ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-5(చివరిభాగం )
ఇంతకీ గాంధీగారి మత౦ ఏమిటి ?మానవ సహజ మూల కార్యక్రమాలలో మతం విడదీయ రానిది .దీనితో ఇతర మానక సంబంధ కార్యాలు మూల స్థానంగా ముడివడి ఉంటాయి .నైతికత ,కళ,సైన్స్ ,సాంకేతికత మొదలైన వాటితో మనిషి ప్రకృతిని నియంత్రణలోకి తెచ్చుకున్నాడు .మానవ జీవితాలలో ప్రకృతి మూలాధార భూతం .మతాన్ని నిర్వచించటం కష్టం .అది పూర్తిగా నమ్మకానికి, సాధనకు సంబంధించిన విషయం .కనుక మతం లో నమ్మకాలు సాధానాలు కలిసి ఉంటాయి .వీటిద్వారా మానవుని ఉనికికి సార్ధకత ,తుది గమ్యమేమిటో తెలుసుకోమని చెబుతుంది మతం .ఇలా వ్యక్తిగతంగానేకాక సామూహిక౦ గా ఆలోచించి అభ్యాసం చేయటం మతం నేర్పుతుంది .’’పరమం’’ తో అనుసంధానం చేయిస్తుంది .సత్యం ,సుందరం ,మంచితనం అనేవే పరమమైన విషయాలు .బాపుకు ఆయన కుటుంబ సంప్రదాయాలనుంచి మతం పై గాఢ విశ్వాసం సంక్రమించింది .మతం ,నైతికతలపై ఆయన విస్తృతంగా మాట్లాడాడు, రాశాడు .రాజకీయ వేషం లో ఉన్నా, మతం అనేది గాంధీకి జీవిత విధానం లో అంతర్భాగమైంది .
సంఘర్షణ ,వివాదాలలో గాంధీ పరిష్కారాలేమిటి ?అనేది అందరూ అడిగే సూటి ప్రశ్న .సకల మానవ సంక్షేమం ,దాని సాధనలో పండి పోయిన అత్యంత ప్రపంచంప్రసిద్ధ అతి కొద్ది ముఖ్య నాయకులలో మహాత్ముడు ఒకడు . వీరితో పాటు గాంధీజీ ఒక ఉన్నత పౌరసమాజ నిర్మాణ ధ్యేయం ఆయన గొప్పకల.అదే ఆయన ప్రవచించిన ‘’రామరాజ్యం ‘’రామరాజ్యం సాధిస్తే అందులో అతి నిమ్న జాతివారు ,అత్యంత బలహీనులు ప్రాధమిక హక్కులు పొంది ,గౌరవంగా సుఖంగా జీవిస్తారని విశ్వసించాడు .దీన్ని సాధించటానికి అనుసరించాల్సిన విధానాలు ,మార్గాలలో గాంధీకి ,మిగిలిన ప్రపంచనాయకులకు భేదాభిప్రాయం ఉన్నది. .మహాత్ముని దృష్టి లో సాధనామార్గాలు ,గమ్యం రెండూ చాలాముఖ్యమైనవే .అనైతిక మార్గాలు మంచి ఫలితాలనెప్పుడూ సాధించలేదు .అందరూ చెప్పే ‘’గమ్యమే సాధనానికి తీర్పరి ‘’(ఎండ్ జస్టి ఫైస్ మీన్స్ ) అనే మాట ఆయన అంగీకరించలేదు .గమ్యంచేరటానికి సత్యం ,నిజాయితీ ,నైతికతతో కూడిన ముఖ్య సాధనాన్ని ఎంచుకోవాలి .