గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2- 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350

దాక్షి కుమారుడైన పాణిని సాలతురాలో ఉన్నాడు. కథాసరిత్సాగరం ప్రకారం పాణిని ,వ్యాడి కాత్యాయన ఇంద్రదత్తులు ఉపాధ్యాయ ఉప వర్ష వద్ద విద్యనభ్యసించారు. చదువులో బాగా వెనుకబడి ఉండటం చేత పాణిని శివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో’’ ప్రత్యాహార సూత్రాలు’’ పొందాడు. దీని ఆధారంగా అష్టాధ్యాయి అనే వ్యాకరణాన్ని రచించాడు. ఇది ప్రపంచంలోనే తొలి వ్యాకరణం. నిర్డుష్టమైనది, అన్నన్య సాధారణమైనది. దీనికి మించిన వ్యాకరణం లేదని అంటారు. వేద, వేదాంగాల అధ్యయనానికి ఇది  ముఖ్యమైనది. ఎనిమిదిభాగాలుగా  కనక అష్టాధ్యాయి అనే పేరు వచ్చింది. పంచతంత్ర కథనం ప్రకారం పాణిని ఒక సింహానికి బలయ్యాడు. అతని కాలం క్రీ. పూ 350 గా అందరూ ఒప్పుకున్నారు. కానీ హుయాన్ సాంగ్  బుద్ధ నిర్యాణం తర్వాత 50౦ ఏళ్లకు జన్మించినట్లుగా రాశాడు . కనిష్కుని సమకాలికుడు అని అన్నాడు. కానీ బుద్ధుని మరణం తర్వాత  5౦౦ ఏళ్లకు కాశ్మీరు నుండి సాలతూరకు ఒక కాశ్మీర్ దేశస్థుడు వచ్చినట్లు ఒక బ్రాహ్మణ గురువు వద్ద విద్యనభ్యసిన్చినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థియే  పాణినిగా మరల జన్మించాడని అంటారు. పాణిని ప్రముఖ వ్యాకరణకర్త, కవి. ‘’జాంబవతీ విజయం’’ రాసాడు. తన “సదూక్తి కర్ణామృతం”లో శ్రీధర దాసుడు పాణిని దాక్షి పుత్రుడు అని చెప్పాడు. క్షేమేంద్రుడు సువ్రుత్తి తిలకంలో పాణిని ఉపజాతి వృత్తాలలో అందరినీ మించిపోయాడని రాసాడు. రుద్రటుడి కావ్యాలంకారంపై వ్యాఖ్య రాసిన నమిసాదు కవి పాణిని రాసిన “పాతాళ విజయం”లోని కొన్ని శ్లోకాలను ఉదాహరించాడు.     ఈ కావ్యం మలబారు తీరంలో లభించింది. పాతాళ భల్లూక  రాజు అయిన జాంబవంతుని కూతురు జాంబవతి కృష్ణుడు అతడిని జయించి శమంతకమనణితో పాటు జాంబవతిని పాణిగ్రహణం చేసిన కథ. ఈ కథ భారత, భాగవత, విష్ణు పురాణాలలో ఉంది. దీనినే విజయనగర రాజు కృష్ణదేవరాయలు జాంబవతీ కల్యాణం నాటకంగా రాసాడు. పాణిని కవిత్వం సహజ సుందరంగా ఉంటుంది. క్రిష్ణలీల సుకుడు  భోజ రాజు రాసిన సరాస్వతీ కంఠా భరణం  వ్యాఖ్య రాస్తూ పాణిని శ్లోకాలను ఉదాహరించాడు. అమరకోశంపై వ్యాఖ్య రాసిన రాయ ముక్కుట కవి పాణిని శ్లోకాలను పేర్కొన్నాడు.

