గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4

311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 )

విష్ణు కుండిన రాజ వంశీకులు క్రీ.శ.358 నుండి 624 వరకు ఆంద్ర దేశాన్ని పాలించారు .అమరావతి బెజవాడలు వీరి రాజధానులు .ఈ వంశం లో నాలుగవ మాధవ వర్మ మహారాజు క్రీ.శ. 580-620 వరకు పాలించాడు .కవిజనులకు ఆశ్రయమైన వాడుకనుక ‘’జనాశ్రయుడు ‘’అనే బిరుదు పొందాడు . మూడువందల ఏళ్ళ తర్వాత పాలించిన ,కవిజనాశ్రయం అనే లక్షణ గ్రంథాన్ని రాసిన మల్లియ రేచనకు కూడా  ‘’కవి జనాశ్రయుడు ‘’అనే బిరుదు ఉన్నది .ఇతడు మయూర ధ్వజుడు .హిందూ మతాన్ని వదలి బౌద్ధాన్ని స్వీకరించాడు .మాధవవర్మ మహారాజు ‘’జానాశ్రయీ ‘’అనే ఛందో గ్రంథం రచించాడు .రాజు బిరుదు పేరనే ఈ గ్రంధం ప్రాచుర్యం పొందింది .అంతే కాదు తెలంగాణలో సంస్కృతం లో వచ్చిన మొట్ట మొదటి ఛందో గ్రంథం గా గుర్తింపు పొందింది .

  మాధవవర్మ సమకాలీన బౌద్ధ  కవి గుణస్వామి దీనికి ‘’ఛందో విచితిః’’అనే  వ్యాఖ్యానం రాస్తూ ‘’అధాతః ఛందో వృత్త జాతీనాం తత్వ జిజ్ఞాసవే పౌరాణికేషు పై౦గలాదిచందోవిచితిషు  యధా సంభవం న్యూనాతిరేకం పరీక్ష్య పరి హృత్య తద్దోష పరి హృతామి మా ప్రపంచామ నాకులం జనాశ్రయీం ఛందో విచితం గుణ స్వామి రచిత వ్యాఖ్యానం వ్యాఖ్యాసామః ‘’అని చెప్పాడు . మూలం లోని వివిధ లక్షణ సూత్రాలకు రాసిన వ్యాఖ్యలలో రఘు వంశ, కుమార సంభవ ,జానకీ హరణ ,సౌ౦దరనంద , నాట్య శాస్త్ర ,మేఘదూత  ఉభాయాభిసారికా  బుద్ధచరిత,శాకుంతలం ల నుండి ,పాండ్యునిశ్లోకాలను లక్ష్యాలుగా ఉదాహరించాడు .ఇందులో బౌద్ధ గ్రంధాలే ఎక్కువ అన్న సంగతి మనకు తెలుసు .

  జానాశ్రయీ గ్రంధం లో 6 అధ్యాయాలు –పారి భాషిక ,విషమ వృత్త ,అర్ధ సమవృత్త ,సమవృత్త ,జాత్య ,ప్రిక్రియాధ్యాలున్నాయి   మొదటి దానిలో 46, రెండు లో 27  ,మూడులో 15 ,నాలుగులో 118,అయిదులో 66 ,చివరి దానిలో 28 సూత్రాలు –మొత్తం 300 సూత్రాలున్నాయి .మొదటి అధ్యాయం లో గణ సంఖ్యలు చెప్పాడు వీటిలో రెండక్షర గణాలనుంచి ఆరు అక్షర గణాలవరకు సూచించాడు .పింగళ చందం కంటే దీనిలో లక్షణం క్లుప్తంగా లక్షణంగా ఉందని విమర్శకులు మెచ్చారు .మొత్తం 18 రకాల గణాలు చెప్పాడు .పింగలం లోనివి కూడా కొన్ని ఇందులో ఉన్నాయి .నందినీ, రత్న మంజూష  వృత్త పాదాల విషయం లో ఇద్దరికీ భేదం కనిపిస్తుంది .