అడ్డ దారి చేటు .సత్యం ద్వారా శాంతి స్థాపించాలి .హింస మరింత హింసకు మూలమౌతుంది .కూకటి వ్రేళ్ళతో భారత దేశం లో పాతుకుపోయిన తెల్ల దొరల పాలన నుండి దేశమాత విముక్తి చెంది స్వేచ్చా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్యం పొందటానికి , కష్టతరమైన నైతిక మార్గాన్నే ఎంచుకున్నాడు .అగౌరవ, అనైతిక మార్గాలు చేటు కలిగిస్తాయన్న పరి పూర్ణ విశ్వాసం ఆ అహింసా మూర్తిది .దౌర్జన్య౦ , హింసావాదుల పద్ధతిని వదలి ,శాంత్యహి౦సలతో ‘’నిష్క్రియాత్మక నిరోధత ‘’అంటే పాసివ్ రెసిస్టన్స్ అనగా సత్యాగ్రహ మార్గాన్నే ఉత్తమ సాధనంగా ఎంచుకున్నాడు .దీనితోనే తెల్లదొరలను దేశం వెలుపలకు తరిమి కొట్టగలిగాడు శాంతితోనే జగజ్జెట్టి అని పించుకున్నాడు .సత్యాగ్రహం లో పాల్గొన్నవారందరూ లాభపడ్డారు .క్లిష్ట పరిస్థితి లో కూడా సత్యాగ్రహి నిగ్రహాన్ని గౌరవాన్ని కోల్పోలేదు .మహాత్ముని సత్యాగ్రహ విధానం యుద్ధానికి ప్రత్యామ్నాయం .ఆయన చెప్పిన సహాయ నిరాకరణ సంఘర్షణ కు సరైన శాంతియుత పరిష్కారం .హింసతో ప్రజ్వరిల్లుతున్నప్రపంచం లో ప్రజలు శాంతి ,ప్రశా౦తులతో జీవిస్తూ ,పరస్పర సహకారం సామరస్యం తో ఎలా జీవించాలో ,కలిసిపని చేయాలో బోదించాడు .ఆచరించి ప్రజలు ఆయననమ్మకాన్ని నిలబెట్టారు .’’యధాగా౦ధీ తధా ప్రజా ‘’అని పించుకున్నారు . అత్యవసరంగా ఫలితాలు , తాత్కాలిక ప్రయోజనాలు రావాలని ఆయన ఆశించలేదు .మానవాళి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కృషి చేశాడు .నిత్యకలహాలు ,ద్వేషాలతో సంక్లిష్టంగా పెచ్చుపెరిగిన ప్రపంచాన్ని మానవాళి ఎలా ఎదుర్కోవాలో ఆయన ప్రవచించాడు .దీనికి కూడా ఆయనది ఆహి౦సా వాదమే ,సత్యాగ్రహమే సాధనాలు గా చెప్పాడు .కనుక ప్రపంచ వ్యాప్తంగా ఏ సమస్యకైనా పరిష్కారం అహింసాయుత ఆందోళన సత్యాగ్రహాలే అని తిరుగు లేని తీర్పు చెప్పాడు .నెల్సన్ మండేలా ,మార్టిన్ లూధర్ కింగ్ ,ఆన్సాంగ్ సూయీ లకు ప్రేరణగా నిలిచి వారి దేశాలలో హక్కుల సాధనకు ,స్వేచ్చకు పరోక్షంగా దోహద పడ్డాడు .
