బిహార్‌పై ఉత్కంఠ!
- 13/08/2015
మరి కొన్ని వారాల వ్యవధిలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా అత్యంత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో అసెంబ్లీ పోరాటం జరుగబోతోంది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అధికార జెడియూ నేత నితీష్ కుమార్ మూడోసారి కూడా పగ్గాలు చేపట్టేందుకు దూకుడుగానే వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికి సంబంధించినంత వరకూ బలమైన ప్రాంతీయ పార్టీలైన ఆర్‌జెడి, జెడియూలకు తీవ్ర విఘాతానే్న కలిగించాయి. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే మోదీ సారథ్యంలో బిజెపి దూసుకుపోయింది. మెజార్టీ లోక్‌సభ సీట్లను కైవసం చేసుకోవడంతో లాలూ, నితీష్‌లకు కంగుతినే పరిస్థితే ఎదురైంది. అనంతరం మాజీ జనతాదళ్ పార్టీలన్నింటినీ కలుపుకుని జనతాపరివార్‌గా ఏర్పాటుచేసేందుకూ గట్టి ప్రయత్నమే జరిగినా అది ఫలించలేదు. ఈ పరివార్ ఏర్పాటుకు కొన్ని పార్టీలు ముందుకు వచ్చినా అనంతర పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గాయి. ఈ కూటమిలో చేరితే తమ వ్యక్తిగత ఉనికిని కోల్పోతామని భావించిన మాజీ జనతాదళ్ నేతలు ఎవరిదారి వారు చూసుకున్నారు. దానితో రాష్ట్రానికే చెందిన జెడియూ, ఆర్‌జెడిలు చేతులు కలిపి పోటీ చేయక తప్పని అనివార్య పరిస్థితే ఏర్పడింది. దాణా కేసులో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకపోవడంతో మరోమార్గం లేక జెడియూతో చేతులు కలపడమే కాక మనసు అంగీకరించక పోయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు నే బలపరిచారు. ఆ విధంగా చేతులు కలిపిన ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు తోడుకావడంతో బలమైన ప్రాంతీయ కూటమి ఏర్పడినట్టయింది. ఈ కూటమి ఎంత మేరకు రాణిస్తుంది? గెలుపే ధ్యేయంగా చేతులు కలిపిన ఈ నాలుగు పార్టీలు చివరి వరకూ ఎలాంటి విభేదాలకు ఆస్కారం లేకుండా ముందుకు సాగుతాయా అన్నది అనేక సానుకూల, ప్రతికూల అంశాలపైన ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికిప్పుడు అలాంటి సమస్యేమీ లేకపోయినా రానున్న కొద్ది రోజుల్లో ఈ కూటమి భాగస్వామ్య పక్షాల ధోరణి విస్మయాన్ని కలిగించేదిగా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.నరేంద్ర మోదీ సారథ్యంలో బిజెపికి ఏ విధంగా చూసినా కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కత్తిమీద సాము చందం. పదహారో లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ ప్రభంజనం పనిచేసినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మాత్రం కమలనాథులకు చేదు అనుభవానే్న మిగిల్చాయి. మోదీ సహా మొత్తం కేంద్ర కేబినెట్ మం త్రులందరూ ప్రచారానికి దిగడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం నల్లేరుపై బండి నడక చందమేనని భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. మొత్తం 70అసెంబ్లీ సీట్లలో 67సీట్లు కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ వశమయ్యాయి. చివరి క్షణం వరకూ పోరాడి మోదీ జనాకర్షణ శక్తితో రాణిస్తామని భావించిన బిజెపికి ఆశాభంగం కలగడంతో ఇతర ప్రతిపక్ష పార్టీలకు కొంత ఊపిరి లభించినట్టయింది. ఏడాది లోనే మోదీ జనాకర్షణ వనె్న తగ్గుతోందని భావించిన కాంగ్రెస్ సహా అనేక విపక్షాలు ఎదురుదాడికి దిగడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే మారాయి. ప్రధాని మోదీ విషయంలో విపక్షాల అంచనాలు తారుమారు చేయాలంటే..అత్యంత వ్యూహాత్మక రీతిలో పావులు కదిపి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరాల్సిందే. అయితే అది ఎంత వరకూ సాధ్యమవుతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ పాచికలు అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇస్తాయా అన్నది ఆసక్తి కలిగించే అంశం. పదహారో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయానికి సూత్రధారిగా పనిచేసిన అమిత్ షా వ్యూహం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయని నేపథ్యంలో ఇప్పుడు బిహార్ పరిస్థితి ఆయనకు అగ్నిపరీక్షగానే మారింది. సామాజిక అనుసంధానమే విజయ సూత్రంగా భావిస్తున్న అమిత్ షా తన ఎన్నికల విజయ వ్యూహానికి ప్రధాని మోదీ జనాకర్షక శక్తిని రంగరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమన్నది మోదీ రాజకీయ ప్రాభవానికి మరింత వనె్న తేవడమే కాకుండా అనంతరం జరిగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయానికి బలమైన పునాదిగా పనిచేస్తుంది.
