ఉల్లి పోటు

ఉల్లి పోటు

  • 16/08/2015
  • -భారతి

ఉల్లిపాయ తరిగితే కన్నీళ్లు వస్తాయి…కానీ కొన్నా, కొనాలనుకున్నా ఇప్పుడు అదే పరిస్థితి. దాదాపు నెలరోజులుగా సగటు భారతీయుడిని ఉల్లి రేటు.. ఘాటెక్కి ఊపిరాడనివ్వడం లేదు. ఈ పరిస్థితి వంటింటి వాతావరణాన్ని వేడెక్కించి సంసారాల్లో చిచ్చుపెడుతోంది. పరిమిత బడ్జెట్ బతుకులను భయపెడుతోంది. మరో మూడునెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఉల్లిపై మమకారాన్ని తగ్గించుకోక తప్పని స్థితి ఏర్పడింది. *** మన గడ్డపై పేదవాడికి ఉల్లిగడ్డ లేనిదే గడవదు. చౌకగా, రుచిగా, ఆరోగ్యప్రదాయినిగా ఇది వారికి చేరువైంది. తెల్లారగట్లే లేచి చద్దిమూట పట్టుకెళ్లే కూలీలు అన్నంతోపాటు ఓ మిరపముక్క, ఉల్లిపాయ చెక్క కసుక్కున కొరికి ఆ ఘాటైన కారాన్ని మమకారంగా తినడంలో ఆనందం పంచభక్ష్యపరమాన్నాలు ఇచ్చినా వారికి రాదు. వారికి కావలసింది తల్లిలాంటి ఉల్లే. కూరగాయలు, పప్పుబెల్లాలు లేకపోయినా, వాటిని కొనలేకపోయినా ఉల్లి ఉంటే చాలని, వాటితోనే సరిపుచ్చుకునే పేదలకు ఇప్పుడు పెద్దకష్టమే వచ్చిపడింది. ఇప్పుడు వారికి నోట్లో ముద్ద దిగడమే కష్టమవుతోంది. *** వేడివేడి పెసరట్టు, దానిపై అల్లం, మిర్చిముక్కలు, తోడుగా ఉల్లి చెక్కు వేస్తే లొట్టలేసుకు తినే మగరాయుళ్లు ఇప్పుడు నొసలు చిట్లిస్తున్నారు. ఇల్లాలి ప్రేమలో ఏ మాత్రం మార్పు రాకపోయినా.. పెసరట్టులో ఉల్లి పల్చబడి పోవడంతో వారికి ఎక్కడ లేని విసుగూ వచ్చేస్తోంది. రుచీపచీలేని తిండి ఎందుకంటూ మగడు విసుక్కుంటే, అందులో తన తప్పేంటో తెలీక ఇల్లాలు కూడా ఒంటికాలిపై లేస్తోంది. ఏతావతా.. ఉల్లి ఇప్పుడు అన్నిచోట్లా లొల్లికి కారణమైంది. ఎందుకిలా అంటే చాలా కారణాలు చెప్పుకోవాలి. వేల ఏళ్లనుంచి ఉల్లి వంటింట్లో ప్రధాన వస్తువైపోయింది. పప్పులు, కూరగాయలు లేకపోయినా ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, ఇల్లాళ్లు వంటలు ఘుమఘుమలాడేలా చక్రం తిప్పేస్తారు. ఎంత ఖరీదైన, అరుదైన వంటకానికైనా పక్కన చెక్కుగానో, ముక్కగానో ఉల్లిపాయ కనపడాల్సిందే. అత్యంత పేదల నుంచి, పెద్దల వరకు ఉల్లికి అలవాటుపడిపోయారు. సాధారణంగా ఏడాదిలో 8 నెలలపాటు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఈ పంట వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు, పంటల దిగుబడి తగ్గినపుడు, కరవు ఏర్పడినప్పుడు ఘాటెక్కిపోతుంది. అందుబాటులో ఉండాల్సిన ధరలు రెట్టింపైనా, అంతకంటే ఎక్కువగా పెరిగినా ఇక పేదలు, మధ్యతరగతి జనాలు గగ్గోలు పెట్టేస్తారు. ఇప్పుడదే జరుగుతోంది. రేట్ల పెరుగుదల ఇలా… దాదాపు నాలుగు నెలలనుంచి క్రమంగా ఉల్లిపాయల రేట్లు పెరుగుతున్నాయి. రెండువారాల నుంచి అది రెట్టింపైంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు 20 రూపాయలుంటే ఇప్పుడు అది 45కు పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 50పైనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది 40నుంచి 60 రూపాయల మేరకు తచ్చాడుతోంది. దేశం మొత్తమీద సగటు కిలో ఉల్లిపాయలు 50 రూపాయలు పలుకుతున్నాయని నిర్ధారించవచ్చు. దేశంలో పేరెన్నికగన్న ఉల్లి మార్కెట్లలోనూ ఊహించని రీతిలో టోకు, రిటైల్ ధరలు