గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)
281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)
శూరుని కుమారుడు ,సోల్లాపేయ మనవడు ,చంద్రాపతి మునిమనవాడు సోద్దాలకవి .కాయస్థ క్షత్రియ కులం లో వల్లభ శాఖ కు చెందినవాడు .దీనికి శిలాదిత్యుని సోదరుడు కాలాదిత్యుడు సంస్థాపకుడు .చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ గంగాధరుని వద్ద పెరిగాడు .చంద్రాచార్యుని వద్ద కొంత విద్య నేర్చి కొంకణ రాజధాని లోని స్తానా లేక థానాకు చేరాడు .చిత్త రాజు నాగార్జున ,ముమ్ముని రాజుల ఆశ్రయం పొందాడు .చిత్త రాజు ,సోదరుడు పదకొండవ శతాబ్ది వారు .చాళుక్యలాట రాజు వత్స రాజాస్థానం లోను సోద్దాలుడు ఉండి గౌరవ పురస్కారాలు అందుకొన్నాడు .
సోద్దాలుడు రాసిన ‘’ఉదయ సుందరి కద’’1026-1080మధ్య వత్స రాజు పాలన లో కాలం లో రచింప బడింది .ఈ కవి రాసిన కొన్ని శ్లోకాలకు ముచ్చటపడి రాజు గోప్పమంచి కావ్యం రాస్తే విలువైన ముత్యాలహారం బహూకరిస్తానని చెప్పాడు .వెంటనే కవిత్వ రచన ప్రారంభించి ‘’ఉదయ సుందరి కద’’రాశాడు .తన క్షత్రియ వంశ సంజాతాన్ని ఆకాశానికి ఎత్తుతూ తానూ బాణుడు ,వాల్మీకి అంతటి వాడిని అని రాసుకొన్నాడు సోద్దాలకుడు .అతని కవిత్వం ఆనాటి ప్రసిద్ధ శృంగార కవుల కవిత్వానికి ఏ మాత్రమూ తీసి పోదు .ఎనిమిది ఉచ్వాసాలలోని ఈ కద నాగ లోక ప్రభువైన శిఖండ తిల కుమార్తె ఉదయ సుందరికి ,ప్రతిష్టాన రాజు మలయ వాహనుడికి జరిగిన వివాహ వృత్తాంతమే .మొదటి ఉచ్చ్వాసం లో తన వంశ చరిత్ర సవివరంగా రాసుకొన్నాడు కవి .తన కవిత్వం గొప్పదనాన్ని వంశ పౌరుషాన్ని ,రచనా పాటవాలను ఏకరువు పెట్టాడు .రెండవ ఉచ్చ్వాసం నుండి అసలు కద మొదలు అవుతుంది .
282-‘’వాదిభ సింహ’’ కవి -(1200)
దిగంబర జైన ముని వాదిభ సింహుడు పుష్పసేన ముని శిష్యుడు .అసలు పేరు ఒడియ దేవుడు .సింహం ఏనుగు పై ఎలా లంఘించి పీచం అణస్తుందో తానూ కూడా వాదం లో అలాగే ప్రతివాదిని ఓడిస్తానుకనుక తనకు ‘’వాదిభ సింహ ‘’బిరుదు వచ్చింది అని చెప్పుకొన్నాడు .ఈకవికి గురువే సర్వస్వం .తన గురువు మూర్ఖులను కూడా విద్యా వంతుల్ని చేసే శక్తికలవాడని చెప్పాడు .తమిళనాడు ప్రాంతపు కవిగా ఈయనను భావిస్తారు .ఈతని వంశం వారు ఇంకా అక్కడ ఉన్నారట .
పదకొండు లంభాలలో’’ గద్య చింతామణి ‘’కావ్యం రాసి అందులో సత్య ధర రాజు అతనికుమారుడు జీవన ధర రాజు క్రమంగా వివేకులై జైనాన్ని ఎలా అనుసరించారో తెలియ జేశాడు . దీనికి ఆధారం గుణ భద్రుని ‘’ఉత్తర పురాణం ‘’.రచన అంతా భట్ట బాణుని కాదంబరి నిఅనుసరించి రాసినట్లే కనిపిస్తుంది .దుర్గుణం పతనానికి హేతువు అనే నీతి ఇందులో ప్రాధాన్యం గా చెప్పాడు .ఇతని ‘’క్షత్ర చూడామణి’’కావ్యం పదకొండు అధ్యాయాలు కలది .ఇది జీవన ధర రాజు చరిత్ర .ఇది తమిళం లోని’’ జీవక చింతామణి ‘’కి పూర్తీ సంస్క్రుతానువాదం అని పిస్తుంది .భోజ మహారాజు మరణ వార్త విన్న కాళిదాసమహా కవి విలపించినట్లే సత్యన్ధర రాజు దుస్టమంత్రి కాస్టాంగర మాయోపాయానికి బలై మరణించి నప్పుడు ప్రజలు కాళిదాసులాగా విలపించారని రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-8-15 –ఉయ్యూరు

