గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
233- మనం మరచిపోయిన కవయిత్రులు
ఋగ్వేదములో ఎందరో విదుషీమణులు, రచయిత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆత్రేయ కుటుంబములో విశ్వ వార ,ఆపాల మొదలయిన సంస్కృత కవయిత్రులు ఉన్నారు. కక్షీవత్ కుటుంబములో ఘోషా అనే కవయిత్రికి గొప్ప పేరు ఉంది. ఆమె కక్షీవంతుని కుమార్తె. ఆమె తనను రాజకుమారిగా చెప్పుకొన్నది కనుక తండ్రి రాజు అయి ఉంటాడు. చాలా కాలం వివాహం చేసుకోలేదు. అశ్వినీ దేవతల అనుగ్రహం వలన వరుడు లభించాడు. జగతీ ఛందస్సులో సులభ శైలిలో చాలా కవితలు రాసింది. ‘’జూహూ’’’’ శాశ్వతి’’,’’ మాన్దాత్రి’’ మాధవీ, శశి ప్రభ అనులక్ష్మి రేవ పహాయీ ,రోహ మొదలైన వారంతా కవయిత్రులు, దార్శనికులు. అనేక మంత్రాలను రాసారు. అశ్వలాయనుడు గార్గి వాచక్నవి బాడవ ప్రాతి, హెయి మొదలయిన వారు ప్రాచీన కవులు, ఋషులు .అనుక్రమణిలో అగస్త్యుని భార్య లోపాముద్ర కవయత్రిగా పేర్కొనబడింది. రాజశేఖరుడు సీత విజయామ్క లేక విజ్జిక, సుభద్ర, ప్రభుదేవి, వికట నితంబల గురించి పేర్కొన్నాడు. సీత గొప్ప ఊహా కవయిత్రి. సుభద్ర గొప్ప కవితావేశం కలిగినది . మోరిక, మారుత గొప్ప భావుకత కలవారు. విజ్జికను సరస్వతీ స్వరూపంగా భావిస్తారు. కానీ నల్లగా ఉండేది. ఈమె చంద్రాదిత్య భార్య. కొడుకు రెండవ పులకేశి. వీరి కాలం 659.
రాజశేఖర చరిత్రలో కామలీల, సునంద, కనకవల్లి, మధురా౦గి , లలితాంగి, విమలా౦గి కవయత్రుల పేర్లు కన్పిస్తాయి. కొన్ని చాటు వు లలో జఘన చపాల, అవిలంబిత సరస్వతి ,ఇందులేఖ, కుంతీ దేవి, చండాల విద్య, మాగమ పద్మావతి మదాలస రజక సరస్వతి, లక్ష్మీ ,వీర సరస్వతి ,సరస్వతి, సీత మొదలయిన మహిళా కవుల గురించి ఉన్నది. వీరందరినీ మనం మరచిపోయాం. అందుకే వీరిని విస్మృత సంస్కృత కవులు అనవచ్చు.
234- శ్యామ రహస్యం రాసిన-ప్రియంవద
శివరామ కుమార్తె, రఘునాధుని భార్య ప్రియంవద. పశ్చిమ బెంగాల్లో ఫరీద్పూర్ నివాసిని. 1600 లో ‘’శ్యామ రహస్యం ‘’మొదటి కావ్యం రాసింది. ఇది కృష్ణ స్తుతి.