తారలను తాకుతున్నాయి. ఈ పరిణామం సగటు భారతీయుడికి భారంగా పరిణమించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా మేల్కొని ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నా ఇంకా పరిస్థితి దారికి రాలేదు. సీజన్‌ల ప్రభావం ఇలా… మనదేశంలో ఉల్లిసాగు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. పైగా కొన్ని దశాబ్దాలుగా ఒకటే విస్తీర్ణంలో ఉల్లిని సాగుచేస్తున్నారు. అంటే ఉల్లిసాగును విస్తృతం చేసేందుకు రైతులు సుముఖంగా లేరన్నమాట. దీనిని వ్యవసాయపంటగా గుర్తించకపోవడంవల్ల అనేక రాయితీలను రైతులు కోల్పోతున్నారు. ఫలితంగా సాగు పెరగడం లేదు. ప్రస్తుతం దీనిని వాణిజ్య పంటగా గుర్తిస్తున్నారు. ఉల్లి సాగుచేసే ‘వ్యవసాయ సంవత్సరాన్ని’ జూన్ నుంచి జులైవరకు పరిగణిస్తారు. రబీ, లేట్ ఖరీఫ్, ఖరీఫ్ సీజన్‌లుగా విభజించి దీనిని సాగుచేస్తారు. ప్రధానంగా రబీలోనే, అంటే ఏప్రిల్, మే నెలల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. అదే కీలకం కూడా. దేశానికి అవసరమయ్యే ఉల్లిలో 60శాతం ఈ రబీలోనే పండిస్తారు. లేట్ ఖరీఫ్ అంటే జనవరి, మార్చిలో ఉల్లిసాగు జరిగినా దేశం డిమాండ్‌లో 25శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఇక ఖరీఫ్‌లో (సెప్టెంబర్, నవంబర్) నామమాత్రంగా సేద్యం చేస్తారు. అప్పుడు 15శాతం ఉల్లి అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద రబీలో సాగయ్యే ఉల్లికి డిమాండ్ ఎక్కువ. అది కాస్త ఎక్కువకాలం నిల్వ ఉండటం, రుచికరంగా ఉండటం వల్ల దీనికి విలువ ఎక్కువ. ఈసారి రబీలో పంటసాగు దెబ్బతింది. వర్షాలు లేకపోవడం, లేట్‌ఖరీఫ్, ఖరీఫ్‌లో సాగు అనుకున్న విధంగా జరగకపోవడంతో దిగుబడి తగ్గి డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఇదీ… మనదేశంలో ఏటా దాదాపు 200 లక్షల టన్నుల ఉల్లి అవసరమవుతుంది. గత ఏడాది 185 లక్షల టన్నుల మాత్రమే దిగుబడి అయ్యింది. అంతకుముందు సంవత్సరం కన్నా 5 లక్షల టన్నుల దిగుబడి తగ్గినట్లయిందన్నమాట. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ఉల్లి ఉత్పత్తి సాగవుతోందా అంటే ఔననే చెప్పాలి. కాకపోతే వచ్చిన దిగుబడిని నిల్వ చేసుకునే వ్యవస్థలు ఎక్కడికక్కడ లేకపోవడం, దేశం అంతటా కాకుండా కొన్ని ప్రాంతాల్లోనే ఉల్లి సేద్యం చేయడం, ఉత్పత్తి అయిన ఉల్లిని ఇతర ప్రాంతాలకు సకాలంలో చేరవేయగలిగే సమర్థ రవాణా వ్యవస్థ లేకపోవడంవంటి కారణాలతో సమస్య ఏర్పడుతోంది. దీనికి తోడు రుతుపవనాల ఆలస్యం, దళారుల కృత్రిమకొరత ఉల్లి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. నిజానికి మనం ఉత్పత్తి చేస్తున్న ఉల్లి దాదాపుగా మన అవసరాలకు సరిపోతుంది. అయితే వ్యాపారులు అత్యధిక ధర లభ్యమయ్యే కొన్ని దేశాలకు మన ఉల్లిని ఎగుమతి చేస్తూండటంతో ఇక్కడా రేట్లు పెరుగుతున్నాయి. మరికొన్ని దేశాలనుంచి ఉల్లిని దిగుమతి చేసుకుని ధరలు ఎక్కువగా లభించే దేశాలకు మన వ్యాపారులు ఎగుమతి చేస్తూండటంతో దేశీయంగా ప్రజలకు లాభం లేకపోతోంది. మనవాళ్లు మలేషియా, శ్రీలంక, బంగ్లా, ఇండోనేసియా, నేపాల్, ఒమన్, కువైట్, కతార్‌లనుంచి ఉల్లిని తక్కువ ధరలకే దిగుమతి చేసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్, వియత్నాంలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా చేయడంవల్ల దేశంలో ఉల్లికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతున్నాయి. గత సంవత్సరం కనీసం 10 లక్షల టన్నుల ఉల్లిని ఇలా ఎగుమతి చేశారు. ఇలా ఇష్టారీతిని ఉల్లి ఎగుమతులు జరగకుండా కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కనీస ఎగుమతి ధరను (ఎంఇపి) బాగా పెంచేసింది. ఒకప్పుడు టన్ను ఉల్లిపాయలు ఎగుమతికి 15,900 రూపాయలు ఎంఇపి ఉంటే ఇప్పుడు 29 వేల రూపాయలకు పెంచారు. దీన్ని గత జూన్ నుంచి వర్తింపచేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. ధరలు దిగిరాకపోగా రెట్టింపయ్యాయి. నిజానికి గతేడాది, అంటే 2014-15లో దేశం మొత్తంమీద 11,92,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. 193.57 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తి అయ్యాయి. దాదాపు అది మన దేశ అవసరాలకు సరిపోతుంది. కానీ ఎగుమతులు, అక్రమ నిల్వలు, ఉల్లిని దాదాపు ఆరు మాసాలపాటు నిల్వచేయగల వ్యవస్థలు లేకపోవడంతో ఇప్పుడు ఉల్లికి కొరత ఏర్పడింది. రేట్లు పెరగడానికి కారణమైంది. మహారాష్ట్ర పాత్ర దేశంలో ఉల్లి సాగులో మహారాష్టద్రే అగ్రస్థానం. కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలది ఆ తరువాతి స్థానాలు. దేశం మొత్తంమీద జరిగే ఉల్లిగడ్డల ఉత్పత్తిలో ఒక్క మహారాష్టన్రుంచి 30నుంచి 40 శాతం మేరకు లభిస్తుంది. హోల్‌సేల్ మార్కెట్లు, ఉల్లి నిల్వచేయగల వ్యవస్థలు మహారాష్టల్రో ఉన్నంత పకడ్బందీగా మరే రాష్ట్రంలోనూ లేవు. ఈ రాష్ట్రంలోని పేరెన్నికగన్న హోల్‌సేల్ ఉల్లిమార్కెట్ లాసెల్గావ్. ఇక్కడ ప్రతిరోజు 15వేల క్వింటాళ్ల ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు కేవలం 5వేల క్వింటాళ్ల వ్యాపారమే జరుగుతోంది. ఇక్కడి మార్కెట్‌లో రేటును బట్టి ఆసియాలో ఉల్లి ధరలు ప్రభావితమవుతూంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి క్రయవిక్రయాలు జరిగే మార్కెట్ అన్నమాట. రబీలో ఉత్పత్తి అయ్యే ఉల్లికి డిమాండ్ ఎక్కువ అని అందరికీ తెలుసు. పొడి వాతావరణంలో తయారయ్యే ఈ ఉల్లి కాస్త ఎక్కువ వారాలపాటు నిల్వ ఉంటుంది. తడి లేకుండా, గాలి తగిలేలా వాటిని నిల్వచేయడానికి తగిన సౌకర్యాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఈ సౌకర్యాలే అక్రమార్కులకు ఆయుధాలయ్యాయి. ఎగుమతులపై కేంద్రం దృష్టిపెట్టి నియంత్రణ చర్యలు చేపట్టడంతో వ్యాపారులు జాగ్రత్తపడ్డారు. ఉల్లిని పెద్దమొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచారు. మార్కెట్‌లోకి విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడింది. దేశీయ అవసరాల్లో 30శాతం మహారాష్ట్ర తీరుస్తుంది. అదీ రబీ పంటనుంచి లభ్యమయ్యే ఉల్లిలో 40శాతం దేశంలోని ఇతర ప్రాంతాలకు అందిస్తుంది. ఇప్పుడంతా అది అక్రమ నిల్వల్లో ఉండిపోవడంతో కటకట ఏర్పడి రేట్లు పెరుగుతున్నాయి. ఇక ఉల్లి ఉత్పత్తిలో కర్నాటకది రెండోస్థానం. ఎంపీ, గుజరాత్‌లలోనూ ఉల్లి ఉత్పత్తి చేస్తున్నారు. కర్నాటక, ఎంపీలకు రుతుపవనాలు ఆలస్యమవడంతో ఉత్పత్తి దెబ్బతింది. ఇక గుజరాత్, బీహార్‌లలో అతివృష్టివల్ల ఉల్లిసాగు దెబ్బతింది. పైగా