ప్రస్తుతం లోక్‌సభలోనే మెజార్టీ కలిగిన బిజెపికి రాజ్యసభలోనూ పైచేయి కావాలంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ విధంగానే జాతీయ స్థాయిలో చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను రానున్న నాలుగేళ్ల కాలంలో ముందుకు తీసుకెళ్ల గలుతుంది. సునాయాసంగానే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదాన్నీ పొందగలుగుతుంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నువ్వానేనా అన్న రీతిలోనే ఉంటాయన్నది స్పష్టం. ఇంతకీ బరిలోకి దిగిన పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలేమిటి? అధికారం సునాయాసంగా చేతికందే విధంగా ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఇవి అనుసరిస్తున్న మార్గాలేవిటన్నవి కూడా ఆసక్తిని కలిగించేవే. మిగతా రాష్ట్రా ల్లో మాదిరిగా కాకుండా బిహార్ ఎన్నికల్లో కులాల ప్రాధాన్యత ఎక్కువే. ఆక్కడ బలంగా ఉన్న పార్టీ ల బలం కూడా వీటిపైనే ఆధారపడి ఉందన్నదీ ఎంతైనా వాస్తవం. ఇప్పటికే రాష్ట్రాన్ని పలుమార్లు పాలించిన ఆర్‌జెడి ముస్లిం, యాదవ ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. పదిహేడు శాతం ముస్లింలు, 13శాతం యాదవ ఓట్లు గంపగుత్తగానే తనకు పడతాయన్న ధీమా నిన్న మొన్నటి వరకూ ఆర్‌జెడికి ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లాలూ ఓటు బాంకు తలకిందులయ్యే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా జెడియూతో కాంగ్రెస్ చేతులు కలుపడంతో ముస్లిం ఓట్లు ఇంకెంత మాత్రం తనకు పడవని భావించిన లాలూ అనివార్యంగానే తన రాజకీయ భవితను పణంగా పెట్టి జెడియూకు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది.‘నితీష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి నేను విషానే్న మింగాల్సి వచ్చింద’న్న లాలూ మాటలే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి నితీష్‌కు సంబంధించినంత వరకూ కులపరమైన బలమేదీ ఆయనకు లేదు. మంచి పాలనాదక్షుడిగానే ఆయన ఓటర్లను ఆకర్షించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. సీట్ల పంపిణీ విషయంలో నితీష్-యాదవ్‌ల మధ్య ఇప్పుడున్నంతగా పొత్తు ఉండక పోవచ్చునన్న ఆశతోనే బిజెపి అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించక పోయినప్పటికీ అందుకు సంబంధించి బలమైన సంకేతాలనే అందించింది. మాజీ ముఖ్యమంత్రి జతిన్‌రామ్‌ను చేరదీయడం ద్వారా ఓ బలమైన సామాజిక వర్గం ఓట్లకు గాలం వేయాలన్నది బిజెపి ఆలోచన. ఎవరి ఎత్తులు ఫలిస్తాయి..ఎవరిది అంతిమ విజయం అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితే. కానీ, బిహార్ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో స్పష్టమైన రాజకీయ మార్పులకు దారితీస్తాయన్నది వాస్తవం.

