ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67
29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-1
వియన్నా దేశపు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషి భావోద్రేకాలకు ప్రతిదిన పరిసరాలకు సంబంధముందని పరిశోధనాత్మకంగా రుజువు చేసాడు. దీనితో సృజనాత్మకమైన ప్రతి రంగంపై ప్రభావం చూపాడు. ఒక తరాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తీ ఫ్రాయడ్. కొందరు శిష్యులు, కొందరు వ్యతిరేకులు ఉన్నా మానవత్వపు అంచనాలను సాహిత్యపు విలువలను భాషా వైశాల్యాన్ని విపరీతంగా విస్తరి౦పచేసాడు. నరాల జబ్బుపై పరిశోధన చేసినా అతని అధ్యయనం సాధారణ పనివారిపై, వ్యాపార రంగం వారిపై విశేషంగా ఉండేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ (న్యూనతా భావం), ఇన్హిబిషన్ మొదలైన శబ్దాల సృష్టికర్త అయినాడు. అంతకు ముందు ఎవరూ వినని’’ సైకాలజీ అఫ్ ఎవరీ డే లైఫ్’’ ఆవిష్కర్త. మాల్ అడ్జస్ట్ మెంట్ , రిప్రేషన్, ఫిక్సేషన్, ట్రాన్స్ఫెరేన్స్, డిఫెన్స్ మెకానిజం, ఓవర్ కాన్ఫి డేన్స్ ,, సప్ప్రేస్ద్ డిజైర్, లిబిడో అనే కొత్త పదాలను ఆవిష్కరించాడు. దీనితో వైద్య పరిభాష మారిపోయింది.
సైకో అనాలసిస్ పిత అని పిలవబడే సిగ్మండ్ ఫ్రాయడ్ 6-5-1856 పూర్వపు ఆస్ట్రియా ప్రస్తుత జెకోస్లోవేకియా మొరావియా లోని ఫ్రీబెర్గ్ లో జన్మించాడు. తండ్రి జూయిష్ వర్తకుడు. ఫ్రాయడ్ 4 ఏళ్ల వయసులో కుటుంబం వియన్నకు చేరింది. తండ్రి రెండవ భార్యకు జన్మించిన 8 సంతానంలో ఫ్రాయడ్ పెద్దవాడు. అతన్ని చూసి అందరూ గర్వపడేవారు. కేమిస్ట్రీ, బాటనీలో అసాధారణ నైపుణ్యం చూపేవాడు. డార్విన్ అనువంశిక సిద్దాంతానికి ఆకర్షితుడయ్యాడు. దీనితో ప్రతి విషయాన్ని సూక్ష్మగా విచారించే అలవాటు పెరిగింది. కానీ జర్మన్ ఫిలాసఫర్ మహా రచయిత గోతే “నేచర్” పై రాసిన వ్యాసం చదివి ప్రభావితుడయ్యాడు. దాని వలన మానవ విజ్ఞానం సాధించడానికి కృత నిశ్చయడయ్యాడు. ఇంగ్లీష్ భాష నేర్చి ఆసాహిత్యపు ఆనందాన్ని అనుభవించాడు. పదేళ్ళు ఇంగ్లీషు సాహిత్యానికే అంకితమయ్యాడు. షేక్స్పియర్ సాహిత్య శాస్త్రాన్ని మిల్టన్ ప్యూరిటన్ శక్తిని ఆసాంతం అర్థం చేసుకోగలిగాడు.