Inline image 1

  1. పాణినిపై వార్తికం రాసిన వరరుచి –(క్రీ.పూ 16౦౦-17౦౦)

కాత్యాయ నుడు అనే పేరున్న వరరుచి సంకృతి గోత్రీకుడైన సోమదత్తుని కుమారుడు. యమునా నది తీరాన ఉన్న కౌశాంబి లో  జన్మించాడు. పాణిని వ్యాడిలతో కలసి పాటలీపుత్రం లోని ఉపవర్షుని వద్ద విద్య నేర్చారు. అతని కుమార్తె ఉపకోశను వివాహం చేసుకున్నాడు. పాణినిపై వార్తికమ్   రాసాడు. పతంజలి మహాభష్యం లో వరరుచి శ్లోకాలను పేర్కొన్నాడు. అవంతీ సుందరి కధాసారం ప్రకారం వరరుచి మహానంది కుమారుడైన మహా పద్మరాజు పాలనలో జన్మించాడు. ఇతను విశాల దేశపు రాజు. పురాణాలప్రకారం మహానంది రాజు క్రీ.పూ 16 7 8 -1635 లో పరిపాలించిన నంది వర్ధనుడి   కుమారుడు. మహా పద్ముని కుమారుడు నందుడు మగధ సామ్రాజ్యాన్ని క్రీ. పూ. 1635 – 1547 వరకూ 8 8 ఏళ్ళు పరిపాలించారు. కనుక వరరుచి క్రీ.పూ. 16-17 శతాబ్దపు వాడు అయి  ఉంటాడు. పాణిని సూత్రాలకు కాత్యాయనుడు వార్తికాలు రాసాడు. ఇందులో నిర్వాణ గురించి వివరించాడు. నిర్వాణం అంటే పేల్చివేయటం అని చెప్పాడు. దీనినే పతంజలి అనేక ఉదాహరణల ద్వారా వివరించాడు. నిర్వాణం అనే బౌద్ధ పారిభాషిక పదం. ముక్తి అనే అర్థం. ఇవన్నీ గమనిస్తే కాత్యాయన పతంజలులు బుద్ధునికి  ముందే జీవించి ఉన్నట్లు తెలుస్తోంది.

విక్రమాదిత్య మహారాజు ఆస్థాన నవరత్న కవులలో వరరుచి ఒకడుగా భావిస్తారు. కాత్యాయనుకి యుద్ధాలు, దేవుళ్ళు, రాక్షసులు మొదలైన వాటిపై అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. పతంజలి’’ వారరుచం’’ అనే కావ్యాన్ని గురించి చెప్పాడు. అందులో వరరుచి శ్లోకాలు ఉన్నాయి. రాజశేఖర, జల్హణలకు వరరుచి గురించి పూర్తి అవగాహన ఉంది. వరరుచి రాసిన “ఉభాయాభిసారిక భాణం   ” లో అందమైన కవిత్వం కన్పిస్తోంది. అతడొక మునిగా దర్శనమిస్తాడు. వరరుచి శ్లోకాన్ని ఒక దానిని తన వల్లభదేవుడు తన సుభాషితావళిలో ఉదహరించాడు.

‘’ఆలోహిత మాకలయన్కంద లమితీ కంపితం మధుకరేణ – సంస్మరతి పాయీ స పాక్షికే దాతు క్షుల్తర్జనం లలితం ‘’

భోజదేవుడు శృంగార ప్రకాశికలో వరరుచి శ్లోకాన్ని వివరించాడు. ఇవి చారుమతిలోనివి. ఎనిమిది శ్లోకాల మార్యాష్టకం దుర్గా దేవి గురించిన శ్లోకం. అద్భుతమైన రచన. మలబారులో ప్రచారం ఉన్న కథనం ప్రకారం వరరుచి అన్ని కులాలకు చెందిన స్త్రీలను18మందిని  వివాహమాడినట్లు ఉన్నది. అందుకని అతనిని చండాలునిగా  భావించి దూరం చేసారు. ఈ విషయాన్నే భోజుడు కూడా ఒక శ్లోకంలో వివరించాడు.

