నేడు ‘ఆంధ్రకేసరి’ 143వ జయంతి
ఆంధ్రకేసరి.. ఈ పదం వింటే గుండె ధైర్యంతో బ్రిటిష్ పాలకులను ఎదిరించి నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు గుర్తుకొస్తాడు. ఒకప్పుడు మద్రాస్ హైకోర్టులో అతి ఖరీదైన లాయర్‌గా పేరుగాంచిన టంగుటూరి తన సంపాదనంతా ఉద్యమానికే ధార పోశారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి, ఆ తర్వాత ఆంధ్ర రాషా్ట్రనికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశం పంతులు కుటుంబీకులు మధ్యతరగతి జీవితాలను వెళ్లదీస్తున్నారు. ఒక సారి ఎమ్మెల్యే అయితే తరతరాలకు సరిపడెంత సంపాదించుకొనే ఈ రోజుల్లో.. టంగుటూరి మనమలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవటానికి నవ్య ప్రయత్నించింది. టంగుటూరి 143వ జయంతి సందర్భంగా వారిని పలకరించింది..
‘‘నేను పుట్టింది 1938లో.. మా తాతగారికి ఇద్దరు కుమారులు- నరసింహారావు, హనుమంతరావు. నేను నరసింహరావుగారి కుమార్తెను. మేం మద్రాసులో.. మా బాబాయి (హనుమంతరావు) ఒంగోలులో ఉండేవారు. తాతగారు ఎక్కువగా బాబాయి దగ్గరే ఉండేవారు. ఇక్కడో మాట చెప్పాలి. తాతగారు దేశం కోసం కుటుంబాన్ని వదిలేశారు. ఎప్పుడూ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నాయనమ్మ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదుట. అందువల్ల ఆమె కూడా పిల్లలను సరిగ్గా చూడలేదు. దీంతో.. నాన్న, బాబాయి చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా ఏమిలేకపోవటంతో ఎవరూ చేరదీసేవారు కారు. మా నాన్నకు పెళ్లికావటం కూడా చాలా కష్టమయిందిట. తాతగారు లాయర్‌గా చాలా సంపాదించారు. బంగ్లాలు, తోటలు, స్థలాలు.. ఇలా చాలా కొన్నారు. కానీ అవేమి నిలవలేదు. మా బాబాయే తాతగారికి కార్యదర్శిగా ఉండేవారు. ఆయనకు కూడా ఆర్థికపరమైన అంశాలలో సరైన శిక్షణ, అవగాహన లేవు. దీంతో చాలా ఇబ్బందులు పడేవారు. తాతగారు బాబాయి దగ్గరే ఉన్నా అప్పుడపుడు మద్రాసు వస్తూ ఉండేవారు. ఆయన వస్తే సందడే. అమ్మ రకరకాల పిండివంటలు చేసేది. ఆయన ఎప్పుడూ గోధుమన్నమే తినేవారు. వీటన్నింటినీ వెండి పళ్లెంలో పెట్టి వండించేవాళ్లం. ఆయన భోజనప్రియుడు. అడిగి మరి వేయించుకొని తినేవారు. ఆయన రోజుకు 50 బత్తాయిలు తినటం ఇప్పటికీ నాకు గుర్తుంది. అలాంటి వ్యక్తి.. చివరి దశలో భోజనం కూడా లేని పరిస్థితులకు చేరుకున్నారంటే బాధ కలుగుతుంది. 1955లో నా పెళ్లి అయింది. నా పెళ్లిని తాతే దగ్గరుండి జరిపించారు. తాతగారికి తగినంత గౌరవం దక్కలేదు. ఆ బాధ ఆయనకు కూడా ఉండేది. అయితే ఒక ఆనందకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటికీ మన దేశంలో అనేక మందికి ఆయన పేరు తెలుసు. మన రాష్ట్రంలో అయితే మనవలం అని చెబితే చాలు ఎంతో ఆదరిస్తారు. టంగుటూరి కుటుంబానికి ప్రభుత్వం పెద్దగా చేసిందేమి లేదు. తాతగారి అడుగుజాడల్లో ఐదుగురు నేతలు నడిచినా చాలు.. దేశం ఎంతో బాగుపడుతుంది. అయినా దేశం కోసం సర్వాన్ని త్యాగం చేసే వారు ఇప్పుడెవరున్నారు?
– శ్యామల
శ్యామల ప్రస్తుతం బెంగుళూరులో స్థిరపడ్డారు. ఆమె బెంగళూరులో ‘నృత్యప్రకాశ వర్షిణి’ పేరుతో భరతనాట్య పాఠశాలను స్థాపించి విద్యార్థులకు నృత్యం నేర్పిస్తున్నాను. ఆమె సేవలకు కర్నాటక ప్రభుత్వం ‘కళాశ్రీ’, ఏపీ ప్రభుత్వం ‘నర్తకి’ బిరుదులు ప్రదానం చేశాయి.
టంగుటూరి వారి వంశంలో జన్మించటమే మా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.ఎక్కడికెళ్లినా మమ్మల్ని అందరూ ఎంతో గౌరవిస్తుంటారు. ముత్తాతగారి జయంతిని ప్రభుత్వం జరపటం ఆనందంగా ఉంది. మే 20వ తేదీన వర్ధంతిని కూడా నిర్వహించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. దీనిపై కూడా పాలకులు ఆలోచిస్తే బావుంటుంది.
– సంతో్‌షకుమార్