ఉల్లి నిల్వలకు ఈ తడి వాతావరణం పెద్దసమస్యగా మారింది. మొత్తమీద ఉల్లికొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పదివేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి జరుగుతున్నా ఎగుమతి చేసే స్థాయిలో లేదు. కడప-కర్నూలు ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. ఉల్లిపాయ చిన్నగా, ఘాటు ఎక్కువగా ఉండే ఈ రకం ఉల్లికి మార్కెట్ ఎక్కువే. అయితే ఇక్కడా రుతుపవనాలు సరిగ్గా లేవు. బీహార్‌లో 21 జిల్లాల్లో ఉల్లిసాగు ప్రధానంగా సాగుతున్నా అననుకూల పరిస్థితుల్లో అది ఉపయోగకరంగా లేదు. ఒడిశాలో ఉల్లిసాగు జరుగుతున్నా అక్కడి అవసరాలకు సరిపోతోంది. దీంతో దేశం మొత్తంమీద ఉల్లికి డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మహారాష్టత్రోసహా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉన్న ఉల్లిని మార్కెట్‌కు తరలించడం, దిగుమతులు పెంచడం, ఎగుమతులు నియంత్రించడం, కొత్త పంట చేతికి అందిరావడం జరిగేవరకు ఈ ధరాఘాతం తప్పదు. అయితే నిత్యావసర పంట అయిన ఉల్లిని దీర్ఘకాలం, అంటే నెలలకు నెలలు దాచిపెట్టే సౌలభ్యం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రెండు లేదా మూడు నెలలకు మించి నిల్వ ఉంచడం సాధ్యం కాదు. మహా అయితే నాలుగు నెలలు. ఆ తరువాతైనా మార్కెట్‌లోకి రావలసిందే. అయితే ఉల్లి రేటు పెరిగిన వెంటనే విడతల వారీగా అక్రమ నిల్వలను పంపిణీలోకి తీసుకువస్తున్నారు. అలా చేయకపోతే అసలుకే మోసం వస్తుందని వారికి తెలుసు. కొత్త పంట చేతికొచ్చేవరకు ఈ ధరల తాకిడి ఉంటుంది. అంటే నవంబర్ వరకూ అన్నమాట. ఈలోగా వర్షాలు పడితే కొంత మార్పు వస్తుంది. ఇలాగే పరిస్థితులు కొనసాగి కరవు ఏర్పడితే మరిన్ని కష్టాలు తప్పవు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఉల్లి వాడకం తెలుగురాష్ట్రాల్లో కాస్త తక్కువే. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కాస్త ఎక్కువ. తెలంగాణలో 2వేల హెక్టార్లలో స్థిరంగా ఉల్లిసాగు చేస్తూంటే ఏపీలో 15వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తున్నారు. ఏపీ ఉల్లిలో సగానికి సగం ఎగుమతి అవుతోంది. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో ఉల్లికి కొరత ఉండదు. ఏపీకి ఒడిశా నుంచి, తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా అవుతోంది. ఇప్పుడు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్లలోనూ ఉల్లి కిలో 40 రూపాయలు పలుకుతోంది. ఇది ఇంకాస్త పెరగవచ్చు. నెలరోజులుగా ధర పెరగడమేకాని తగ్గుముఖం పట్టలేదు. హైదరాబాద్ బిర్యానీకి ఎంత గిరాకీ ఉందో, దాంతోపాటు ఉల్లిపాయలకూ అంతే గిరాకీ ఉంది. బిర్యానీ, చపాతీలకు ఉల్లిముక్కలు లేకుండా తినడం ఇక్కడివారికి అలవాటు లేదు. ఇప్పటి పరిస్థితిలో ఉల్లిపాయలు ఇవ్వలేక హోటల్ యజమానులు అవస్థలు పడుతున్నారు. ‘నో ఆనియన్స్ ప్లీజ్’ అన్న బోర్డులు పెట్టి వినియోగదారులను దూరం చేసుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఉల్లిసాగును ఉద్యానవనశాఖ పరిధిలో ఉంచడం, దీనిని వాణిజ్య పంటగా గుర్తించడంవల్ల రైతులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. మిగతా పంటలను నిల్వ చేసే