మానవ సంరక్షణ లో మాహాత్ముని దృష్టి కోణం విశిష్టమైంది .నాగరకత అంటే నిజంగా అన్నీ అనేక రకాల పెరగటం మాత్రమే కాదు .జాగ్రత్తగా ఉద్దేశ్యపూర్వకంగా స్వచ్చందంగా కోరికలు తగ్గించుకోవటం .దాని వలననే అసలైన సంతోషం మనశ్శాంతి, సంతృప్తి లభి౦చి సేవా ధర్మ౦లోశక్తి సామర్ధ్యాలు కలుగుతాయి .మానవ సంరక్షణ ఒక వినూత్న కీలక భావం (కాన్సెప్ట్ ).ఇప్పుడు అది విశ్వ వ్యాప్తంగా వ్యక్తికి ఉన్న సంక్లిష్ట, పరస్పర సంబంధమున్న భయం ఆందోళనలను వివరి౦చటానికి తోడ్పడుతుంది .మానవ సంరక్షణ సిద్ధాంత కర్తలు సంప్రదాయంగా ఉన్న రక్షణ అనే భావాన్ని సవాలు చేస్తున్నారు .వీరి దృక్పధం లో సరైన సంరక్షణ రాజ్యానికి కాకుండా వ్యక్తిగతమైంది గా తప్పక కావాలి .దేశ సంరక్షణ అంటే ప్రజా సంరక్షణమే ..గత వందేళ్ళలో ఆయా దేశ ప్రభుత్వాలు వారి ప్రజలను విదేశీ సైన్యం కంటే అతిపెద్ద సంఖ్య లో హతమార్చాయి .1994 నాటి యు. యెన్ .డి .పి . అంటే అంతర్జాతీయ అభివృద్ధి ప్రోగ్రాం రిపోర్ట్ మానవ రక్షణకు గొప్ప మైలురాయిగా నిలిచింది .అందులో ‘’కోరిక నుండి ,భయం నుండి ప్రజలందరకు స్వేచ్చకల్పించటమే ప్రపంచ మానవ సంరక్షణ సమస్యకు మేలైన మార్గం’’ అని ధృవీకరించింది .
21 వ శతాబ్దిలో గాంధీయిజం ఔచిత్యం గురించి కూడా విశ్లేషకులు పలుకోణాలలో అధ్యయనం చేశారు .గాంధి మరణించి ఉండవచ్చు .గా౦ధీయిజానికి మరణం లేదు అది అమర౦, శాశ్వతం అన్నారు .గాంధీయిజం మనదేశం లో మాత్రమేకాదు ప్రపంచంలో జీవించే ఉంది ..గాంధీజీ ప్రవచించిన అహింస ,సత్యాగ్రహం ,అంతిమ సంబంధం (ఎండ్ మీన్ రిలేషన్ షిప్ ),సర్వోదయం ,విద్య ,సాంఘిక సంస్కరణలు ,జాతీయత ,,అంతర్జాతీయత మొదలైనవన్నీ నేటి అధునాతన ప్రపంచం సమాజం లోనూ గొప్ప ఔచిత్యవంతంగానే ఉండటం ఆమహాత్మునికి ,ఆమహర్షికి దక్కిన అరుదైన గౌరవం ..మహాత్ముడు ఎన్నడూ తన సిద్ధాంతాలను ఇజం పేరిట చెప్పనే లేదు. వాటిని జీవన మార్గాలుగా అనుస్టించాడు .గా౦ధీ ఇజమ్ఆధునిక యుగం లో చాలాగొప్ప భావజాలం(ఐడియాలజీ ). గా౦ధీ ఇజమ్ మన ఆధునిక రాజకీయ ,సాంఘిక సమస్యలపరిష్కారాలకు సంప్రదాయ సూత్ర ,సంస్కృతీ సాంఘికబద్ధ జీవిత సూత్రాలనాధారంగా మార్గ దర్శకం చేస్తుంది .అది ఆధ్యాత్మిక నైతిక మూలాలపై వర్ధిల్లింది . ఈ నాటి ప్రతి దిన సమస్యలన్నిటికీ గాంధీయిజం సరైన పరిష్కారం సమాధానం చెప్పగలదు.అసమానత , అస్పృశ్యత, సంకుచిత జాతీయత ,ఆవేశ కావేషాలకు చక్కని పరిష్కారాలు సూచించి మార్గ దర్శకం చేస్తుంది. అందులో ఆధునిక పౌర సమాజ భావన పొందు పరచబడింది .గాంధీ ఇజం సాంఘిక సంక్షేమ తత్వాన్నివిస్పష్టంగా, బే షరతుగా సమర్ధిస్తుంది .కనుక గాంధీ ఇజమ్ సార్వకాలికం సార్వ జనీనం అని అర్ధమయి౦ది కదా..
