శీలా సుభద్రా దేవి గారి అస్తిత్వ భావ రాగం
శ్రీ శీలా వీర్రాజుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా) ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా వీర్రాజుగారికి బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధాంగి శ్రీమతి సుభద్రా దేవి గారిని చూశాను .అన్యోన్యమైన జంట .ఇద్దరూ సాహిత్యపు పంట పండించారు . వీర్రాజు గారి పుస్తకాలతో బాటు ఆమె రాసిన ‘’బతుకు పాటలో అస్తిత్వ రాగం ‘’,నా ఆకాశం నాదే ‘’అనే రెండు కవితాసంపుటుల పుస్తకాలనూ నాకు అందజేశారు .కాని వాటిని ఒక పది రోజుల క్రితమే చదివే తీరిక దొరికి చదివాను .వీటిపై నాకు తెలిసిన విషయాలను సాహితీ బంధువులకు అందజేయటమే నేను చేస్తున్న పని .వీర్రాజు గారి ప్రతిభకు ఏమాత్రం తీసిపోని ప్రతిభ సుభద్ర గారిది ఆమె భావనా ,పరిధి ఆమెదే . స్త్రీ అస్తిత్వవాదాన్ని తన వాదం గా భావి౦చి రాసిన కవితలే ఇవి .రెండుపుస్తకాలు వీర్రాజుగారి గొప్ప ముఖ చిత్రాలతో ఆకర్షణీయంగా ఉన్నాయి .ముందుగా ‘’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ఊరించి తెలుసుకొందాం . .
’బతుకు పాటలలో అస్తిత్వ రాగం ‘’ .
ఇది దీర్ఘ కవితా విహారమే .ఏడు ఖండికలుగా ఉన్నది .పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు జీవిత గమనమే కనిపిస్తుంది .ఆడపిల్ల పుట్టితే సహించలేని లోకాన్ని ,ముందు జాగ్రత్తకోసం లింగ నిర్ధారణ చేయింఛి ఆడపిల్లయితే ‘’శకలాలు శకలాఉగా చిదిమేయాలనే రాక్షస ప్రయత్నాన్ని ‘’ఆమె ఎండగట్టారు .బిడ్డజననం తో ‘’బండరాళ్ళను బోసి నవ్వులు కరిగించవు –కేరింతలకు రాతి హృదయాలు చలించవు ‘’అని చెప్పి లింగ భేదం అంటే ఏమిటో తెలీని ఆ పసి గుడ్డు ‘’ఆత్మీయ స్పర్శకోసం దిశలు పరికిస్తూనే ఉంటుంది ‘’అని మానవ అల్పమనస్కతను తెలియ జేశారు .ఇంతటితో ఆ పిల్ల కస్టాలు తీరవు .భ్రూణ హత్య కుదరక పొతే చంపటానికి సవాలక్ష మార్గాలున్నాయి .పసిపిల్ల నోట్లో వడ్లగింజ వేసి ,గాజురవ్వ వేసి ప్రాణాలు తీసే ఉపాయాలున్నాయి .వీటినీ తట్టుకొని బతికినా బిడ్డ కన్నవారికి భారమై ‘’చెత్త కుప్ప తొట్టెలో ‘’జాలిలేని లోకాన్ని అసహాయంగా చూస్తూ కన్ను మూయనూ వచ్చు .
