సగటు తెలివి తేటలగాంధీ మహాత్ముడయ్యాడు
మెట్రిక్ పరీక్షలో గాంధీ గారి మార్కు లెన్నో తెలిస్తే నోరెళ్ళ బెడతాం .అయ్యగారికి వచ్చిన మార్కులు 625 కు 247 1/4 .మాత్రమే .అంటే 39.6 శాతమే .అంటే గురూగారు అత్తెసరు మార్కులతోనే 18 87 బాంబే యూని వర్సిటీ పరీక్ష పాసయ్యాడు .ఆయన ఉత్తీర్నత భావనగర్ లోని శ్యామలదాస్ కాలేజి దృష్టిలో’’ తప్పినట్లే ‘’లెక్క .లా చదవటానికి లండన్ వెళ్ళటానికి ఆర్ధిక సాయం కోసం పోర్ బందర్ లోని బ్రిటిష్ అడ్మినిస్ట్రే టర్ మిస్టర్ ఫ్రెడరిక్ లేలీ తో పర్సనల్ ఇంటర్వ్యుకు వెళ్ళాడు .ఆయన అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి సంతృప్తి పరచలేక తెల్లమొహం వేశాడు .కనుక ప్రభుత్వ సాయం హుళక్కి అయింది .అయితే అన్నగారు లక్ష్మీదాస్ చాలా ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి స్వాములోరిని లండన్ వోడ ఎక్కించి పంపాడు .బాకీ తీర్చటానికి ఆయన నడ్డి విరిగిందనుకోండి .లండన్ మెట్రిక్ పరీక్ష రెండో ప్రయత్నం లో మాత్రమే పాసయ్యాడు .తన స్వీయ చరిత్రలో తాను లండన్ లింకన్స్ ఇన్ లో రెగ్యులేషన్ డిన్నర్ లకు వెళ్లేవాడినని ,చాలా కస్టపడి ఇంగ్లాండ్ కామన్ లామొదలైన నిర్ణయించిన గ్రంధాలను చదివి ,లాపరీక్ష రాసి 18 91 జూన్ 10 న బార్ కు ఆహ్వాని౦పబడ్డానని రాసుకున్నాడు .ఏదో పరీక్ష మిణికి లాయర్ అయ్యాడు అంటే వకీలు వృత్తిలో రాబడి లాకేత్వం దాకు కొమ్ము అయి నిరాశ పరచింది .ఇది కలిసొచ్చేదికాదని వదిలేసి, అసలైన లక్ష్యం భారత దేశ స్వాతంత్ర్యం గా ముందుకు కదిలాడు .కనుక విద్య ,వృత్తిలలో ఆయనవి సగటు తెలివి తేటలే .ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొన్నాడు .’’నేను సగటు తెలివి తేటలమనిషిని సగటు శక్తి సామర్ధ్యాలున్న వాడిని .మేధావిని అసలేకాను .బుద్ధి పెరగటానికి ఒక హద్దు ఉంటుంది .కాని మనసు పెరగటానికి హద్దు ఉండదుకదా ‘’ ‘’అన్నాడు .దక్షిణాఫ్రికా జైలు లో ఇండియా జైళ్ల లో ఆయన పుస్తకాలను విపరీతంగా అధ్యయనం చేసి జైలు జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు. ఆయన చదివిన వాటిలో భారతీయ మత ఇతిహాసాలేకాక భగవద్గీత, ఉపనిషత్ లు ,మహాభారతం బైబిల్ కొరాన్ ,లను కూడా చదివాడు .ప్లేటో ,కార్లైల్ ,రస్కిన్,విలియం జేమ్స్ ,గిబ్బన్ ,ఆడం స్మిత్ ,గోథే బకిల్ ,లెక్కి ,జేడ్దేస్ ,షా ,వెల్స్ కిప్లింగ్ ,మార్క్స్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ రచయితల గ్రంథాలన్నీ అవలోడనం చేసుకొని అర్ధం చేసుకున్నాడు .ఆయనపై గొప్ప ప్రభావం చూపినవారిలో హెన్రి డేవిడ్ థోరో, రస్కిన్, టాల్ స్టాయ్ లు . ‘’బహుళ ప్రజల బహుళ సంతోషం ‘’ఆయన కోరుకున్నాడు . అదేసర్వోదయం. ఆయన ‘’సర్వోదయం ‘’కు పూర్తిగా అంకితమై పని చేశాడు .ఆయనది అసలు సిసలైన స్వంత మనసు .కాని ఆయన రాయని విషయం, వదిలిపెట్టిన సాంఘిక సమస్య లేనే లేవు .అంత విస్తృతంగా రచనలు చేశాడు.గాంధీ రచనాసర్వస్వం 90 సంపుటాలలో ఉంది అంటే ఆయన రచనా సామర్ధ్యమేమిటో అర్ధమవుతుంది .ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిభాషల్లోకి అనువాదం చెంది ప్రపంచప్రజలనాకర్షించాయి .మోస్ట్ పాప్యులర్ రైటర్ అయ్యాడు గాంధీజీ .