వ్యవస్థలు ఉండగా అటు ఏపి, ఇటు తెలంగాణలో ఉల్లిని నిల్వచేసే గిడ్డంగులు లేవు. అటు ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలూ ఈ విషయంపై చర్యలు తీసుకోలేదు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో ఎనిమిది నెలలు మాత్రమే ఉల్లి సాగవుతుంది. అందులో రబీలో మాత్రమే సగానికిపైగా విస్తీర్ణంలో సేద్యం చేస్తారు. మిగతా నెలల్లో ఉల్లి దిగుబడి తక్కువగా ఉంటుంది. కనుక అప్పుడు రేటు పెరుగుతుంది. ఆ సమయానికి ఉల్లి అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ముందే నిల్వలు చేసి జాగ్రత్తపడటం కనీస కర్తవ్యం. కానీ అది జరగడం లేదు. ముందుచూపు లేని ప్రభుత్వ వైఖరిని ఆసరా చేసుకుని దళారులు, వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. అటు రైతు, ఇటు వినియోగదారుడు ఎప్పటిలా మోసపోతూనే ఉన్నారు. రాజకీయాలు ఉల్లి ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయ పార్టీలు గగ్గోలు పెడతాయి. నిజానికి ఎన్నికల వేళ ఉల్లి ధరలు పెరిగితే రాజకీయ పార్టీలకు గుండెదడ పెరుగుతుంది. జనతా ప్రభుత్వం ఉల్లిఘాటుకే దెబ్బతింది. 2010లో మళ్లీ ఉల్లిధరలు అమాంతం పెరిగి అందర్నీ భయపెట్టాయి. గతంలో దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఉల్లిధరల పెరుగుదల ఓ అంశమైపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆప్ సర్కార్‌ను తాజా పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దిల్లీలో ఉల్లిధరలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉల్లి వాడకం కూడా ఎక్కువ. అందువల్ల డిమాండ్ ఎక్కువే. కేంద్రంపై విమర్శలు చేసి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నాల్లో ఆప్ సర్కార్ ఉన్నా సగటు పౌరుడు అది వినే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలు వీధికెక్కుతున్నాయి. వారితో సామాన్యులూ గొంతు కలుపుతున్నారు. మొత్తానికి ఉల్లి లొల్లి పెరుగుతోంది. ఇది మనదేశంలోనే కాదు. అటు ఇరుగుపొరుగు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. పాకిస్తాన్, బంగ్లా, నేపాల్, భూటాన్‌లలోనూ ఇప్పుడు ఉల్లిఘాటు అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్‌లో ఉల్లిధరలు పెరగడం, ఎగుమతులపై నియంత్రణ ఉండటంతో తమకు ధరలభారం మరింత పెరుగుతుందని బంగ్లాదేశ్ భయపడుతోంది. అటు ఖాట్మండూలోనే ఉల్లి మంటపుట్టిస్తోంది. మనదేశంలో ప్రతి వంటిల్లు ఉల్లిలేక తల్లడిల్లుతూంటే పొరుగుదేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి కనీసం నవంబర్ వరకు ఇలాగే ఉంటుందని అంచనా. ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. అందుకే మనవాళ్లు ఉల్లిని తల్లికంటే ఎక్కువగా చూసుకుంటారు. అది లేక ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వాలు ఏం చేయాలి… ఉల్లి ధరలు పెరిగి విమర్శలు వెల్లువెత్తుతూండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనమే ఇస్తాయి. ఏటా ఎదురయ్యే ఈ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లి ధరలు అమాంతం పెరగడం, ఒక్కోసారి నేలను తాకడం జరుగుతుంది. వాతావరణ, మార్కెట్ పరిస్థితులను గమనించి రైతుకు, వినియోగదారుడికి మేలు