17 ఏళ్ల వయసులో మెడికల్ స్కూల్లో చేరి యాంటీ సేమిటిజం మీద వ్యతిరేకత పొందాడు. తన జాతిపై ఎందుకు అవమానమొ అర్హ్హం కాలేదు. “సెల్ఫ్ పోర్త్రయిట్” అనే దానిలో తన ఆలోచన ఫలితాలను పొందుపరచాడు. తన గమ్యమ్ ఏమిటో తెలుసుకున్నాడు. మెజారిటీ జనం ముందు మైనారిటీ వాళ్ళు ఓడిపోరాదు అని అనుకున్నాడు. కనుక స్వతంత్ర నిర్ణాయక శక్తి, తీర్పు అవసరమని భావించాడు. యూనివర్సిటీలో చేరి నాడీ వ్యవస్థ శాస్త్రమ్ పై పరిశోధనలు చేసాడు. 20 వ ఏట నుండి 29వ యేట వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెరిబ్రల్ అనాటమీ లో పనిచేసాడు. తాను ఒక సాధారణ వైద్యునిగా ఉండాలని అనిపించలేదు. కానీ వియన్నా లోని ప్రసిద్ధ అల్జిమిఏన్ క్రాన్కే హాస్ (జనరల్ హాస్పటల్) క్లినికల్ న్యూరాలజైస్ట్ గా పనిచేసాడు. అప్పటికే రోగుల నిజమైన తత్వానికి,ఊహలకు(ఫాంటసీ ) వ్యత్యాసం గమనించాడు. రోగుల రోగలక్షణాలను గమనించాడు. అతని సహచరులు ఫ్రాయడ్ చేసిన నాడీ వ్యవస్థ వలన కలిగే జబ్బుల గురించి విని సంతోషించారు. రోగి మెదడు లోకి లోతుగా చొచ్చుకుని పోయే విధానం గురించి ఆలోచించాడు. 29 వ ఏట ఒక పరిష్కారం లభించింది. ఒక వియన్నా డాక్టరు హిస్టీరియా రోగులకు హిప్నటైజ్ చేసి నయం చేసానని ప్రకటించాడు. మానసిక అసమతుల్యాలను బయటపెత్త టానికి ఇది ఒక మార్గం అనిపించింది. పారిస్ వెళ్లి జీన్ మెరీ చార్కాట్ దగ్గర చదివాడు. అప్పటికే ఆయన న్యూరలాజికల్ క్లినిక్ లను ఏర్పాటు చేసి హిప్నాటిజం రోగాలను కుదిర్చి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ఫ్రాయడ్ ఈయన దగ్గర ఒక ఏడాది విద్యార్థిగా, అనువాదకునిగా ఉన్నాడు.
30వ ఏట వియన్నా చేరి మార్తా బెర్న్స్ ను పెళ్ళాడి ప్రైవేట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టాడు ఫ్రాయడ్. మొదట్లో గురువు చార్కాట్ బోధించినట్లే ప్రాక్టీస్ చేసాడు. చాలా తీవ్రంగా ఆ పద్ధతిలో రోగ నిదానం చేసాడు. అతన్ని సమతుల్యత లేని వెర్రివాడిగా బీరాలు పలికే వాడిగా ముద్ర వేసారు. ఎంత జాగ్రత్తగా వైద్యం చేస్తున్నా తన పరిశోధనలను ఎప్పటికప్పుడు సమీక్షుస్తున్నా ఈ మాటలు జీవితాంతం వెంటాడాయి. అది ఫిజికల్ థెరపీ కాలం అని ఆనాటి డాక్టర్లకు రోగి మానసిక విషయాలు పట్టేవికావని ఫార్ములా ప్రకారమే ప్రతిదానిని నిర్ణ యించే వారని రోగ లక్షణాలను సజీవ సిద్ధాంతంగా భావించేవారని కాని రోగి మానసిక ఆందోళనలు ఎవరికీ పట్టేవి కావని చికిత్స లోపభూయిష్టమైన అవగాహనతో మందులతో హైడ్రో దెరపీతో ఎలక్ట్రో తదెరపీతో మాత్రమే ఆనాటి డాక్టర్లు చేసేవారని ఫ్రాయడ్ జీవిత చరిత్ర “ది బేసిక్ రైటింగ్స్ అఫ్ సిగ్మండ్ ఫ్రాయడ్” రాసిన డాక్టర్ ఎ .