వరరుచి ప్రాకృత భాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ‘’ప్రాకృత ప్రకాశ ‘’అనే వ్యాకరణం రాశాడు .నాలుగు ప్రాక్రుతభాశాలను గుర్తించాడు అవి మహారాష్ట్రి, సౌరసేని,మాగధి ,పైశాచి పైశాచి భాష అంతరించింది  .ఈ గ్రంధం లో పన్నెండు అధ్యాయాలున్నాయి మొదటి దానిలో మహారాష్ట్రి ప్రాకృతానికి కేటాయించి .424 సూత్రాలు చెప్పాడు . చివరిమూడు అధ్యాయాలు పైశాచి భాషకు కేటాయించి పద్నాలుగు సూత్రాలు  మాగాదికి పదిహేడు ,సౌరసేని కిముప్ఫై రెండు రాశాడు .వరరుచి ది కాత్యాయన గోత్రం కనుక కాత్యాయనుడు అనే పేరు వచ్చి ఉండ వచ్చు .వేదం గానితాభ్యాసానికి వరరుచి ‘’సులభ సూత్రాలు ‘’రాశాడు .

చతుర్భాణి అనే ‘’ఉభాయాభిసారిక ‘’రాశాడు .వరరుచి ‘’సింహాసన ద్వాత్రి౦సిక ‘’రాశాడు .ఇందులోని కధలు పరమాద్భుతంగా ఉల్లాసభరితంగా ఉంటాయి .విక్రమ చరిత్ర కూడా వర రుచి రాశాడని అంటారు .ఇతర కావ్యాలుగా కంఠాభరణం, చారుమతి లను పేర్కొన్నారు .ఎన్నో చాటువులు అతనిపై ఉన్నాయి .నీతి రత్నం  యాస్కుని నిరుక్తం పై భాష్యం నిరుక్త సముచ్చయం ఆయన రచనలే అంటారు . సామవేదానికి ప్రతీశాఖ్య రాశాడు .ఒక నిఘంటువు అలంకార గ్రంధమూ రాశాడని అంటారు .

  1. యోగ సూత్రాలను రాసిన- పతంజలి (క్రీ . పూ.  16౦౦-17౦౦)

కాత్యాయనుని తర్వాత పతంజలి వచ్చాడు. అతను రాసిన మహాకావ్యం ఏదీ లేదు. ఆయన రాసిన మహా భాష్యం లో మాత్ర౦ అనేక  శ్లోకాలను, శృంగారాన్ని నాటకాలను పేర్కొన్నాడు.  టి ఎల్. హార్న్ అనే పరిశోధకుడు వీటిని సేకరించి కృత్రిమ కవిత్వంగా అందులోని వృత్తాలు మాలతీ ప్రమితాక్షర ప్రహర్శినీ వసంత తిలకకు చెందినవిగా తెలియచేసాడు. ఇవన్నీ రాజాస్థాన కావ్యాలుగా కన్పిస్తాయి. మహా కావ్యాలు కావు. పతంజలిని గోనార్డ మనిషి అంటారు.ఉత్తర ప్రదేశ్ లో అయోధ్యకు యాభై కిలోమీటర్ల దూరం లో ఉన్న జిల్లాయే గోనార్డ .గ్రీకు సాహిత్యం లో పతంజలిని పేర్కొన్నారు  .పతంజలి అంటే ముకుళిత హస్తాలలో పడిన వాడు అని భాష్యం చెప్పారు .ఎవరిని ప్రజలు ముకిలిత హస్తాలలో దర్శిస్తారు ఆయనే పతంజలి అనే మరో అర్ధమూ చెప్పారు .వ్యాకరణ వైద్య యోగ శాస్త్రాలలో పతంజలి సిద్ధ హస్తుడు .తమిళనాడు తిరుచికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లో ఉన్న బ్రహ్మ పురీశ్వర దేవాలయం లో పతంజలి విగ్రహం ఉన్నది .పతంజలి ‘’స్పోట వాదాన్ని’’చెప్పాడు  .ఇదే ఆధునిక ఫోనేమిక్స్ గా రూపొందింది .మార్ఫాలజీ లేక ప్రక్రియ గురించి కూడా వివరించాడు .ఫ్రాంజ్ కీల్హాన్ మొదటి సారిగా పందొమ్మిదవ శతాబ్ది లో పతంజలి మహా భాష్యాన్ని ప్రచురించాడు .ఆస్తిక నాస్తిక విభేదాలను పాము ముంగిస పోరాటం అన్నాడు .