‘’అహింసాయుత ప్రతిఘటన సామ్రాట్ ‘’గా మహాత్మా గాంధీ సుప్రసిద్ధుడు .ఆధునికకాలం లోఅహి౦సా మూర్తులుగా ప్రపంచ గుర్తింపు పొందిన ఇద్దరిలో మహాత్మా గాంధీ మార్టిన్ లూధర్ కింగ్ మాత్రమే నిలిచారు .వీరిద్దరూ అన్యాయం ,జాతి వివక్షత ,పేదలపై దౌర్జన్యాలు అల్పసంఖ్యాక వర్గాల సాంఘిక బహిష్కరణ లను రూపు మాపటానికి అహింస ఆయుధంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించారు.నిజానికి గాంధీజీ దేశ స్వేచ్చ స్వాతంత్ర్యాలకోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టటానికి అహింసా యుతంగా ఉద్యమించాడు .అమెరికా పౌరహక్కుల నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతివారి హక్కులకోసం ,న్యాయ సంస్కరణలకోసం గాంధీయిజం ఆధారంగా అహింసా పద్ధతిలో నిరసన ,భారీ ప్రజా సమీకరణ తో ఉద్యమాలు చేసి విజయం సాధించాడు . సాంఘిక మార్పులు రావాలంటే అహింసా మార్గమే సరైనదని ఈ ఇద్దరు నాయకులు విశ్వసించి అమలు చేశారు .మనసు చిత్తశుద్ధి ఉంటే ,ఎవరైనా ఈమార్గాన అనుకొన్నది సాధించవచ్చునని రుజువు చేశారు .వీరిద్దరికీ ఆహి౦స ఒక సాధనమార్గం .దీనివల్లనే బాంధవ్యాలు బలపడి ,శాంతియుతంగా అధికార మార్పిడి ని ఈ ఇద్దరు మహానాయకులు సాధించారు . అహింస విశ్వజనీనమైన, స్థిరమైన, నమ్మకమైన,గొప్ప సిద్ధాంతం అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు . కనుక గా౦ధీయిజానికి ఎన్నటికీ మరణం లేదు . గాంధీ ,గాంధీ ఇజం చిరంజీవులే .
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా రాసిన ఈ చిరు ధారావాహిక సమాప్తం
ఈ చిరు ధారావాహిక కు నేపధ్యం ,ప్రేరణ ,ఆధారం –
8-8-18 శనివారం మేము ఖమ్మం వెడుతూ దారిలో విజయవాడలో డా జి.వి పూర్ణచంద్ గారిని వారింట్లో పరామర్శించినప్పుడు,మాటల సందర్భం లో ఆయన ‘’మాస్టారూ! గాంధీజీ 150 వ జయంతిసందర్భంగా మీరేదైనారాస్తే బాగుంటుంది ‘’అన్నారు ..’’ఏం రాయమంటారు “’అని అడిగాను .’’గాంధీ-21 వ శతాబ్ది ‘’పై రాయండి యాప్ట్ గా, రిలవెంట్ గా ఉంటుంది ‘’అన్నారు .’’సరే ‘’అన్నాను .రాత్రి ఇంటికి చేరి శ్రీమైనేని గోపాల కృష్ణగారికి ఈ విషయం మెయిల్ రాసి, దానికి సంబంధి౦చిన పుస్తకం ఉందేమో చూడమనికోరాను .ఆయనలో ‘’హనుమంతుని అంశ ఎక్కువేమో! చూచిరమ్మంటే కాల్చి వచ్చేరకం .