ఆగస్టు 15న అరబిందో జయంతి
మానవ పరిణామ ప్రక్రియను పురోగమన దిశలో నడిపించే క్రమంలో శ్రీ అరవిందులు మానవ జాతికి చేసిన సేవ అపూర్వమైనది. శ్రీ అరవిందుల జీవితాన్ని రెండు అంకాలుగా విభజిస్తే.. మొదటిది భారతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి విప్లవాత్మక భావాలతో, అనర్గళ ఉపన్యాసాలతో, ‘ఆర్య’ పత్రిక స్థాపనతో జాతిని ఉత్తేజితం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు అరబింద్‌ఘో్‌షగా కనిపిస్తారు. రెండో అంకంలో భౌతికాధ్యాత్మికతల సమన్వయంతో మానవజాతిని భవబంధశృంఖలాల నుంచి విముక్తం చేసి, అతిమానస సాధన వైపు తీసుకుపోయే మహాయోగిగా అనిపిస్తారు.
1872 ఆగస్టు 15న తేదీన జన్మించిన అరబిందో చిన్న వయసు నుంచే ఇంగ్లండ్‌లో విద్యనభ్యసించారు.
ఆ సమయంలో మన దేశంలో ఐపీఎస్ పరీక్ష అతి కష్టమైనది. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమైనది. అలాంటి పరీక్షలో 21 ఏళ్లకే ఉత్తీర్ణుడైన అరబిందోకు ఉద్యోగం నచ్చలేదు. ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు రాగానే ఒక విస్తృతమైన ప్రశాంతత, నిశ్శబ్దాలు ఆయనను ఆవరించాయి. జనచైతన్యం కోసం ఉద్యమాన్ని విస్తృతం చేయాలనే భావన బలపడింది. అదే సమయంలో ఆయన మహారాష్ట్రకు చెందిన విష్ణుభాస్కర్ లేలే అనే యోగిని కలిశారు. మూడు రోజుల ధ్యానం ఆయన జీవితాన్ని మార్చేసింది. బ్రహ్మచైతన్య అనుభవాన్ని పొందగలిగారు. ఒక వైపు ఆధ్యాత్మిక మార్గం, మరోవైపు దాస్యశృంఖలాలను తెంపటానికి చేసే స్వాతంత్య్ర ఉద్యమం. ఈ రెండింటిలోను అరబిందో తనదైన ముద్రను వేయగలిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఒక ఏడాదిపాటు ఆయన జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అతివాద రాజకీయవాదిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరబిందో ఆ తర్వాతి కాలంలో మహాయోగి అరవిందులుగా మార్పు చెందారు. యోగకార్య నిమిత్తం పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు. శక్తిస్వరూపుణి శ్రీమాత మిర్ర ఆగమనంతో పాండిచ్చేరి ఆచరణాత్మక పూర్ణయోగ సాధనకు నిలయమైంది.
జ్ఞాన సారంశమిది..
ప్రస్తుతం మానవజాతి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనిని ఆధ్యాత్మికత కానీ, హేతువాద భావనలు కానీ, విజ్ఞాన శాస్త్ర ప్రగతి కాని వేర్వేరుగా అడ్డుకోలేవు. ఈ మూడు సమన్వయంతో పనిచేసినప్పుడే- ఈ సంక్షోభం తొలగిపోతుంది. జీవితాన్ని శత్రువుగా భావించే ఏ ఆదర్శమూ మానవునికి వెలుగుబాట చూపలేదు. అదేవిధంగా అంతరాత్మను కాదనే ఆధునిక దృక్పథం కూడా పరిష్కారం కాదు. జీవితానికి, ఆధ్యాత్మికతకు జరుగుతున్న సంఘర్షణ పూర్తి అవగాహనతో తొలిగిపోవాలి. అప్పుడు జీవితమంతా యోగమే (all life is yoga) అవుతుంది. పదార్థం నుంచి జరిగిన పరిణామంలో మానవుడు ఇంకా మధ్యంతరస్థిలోనే ఉన్నాడు. దివ్యచైతన్య ఆవిర్భావంతో ఈ స్థితి నుంచి దైవం వైపుగా పయనించగలడు. అసమగ్రంగా ఉన్న భౌతిక, ప్రాణిక, మానసిక స్వభావాలలో పరివర్తన జరగాలి. అప్పుడే దివ్యచైతన్యం భూమి మీద అవతరించి భూమి మానవ జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. అరవిందుల పూర్ణయోగ, హఠయోగ, రాజయోగ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాలన్నీ మనుషులను ఈ మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. తన జీవితాన్ని మానవహితానికి త్యాగం చేసిన మహర్షి అరవిందులు 1950 డిసెంబర్ 5న దేహపరిత్యాగం చేశారు. ‘సింథసిస్ ఆఫ్ యోగ’, ‘లైఫ్ డివైన్’, ‘గీతావ్యాసాలు’, ‘వేదోపనిషత్తుల వివరణలు’, ‘యోగలేఖలు’, ‘భారతీయ సంస్కృతి పునాదులు’ వంటి ఎన్నో అద్భుత రచనలు దివ్య చైతన్య ప్రవాహంలా ఆయన కలం నుంచి జాలువారాయి.ఆయన రచించిన ‘సావిత్రి’ మహాకావ్యంలో ప్రతి పద్రమూ మంత్రాక్షరంగా పనిచేసి, చైతన్య విస్తారం జరిగి నిశ్శబ్దస్థితిని ప్రసాదిస్తుంది.
సునీత శేఖర్,
934623546741