మనం మారమా

మనం మారమా

  • 17/04/2015
  • – సరయు శేఖర్

మా శోభనాచల స్టూడియోకి సాయంత్రమైతే -అందరు దర్శకులూ, నిర్మాతలు వీలునుబట్టి వస్తూండేవారు. అలా వచ్చినవాళ్లు -అప్పటికి వారు నిర్మిస్తోన్న చిత్రాలకు సంబంధించి కథాకమామీషు చర్చలు సాగించేవారు. సరైన నిర్ణయాలు తీసుకుని, పలువురి అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించే తీరు అప్పట్లో ఉండేది. అందుకే -అప్పటి చిత్రాలు గొప్ప చిత్రాలుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంస్కృతి లేదు. చూద్దామన్నా -మచ్చుకైనా కనిపించదు! – సి కృష్ణవేణి , అలనాటి నటి, నిర్మాత ============== ఔను.. వాళ్లవి గొప్ప చిత్రాలే! ఉద్దండులు మనకు అందించిన, మిగిల్చిన -క్లాసిక్కులే. మరోకోణంలో చూస్తే -ఇప్పుడొస్తున్న నిస్తేజమైన చిత్రాలు కూడా అలనాటి చిత్రాలను అజరామర చిత్రాలుగా మార్చేశాయేమో. సినిమా అభిరుచి ఉన్నవాళ్లను -పాత సినిమాలే ఇప్పటికీ లంగావోణీ వేసుకున్న అందమైన కనె్నపిల్లలా ఆకర్షిస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే -ప్రస్తుత టాలీవుడ్‌కే ఆ అందాలను తేరిపార చూసే దిక్కులేదు. ఆ సౌరభాలను ఆఘ్రాణించే తీరక లేదు. చిత్రమైన సినిమా పోకడలతో మసకబారిన కళ్లకు -కళ్లజోడు పెట్టుకుని చూసే అదృష్టమూ లేదు. అందుకే -అలనాటి సుందరాంగులను ముసలి ముతె్తైదువలుగానే భావిస్తున్నాం. ఈతరానికి ఇవ్వాల్సింది -‘నగ్న వెలయాల’న్న దృక్ఫథంతోనే చాలామంది చిత్రాలూ నిర్మిస్తున్నారు. ఎందుకిలా!? అమృత గుళికలు అందించిన తెరమీదే విషబీజాలు నాటుతారా? అంటూ -నిజమైన సినీ అభిమాని నిగ్గదీసి అడగలేక వౌనంగా రోదిస్తున్నాడు. చెట్టు కూలడానికి గొడ్డలి దెబ్బ ఒకటి సరిపోకపోవచ్చు. కానీ -వ్యాపార దాహంతో తలో చేయి వేసి గొడ్డళ్ల వేటు వేస్తే సినీవృక్షం కుప్పకూలడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే, అలాంటి పరిస్థితిని, ప్రమాదాన్నీ ఆలోచించకుండానే కూల్చేసే ప్రయత్నం జరుగుతోందిక్కడ. నిస్తేజమవుతోన్న సినిమాలపై ఇదీ ప్రేక్షకుడి నుంచి వినిపిస్తోన్న -నిజమైన విమర్శ. విలువల వలువలను విదిలిస్తూ.. సినిమా దిగజారిపోతోందని ప్రేక్షకుడు వ్యక్తం చేస్తోన్న భయాలకు -కారణాలు లెక్కలేనన్ని ఉండొచ్చు. సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణమ్మ మాటల్ని ఒక్కసారి మననం చేసుకుంటే -అవును ఆమె చెప్పేదీ ఓ కారణమే అనిపించక మానదు. భ్రష్టుపట్టిన సినీ విశ్వరూపం మదిలో మెదలక మానదు. అనేక కారణాలతో రూపొందిన చిత్రాలు వారంకంటే ఎక్కువకాలం థియేటర్లలో ఎందుకు ఉండలేకపోతున్నాయి? మొదటి వారంలోనే -రాత్రి రెండో ఆటకు ఐదారుగురు ప్రేక్షకులు కూడా లేరంటూ ప్రదర్శన రద్దు చేస్తున్న దౌర్భాగ్య స్థితి ఎందుకు తలెత్తుతోంది? కారణం వెతుక్కుంటే -మళ్లీ కృష్ణవేణమ్మ మాటల దగ్గరకే పరిగెత్తాలి. సినిమాలో సరుకు ఏంముంది? ఏం చూపుతున్నాం.. ఏం చెప్పదలచుకున్నాం అన్న ప్రశ్నలకు సమాధానాన్ని సినిమాలు తీస్తున్న వాళ్లే వెతుక్కున్నా దొరకని పరిస్థితి. అలాంటప్పుడు -సినిమా చూసేందుకు ప్రేక్షకుడు ఎందుకు పరిగెత్తుకుని వస్తాడు. సినిమాను ఎంత