మొదటికొచ్చిన కశ్మీర్ వ్యథ…

మొదటికొచ్చిన కశ్మీర్ వ్యథ…

  • 13/04/2015
TAGS:

స్వదేశంలోనే శరణార్థులుగా బతుకుతున్న కశ్మీరీ పండితుల వ్యథ సమీప భవిష్యత్తులో తొలగిపోయే అవకాశం లేదని మరోసారి స్పష్టమైంది. 1947వ 1990వ సంవత్సరాల మధ్య జమ్ము కశ్మీర్‌లోని ‘లోయ’ ప్రాంతంనుండి తరిమివేతకు గురైన లక్షలాదిమంది ఈ హిందువులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలన్న ‘స్వప్నం’ ఎప్పటికి సాకారవౌతుందన్నది ఎవ్వరూ చెప్పలేని విషయం! ఈ ‘చెప్పలేనితనాన్ని’ కేంద్ర ప్రభుత్వం మార్చి పదవ తేదీన స్వయంగా ఆవిష్కరించడం ‘కథ’ మొదటికి వచ్చిందనడానికి నిదర్శనం. జమ్ములోను, వివిధ రాష్ట్రాలలోను, శరణార్థుల శిబిరాలలోను, తాత్కాలిక ఆవాసాల సముదాయ ప్రాంగణాలలోను పడిగాపులు కాస్తున్న పండితుల పునరావాసం కోసం కశ్మీర్ లోయ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇళ్లను, పల్లెలను నిర్మించడం గురించి కేంద్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా ప్రచారం చేస్తోంది. 2004వ సంవత్సరానికి పూర్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన భారతీయ జనతాపార్టీ, 2014వ సంవత్సరం వరకు పెత్తనం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ కూడ కశ్మీరీ పండితులకు లోయ ప్రాంతంలో పునరావాసం కల్పించడంలో ఘోరంగా విఫలం కావడం చరిత్ర…ఇందుకు ప్రధాన కారణం జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ ప్రభుత్వపు తొత్తులైన ‘జిహాదీ’ హంతకులు కొనసాగిస్తున్న బీభత్సకాండ, రక్తపాతం ఆగకపోవడం! ఈ హత్యాకాండ జమ్ము కశ్మీర్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులకు వ్యతిరేకంగా కొనసాగుతోంది! గత ఏడాది భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పండితుల పునరావాసం గురించి మళ్లీ చిగురించిన ఆశలపై జమ్ము కశ్మీర్ ప్రభు త్వం నిప్పులను చల్లుతోంది! కశ్మీర్ పండితులు ‘లోయ’ తిరిగి వెళ్లి శాశ్వతంగా అక్కడ నివసించడానికి వీలుగా ప్రత్యేక పట్టణ వాటికలను ఏర్పాటు చేయాలన్న దీర్ఘకాల ప్రతిపాదనకు ఇటీవల ఢిల్లీలో చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తిమహమ్మద్ సరుూద్ తుది రూపం ఇచ్చారు. ప్రత్యేక పట్టణ వాటికల నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించడానికి, కేంద్ర ప్రభుత్వ సహాయంతో పట్టణ వాటికలను నిర్మించడానికి ముఫ్తి అంగీకరించాడు. కానీ ఇలా అంగీకరించి కశ్మీర్‌కు తిరిగి వెళ్లిన ముఫ్తి రెండురోజుల్లోనే ‘మాట’ మార్చాడు! ఎందుకంటే పండితులకు ప్రత్యేకంగా పట్టణ వాటికలను నిర్మించరాదని కోరుతూ పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాద సమర్ధక బృందాలవారు లోయ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు. ఈ ప్రదర్శనలలో పోలీసులు గాయపడుతుండడం సరికొత్త సమాచారం! ‘పండితులు’ తిరిగి వచ్చి నివసించడానికి వీలుగా పట్టణ వాటికలను నిర్మించడం లేదని ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ముఫ్తి శాసనసభలో స్పష్టం చేశాడు! కేంద్ర ప్రభుత్వం ‘ఊకొట్టడమే’ విస్మయకర పరిణామం!
పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత పైశాచిక కాండకు బలైపోయి కశ్మీర్ లోయనుండి నిర్వాసితులైన ‘పండితులు’ తిరిగి స్వస్థలాలకు చేరుకోరాదన్నది దశాబ్దుల తరబడి కశ్మీర్ ప్రభుత్వాలు అనుసరించిన విధానం. ప్రస్తుత ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ -పిడిపి-అధినేత ముఫ్తి మహమ్మద్ సరుూద్ ఈ విధానాన్ని మార్చి తొమ్మిదవ తేదీన జమ్ము కశ్మీర్ శాసనసభలో పునరుద్ఘాటించడం ఆశ్చర్యకరం కాదు! ఎందుకంటే ఇళ్లను, పల్లెలను, పొలాలను, పశువులను, గుడులను వదిలిపెట్టి ‘లోయ’నుండి పారిపోయిన ‘పండితులు’ తిరిగి రావడానికి వీలులేదన్న విధానాన్ని ‘పిడిపి’ ఏళ్ల తరబడి అనుసరిస్తోంది! ఈ విధానం సర్వమత సమభావ-సెక్యులర్-రాజ్యాంగ వ్యవస్థకు విఘాతకరం. ‘హురియత్’లోని మెతక ముఠా, ముదురుముఠా, జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటి దేశ విద్రోహ సంస్థలు పాకిస్తాన్‌లో వలెనే మనదేశంలో కూడ ఒకే మతం ఉండాలని, ఇక్కడ కూడా ఇస్లాం మత రాజ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని కోరుతుండడం సహజం! ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనుకూల విద్రోహపు తండాలు ‘జిహాదీ ఉగ్రవాదాన్ని’ సమర్ధిస్తున్నాయి. మనదేశంలో మాత్రమే కాదు ప్రపంచమంతటా ఇస్లామేతర మతాలన్నింటినీ నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం ‘జిహాద్’ లక్ష్యమన్నది చారిత్రక వాస్తవం. ఈ ‘జిహాదీ’ లక్ష్యానికి అనుగుణంగానే పాకిస్తాన్ ప్రభుత్వ అనుకూల హంతకులు 1947వ, 1990 సంవత్సరాల మధ్య కశ్మీర్ లోయనుండి హిందువులను నిర్మూలించారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, మతం మార్చారు…మిగిలిన హిందువులను తరిమివేశారు. ఈ మతోన్మాదాన్ని ‘జిహాద్’ను బహిరంగంగా సమర్ధిస్తున్న ‘హరియత్’ తదితర సంస్థలు సమర్ధించడం ఆశ్చర్యకరం కాదు. కానీ భారత రాజ్యాంగంపట్ల విధేయతను నిష్ఠను ప్రకటించిన కశ్మీర్ ప్రాంతీయ రాజకీయ పక్షాలు కూడ ‘ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’ను కశ్మీర్‌లో నెలకొల్పాలని యత్నించడమే వైపరీత్యం. ఈ వైపరీత్యానికి సరికొత్త సాక్ష్యం జమ్ము కశ్మీర్ శాసనసభలో ముఖ్యమంత్రి ముఫ్తి చేసిన ప్రకటన! విచ్ఛిన్నవాదులను ప్రభావితం చేసి వారిని జాతీయ ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడానికై భారతీయ జనతాపార్టీ వారు ‘పిడిపి’తో చేతులు కలిపి ఉండవచ్చు! కానీ ‘్భరతీయ జనతాపార్టీ’ ప్రభావితవౌతుండడం మరో జాతీయ వైపరీత్యం…
జమ్ము కశ్మీర్‌లో ప్రధాన సమస్య జిహాదీ ఉగ్రవాదం. 1947లో దేశ విభజన జరిగిన తరువాత నెలలు గడవక ముందే పాకిస్తాన్‌నుండి హిందువులను ‘జిహాదీలు’ వెళ్లగొట్టారు. మానభంగాలకు, హత్యలకు గురైన హిం దువుల సంఖ్య లక్షలకు చేరింది. దాదాపు కోటిమంది హిందువులు పశ్చిమ పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చేశారు. ఇలా తమ దేశంలో హిందువులను నిర్మూలించిన పాకిస్తానీ ప్రభుత్వం మనదేశంలో హిందువులు అల్పసంఖ్యాకులుగా కశ్మీర్ లోయ ప్రాంతంనుడి కూడ హిందువులను నిర్మూలించడానికి పూనుకొనడం దశాబ్దుల బీభత్సకాండకు కారణం! కిరాయి గూండాలు, పాకిస్తాన్ సైనికులు 1947లో కశ్మీర్‌లోకి చొరబడ్డారు. మూడవ వంతు కశ్మీర్ పాకిస్తాన్ అక్రమ అధీనంలో మిగిలిపోవడంతో ఆ ప్రాంతంనుండి హిందువులు నిర్వాసితులై మన అధీనంలో మిగిలిన కశ్మీర్‌లోకి వచ్చేశారు. కానీ మన అధీనంలో మిగిలిన కశ్మీర్‌లోయ ప్రాంతంలోని హిందువులు నిరంతరం హత్యాకాండకు గురయ్యారు. 1990 వరకు సాగిన ఈ ‘కాండ’ ఫలితంగా ‘లోయ’నుండి హిందువులందరూ పారిపోవాల్సి వచ్చింది!! యుగయుగాలుగా కశ్మీర్‌లోయ ప్రాంతంలో నివసించిన హిందువులు తమ జన్మస్థలాలనుండి ప్రాణాలను గుప్పెటలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోవలసి రావడం ఘోరమైన చారిత్రక వైపరీత్యం!
కశ్మీర్ లోయ ప్రాంతం జనాభాలో పండితుల సంఖ్య పదిశాతం కంటే తక్కువే ఉంది. కానీ వీరు తిరిగి వెళ్లి లోయ ప్రాంతంలో స్థిరపడడంవల్ల, పట్టణ వాటికలు ఏర్పడడంవల్ల కశ్మీర్ మరో ‘పాలస్తీనా’లాగా తయారవుతుందని హురియత్ పెద్దలు వ్యాఖ్యానించడం దేశ విద్రోహకర పరిణామం! ఇలాంటి వ్యాఖ్యలను సహించడం కేంద్ర ప్రభుత్వం వారి ‘మెతక’దనానికి నిదర్శనం! పండితులకు ప్రత్యేక వాటికలు నిర్మించడం గురించి తుది నిర్ణయం జరగలేదని దేశ వ్యవహారాల సహాయమంత్రి కిరణ్ రిజ్జూ 10వ తేదీన ప్రకటించాడు. పండితులకోసం నిర్మించే గృహ సముదాయాలలో పండితులు కాక మరెవరు నివసించాలి?

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.