఉండచ్చు . కనుక నేను అక్కడికి రాకుండా ఉండటానికి అన్ని రకాల పావులు కదిపారు .నేను ఈ ప్రభాకరరావు బృందాన్ని చలపాయి బామ్మర్దిని నమ్ముకోన్నాను .

నాయుడు ఉయ్యూరు సెంటర్ లో కనిపించినప్పుడల్లా ‘’ప్రసాద్ గారు ! ఆర్డర్ ఎప్పుడు వస్తుంది ?’’అని అడిగే వాడు తెలియనట్లు .నేను ‘’మీకు తెలీకుండా ఆర్డర్ ఎలా వస్తుంది ?’’అనేవాడిని ‘’మీకే వస్తుంది పెనమకూరు ‘’అని జోల పాడేవాడు  .నవ్వీ నవ్వకుండా నవ్వే వాడిని అంటే ఏడవ లేక నవ్వే  వాడి నన్నమాట .కాని నా వెనక ఏదో గూడు పుటాణీజరుగు తోందని అర్ధమయ్యింది .నన్ను పెనమకూరు వేయరని నమ్మకంగా తెలిసింది . .గుమాస్తాను కలిశా .పరమహంస గారినీ కలిశాను .అప్పుడు ఆయన ‘’మేస్టారూ ! మిమ్మల్ని పెనమకూరు వేసే ఆలోచనలో చైర్మన్ గారు లేరని తెలుస్తోంది .అక్కడ కమిటీ వారిని మీరు ప్రసన్నం చేసుకోలేదు .మీ మీద నాకు మంచి అభిప్రాయం ఉన్నా సాయం చేయాలని ఉన్నా నేనేమీ చేయలేని పరిస్తితి .మీ ప్రయత్నాలు గట్టిగా చేసుకొని నస్టపడకుండా ము౦దు జాయింగ్ పర్మిషన్ పెట్టండి జాగ్రత్త  ‘’అని చాలా చక్కగా చెప్పారు ఏదీ దాచకుండా .అప్పటి దాకా నాకూ పరమహింస అని పించిన ఆయన ఇప్పుడు నిజం గా ‘’పరమ హంస ‘’అనిపించారు .ఆయన చెప్పినట్లే వెంటనే జాయింగ్ పర్మిషన్ కోసం అప్ప్లై చేశాను .

చేసేదేమీ లేదు .రోట్లో తలపెట్టాను రోకటి పోటుకు వెరవాల్సిన పనేముంది .అంతా మోసం గురో అనిపించింది ప్రభాకర్రావులు కాడి పారేశారు .మన సొమ్ముతో సోకు చేసుకొనే వాళ్ళు వీళ్ళు .తప్పు మనదే కనుక ఏదైతే అది అయిందని వాళ్ళ దగ్గరకు వెళ్ళటం మానేశాను .ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను.  చివరికి నా లీవ్ మంజూరై జాయినిగ్ పర్మిషన్ మైలవరం దగ్గర ఉన్న ‘’చిలుకూరి వారి గూడెం ‘’కు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్ వచ్చిందని తెలిసి జిల్లా పరిషత్ కు వెళ్లి ఆర్డర్ తెచ్చుకొన్నాను. అందరూ నా మీద సానుభూతి చూపించారు ..అది భరించటం కష్టమైంది .మొదటిసారిగా కాటా దెబ్బ  పీటీ దెబ్బ తిన్నాను .బుద్ధి వచ్చింది లేమ్పలేసుకోన్నాను .రాచకీయ నాయకుల్ని నమ్మటం యెంత తప్పో తెలిసింది .తెలిసి కూడా అడుసులో కాలు వేస్తాం ఒక్కొక్కప్పుడు అదే జరిగింది నాకు .చిలుకూరి వారి గూడెం ఎక్కడుందో తెలీదు .అసలు అలాంటి పేరుతొ ఒక ఊరు ఉందని తెలియదు .కాని సుబ్బారావు అనే తిరువూరు ఏం ఇ వొ ఒక సారేక్కడోకలిసి మైలవరం దగ్గరుందని, చాలా బాగా ఉంటుందని చాలా మంచి స్కూలు అని చెప్పారు .అక్కడ అప్పటిదాకా పని చేసిన హనుమంత రావు నాకు రాజమండ్రి ట్రెయింగ్ మేట్ .అతన్ని కాజ హైస్కూల్ కు మార్చి  నన్ను అక్కడికి వేశారన్నమాట .  ఒక మంచి రోజు అక్కడికి జాయిన్ అవటానికి బయల్దేరి వెళ్లాను .ఆవివరాలు తరువాత తెలియ జేస్తాను .ఇదీ ‘’మోసం గురో కద’’.ఇంతమోసానికి నేనెప్పుడూ గురికాలేదు .ఒక రకం గా భగవంతుడు బుద్ధి చెప్పాడేమో అనిపించింది .ఉన్న చోట ఉండక ఈ తిప్పలెందుకు ?అని పించింది .కాని ఊరుకోనిస్తు౦దా బుద్ధి ?

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-4-15 ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.