‘’నేను విద్యా సంబంధ రచనలపై పైకి రాలేదు .క్రియా శీలత నా క్షేత్రం ‘’అన్నాడు మహాత్ముడు .మరోమహాత్ముడు బాపూ రావు ఫూలే కూడా ఇదే మాట చెప్పాడని మనకు తెలుసు .ఆయనది విస్తృతమైన కర్మ క్షేత్రం .అందుకే ప్రపంచ ప్రజల నీరాజనాల౦దుకొన్నాడు బాపు .అమెరికా రాయబారి చెస్టర్ బౌల్స్ ‘’ఈభూమిమీద ప్రతిమనిషి గాంధీ ప్రభావానికి లోనైనవారే ‘’అన్నాడు .అందుకే ఐన్ స్టీన్ ‘’ఇలాంటి మనిషి భూమిమీద పుట్టాడంటే భవిషత్ తరాలవారు నమ్మరేమో ‘’అన్నాడు .గాంధీని అజాత శత్రువు అని కొందరంటారు .ఆయనది విజయవంతమైన రహదారి అనీ అంటారు .ఒక్కమాట మాత్రం నిజం .ఈ భూ ప్రపంచం మీద ఏ అధికారం లేకుండా ,ప్రజలచేత అత్యంతం గా ప్రేమి౦పబడినవాడు ,విమర్శలు ఎదుర్కొన్నవాడు ,తన దేశ ప్రజలలో ఒక వర్గం వారి అలక్ష్యం ,ద్వేషాలకు గురైనవాడు గాంధీ మహాత్ముడు తప్ప వేరెవరూ లేనేలేరు అన్నది అక్షర సత్యం .జాత్యహంకారానికి వ్యతిరేకంగా గాంధీ శాంతియుత అహింసా పోరాట౦ చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ప్రేమించ లేకపోవచ్చు ద్వేషించింది కూడా .దక్షిణాఫ్రికాలో గాంధీ విరోధి జనరల్ స్మట్స్ ‘’ఆసియా కాన్సర్’’ తన దేశ రాజకీయ శరీరం లో నిర్మూలించాలి ‘’అన్నాడు గాంధీని అన్యాపదేశంగా, ఒక్కో సారి సూటిగాకూడా .బ్రిటిష్ ప్రధాని చర్చిల్ మహాత్ముని ‘’ దిగంబర ఫకీర్ ‘’అని ,ఆయన ఆ౦ దోళనకరమైన,భయంకరమైన చీదరపుట్టి౦చేమనిషి’’అని చీదరించాడు అవహేళన చేశాడు .ఇంకోఆకు ఎక్కువ చదివిన లార్డ్ వేవెల్ 19 4 6 లో తన జర్నల్ లో ‘’గాంధీ పైకి కనిపించినంత మంచివాడు కాదు .చాలా చురుకు న్నవాడేకాని ,మొండిపట్టుదల ,రెండునాలుకల ధోరణి ,సింగిల్ మైండెడ్ రాజకీయనాయకుడు ‘’ ‘’అని రాశాడు .