Inline image 2  Inline image 3

కేరళలో వరరుచి కొడుకు విగ్రహం

  1. మధురవాణి (క్రీ.శ 1614-1662)

తంజావూరు రఘునాధనాయక  రాజు ఆస్థానంలో మధురవాణి ఉండేది. ఆమె అసలు పేరు తెలియదు. 14 కాండలలో రామాయణం రచించింది. మధురమంజుల కవిత్వం అందులో ఉంటుంది. చివరి కాండలో తాను ఎందుకు రామాయణం రచించ వలసి వచ్చిందో రాసింది. ఒక సారి యువరాజు రఘునాధ నాయకుడు సింహాసనం మీద అంతఃపుర  మహిళల మధ్య   కూర్చుని తాను రాసిన  ఆంద్ర రామాయణాన్ని పాడుతుండగా వింటున్నాడు. ఆయనకు శ్రీరామునిపై ఉన్న అనన్య దైవభక్తిని పొగుడుతున్నారు. అప్పుడు యువరాజు తనలో తాను విష్ణు కథలు చాలా ఉన్నా రామ కథ అమృత తుల్యమని వేలాది సార్లు విన్నా ఎప్పటికప్పుడు కొత్తదిగా మానసికాహ్లాదాని కల్గిస్తుందని అన్నాడు. అక్కడున్న వందలాది మహిళలు సంస్కృత, తెలుగు కవిత్వంలో నిష్ణాతులు. ఇందులో ఎవరు రామాయణాన్ని సంస్కృతంలో రాయగలరు అనిప్రశ్నించాడు. ఆ రోజు రాత్రి శ్రీరాముడు కలలో ప్రత్యక్షమై ఆ విషయంపై ఆందోళన చెందవద్దని తాను మధురవాణి అనే బిరుదు ఇచ్చిన కవయిత్రి అతని కోర్కెను తీర్చగలదని ఆమె అందరిలో మహోన్నత శ్రేణికి చెందిన కవయిత్రి అని తెలియచేసాడు. మర్నాడు  సభలో మధురవాణిని దగ్గర కూర్చోబెట్టుకుని తన కలను వివరించాడు. ఆమెను సంస్కృత రామాయణం రాయమని కోరాడు. అందులో అందమైన అలంకారాలు రసమాదుర్యం, పదాల సృష్టి ఉండాలి అని చెప్పాడు. “మీ దయవలన శ్రీరాముని అనుగ్రహం వలన నేను రామకథను సంస్కృతం లో రాయగలను, మీ కోరిక నేరవేర్చగలను” అని చెప్పింది. రామ కథ మొదటి కాండలో తన రాజు గుణ శీలాలను గొప్పగా వర్ణించింది. మధురవాణి కుమార సంభవం ,నైషద కావ్యాలను కూడా సంస్కృతం లో రాసింది .అస్టావదానలలో గొప్ప ప్రతిభ చూపింది .

Inline image 4

  1. ఆళ్వా  దివ్య ప్రబంధాలు

తమిళ దేశంలో 12 మంది ప్రసిద్ధులైన మునులను ఆల్వారులు అంటారు. గరుడ వాహన పండితుడు తన దివ్య సుచరిత్రలో అనంతాచార్య తన ప్రపన్నామ్రుతం లో ఆల్వారుల దివ్య చరిత్రను రాసారు. వీరి జీవిత కాలాలను ఆధునికులు అంగీకరించటం లేదు. వారి కథనం ప్రకారం కొందరు ఆళ్వారులు ద్వాపర యుగంలో కొందరు కలి యుగం లో జన్మించారు. కులశేఖర ఆల్వార్ మొదటి వాడు. కీ.పూ. 3075కు  చెందినా వాడు. ద్రుదావర్తుని కుమారుడు. అతని ముకుందమాల గొప్ప ఆధ్యాత్మిక స్తోత్రం.