సంక్షేమ హాస్టళ్ళలో క్షేమం ‘’some ‘’మాత్రమె నని మనకు తెలుసు .అక్కడ ఈ మధ్య ‘’ట్రంకు పెట్టెలు సైతం పురిటి నొప్పులు’’ పడుతున్నాయి .రక్త సిక్తమై ఊపిరి పీల్చుకోలేక పసికందులు తమలోకి తామే ముడుచుకుకు పోతున్నాయి ‘’అని వాటి బండారం అక్కడ జరిగే వ్యభిచారం వాటి ఫలితంగా చదూకొనే పిల్లలకొచ్చే గర్భ ధారణ లను కాళ్ళ ముందు ఉంచారు . .ఆక్కర లేని పిల్లలు గడ్డిపువ్వులై మట్టిలోనే తలవాలుస్తున్నాయని ఆవేదనా చెందారు ‘’ఒక్కో పాపాయి ఒక్కో చరిత్రకు ప్రారంభ మౌతుంది ‘’అని నిర్వచించి కాలం మాత్రం జీవన కావ్యాలు రాస్తూనే ఉ౦ టుందన్న చారిత్రిక సత్యాన్ని ఎరుక పరచారు .ఆడపిల్ల సీతాకోక చిలుకలని ఎగరేసుకొంటూ ఇల్లంతా సందడిగా తిరగాలని అంతటా తానై ఎదగాలని అప్పటినుండే ఆశతో ఉంటుంది .వాళ్ళంతా చిట్టిమొలకలు .కాని వారిలో ఉన్నది అస్తిత్వ ఆలాపనయే అంటారు .
తల్లి ఒడిలో పెరుగుతూ నిశ్చింతగా ఒక బిడ్డ నిద్రలోకి జారుకొంటే ‘’ప్రభుత్వ ఆస్పత్రి పెరటి గుమ్మం లోనే తుది ఊపిరి జార్చుకొన్న పసి గుడ్డు నిర్జీవ శరీరం కోసం ఊరకుక్కలు నంజుకోటానికి సిద్ధంగా ఉండే హృదయ విదారక దృశ్యాన్ని ఆవిష్కరించారు .బాబాల వెంటబడి ,బూడిదతో పిండాలని పందడిస్తామంటే నమ్మి ,దేవుళ్ళను నమ్ముకొని ఉన్నవాళ్ళను గురించి చెబుతూ ‘’నిలువెల్లా ముద్దై కడుపులు పండించుకోటానికి పడే ఆరాటాన్ని కళ్ళారా చూపారు .బతుకు బండీలాగటానికి గతి లేక ,విధిలేక ఆశ్రమ స్కూళ్ళలో చేరే ఆడపిల్లల మానాలతో ఆడుకొని ఆగమాగం చేసి ‘’అక్ష రాలకు బదులుగా పొట్టల్లో పిండాలు ‘’పొదిగి పెడుతున్నారు ‘’అని సమాజ కీచకులను చీదరించుకొన్నారు . .
అమ్మాయి పెరిగితే ‘’అబ్బురాల పంటై –ఇంటి నిండా పరుచుకొన్న రంగుల రాట్నం ‘’అవుతుంది .వెలుగులు నింపే హరివిల్లూ కావచ్చు నంటారు సుభద్ర గారు .అదే మరొక ఇంట్లో ‘’ఇరుకిరుకు మనస్సులో మరొకతై-కోరుకొని అతిధీ ‘’కావచ్చు .ఇంకో ఇంట్లో ‘’అమ్మకపు సరుకై బాల దమయంతి యై –అక్కున చేర్చుకొనే మరో వెచ్చని గూటికోసం ‘’ఎదురు చూస్తూ కలల్లో కూడా దిక్కుల్ని వెదుక్కొనే దౌర్భాగ్య దామోదరి అవుతుంది .’’దారిపక్క కన్ను విప్పిన గడ్డిపూపాపాయికి –చిరుగాలే ‘’జోల కొట్టేది అని సానుభూతి చూపిస్తారు .’’పూల గుత్తి కుటుంబం లో గుచ్చేత్తే భద్రత కోసం –చూసే పసిచూపులు మన చుట్టూ ఎన్నో వేలాడుతున్నాయో ?అని ఆశ్చర్యపోతారు .
