లలిత కళలలో పరమోత్కృష్టమైన సంగీత సాహిత్యాలలో అత్యున్నత శ్రేణి ప్రతిభాపాటవాలు ‘నువ్వా? నేనా?’ అన్నట్లు సమస్థాయిలో పోటీపడుతూ ఉన్నవారు మిక్కిలి అరుదు. అరుదైన అటువంటి వారిలో తెలుగునాట బహు అరుదైన వ్యక్తి ‘సంగీత సాహిత్య కళానిధి’, ‘గానకళా ప్రపూర్ణ’, ‘హరి కథా చూడామణి’ ‘సంగీత కళాసాగర్’, ‘సంగీత సాహిత్య చతురానన’ ఇత్యాది బిరుదాంచితులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. ‘సంగీత సాహిత్యాలలో విడివిడిగా విశేష ప్రజ్ఞ కలిగి ఉండడం చూస్తాం. కానీ ఈ రెండిటా అసమాన ప్రజ్ఞ సమపాళ్లలో కలిగి ఉండడం ఆచార్యుల వారికే చెల్లింది’ అని సంగీత సాహిత్య సరస్వతీ స్వరూపులు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కృష్ణమాచార్యుల వారి గ్రంథ సమీక్ష సందర్భంగా కొనియాడారు.
కృష్ణమాచార్యుల స్వస్థలం జగ్గయ్యపేట. జనన సంవత్సరం 1923. జననీజనకులు శ్రీమతి వేంకట రమణమ్మ, శ్రీమాన్ జగన్నాథ తిరువేంకటాచార్యులు. తిరువేంకటాచార్యులు శతాధిక గ్రంథకర్త. సంస్కృతాంధ్ర ద్రావిడ భాషలలో అగ్రేసరులు. విశిష్టాద్వైతంలో అపారశక్తి సంపన్నులు. అటువంటి మహనీయులైన తండ్రిగారివద్ద సంస్కృతాంధ్ర ద్రవిడ కావ్య సేవనం చేసారు. కృష్ణమాచార్యులు. తర్క మీమాంసాది శాస్త్రాలు అధిగమించారు. బాల్యంలోనే తమ మేనమామ శ్రీమాన్ చిలకమర్రి కేశవాచార్యులు వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, అనంతరం ‘గాయక సార్వభౌమ’ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి సంగీత వృక్షంలో ఒక ప్రధాన శాఖగా ఎదిగారు. జగద్విఖ్యాతులు ద్వారం వేంకటస్వామినాయుడు వాయులీన వాద్యాన్ని ఆదర్శంగా భావించే కృష్ణమాచార్యులు గారి ఆసక్తిని గుర్తించి మేనమామ కేశవాచార్యులు ఆ కాలంలో అపురూపంగా జరిగే ఒకటి రెండు కచేరీలకు తీసుకెళ్లి ద్వారం వారి వాదనాన్ని వినిపింపచేసారు. పదిపన్నేండేళ్ల ప్రాయంలోనే నాటి సుప్రసిద్ధ హరికథకులు శ్రీమాన్ దీక్షితదాసు గారికి వాద్య సహకారం అందించే అవకాశం కలిగింది ఆచార్యులు గారికి. ప్రథమ ప్రయత్నానికే ముగ్ధులైన దీక్షితదాసుగారు అప్పటినుంచీ తమ కథలకు ఆచార్యుల వారి వాయులీన సహకారాన్నే స్వీకరించారు. లబ్ధప్రతిష్ఠులూ సంగీతకోవిదులూ జీఎన్‌బీ, మహారాజపురం సంతానం, బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి వంటివారి కచేరీలకు కృష్ణమాచార్యుల వారు వాద్య సహకారం అందించి ప్రశంసలందుకున్నారు. ఆయన ఆకాశవాణి టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్. ఒకే కుటుంబానికి చెందిన తన శిష్యపరంపర ఆరుగురితో (నల్లాన్ చక్రవర్తుల వారి వాయు లీన షట్కం) నరసరావుపేటలోనూ, విజయవాడలోనూ వాయులీన సంగీత సభలు చేసారు. ఇది చాలా విశేష ప్రయోగం.
సంగీతలోకంలో ప్రసిద్ధులకూ సాహిత్యపరిశోధకులకూ ఒక పరామర్శ గ్రంథాలయంగా ఉండేవారు ఆచార్యులుగారు. సంస్కృత ప్రసంగాలకై ఆకాశవాణికి వచ్చే పండితులను ఆచార్యులగారి వద్ద శుద్ధి చేసుకుని రమ్మని చెప్పేవారు. ప్రయోక్త ఉషశ్రీ గారు. ఆ విధంగా కొందరు ఆకాశవాణి నిలయంలోనే ఆ పని పూర్తిచేసుకోగా కొందరు పండితులూ కవులూ ఆచార్యుల గారి ఇంటికి వచ్చి పరిష్కారాలు చేసుకొంటూ ఉండేవారు. హరికథకులూ అంతే! పెద్దా చిన్నా అనే తారతమ్యం చూపక ప్రోత్సహించే సుగుణం-స్వయంగా ఉన్నది- రామకృష్ణయ్య పంతులు గారి శిక్షణాశాలలో మరింత వృద్ధి అయింది. ఆచార్యులవారి రూపం చూడగానే సంప్రదాయం విలసిల్లుతూ దివ్యంగా తోచేది.