విదేశాలలోఏమిటి మనదేశం లోనూ మహాత్ముని వ్యతిరేకించినవారు చాలామందే ఉన్నారు .మహాత్ముని హింద్ స్వరాజ్ అంటే హోమ్ రూల్ ను ఆయన రాజకీయ గురువు గోఖలే తిరస్కరించాడు .అప్పుడు గాంధీకి నమ్మకంగా ఆసరాగా నిలబడింది సర్దార్ పటేల్ జవహర్ లాల్ నెహ్రు .ఆహారపు అలవాట్లు ,సెక్స్ ,ఆధునిక మందులు ,కుటుంబ నియంత్రణ ,బేసిక్ విద్య ,తనభార్యను క్రూరంగా చూడటం వంటి వాటిపై గాంధీపై చాలా విమర్శలున్నాయి .చాందసవాదులు ఆయన హరిజనోద్ధరణను, సెక్యులర్ రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించారు.జాతీయవాదులు హింస దౌర్జన్యం తోనేస్వరాజ్యం సాధించాలన్నారు .చాలాకాలం ‘’పాకిస్తాన్ ఇస్లాం కు వ్యతిరేకి ‘’అని గాంధీ చెప్పేవాడు .జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని గాంధీ కాదన్నాడు .ఒక్కో సమయం లో స్వాతంత్ర్య పోరాటం లో గాంధీ పాత్రకు విమర్శలు కూడా వచ్చాయి .ఇవన్నీ ఆయన్ను కొంచెం చేయటానికి కి౦చపరచటానికి వచ్చినవే అని చరిత్రకారులన్నారు .
ఇటీవలికాలం లో కాన్షీ రాం , మాయావతి మొదలైనవాళ్ళు గాంధీని తక్కువ చేసి మాట్లాడారు దళితులను పట్టించుకోలేదన్నారు .ఎవరేమన్నా కోట్లాది సామాన్య భారత ప్రజల తరఫున పోరాడి వారి సాంఘిక ఆర్ధిక ఉన్నతికి ,స్వేచ్చకు కృషి చేసింది గాంధీ మాత్రమే అన్నది తిరుగు లేని సత్యం . ఆయన ఖచ్చితత్వానికి ప్రాదాన్యమిచ్చాడు .’’నేను మానవమాత్రుడిని మహాత్ముడినికాదు.నేను సత్య శోధకుడిని. వినయమే నాకు ఆభరణం .సత్యాన్వేషికి తన హద్దులు తెలుసు .చేసిన తప్పులు తెలుస్తాయి తప్పు చేశానని చెప్పటానికి నేనేమాత్రం సంకోచించను’’ అన్నాడు .‘’ గాంధీ సెల్ఫ్ మేడ్ మాన్ ‘’. సమస్యా పరిష్కారాలకు ఒకరితో ఒకరు చర్చించుకోవటం తప్పని సరి. తనను విమర్శించేవారితో ఆయన విభే దించలేదు తనవాదన వారికి నచ్చేట్లు చేసేవాడు .ఒకవేళ తాను ఆలోచించింది సరైనదికాదని వారు నిరూపిస్తే తప్పక పధ్ధతి మార్చుకోనేవాడు అడ్జస్ట్ మెంటాలిటి ఉన్నవాడు .19 42ఆగస్ట్ 8 క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 13 మంది కమ్యూనిస్ట్ సభ్యులను ఆయన తూలనాడలేదు. పైపెచ్చు నిశ్చయం పై వారి కున్న ధైర్యాన్ని దాన్ని ప్రకటించిన తీరును ,అభినందించాడు ఇలాంటివి మహాత్ముని జీవితం లో కోకొల్లలు
ఆధారం –శ్రీ మైనేని వారుపంపిన డా .ఎస్. యెన్ .దాత్యే .సంకలనం చేసిన ‘’రీదిన్కింగ్ మహాత్మా గాంధి ‘’
సశేషం
గాంధీ ,లాల్ బహదూర్ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-18 –ఉయ్యూరు