పిల్ల పెరిగి పెద్దదై’’నాన్న ఒడిలో కులుకుతున్న చిట్టి తమ్ముడి ని ఆప్యాయం గా లాలించ బోతుంది .వాడెందుకు ఏడ్చాడో తండ్రి తనను ఎందుకు కసిరాడో తెలీక గుడ్ల నీరు కుక్కు కుంటుంది ఆ అమాయక ప్రాణి .ఆమెది ‘’తనదికాని తప్పును శిలువలా మోస్తున్న ‘’యేసు అవతారం .తలిదండ్రుల కలల్నితన కళ్ళలో అతికించు కొంటుంది .స్వంత కలలు కనే అదృష్టం లేనిది .ఇంట్లో తోబుట్టువులను సాకుతూ బుజాన ఉన్న పుస్తకాల సంచీతో బాటు బాల్యాన్నీ మూలకు విసిరేసే విధి వంచిత అవుతోంది బాలిక .కొందరేమో వయసుకు మించిన భారాన్ని చంకనేసుకొని ‘’పసితనం లోనే ఆరిందా లైపోతున్నారు ‘’అని జాలి పడ్డారు .’’నర్సరీ క్లాసు పంజరం పక్షి ఆమె ‘’.బడిపిల్లలతో నిండిన ఆటోలు పరిగెత్తే ఫ్లవర్ వాజులు ‘’గా కనిపిచాయి సుభద్రగారికి .చిదిమేయబడిన బాల్యం గల ఒకపిల్ల ‘’మంది ఇళ్ళల్లో అంట్ల గిన్నెలని కన్నీళ్ళతో కడిగి దిగులు మొకాలతో ‘’భవిష్యత్తు తెలీకుండా గడుపుతున్నందుకు బాధ పడ్డారు
అనాధ శరణాలయాల్లోవిదిలించే మెతుకుల్ని ‘’రుచి ఎరగని నోట్లో కుక్కుకొనే ‘’అనాధలను పుస్తకాలైనా తమ బతుకుల్లో తెరచుకొని చీకట్లను తరిమి కోటి ఆశల్ని పూయిస్తాయని ‘’ఆశించే అభాగ్యులెందరో ?పనీ పాటా చేసే పిల్లల గురించి చెబుతూ ‘’గుడిసె కప్పు నిండా సూర్యుళ్ళని నింపుకొని –కలల తూనీగల రెక్కల్నిచిదిపెసేవి పుస్తకాలే ‘’అని వాపోయారు వారి దౌర్భాగ్యానికి .వీళ్ళు ‘’శ్రమ విలువని అణా పైసల్తో సహా ఖచ్చితంగా –లెక్క వేయ గలుగుతున్న చిన్నారి శ్రమజీవులు ‘’అన్నారు .మరికొందరు ‘’తాము కోల్పోయిన హక్కు ఏమిటో తెలియని ‘’వారు చెత్త కుప్పలో చిత్తుకాగితాల్ని ఏరుకొంటూ బాల్యాన్ని పోగొట్టుకొన్న వీధి బాలికలు .ఇలా సమాజం లో భోగం ,దౌర్భాగ్యం పాపల జీవితాలతో ఆడుకొంటోంది అని స్పష్ట పరుస్తారు .
బాలిక పెరిగి కన్నె వయసు వస్తే ‘’కొత్త అందాలు శరీరమంతటా పరచుకొని ‘’ప్రతిదీ కొత్తగా దర్శన మిస్తూ పొందాలన్న తపన పెరిగి ‘’సృష్టిలోని అందాలన్నిటినీ సొంతం చేసుకోవాలనే కాంక్ష రగుల్తుంది ఇది సహజం వయసు ధర్మం కూడా . ఇక్కడా తర తమ భేదాలున్నాయి .కొందరు ‘’లక్ష్య సాధనలో గ్రంధ ‘’ వాల్మీక’’లై అనుకొన్నది సాధించి అపర సరస్వతులౌతారు .మరికొందరు తళుకు బెళుకు ప్రపంచపు భ్రమలకు లోనై ,రంగుల కలలు కని తప్పటడుగులు వేసి జీవితం ముళ్ళ బాట చేసుకొంటారు .’’అందమే తొలి మెట్టు అనే భ్రమ మెస్మరిజం చేసి అందాల్ని అతికి౦చు కొనే దారిలో కొందరు ,’’కామ దావానలం చుట్టూ ముట్టి –నిగ నిగల నాజూకు ఆకు పచ్చని జీవితం ‘’బూడిద కుప్పగా మార్చుకొనే వారు కొందరుంటారు .మరికొంతమంది ‘’ప్రేమికుడి వెనకాల పెంపుడు జంతువుగా మారిన బాలనాగమ్మలై ‘’బలై పొతూఉంటారు .