ఆ రాత్రికే అమెజాన్ లో పుస్తక౦ ఆర్డర్ చేయటం, వాళ్ళు అక్టోబర్ 3 కు పుస్తకం చేరుతుందని తెలియ జేయటం జరిగిపోయాయి నిమిషాలమీద .ఇలా ఈ సారే కాదు ఎన్నో సార్లు అంటే’’ ఎన్త్ టైం ‘’అన్నమాట . Relevance of Gandhi in 21 st Century ‘’అనే పుస్తకం ,’’Gandhian Ideas On Edcation అనే రెండు పుస్తకాలు 21 సెప్టెంబర్ కు నాకు చేరాయి .మొదటిదాన్ని ఆ రోజే చదవటం మొదలుపెట్టి ఇంట్ర డక్షన్ చాప్టర్ ముందు చదివాను .ఇందులోనే గాంధియన్ ఫిలాసఫీ అంతా విస్పష్టంగా ఉంది .వెంటనే రాయాలనిపించి ఒక పేరా రాశాక నాకే నచ్చక తీసేశాను .ఈ లోగా గాంధీపై రేడియో టాక్ రావటం ,దానిపై రెండు రోజులు కూర్చోవటం, తర్వాత ఆహితాగ్నులు, రావూరు, ధనికొండ లపై రాయటం మైనేనిగారు పంపిన గాంధీపై వ్యాసాన్ని రాయటం తో సరిపోయిది .అయ్యో గాంధీ జయంతి దగ్గర పడుతోందే ఆయనపై రాయక పొతే బాగుండదు అనిపించి శీర్షిక కోసం బుర్ర బద్దలు కొట్టుకొని చివరికి’’ పై శీర్షిక’’ ఖాయం చేసి సెప్టెంబర్ 29 న రాయటం మొదలు పెట్టి ,మూడు రోజులలో ఈ రోజు అక్టోబర్ 1 తో 5 ఎపిసోడ్ లు రాసిపూర్తి చేసి , ఊపిరి పీల్చుకున్నాను .రేపు గాంధీ జయంతి సందర్భంగా నూలువడికి ఆయనకో నూలు పోగు వేయలేకపోయినా ,శ్రీ ఆశుతోష్ పాండే సంకలించిన పై పుస్తకం లోని విషయాలను పేని ఒక సాహితీ పోగు తయారు చేసి మహాత్మునికి నివాళిగా సమర్పించి కృతార్దుడనయ్యాను .నేను అడగకపోయినా మూడవ పుస్తకం గా ‘’Rethinking Mahatma Gadhi –Relevance of Gandhian Thought and Leadership in 21 st Century ‘’మైనేనిగారు పంపినది ఈరోజే నాకరకమలాలను అలంకరించింది .శ్రీ గోపాలకృష్ణగారు ఇప్పటికే నన్ను చాలా రుణ గ్రస్తుడిని చేశారు .వీటితో మరింత రుణాన్ని పెంచారు .
నన్ను రాయమని ప్రేరేపించిన శ్రీ పూర్ణ చ౦ద్ గారికి ,,నాచేతికి మట్టి అంటకుండా పుస్తకం కొని పంపిన శ్రీ గోపాలకృష్ణ గారి సౌజన్యానికి ధన్యవాదాలు .ఈ రచనకు ఆధారం ‘’ గాంధీ సిద్ధాంతాలపై నిష్ణాతులైన పలువురు రచయితలతో విషయానికి సంబంధిన నిర్దుష్టమైన వ్యాసాలు రాయించి,సంపాదకత్వం వహించి సంకలనం చేసి శ్రీ ఆశుతోష్ పాండే ప్రచురించిన ‘’ Relevance of Gandhi in 21 st Century ‘’పుస్తకం అని మరొకమారు తెలియ జేస్తున్నాను .
2-10-18 మంగళవారం గాంధీ జయంతి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ .1-10-18 –ఉయ్యూరు … . . . .