కళాత్మకంగా చెప్పుకున్నా -అదీ వ్యాపారమే. ఎవ్వరూ కాదనరు. కానీ -ప్రేక్షకుడిని ఎలాగోలా ఊరించి, బొలిపించి దోచుకోవడమే సినిమా ధోరణి అన్నట్టుగా తయారైంది. ప్రెస్‌మీట్లలో చెప్పే కోతలేవీ సినిమాలో కనిపించవు. విలువల మాటలేవీ సన్నివేశాలుగా కానరావు. అబద్ధాలతో కాలం గడుపుతున్న తెలుగు చిత్రానికి మళ్లీ వైభవం వస్తుందా? పూర్వీకులు, ముందుతరం పెద్దలిచ్చిన ఆస్తిని, ఖ్యాతిని నిలబెట్టగలిగే గొప్పవాళ్లను చూస్తామా? గొప్ప కళాకారులు, రచయితలు, దర్శకులు మళ్లీ తెలుగు సినీ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తారా? ఇలాంటి ప్రశ్నలను మనకుమనమే వేసుకుంటూ.. వస్తారనే సానుకూల దృక్పధంతో ముందుకు సాగాల్సిందే? ఎన్నాళ్లకు మళ్లీ స్వర్ణయుగ వైభవం వస్తుంది? అసలెందుకింతగా తెలుగు సినిమా దిగజారిపోతుంది?? అతివేగం ప్రమాదం! దాహం వేసినప్పుడే బావి తవ్వడం ప్రారంభిస్తే ఏమవుతుంది? నీరు ఊరేలోపు ప్రాణం హరీమంటుంది. కానీ -ఇప్పుడది ఆలోచించే స్థితిలో లేడు నిర్మాత. తాను పెట్టిన పైసాకు తక్షణం పదివేలు వచ్చేయాలి. అందుకు కథ కమామీషు, పాటలు, సందేశం, కనీసం స్క్రిప్ట్ అవసరం లేకుండానే సినిమా ప్రారంభించేస్తున్న పరిస్థితి పరిశ్రమలో కనిపిస్తోంది. మొదలుపెట్టేశాక -ఎవరైనా వచ్చి అడ్వాన్స్‌లు, శాటిలైట్ ధరలు ఇస్తారేమోనని ఎదురుచూపులు. అందుకే త్వరత్వరగా సినిమా పూర్తిచేయాల్సి రావడం. ఏ నటుడికీ, నటికీ పాత్ర ఏమిటో సెట్‌లోకి వచ్చేవరకు తెలీని పరిస్థితి. అప్పుటికప్పుడే ‘ఇన్‌స్టంట్’గా వండిన పాత్రను అంతే ‘ఇన్‌స్టంట్’గా చేసేసి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలు. సదరు నటికిగానీ, నటుడికిగానీ కెరీర్ ఎన్నాళ్లుంటుందో తెలీదు. అందుకే త్వరగా ఇక్కడచేసి, మరోచోట కెరీర్ ట్రాక్ వేసుకుంటుండాలి. లేదా గ్లామర్ ఉన్నపుడే బంగ్లా చక్కదిద్దుకోవాలి. ఇలా అన్నిట్లో వేగం -సినిమాను లేవలేని దెబ్బతీస్తోంది. సన్నివేశాలు, కథలు రాసేవాళ్లు కరువు. ఒరిజినాలిటీ అంటే ఏమిటో తెలియని రచయితలు విదేశీ సీడీలు చూసి రాత్రికిరాత్రే అనుకుని, తెల్లారి సెట్లోకొచ్చి వండేసే పరిస్థితులూ లేకపోలేదు. ఇలాంటి పని చేయడానికి రచయితలే అవసరం లేదు. అందుకే నిర్మాతలు కూడా -కాపీకొట్టి పరీక్షల్లో పాసైన వాడైనా చాలని వీరతాడు వేసేస్తున్నారు. ఇదో మరో గొడ్డలి దెబ్బ! పోనీ ఆ కాపీ రచయితలు పర భాషా సీడీలోవున్న కథను తెలుగుదనానికి మార్చుగలిగే సత్తా ఉన్నా వాళ్లా? అంటే అదీ డౌటే. కాపీ రాయుళ్ల నుంచి ఒరిజినాలిటీని ఆశించడం అతిశయోక్తే మరి. అందుకే విదేశీ సంస్కృతి ‘తెలుగుదనం’లోకి ఇంకిపోతోంది? అలాంటి సినిమా ప్రేక్షకుడికి నచ్చవచ్చు లేదా తొంభైశాతం నచ్చకపోవచ్చు! అక్కడితో ఆ చిత్రం సీడీలోనే భద్రం! ఛీ… ఛీ ఇలా కాదు. పర దేశస్థుల చిత్రాలు తెలుగుదనం చేయలేకపోతున్నాం!. అదే చిత్రాన్ని తమిళంలోనో, మలయాళంలోనో భలే చేశారు. అది మన సంస్కృతికి సరిపోతుందని భ్రమించి, తమిళనాడు, కేరళ, ముంబాయిలో హిట్టయిన పరదేశ చిత్రాల రైట్స్ కొనుగోలుకు ‘్ఫ్యన్సీ రేట్స్’ ఇస్తోన్న నిర్మాతలూ కనిపిస్తున్నారు. అవతలివాళ్లు అలా అమ్మకపోయినా చాలా పోటీ ఎదుర్కొని ఫ్యాన్సీ రేట్‌కు రైట్స్ సొంతం చేసుకున్నామన్న పెద్ద అబద్ధం నిజంలా చేస్తున్నారు. చిత్రంలో అసలు విషయంలేకున్నా సన్నివేశాలు కృతకంగా అల్లుకుని, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సాగే హాస్య ధోరణితో చిత్రాన్ని గట్టెక్కించాలని తాపత్రయపడుతున్నారు. చిల్లు పడవలో ప్రయాణం ఎంత కాలం సాగుతుంది? ఒక సినిమాకు ప్రీ ప్రొడక్షన్‌కు కావాల్సిన అసలు హంగులకన్నా ముందే ‘మందు విందు పొందు’ హంగులతో, కొందరి నిర్మాతల పెట్టుబడి హారతి కర్పూరంలా కరిగిపోతుంది. తెలుగు సినిమాకు పట్టుకున్న మరో జబ్బు -బడ్జెట్. తీసే సినిమాకు స్థాయిలేకున్నా, బాక్సాఫీస్ దగ్గర వర్కవుటవుతుందన్న నమ్మకం లేకున్నా కోట్ల బడ్జెట్‌ను పెట్టడం. అలా 50 కోట్లు, 100 కోట్లుకు సినిమా బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు. స్క్రిప్ట్ భూతం మరోవైపు. అసలేమీ లేని స్క్రిప్ట్‌పై భయం! విచిత్రం అనిపిస్తోంది కదూ! కథ ఎవరికీ చెప్పం! మా సినిమా కథ అద్భుతం! అందుకే సైలంట్‌గా తక్కువ సాంకేతిక నిపుణులతో రహస్యంగా చేస్తున్నాం. కనీసం సెల్‌ఫోన్ కూడా ఫ్లోర్‌లోకి రానివ్వం! ఒక్కమాట ‘లీక్’ అయిందంటే మాకు చాలా నష్టం! ఎవరితో ఈ కథపై చర్చ చేయం! ఎవరివద్దా చర్చలు చేసి మంచి సలహాలు తీసుకోము! అలాచేస్తే చర్చల్లో పాల్గొన్నవాళ్ళు కథను ‘చౌర్యం (?)’ చేస్తారు. అంత పకడ్బందీగా తీస్తున్నాం అని ‘బిల్డప్’ ఇస్తున్నారు. చివరికి ఆ చిత్రం విడుదలైతే ప్రేక్షకులే చెప్పేస్తారు ‘ఏ సీను.. ఏ సినిమాలోదో…’ అలా అన్ని సీన్లు ఏయే చిత్రాల్లో ఉన్నాయో చెప్పేస్తున్నారు ప్రేక్షకులు. ఇలా ఉంటాయి రహస్య కథల షూటింగ్‌లు. దీనికో ఉపసంహారమూ ఉంది. ‘దయచేసి మా చిత్రాన్ని పైరసీ చేయకండి’ అని! పైరసీ చేయడానికి ఓ అర్హతుండాలి. అలాంటి అర్హతలులేని చిత్రాలు ఇప్పుడొస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో మరో చిత్రమైన ధోరణీ ఎక్కువవుతోంది. సినిమాలో ఏ విభాగంలో పని చేస్తున్న వారైనా, ఎలాంటి అర్హతలూ, అనుభవాలు లేకున్నా -రాత్రికి రాత్రే కప్టెన్ చైర్‌లో కూర్చునే సాహసం చేయడం. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌ను నడిపించే సామర్థ్యం, అంతటి అనుభవం ఉందా? లేదా? అన్నది ఆలోచించకుండానే -సినిమా దర్శకత్వానికి సిద్ధమైపోవడం. ఈ గందరగోళమంతా ఎందుకు తలెత్తుతోందంటే -మొదట చెప్పిన విషయాలను ఎవరూ పాటించకపోవడం. నిజాన్ని నమ్మకపోవడం. ప్రతిభను గుర్తించలేకపోవడం! పలు ‘వ్యామోహాలకు’ లొంగిపోవడం! ఇన్నిరకాల గొడ్డలి దెబ్బలతో -తెలుగు కళామతల్లి ఆత్మ పుండైపోయింది. చిప్పులే చితిమంటలేస్తుంటే -వర్తమాన సినిమా కవిరికంపు కొడుతోంది. ఈ పరిస్థితి పోవాలంటే -అందమైన సినిమా కోసం తాపత్రయపడే నిర్మాతలు రావాలి! ఆరోగ్యకర వాతావరణంలో చర్చలసారంగా, జాతి, సంఘ శ్రేయస్సును కాంక్షించే చిత్రాలు తీయాలి. అలాంటి స్వర్ణయుగం ఆవిష్కృతమవ్వాలి. ఎప్పటికి అన్న ప్రశ్న నుంచే ఎదోక అడుగు ముందుకు పడుతుందన్నది నిజం. అందుకుముందు -మిగిలివున్న పాత తరాన్ని ఆశ్రయించాలి. ***

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.