235- వైజయంతి
మూరభట్ట కుమార్తె అయిన వైజయంతి ఫరీద్పూర్ జిల్లాలో ధనూకాలో జన్మించింది. కోటలిపదపు చెందిన దుర్గా దాసు కుమారుడు క్రుష్ణనాధుని భార్య. 17 వ శతాబ్దపు మధ్య భాగంలో ఉండేది. తండ్రి వద్ద సంస్కృతం నేర్చి మీమాంస శాస్త్రంలో ఉద్డండురాలైంది. ఒకసారి భర్త శిష్యులకు తప్పుగా పాఠం బోధిస్తుంటే సరి చేసింది. అద్భుతమైన కవిత్వం రాసింది. అదంతా “భర్త రాసిన ఆనంద లతికా చంపూలో” కలసిపోయింది. ఈ రచనలో ఆమె భాగస్వామ్యాన్ని భర్త అంగీకరించాడు. ఒకసారి భర్త ఒక నాయికను వర్ణిస్తూ కవిత్వం ఆగిపోతే వైజయంతి అద్భుతంగా దాన్ని పూర్తి చేసింది.
తూర్పు బెంగాలుకు చెందిన పూర్వపు విశ్వకోశం అనే పత్రికలో సంపాదకుడు జయంతి ప్రతిభను వర్ణించాడు. ఆమె రాసిన గొప్ప కావ్యాన్ని పండిత అమూల్య చరణ్, విద్యా భూషణ్ లు చూసారని తెలియచేసాడు. విద్యా భూషణుడు బెంగాల్ సాహిత్య పరిషత్ కు ఉపకార్యదర్శి.
మలబారుకు చెందిన మనోరమ, సుభద్ర, రాజశేఖరుని భార్య అవంతీ సుందరి, ఘనశ్యాముని భార్యలు సుందరి, కమల గొప్ప కవయి త్రులుగా గుర్తి౦పబడ్డారు. గంగా దేవి, మధురవాణి, తిరుమలాంబ గురించి ముందే తెలుసుకున్నాం.
236- లక్షిణ
ఠాకూర్ రాణి అనబడే లక్షిణ మిథిలకు చెందిన గొప్ప కవయిత్రి. ఆమె రాసిన శ్లోకం ఒకటి ఉన్నది.
237- త్రివేణి
ఉదేంద్ర పురం కు చెందిన అనంత రాయల కుమార్తె త్రివేణి. ఆమె తండ్రి “యాదవ రాఘవ పాండవీయం” త్రయర్థి కావ్యం రాయగానే ఈమె జన్మించిన౦దున’’ త్రివేణి’’ అని పేరు పెట్టాడు. 1817- 1883 నాటి కవయత్రి. శ్రీపెరంబదూరుకు చెందిన ప్రతివాది భయంకర వేంకటాచార్య ఈమె భర్త. పెళ్లి కాక ముందే కవిత్వం రాసేది. పెళ్లి అయిన తర్వాత భర్త వద్ద వేదాంతం నేర్చినది. ఒక కొడుకు పుట్టి చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఆనాటి కలక్టర్ ఒక విగ్రహం దొరికితే ఆమెకు అందచేస్తే దేవాలయం నిర్మించింది.’’ హారాతి పంచకం ‘’రాసింది. తిరువాన్కూర్ రాజదర్బారుకు వెళ్లి గౌరవం పొందింది. మైసూరు దివాన్ రంగాచార్య ఆమె భక్తుడు. ఏ సమస్యని ఇచ్చినా ఆశువుగా కవిత్వం చెప్పగలిగేది. ఆనాటి స్త్రీలలో సంస్కృత సాహిత్యానికి విశేష సేవ చేసిన మహిళ త్రివేణి. ‘’లక్ష్మీ సహస్రం’’,, ‘’రంగనాధ సహస్రం’’ మొదలయిన ఆధ్యాత్మిక గ్రంధాలు రాసింది. ‘’శుకసందేశం,’’ భ్రు౦గ సందేశం’’ రాసింది. ‘’రంగాభ్యుదయం’’’’, సంపత్కుమార విజయం’’ కావ్య రచనలు చేసింది. ‘’రంగరాట్ సముదయం’’, ‘’తత్వముద్ర భోదోదయ’’ నాటకాలు రాసింది. చివరి రెండూ వ్యంగ్య రచనలు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-15-ఉయ్యూరు