వీరిలో నమ్మాళ్వార్ లేక శఠ గోప యతీన్ద్రుడు పరాశర లేక వకుళాభరణుగా ప్రసిద్ధుడు. తిరుక్కుల్ లో క్ర్ర్.పూ. 3059 లో జన్మించాడు. అసలు పేరు మారన్. కొద్ది కాలం తపస్సు చేసాక ఆత్మ జ్ఞానం కలిగి ‘’నాలాయిరం’’ అనే తమిళ ప్రబంధం రాసాడు. దీనిణి  సంస్కృతంలో ‘’పురుకేశ గాధానుకరణ’’గా రామానుజాచార్య అనువదించాడు. యమునాచార్య్డు అని పిలవబడే ఆలవందార్ శ్రీరంగంలో మహా పండితుడు. ఈశ్వర భట్ట రంగనాయకి ల కుమారుడు. మహా భక్తుడైన నాదముని మనమడు. చతుస్శ్లోకి, స్తోత్ర రత్న శ్రీ స్తుతి అనే గొప్ప మాదుర్యవంతమైన కావ్యాలు రాసాడు. ఈయన కాలం క్రీ.శ. 950 -1040

  1. విశిష్టాద్వైత మత స్థాపకులు- భగవద్రామానుజాచార్యులు క్రీ.శ. 1017-1137

తమిళనాడులోని శ్రీ పెరంబ దూరులో క్రీ శ 1017 లో ఆలవందార్ కుమారుడి కుమార్తె  కొడుకు రామానుజాచార్య. తండ్రి హరితస గోత్రానికి చెందిన ఆశూరి కేశవ భట్టార్. చిన్నప్పటి పేరు లక్ష్మణ ఇప్పుడు లక్ష్మణ  ముని అంటారు. ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. వేద యాదవ ప్రకాశ అనే గురువు వద్ద కానేరి లో విద్యనభ్యసించాడు. గురువుగారి అసూయను భరించలేక బయటకు వచ్చేసాడు. తనను హత్య చేసే ప్రయత్నం నుండి బయటపడి కాంచీపురం చేరాడు. తర్వాత శ్రీరంగానికి ఆహ్వాని౦చ బడి ఆలవందార్ స్థానాన్ని పొందాడు. శ్రీరంగానికి ఆలవందార్ అంతిమ దర్శనం చేయడానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మధురాంతకం లో పెరియనంబి వద్ద వేదాంతం నేర్చాడు. తర్వాత మహర్షి అయ్యాడు.

వ్యాస సూత్రాలకు భాష్యానికి వేదాంతానికి వ్యాఖ్యానాలు రాసాడు. కాశ్మీరు వెళ్ళినప్పుడు ఆయన వ్యాఖ్యానాలను సరస్వతి దేవి మెచ్చినందువలన వాటికి’’ శ్రీ భాష్యం ‘’అనే పేరు వచ్చింది. 1098 లో మెల్కోటే లో విష్ణు విగ్రహాన్ని స్థాపించి దేవాలయాన్ని నిర్మించాడు. తిరపతి చేరి అక్కడ తగాదాలను పరిష్కరించి అనేక  విష్ణ్వాలయాల్లో పూజలు, ఉత్సవాలు నిర్వహించాడు. 128 సంవత్సరాలు సార్ధక  జీవితం గడిపి 1137 లో పరమపదం పొందాడు. వేదాన్తంపై అనేక గ్రంథాలు రాసాడు. రామానుజుని’’ వైకుంఠ గద్య, రఘువీర గద్య, శరణాగతి గద్య’’ చాలా సుప్రసిద్ధమైనవి. విశిష్టాద్వైత మత సంష్టాపకుడు రామానుజాచార్యుడు. కులమత రహితంగా వేదాలను మంత్రాలను బోధించిన మహాత్ముడు రామానుజాచార్య్డు. రామానుజులపై రామానుజ చరిత్ర, చూలికను రామనుజదాసుడు రాసాడు. యతీంద్ర చంపూను వెంకటా భరనణుడు రామానుజ దివ్య చరిత్ర రామానుజ విజయం మొదలైనవి రచి౦పబడినాయి . ఆయన ముఖ్య శిష్యుడు ఆంద్ర పూర్ణుడు లేక వదూహ నంబి ‘’యతిరాజ వైభవం’’ రాసాడు.

Inline image 5

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.