ఎ .బ్రిల్ రాసాడు. సంప్రదాయ చికిత్సా విధానం నుంచి వైద్య విధానాన్ని మార్చాలని ఫ్రాయడ్ అభిప్రాయం. హిప్నోటి క్ థెరపీ పై ప్రయోగాలు చేసాడు. స్మృతి లోపం (ఆమ్నేసియ), మూగతనం- (అఫెసియ) లపై పనిచేస్తున్నా హిప్నాటిజం తో, సలహాలతోనే నయం చేయవచ్చని భావించాడు. ఈ కొత్త కష్టతరమైన విధానంలో పని చేస్తూ రోగి గత జీవితాన్ని గుర్తు చేసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాడు. రోగి మనసులో దాగి ఉన్న జ్ఞాపకాలను బయట పడేట్టు చేసేవాడు. ఈ విధానానికి మానసిక విశ్లేషణ (సైకో అనాలసిస్ ) అని పేరు పెట్టాడు. దీనిని నమ్మని ఇతర డాక్టర్లు, మనుషులు ఫ్రాయడ్ ను క్రూర హింసా వాదిగా భావించారు. దీని వల్ల బాగుపడ్డ వారు ఫ్రాయడ్ ఒక కొత్త శాస్త్రీయ విధానాన్ని ఆవిష్కరించాడని సంబరపడ్డారు.
ఫ్రాయడ్ చేసిన సైకో అనాలసిస్ లో హిస్టీరియా మొదలైన రోగాలకు మూల కారణాలు రోగి మరచిపోయిన, లేక అణచుకున్న సంతోష రహిత విషయాలే కారణమని అన్నాడు. తనను బాధించిన ఈ విషయాలు రోగి మరచి పోయుంటాడు . అందుకని ఫ్రాయడ్ సమాధి చేయబడిన ఆకారణాలను అతని అపస్మారక స్థితిలోంచి బయట పడేట్లు చేసేవాడు. ఈ అణచివేత రోగికి చాలా నష్టం కలిగించేది. ఇది సాధారణ మానసిక ప్రతిచర్యను అడ్డగించేది లేక నిషేధించేది. దీనితో భౌతికమైన రోగం వస్తుందని భావించాడు. ఈ అణచివేత అసలు బాధను గుర్తించేది అవుతుంది. దీనిని విడుదల చేస్తే రోగం నయమవుతుంది అనేది ఫ్రాయడ్ సైకో అనాలసిస్ సిద్ధాంతం.
ఎక్కువ భాగం భౌతిక ఆందోళనలు వ్యక్తీ కల్పితాలే. ఫ్రాయడ్ తన కాలాన్ని మైండును ఒక ఆర్గానిక్ సిస్టం గా భావించి దాని ద్వారా శరీరానికి వైద్యం చేసేవాడు. ఇందులో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చేది. రోగి సహకరించేవాడు కాదు. బాధాతప్త గత జీవితాన్ని గుర్తుచేసుకోవటం ఇష్టం ఉండేది కాదు. సాధ్యమైనంత వరకు దీని నుండి తప్పించుకుపోవటానికి, పారిపోవటానికి ప్రయత్నం చేసేవాడు. అందుకని ఫ్రాయడ్ రోగికి నేస్తంగా సన్నిహితునిగా మెలుగుతూ విషయాన్ని రాబట్టేవాడు. అణచబడిన అంతరాత్మకు బహిర్గతం కాని అంతరాత్మకు తీవ్ర సంఘర్షణ జరిగేది. అంటే ఇచ్చ లేదా సంకల్పానికి సహజ జ్ఞానానికి (విల్/ఇన్స్టింక్ట్ ) మధ్య సంఘర్షణ అన్నమాట. ఈ సంఘర్షణ నుండి రోగిని ఫ్రాయడ్ తన విశ్లేషణ ద్వారా బయటపదేటట్లు చేసేవాడు. రోగి కలలను చిహ్నాలుగా వికారాలను తీరని కోరికలను తీరాలనే కోరికలను ఫ్రాయడ్ బయటపెట్టేవాడు. కలలకు అర్థాలను వెతికి చెప్పేవాడు. వాటిలో రోగి దాచుకున్న ఆందోళనలను వెతికి వెలికి