నిజం తెలిసి ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా జీవిత రంగం నుండి నిష్క్రమిస్తారు .దీనికి తోడూ ‘’వెండి తెర వేల్పుల విన్యాసాలూ’’ చూసి ‘’జీవితమంటే ప్రేమనే రెండక్షరాల మంత్రం ‘’అనుకోని మోసపోతారు .ఈ వయసులో ‘’కాలాన్నీ జీవితాన్నీ ‘’గురించి సుభద్రగారు ఉద్బోదించి ‘’చేజారిన నిమిషాన్ని తిరిగి వెనక్కి తెప్పించుకోలేం ‘’అని వార్నింగ్ ఇస్తారు .ప్రేమించలేదని యాసిడ్ దాడులు బ్లేడ్ల కోతలు నిత్యం చూస్తూనే ఉన్నాం .రాక్ష ప్రేమ ఇది .దీన్నుంచి సమాజం బయటపడాలి. దీనిలో అందరి బాధ్యతా ఉందని చెప్పకుండానే చెప్పారు .
చదువులు పూర్తయి ‘’డాలర్ల గింజల కోసం వీసా రెక్కలు విదిలిస్తూ –గూడు వదిలిన పక్షి కూనలౌతున్నార’’ని అంటారు కవయిత్రి .అయితే ‘’తమదైన జీవిత శిల్పాన్ని చెక్కుకోటానికి వేడుతున్నందుకు ‘’సంబరపడతారు .వీళ్ళంతా చదువు’’ కొనుక్కోగలిగే’’ జనం .మరి కొనుక్కోలేనివారు –‘’కోరికల్ని కట్టగట్టి ఇంటి చూరులో నో గుండె సరంబీ లోకో విసిరి కొట్టి ‘’బతుకు పోరాటం చేస్తారు .గంతకు తగ్గ బొంత ను కట్టుకొని ఇల్లే స్వర్గం గా జీవితం వెళ్ళ మారుస్తారు .ఇందులోనూ అదృష్టవంతులు దురదృష్ట వంతుతులూ ఉంటారు .’’భర్త చుట్టూ కుటుంబం చుట్టూ కోరికల్నీ ఆశల్నీ అల్లుకొని తనజీవితాన్ని అందులోనే మమైకం చేసుకొంటారు .’’.స్త్రీకోసం అందరూకలిసి ‘’స్వర పెటికపై పొదుపు కొని-ఆర్తిగా గొంతుకలుపుదాం ‘’రారమ్మని సుభద్రా దేవిగారు పిలుపు నిచ్చారు .
కన్నె ముత్తయిదువై అత్త వారింట అడుగు పెట్టిన శుభ సందర్భం .భర్త నే దైవంగా భావించి పూజించే వైనం .కడుపు పండే సమయం .’’పొట్టలో పాపాయి ఊపిరి పోసుకోన్నది మొదలు ‘’ఎన్నెన్నో కలని గుది గుచ్చుకొంటుంది ఆ తల్లి .తల్లి గుర్తుకొచ్చి ‘’తనకై అమ్మ పడిన ఆరాటపు జాడల్ని –కళ్ళల్లోకి తెచ్చుకొని కన్నీళ్ళతో కడిగి అందులో తన ప్రతిబింబాన్ని చూసు కొంటుందట ‘’అద్భుత భావ చిత్రణ .కర్తవ్యమే ఇప్పుడు ఆమె జీవిత నావకు చుక్కాని అవుతుంది .’’తనకు దక్కని జీవన పరిమళాలని –పిల్లల దోసిట్లో నింపటానికి ’’ఆరాట పడుతుంది ..ఇప్పటి మహిళా జీవితం అనేక రంగాల్లో ఉంది .కార్యాలయాల్లో గృహాలయాల్లో బాధ్యత నిర్వహిస్తుంది .’’సహకరించని శరీరాన్ని ఉత్సాహ పరచుకొని ‘’సమాధాన పడుతుంది .కెరీర్ కు పగ్గం వేసి ,సంపాదనకు ఫుల్ స్టాప్ పెట్టి ,జీవితం తో రాజీపడి పిల్లల ఆటపాటలతో మమేకమై ‘’సంపూర్ణ గృహ లక్ష్మి ‘’అవతారం ఎత్తు తుంది .ఆమెలో సహనం ఓర్పూ ,పట్టుదల ముప్పేటలా అల్లుకొని ఇంటికే సర్వం సమర్పిస్తుంది .ఆదర్శ గృహిణి అని పించు కొంటుంది .ఇందులో సంతృప్తి ఆనందం అనుభవిస్తుంది .ఇల్లే స్వర్గ సీమ అవుతుంది ఆమెకు .
‘’శ్రమకు తగ్గ ఫలితం చెమటై జారి పోతున్నా –ముళ్లబాటలో శరీరం చీరుకు పోతున్నా –కడుపు పంటకు మాత్రం ముళ్ళు తాక కూడదని ‘’నిర్విరామంగా పని చేసే యంత్రమే అవుతుంది .కడుపుకట్టుకొని ‘’స్వేదజలాన్ని పైసలుగా మార్చి –పిల్లల దోసిట్లో విద్య గా ధారపోసి ‘’వాళ్ళు ఏ రోజుకైనా ‘’లోహపు రెక్కలు కట్టుకొని విదేశాలకు ఎగిరిపోయి ‘’నిలువెల్లా డాలరు పూలతో అభిషేకిస్తారని కొండంత ఆశ తో బతుకుతుంది మందికోసం .’’స్వప్నాలను మాత్రం వెలిగించు కొంటుంది –కంటి దీపాన్ని ఆశతో ఎగ దోసు కొంటూ ‘’అదీ ఆమె ప్రస్తుత పరిస్తితి .తనలాంటి అభాగ్యుల సేవలో తరించాలన్న తలంపు ఆమెను బతికిస్తుంది .’’మూలాల్ని నిరంతరం తడుముకొంటూ –నవ చైతన్యం తో అక్షరీకరించుకొని ‘’సమస్యకూ సమస్యకూ మధ్య నడుస్తుంది సామాజిక కార్యకర్తగా జీవితాన్ని పునీతం చేసుకొని సార్ధకం చేసుకొంటుంది .వారి ‘’పురోగమనానికి దీప ధార అవుతుంది ‘’ఇదీ ఉత్కృష్టమైన మార్పు .
కోరికల పంచకల్యాణి గుర్రాలెక్కి స్వారీ చేసే సంతానాన్ని చూసుకొని మురుస్తూ ,అప్పుల అడుసులో కాలుపెట్టి లోతుకు ,ఇంకా లోతుకు దిగిపోతూ అసహాయయై ఆసరాకోసం దిక్కులు చూస్తుంది .విధి వక్రించి జీవిత భాగస్వామిని దూరం చేస్తే సముద్రం లో ఏకాకి నావ అయి ,విద్య సమకూర్చిన ధైర్యం తో ముందుకే సాగిపోతుంది .అధైర్యాన్ని నిలువు లోతున పాతేస్తుంది .’’ధైర్యే సాహసే లక్ష్మీ ‘’అని పించు కొంటుంది .కాలం తో సమానం గా ‘’మరాతన్ రేస్ ‘’లో పాల్గొంటుంది .’’మెనీ మెనీ బాధలు పెట్టె మెనో పాజ్ ‘’నుండి బయట పడటానికి అవయవాలను యుద్ధ రంగం గా మార్చుకొంటుంది .’’గర్భ సంచీ నిండా అండ పిండ బ్రహ్మాండాల నన్నింటినీ సర్దుకొని –బుజాన వేసుకొని హడావిడి చేసి పోతుంది .ఇదొక నరక యాతన .ఆ బాధ నుంచి గట్టెక్కి సరైన ఆరోగ్యం పొందటం ఏంతో కష్టం .’’ఎప్పటికీ ఎండిపోని జీవజలం ఆత్మా విశ్వాసం తో –మనసును నింపి సజీవం చేసుకొంటుంది ‘’.అందుకే ‘’ప్రతి గుండె తలుపు తట్టి –ప్రతి హృదయం పై అస్తిత్వ జండా ప్రతిష్టించి ‘’దిక్కులు ప్రతిధ్వనించేలా పాడమని కెప్టెన్ లక్ష్మిలాగా సలహా ఇస్తారు సుభద్రా దేవి .