జరిగేలా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా కదలాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉల్లిసాగు చేసే భూమి విస్తీర్ణం పెరగాలి. కొన్ని దశాబ్దాలుగా ఈ విస్తీర్ణంలో మార్పు లేదు. ఉల్లి సాగుకోసం రైతులను ప్రోత్సహించాలి. మార్కెటింగ్, నిల్వలకోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన గిడ్డంగులు, ఇతర వ్యవస్థలను సంఘటితం చేయాలి. ఉల్లిని వ్యవసాయ పంటగా గుర్తించి సబ్సిడీలు, విత్తనాల సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి. యాజమాన్య పద్ధతులను, మెలకువలను వివరించి అధిగ దిగుబడి సాధించేలా రైతులకు శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడివేవీ జరగడం లేదు. అమెరికాలో ఎకరాకు 30 టన్నుల ఉల్లి దిగుబడి అవుతూంటే, గుజరాత్‌లో ఎకరాకు 27 టన్నులు దిగుబడి వస్తోంది. మహారాష్టల్రో 20 టన్నులు, ఏపీ-తెలంగాణల్లో 15 టన్నులకు మించి దిగుబడి రావడం లేదు. రైతులకు రుణసౌకర్యం, వారే సరుకును మార్కెట్‌కు తరలించుకునే వెసులుబాటు కల్పించాలి. దళారుల పాత్ర పరిమితం చేయాలి. ధరలు పెరిగినప్పుడల్లా పౌరసరఫరాలశాఖ, ప్రత్యేక కేంద్రాల ద్వారా వినియోగదారులకు తక్కువ ధరతో ఉల్లిని సరఫరా చేస్తున్నారు. కానీ ఇది కొంతమందికే, కొంతమేరకే ఉపయోగపడ్తుంది. ఇది ఉపశమన చర్యగానే మిగిలిపోతుంది. దళారులను నిలువరించి, రైతును ప్రోత్సహించి, ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తే తప్ప ఇలాంటి పరిణామాలు తరచూ ఎదురవుతూంటాయి. * బ్యాక్టీరియాను నాశనం చేసే గుణం ఉల్లికి ఉంది. కోసి వదిలేసిన ఉల్లిలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఉల్లి పాడైందనడానికి అది సంకేతం కాదు. అక్కడి గాలిలో ఉన్న బ్యాక్టీరియా ఉల్లిలో చేరిందన్నమాట. అయితే, అందులో ఉండే రసాయనాల ధాటికి అవి మరణించి అలా మసిగా ఏర్పడతాయి. ఉల్లివాసన ఇష్టపడే బ్యాక్టీరియా అక్కడకు చేరి ఆ ఘాటుకు మరణిస్తుందన్నమాట. దీనినిబట్టి కోసి వదిలేసిన ఉల్లిని వాడకపోవడమే మంచిది. ఫ్లూవంటి జ్వరాల బారిన పడిన వారి పక్కన ఉల్లి ముక్కలను ఉంచితే మంచిదని చెబుతారు. * దేశంలో మహారాష్ట్ర ఏటా 4660 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో ఎంపి 2691, కర్నాటక 2395, ఏపీ, తెలంగాణ కలిపి 1565, బీహార్ 1107, గుజరాత్ 704, హర్యానా 604, రాజస్థాన్ 476, యు.పి. 474, తమిళనాడు 429 మెట్రిక్ టన్నులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. * ఉల్లిపాయలు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. మనం నిత్యం చూసే నీరుల్లి ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు (వెల్లుల్లి కాదు)లో అవి ఉంటాయి. ప్రపంచం మొత్తమీద 70శాతం మేరకు పసుపువర్ణంలో ఉండే ఉల్లిపాయలనే వాడతారు. * ప్రపంచం మొత్తమీద 9,000,000 ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు. దాదాపు 170 దేశాల్లో ఉల్లి సాగు జరుగుతోంది. ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే ఉల్లిలో 8 శాతం అంతర్జాతీయ ట్రేడింగ్ జరుగుతోంది. మిగతాది ఎక్కడికక్కడ సొంతానికి వాడుకుంటున్నారు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.