తీసేవాడు. దీనిపై ఫ్రాయడ్ “A dream frequently has the profoundest meaning in the very places where it seems most absurd. Dreams behave in real life like the prince who in the play pretends to be a mad man. Hence we may say of dreams what Hamlet said of himself- substituting an unintelligible jest for the actual truth.’’ I am but mad North North West when the wind is southerly. I know a hawk from a handsaw”.పదేళ్ళు దీనిపై ఒంటరిగా శ్రమించి ఫ్రాయడ్ ‘’ఇంటర్ ప్రిటేషన్స్ అఫ్ డ్రీమ్స్’’ అనే కలలపై తొలి గ్రంథాన్ని రాసాడు. ఇది మానసిక శాస్త్రంపై వచ్చిన తోలి అపూర్వ అద్భుత గ్రంథంగా పేర్కొంటారు. దీనిపై ఫ్రాంజ్ అలక్జాండర్ సమీక్ష చేస్తూ ఈ గ్రంథ ప్రచురణ మానవ విజ్ఞాన అభ్యుదయంలో ఒక మైలు రాయి అన్నాడు. ప్రతి వ్యక్తీ కలలు కంటాడు. వాటికి అర్దాలుంటాయి . వాటిని గుర్తించి వైద్యంలో చేరిస్తే రోగి సుఖపడతాడు.
ఫ్రాయడ్ కొత్తగా పొడిచేసి కొత్త సిద్ధాంతం కనిపెట్టలేడని అన్నవారు కూడా అతని విధానాన్ని మెచ్చకుండా ఉండలేకపోయారు. మానసిక ఉద్రేకం వలన కలిగిన గాయం ఎదో ఒక వ్యాధికి కారణభూతం అవుతుంది. దానికి సెక్స్ కూడా కారణం కావచ్చు. చిన్నతనంలో సెక్స్ వలన కూడా కొన్ని రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ఎమిల్ లుడ్విగ్ తీవ్రంగా విమర్శిస్తూ “Freud’s opium endangers our generation”అన్నారు. ప్రతిబాలుడికి చిన్నతనంలో తల్లితో అనుబంధం ఎక్కువగా ఉంటుందనీ తండ్రికి దూరంగా ఉంటాడని దీనినే’’ ఈడిపస్ కాంప్లెక్స్’’ అంటారని, ప్రతి బాలికకు తండ్రిని ఆరాధించే ‘’ఎలక్ట్రా కాంప్లెక్స్ ‘’ఉంటుందని ఫ్రాయడ్ చెప్పాడు. ఇవి యవ్వన దశలో వారికి ఇబ్బందికరంగా మారతాయి. కనుక యవ్వన దశలో నిరుత్సాహం ఆవహించి కలల లో లేక భయంకర భ్రమల్లో పడిప్తారు. భయం పెరిగిపోయి సామాన్య బాధ్యతలనుండి తప్పుకోడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి అసాధారణ విషయలపైనే కాకుండా సెక్స్ కోరికపైన కూడ పైన పరిశోధించాడు. దానికి ఉన్న ప్రాముఖ్యతను, సంపూర్ణ మానవ వ్యక్తిత్వానికి ,సెక్స్ కూ గల సంబంధంపై అధ్యయనం చేసాడు. “Three contributions to the theory” అనే ఫ్రాయిడ్ ఆంగ్ల అనువాద గ్రంథానికి ముందుమాట రాస్తూ జేమ్స్ పుట్నం “మానవ జీవితం లోని ప్రతి దశను లోతుగా చొచ్చుకుపోయాడని మానవ శీలాభివ్రుద్ధికి కృషి చేసాడని సైకో న్యురాటిక్ వ్యాధులకు కారణాలను ఆవిష్కరించాడని మెచ్చుకున్నాడు.
‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-8-15 ఉయ్యూరు