కాల చక్రం ఎవరి కోసమూ ఆగదు .తరానికి తరానికీ మధ్య అంతరాయాలు పెరుగుతాయి .వైరుధ్యాలు చోటు చేసుకొంటాయి .పిల్లలు డాలర్ల వర్షం లో విదేశాలలో హర్షం పొందుతుంటే ,తనకోసం వస్తారన్న ఆశ అడుగంటి పోతుంటే ఇన్నాళ్ళ ,ఇన్నేళ్ళ శ్రమ వృధా అనిపించి జీవితంపై ఆశ నశించటం సహజం .వారికోసం’’ నిరీక్షణ చేతికర్రకు ఆనుకొంటూ –మనసు ముంగిట్లోనే లైట్ హౌస్ గా స్తంభించి పోతుంది ఆ వృద్ధ నారి ‘’.ఒకవేళ కన్నపేగు చీరుకు పొతే –ఆశల బుడగలు చిట్లి పోతుంటే –కన్నీరు వర్షించటం మర్చి పోయిన పొడి కళ్ళతో ‘’కూల బడి పోతుంది .
చివరి క్షణాలలో అనాధ జీవచ్చవమై –నిర్వేదానికి , నిర్లక్ష్యానికి గురికాక ‘’ఏ ఆడదానికీ తప్పటం లేదని నిర్వేదం చెందారు సుభద్రా దేవి .ఉమ్మడి కుటుంబాలు ‘’కుంచించుకు పోయి అతి చిన్న పరమాణు కేంద్రం లో ఇమిడి పోతున్నాయి ‘. ఇప్పుడు దేశాలన్నీ ‘’వ్రుద్దాశ్రమాలయ్యాయి ‘’అని యదార్ధ పరిస్తితిని వివరించారు .ఉద్యోగ విరమణ చేసినా ‘’ఇంటి చాకిరీకి విరమణ ఉండదు ‘’.అమ్మ రాజీనామా ‘’కు అవకాశమే లేదు .’’సెకండ్ ఇన్నింగ్స్ గా మనవళ్ళు మనవరాళ్ళను ‘’తీర్చి దిద్దే బాధ్యతా మీద వేసుకొంటుంది .’’సిరి చుక్క పెట్టిన స్వంత ఆలోచనల్ని మరో సారి తడుముకొని ఇష్టమైన వ్యాపకాలలో కష్టమైనా తనివితీరా ఈదు లాడుతుంది .ఇప్పటిదాకా పిల్లలకోసం దాచి పెట్టి తినిపించింది ఇప్పుడు తానూ తినాలనుకొంటే ‘’అనారోగ్యాలు నోటికి ప్లాస్టరు అంటించి బెదిరిస్తాయి .తినే యోగం ఇప్పుడు లేనే లేదు .’’మైసిన్లు ‘’తో కాలక్షేపం .
జీవన సంధ్య వచ్చేస్తుంది .’’చర్మం పై అలలు అలలు ‘’గా ముడుతలు ఆవరించుకు పోతాయి. శిరసుపై వెండితీగలు మెరుస్తాయి .ఎదురీతల్లో అయిన గాయాల మచ్చలు వగైరాలన్నీ ‘’జీవితానుభవాల పరిపక్వతకు కొలమానాలే ‘’అంటారు .’’చేవ లేదనీ గొంతు పెగలటం లేదనీ –నిరాశ సూదితో పెదాల్ని కుట్టేసు కొంటుంది ‘’. ఇక్కడే సుభద్రా దేవి మేలుకోలుపు పాడారు ‘’మధుర జీవితానుభవాల సారాంశాన్ని నింపి –అస్తిత్వ జండాను గుండె గుండెకు తాకించి ‘’కొత్తపాటకు జీవితార్ధాన్ని నేర్పించి ఆలపించమన్నారు .’’సామూహిక అస్తిత్వ ఆలాపనలతో –ప్రతి హృదయం లోను గమకాల్ని మీటి –ప్రతిమనసును తట్టి లేపాలని ‘’అస్తిత్వ రాగాలాపన చేసి జాగృతం చేశారు .