  విషమ వృత్తాధ్యాయం లో సమాన ,ప్రమాణ ,కీర్తి వితాన ,ఉద్గాతా ,సౌరభక అల్లలిత ,ఉపస్థిత ,ప్రచుపిత ,వర్ధమాన  శుద్ధ విరాద్రుషభ,మంజరీ ,లవలీ ,అమృత ధారా ,ప్రత్యాపీడ,పద్యా విపరీతి పద్యా చపల ,విపుల మొదలైన విషమ వృత్త వివరణ ఉంది .అర్ధ సమ వృత్తాధ్యాయంలో ఉపచిత్రకం ,ద్రుత మధ్యా ,భద్ర విరాట్ ,కేతుమతీ ,ఆఖ్యానికా ,విపరీతాఖ్యానికా హరిణ ,ప్లుతా ,అపర వక్త్రా ,పుష్పితాగ్రా ,యవవతీ ,దేవ గీతికా ,శిఖా మొదలైన అర్ధ సమ వృత్త లక్షణ లక్ష్యాలు చెప్పబడినాయి .నాలుగవది అయిన సమా వృత్తాధ్యాయం లో ఉక్తమొదలు ఉధృతి వరకు గల 26 ఛందాలలో కొన్ని పద్యాలకు లక్షణాలు చెప్పాడు .ఇవికాక దండకాలలో  భేదాలూ తెలియ జేశాడు మేఘ ,పిపీలికా ,ప్రణవ ,కరభ  లలిత అనే అయిదు దండక లక్షణాలను  జలద ,చందా వృష్టి ,ప్రయాత దండక భేదాల లక్షణాలు వివరించాడు  .పింగాళ వృత్తాలకు దీనికీ కొంత తేడా కనిపిస్తుంది .

 జాత్యాధ్యాం లో జాతి ఉపజాతి పద్య లక్షణాలు చెప్పాడు .ఇవి తెలుగు జాతి ఉపజాతులకు దగ్గరలో ఉన్నాయి .గద్య ,పద్యాల గణ యతి ప్రాస నియమాలు  తెలిపాడు ‘’శీర్షిక ‘’అనే పద్యం ఏడు రకాలనీ ,చివరలో ‘’గతం ‘’పద్యం ఉండాలని నిబంధన చెప్పాడు ఇది తెలుగు సీసపద్యానికి దగ్గర .కనుక విష్ణు కుండినుల కాలం లోనే తెలంగాణా లో తెలుగు పద్య రచన ఉన్నట్లు అర్ధమవుతోంది .చివరిదైన ప్రక్రియాధ్యాయం లో ప్రస్తారం ,నష్ట లబ్ది ,ఉద్దిస్టం ,సంఖ్యా లగ క్రియ ,అద్వం ల వివరణ ఉన్నది .

  ఇంతటి ప్రసిద్ధ తొలిసంస్కృత ఛందో గ్రంధం తెలంగాణలో  వెలువడినందుకు మనకు గర్వం గా ఉన్నా కవుల సాహిత్య చరిత్రలో ‘’జనాశ్రయీ ‘’ గురించి కాని గ్రంథ కర్త జానాశ్రయ బిరుదాంకిత నాలుగవ మాధవవర్మ మహా రాజు గురించి కాని విషయాలు విశేషం గా లేవు . అంతేకాదు దీని  వ్యాఖ్యానం ‘’జానాశ్రాయీ ఛందో విచితిహ్ ‘’ గురించీ ,రాసిన గుణస్వామి గూర్చికాని వివరాలు లభించకపోవటం దురదృష్టం .బహుశా బౌద్ద  కవులు  కర్తలు అవటం వలన మనవాళ్ళు పక్కకి నేట్టేశారేమో !

  ఆధారం –2018 మార్చి ‘’మూసీ ‘’మాసపత్రికలో శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు రచించిన ‘’తెలంగాణా నుండి సంస్కృతం లో వెలువడిన ప్రప్రధమ ఛందో గ్రంథం-‘’జానాశ్రాయీ ‘’

సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-18-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.