ఆనంద రామాయణ విశేషాలు -2

ఆనంద రామాయణ విశేషాలు -2

రావణుడు కౌసల్యాదేవి వివాహానికి విఘ్నాలు కలిగించటం

మనకు ఏ రామాయణం లోనూ కనిపించని కొత్త విషయాలు ఆనంద రామాయణం లో కనిపిస్తాయి రావణుడు కౌసల్యను చెరబట్టటం మనం ఇంతకూ ముందు ఎక్కడా విని ఉండలేదు .ఆ విషయం దీనిలో సవివరంగా ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .

బ్రహ్మ దేవునివలన తన మరణం కౌసల్యా సుతుని వలన కలుగుతుందని  తెలుసుకొన్న రావణా బ్రహ్మ  ఆమెకు వివాహం కాకుండా ఉండటానికి ఎన్నో పన్నాగాలు పన్నాడు .అప్పటికి అయిదు రోజుల్లో కౌసల్యా దశరదుల వివాహ ముహూర్తం  నిర్ణయించారని  బ్రహ్మ రావణా బ్రహ్మకు చెప్పాడు .లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు రావణుడు రాక్ష సమూహం తో అయోధ్య కు వెళ్ళాడు .దశరధ మహారాజుతో యుద్ధం చేసి ఓడించి ఒక నౌకలో ఉన్న దశరధుని చూసి నౌకను కాలితో తన్ని సరయూనదిలోవిరిగి పడేట్లు  మునిగేట్లు చేశాడు .దీనికి వాల్మీకి శ్లోకాలు –‘’అయోధ్యాం సత్వరం గత్వా  రాక్శసైహ్  పరివేస్టితః –నౌకాస్తం తమ్ దశరధం జిత్వా యుద్ధైస్సు దారుణైః-బభంజ నిజ పాదేన తాం నౌకాం సరయూ జలే ‘’.  ఆనీతిలో అందరూ చనిపోయారు .కాని దశరధుడు సుమంత్రుడు మాత్రమె బతికి బట్టకట్టి ఆ నౌక ముక్క పై ప్రయాణం చేసి గంగానదిని చేరారు .అక్కడినుండి సముద్రం లోకి కొట్టుకు పోయి ఎలాగో బతికారు .

రావణుడు కోసల దేశానికి వెళ్లి యుద్ధం చేసి కన్య కౌసల్యను అపహరించి ,లంకకు  ఆకాశమార్గం లో వెడుతూ సముద్రం లో ఈదుతున్న ఒక పెద్ద తిమింగిలాన్ని లాన్ని చూసి దానికి కౌసల్యను ఎరగా వేస్తె పీడా వదిలి పోతుంది అది ఆమెను మింగేస్తే కౌసల్య కద కంచికే కదా ఆమెకిక పిల్లలు పుట్టటం, పుట్టినవాడు తనను చంపటం ఉండదుకదా అని ఆలోచించి ఒక పెట్టెలో పెట్టి సముద్రం లోకి తిమింగిలం ఉన్న చోట పడేశాడు .ఇక ఆమె వలన ఏ భయమూ లేదని నిశ్చింతగా లంకకు చేరాడు పదితలలవాడు .తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తున్దికదా.ఆ తిమింగిలం ఇతర జల జీవులతో పోట్లాడి జయించాలని కోరిక కల్గి నోటితో ఆ పెట్టును లాక్కుపోతూ సముద్రం ఒడ్డున దాన్ని ఉంచి మళ్ళీ సముద్రంలోకి చేరి జలచరాలతో కల హిస్తోంది .సుమంత్రుడు రాజు దశరధుడు ప్రయాణం చేస్తున్న నౌకా ఖండం అప్పుడే అక్కడికి చేరింది .అక్కడున్న పెట్టెను చూసి ఇద్దరూ ఆశ్చర్య పోయారు .పెట్టె తెరచి చూస్తె కౌసల్య కన్య కనిపించింది .ఒకరికొకరు పరిచయమై ప్రేమ పెంచుకొన్నారు అవ్యవధానం గా ఇద్దరూ గాంధర్వ విధిలో వివాహం చేసుకొన్నారు . -‘’భార్యా భర్తా సుమంత్రుడు ముగ్గురూ కూడా ఆ పెట్టెలో దూరిరి మూత వేసేసుకొన్నారు .తిమింగిలం శత్రువులను జయించి వచ్చి మళ్ళీ ఆ పెట్టెను నోట కరచుకొని సముద్రం లో దిగింది .

లంక చేరిన రావణుడు బ్రహ్మను పిలిపించి ఆయన చెప్పిన మాట అబద్ధం అయ్యిందని ప్రగల్భాలు పలికాడు .నవ్విన బ్రహ్మ దేవుడు ‘’ఓం పుణ్యాహం ‘’అని గట్టిగా అన్నాడు .అర్ధం కాక రావణుడు షేక్స్ పియర్ ఫేస్ పెట్టాడు .బ్రహ్మ ‘’కౌసల్యా దశరదుల వివాహం జరిగి పోయింది కదా !’’అన్నాడు .విషయం తెలుసుకొన్న పదితలలవాడు తిమింగిలానికి ఎరగా వేసిన పెట్టెను తెప్పించాడు .అందులో చిలకా గోరింకల్లా కౌసల్యా, పదిరదాల దశరధుడు నవ్వుకుంటూ కుల్కుతూ కనిపించారు .క్రోదా వేశం  తో రావణుడు ఖడ్గం తీసి వారిని చంపబోయాడు .బ్రహ్మ వారిస్తూ ‘’నువ్వు పెట్టెలో కౌసల్యను ఒక్కదానినే పెట్టావు .ఇప్పుడు అందులో ముగ్గురున్నారు .కాసేపట్లో కోట్లకొలది జనం కాగలరు ‘’ ’’కౌసలై స్తాపితా శ్యాం పటికాయాం త్వయాపురా –త్రయస్త్రతు సంజాతా భవిష్యం త్యత్ర కోటిశః-‘’ అని భయపెట్టాడు .నువ్వు ఇప్పుడే వీళ్లిద్దర్ని చంపితే ఇప్పుడే రాముడు పుట్టి నిన్ను  చంపేస్తాడు జాగ్రత్త .భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలీదు కనుక నవ వివాహ దంపతులను సుఖం గా సాకేత రాజధానికి పంపించేయ్యి .నా మాట విను .కాస్తకాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు ‘’అన్నాడు .భయపడిన రావణుడు బ్రహ్మ చెప్పిన మాట విని ఆ పెట్టెను కోసల దేశానికి  భద్రం గాపంపించేశాడు .ప్రజా సమక్షం లో కోసల రాజు మళ్ళీ వారిద్దరికీ అపూర్వంగా వివాహం జరిపించాడు .తన రాజ్యాన్ని దశ రదునికి కానుకగా ఇచ్చేశాడు .అప్పటినుంచే సూర్య వంశ రాజులు’’ కౌసలేన్ద్రులు’’ అని పిలువ బడ్డారు .

తర్వాత దశరధుడు మగధ రాజ సుత సుమిత్రను పెళ్లి చేసుకొన్నాడు .ఆ తర్వాత కేకయ రాజకన్య కైకేయినీ వివాహమాడి ముగ్గురు రాణులతో స్వర్గ సుఖాలు అనుభవించాడు .అన్నీ ఉన్నాయికాని దశరధునికి సంతానం కలగలేదు ముసలి వాడై పోతున్నాడు .ఈ బెంగ బాగా బాధిస్తోంది .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-4-15- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.