ఆడది గర్భం లో పిడమై ఊపిరి పోసుకొన్న దగ్గర్నుంచి –చిద్రమై శకలాలుగా జారి పోకుండా ప్రాణాన్ని నిల బెట్టుకొనే వరకు –మొదలైన అస్తిత్వ పోరాటాన్ని కడదాకా కొన సాగించాల్సి వస్తున్నందుకు విచారించారు .ఎక్కడ ఏ రకమైన విచక్షణ ఉన్నా సమైక్య నినాదం తో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు .’’ఎప్పుడూ ఏ నాడూ కూడా తెగిపోని విధంగా విస్తరింప జేస్తూ –వినువీధుల నిండా అల్లుకొనేలా –చేతుల్నీ హృదయాల్నీ కలుపుకొంటూ –మాటల్నీ మనసుల్నీ విస్తరిస్తూ –సజీవ స్వరాల అల్లిక జిగిబిగితో –రేపటి తరాలకు కొత్త ఊపిరి లందిస్తూ ‘’ముందుకు సాగాని అభిలషించారు .ఈ కొనసాగింపు ‘’కడదాకా –ఊపిరి కొసదాకా –అనంతంగా –‘’కొనసాగిద్దామని అందరికి ఎరుక పరచారు సుభద్రా దేవిగారు .
‘’జనం బాధ శ్రీ శ్రీ బాధ ‘’అయితే మహిళా జనం బాధ శీలా సుభద్రా దేవిగారి బాధ .ఇదొక అస్తిత్వ నిరూపణ గాధ.ప్రతి అడుగులో పొంచి ఉన్న ప్రమాదాల ఘోష .ఒక రకం గా ‘’మహిళాయణం ‘’ మహిళా వేదం .స్త్రీ త్వ నిరూపణం .అవరోధాలను అధిగమించి ముందుకు సాగే స్థిర సంకల్పం .అనుకొన్నవి జరగవని ,జరగనివాటికోసం విచారిస్తూ కూర్చోటం కాదు –ఉన్నదానిలో సరిపుచ్చుకొని ముందుకు సాగటమే అవుతోంది స్త్రీజీవితం .ఆమెకు విముక్తి లేదు .కనుక ఇది ఒక విముక్తి గీతం .అయితే సాధారణ ఫెమినిస్ట్ రచయిత్రుల్లాకాకుండా సుభద్ర గారికి ఎవరిపైనా కోపం ద్వేషం లేదు .పగ సాధింపు లేదు .అశ్లీలం ,అసభ్య పదజాలం లేదు .మార్పు రావాలన్న ఆరాటమే కనిపస్తుంది .స్త్రీ స్వయం సిద్ధ అవ్వాలన్న తపనే ఉంది .ఊహల్లో తేలిపోకుండా నేలమీద నిలవాలన్న హితవు ఉంది .భద్రమైన జీవితం మహిళలకు ఉండాలని సుభద్ర గారు కోరుకొన్నారు .స్త్రీ అస్తిత్వ జండాను బుజాన వేసుకొని అస్తిత్వ నినాదం తో దిక్కులు పిక్కటిల్లేట్లు నినదించిన స్త్రీ మూర్తి ఆమె .ఆమె ఆరాటం ,పోరాటం దీనికే .అందుకే అందరినీ సమైక్యమవ్వమని పిలుపు నిచ్చారు .
సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’సంపుటి పై తరువాత తెలియ జేస్తా.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-4-15 –ఉయ్యూరు