ఒక విషయాన్ని నిక్కచ్చిగా హేతుబద్ధంగా తార్కికంగా చెప్పడంలో వారు అందెవేసిన చెయ్యి. చాలా మంది పెద్దలు ఆచార్యుల గారి వద్ద గోష్ఠులలో ఆచార్యుల గారు తెలిపిన మర్మాలు అంతకుముందు తమకు ఎవ్వరూ చెప్పలేదని అబ్బురంగా చెప్పడం జరుగుతూండేది. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారు కొన్నిరోజులపాటు ఆచార్యుల వారి ఇంటికి అతిథిగా వస్తూ ‘విప్రనారాయణ’ నృత్యనాటకాన్ని రాయించుకున్నారు. ఈ విప్రనారాయణ వేదాంతం వారి ద్వారా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది.
కర్ణాటక సంగీతంలో సంగీత సాహిత్య పరంగా వస్తున్న కొన్ని అపమార్గాలనూ అపపాఠాలనూ సవరిస్తూ సాగిన ఆచార్యుల వారి వ్యాసపరంపర అధ్యాపకులకూ అభ్యాసకులకూ కరదీపికలు. ఆరుద్ర గారితో సంగీత కచేరీ బాణీ గురిం, త్రిపురనేని వేంకటేశ్వరరావు గారితో సాగిన రామాయణ సంబంధ విషయ ప్రతివాదాలూ సిద్ధాంతావిష్కరణలు. ‘కొంచెం వైష్ణవం పాలు తగ్గిస్తే ఆచార్యుల వారి మనుచరిత్ర విశ్లేషణ వ్యాసాన్ని నాగార్జున యూనివర్శిటీలో పరామర్శ వ్యాసంగా ఉంచుతామని’ అప్పటి తెలుగుశాఖాధిపతి ఒక పెద్ద మనిషితో వర్తమానం వంటిది పంపగా ‘అందులో ఉన్నదే వైష్ణవం. యూనిర్శిటీ గురించి కావ్య విషయాలను మార్చలేను’ అని నిర్ద్వ్దంద్వంగా త్రోసిపుచ్చిన సంప్రదాయాభిజ్ఞులు ఆచార్యులుగారు.
‘శ్రీ గోదా గ్రంథమాల’ ఆచార్యుల వారింట పురుడుపోసుకుంది. వ్యవస్థాపకులైన శ్రీమాన్ కేటీఎల్ నరసింహాచార్యులు గారి గ్రంథమాల’ కావ్య ప్రచురణ అంతా ఆచార్యుల వారి ఇల్లు కేంద్రంగా సాగింది. ఆ గ్రంథమాల సాహిత్య సేవ అమూల్యం. గుంటూరు ధనకుధరం వారు స్థాపించిన ‘శ్రీరామానుజ కీర్తి కౌముది’ విశిష్టాద్వైత గ్రంథపరంపరతో సంపాదకవర్గంలోనూ రచనల పరంగానూ ఆచార్యుల వారి పాత్ర గణనీయమైనది. పెద్ద ముక్తేవి ఆస్థాన విద్వాంసులుగా సుప్రభాతం రచించి, ప్రసిద్ధ గాయకులతో పాడించి, దేవస్థానానికి సమర్పించారు. ‘ముకుందమాల’ శ్లోకాలను భక్తిగీతాలుగా మలచి స్వరపరచి ఆకాశవాణిద్వారా ప్రసారంచేసారు. హరికథలు స్వయంగా రచించుకుని గానంచేసేవారు. వారి హరికథలో నవ్యత్వం ఉండేది.
కృష్ణమాచార్యులు గారు కొందరు వరిష్ఠ విద్వాంసుల కోరికపై కృతులు రచించారు. సంగీతకృతులు 20 వరకూ ఉన్నాయి. వీరి కీర్తనలను వాయులీన దిగ్గజం లాల్గుడి వారు పాఠంచేసి దక్షిణాదిన పరివ్యాప్తం చేసారు. అందుకే వీరిని మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ‘ఉత్తమ వాగ్గేయకార’ పురస్కారంతో సత్కరించింది. తెలుగునాట మరి ఎవరికీ ఈ గర్తింపు లేదు. ఉజ్జయనిలో సంస్కృతంలో హరికథాగానమూ సత్కార స్వీకారమూ విజయవాడ నగరంలో వాగ్గేయకారుల రచనల గురించి పరంపరగా సాగిన సంస్కృత ప్రసంగాలూ ప్రశస్థం. ఆచార్యులవారి ‘త్యాగరాజ గేయార్థకుంచిక’ అన్యన్యసామాన్య రచన. ‘అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’ అన్నట్లుగా మొక్కవోని వ్యక్తిత్వంతో కృష్ణమాచార్యుల వారు 2006 ఆగస్టు 24న తమ 84 వ ఏట పరమపదానికి చేరుకున్నారు.
-ఎన్.సిహెచ్.చక్రవర్తి
(రేపు కృష్ణమాచార్యుల వర్ధంతి)