సగటు తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -2
చరిత్ర విశ్వ మానవ గురువు .సామాన్యుని విషయాలు ,అతని జయాపజయాలు సాధనాలు అన్నీ రికార్డ్ చేస్తుంది చరిత్ర .పైన చెప్పుకున్నట్లుగా సామాన్య తెలివితేటలున్నప్పటికీ ,గాంధీ మాన్యుడయ్యాడు. మహాత్ముడయ్యాడు .,కారణం ఆయన రాజకీయ,నైతిక ,అహింసా సిద్ధాంతాలే .బాధిత ప్రజలకాయన ‘’ మెస్సయ్యా ‘’అయ్యాడు .కనుకనే దేశ ,విదేశాలలో చరిత్ర ప్రసిద్ధుడయ్యాడు .1948 జనవరి 30 శుక్రవారం సాయంత్రం గాంధీ హత్య చేయబడితే యావత్ ప్రపంచం కన్నీరుమున్నీరుగా విలపించింది .ఆయన విశ్వమానవుడు .శాంతి అహింస ప్రేమ ల ప్రవక్త . ఆయన దారుణ హత్యను ప్రపంచ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు .ప్రసిద్ధ అమెరికా నవలా రచయిత్రి పెరల్ ఎస్ బక్ ‘’ఇది మరొక క్రూసిఫిక్సేషన్’’అన్నది .ఆసాయంత్రమే భారత తొలిప్రధాని నెహ్రు ‘’మన జాతిపిత మూర్తీభవించిన సత్య స్వరూపం మాహాత్మా గాంధీ అమరులయ్యారు .అయన సత్యమార్గాన్నిచూపి మన తప్పులను మన్నించి ,ఈ పురాతనభారత దీశానికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు సాధించి ఇచ్చారు ‘’అని కన్నీటితో రుద్ధ కంఠం తో విపపిస్తూ అన్నాడు .అమెరికా సెక్రెటరి ఆఫ్ స్టేట్ జనరల్ సి.మార్షల్ ‘’సర్వ మానవ జాతి అంతరాత్మ ‘’ను కోల్పాయాం అన్నాడు .ఇవన్నీ సత్యాతి సత్యమైనవే .సందేహమే లేదు . దేశ దేశాల స్త్రీపురుషులందరూ తామేం కోల్పోయామో తెలుసుకొని దుఖించారు. గాంధీ చరిత్ర రాసిన లూయీ ఫిషర్ చెప్పిన దాన్నిబట్టి మహాత్ముని హత్య వార్త విన్న కొద్ది సేపటికే భారత అధికారులకు విదేశాలనుండి 3,4 41 సందేశాలు అందాయట . పంపినవారిలో పోప్ పయస్ ,దలైలామా ,కా౦టర్ బరీ ఆర్చిబిషప్ , బ్రిటన్ రాజు ,,ప్రెసిడెంట్ ట్రూమన్ ,లండన్ చీఫ్ రబీ ,చాంగ్ కై షేక్ ,ఫ్రాన్స్ ప్రెసిడెంట్ , రష్యా నుంచి తప్పఅన్ని దేశాల ముఖ్య రాజకీయనాయకులు పదవులలో ఉన్నవారు ఉన్నారు.ఫ్రెంచ్ సోషలిస్ట్ లియాన్ బ్లుం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు గాంధీ హత్యపై స్పందించిన తీరును రికార్డ్ చేసి ‘’నేనెప్పుడూ గాంధీని చూడనే లేదు .కాని నా స్వంత బంధువు చనిపోయిన దుఖం అనుభవించాను .ప్రపంచం దుఃఖ సాగరం లో మునిగి పోయింది .బాపు మహాత్ముడు. అసాధారణ వ్యక్తి .మనీషి ‘’అని రాశాడు .ఇండియా సోషలిస్ట్ నాయకుడు మధూ లిమాయే గాంధీ దుర్మరణానికి యూరప్ సామాన్య ప్రజలు ఎలా కృంగిపోయరో ప్రత్యక్ష సాక్షిగాతన ‘’ఎ డ్రీం షాటర్డ్’’లో వివరించాడు .గాంధీతో మౌలిక భేదాలున్న అంబేద్కర్ గాంధీ హత్యకు షాకయ్యాడు.’’శాంతిదూత ఆహి౦సామూర్తి కి ఇంతటి దారుణ హి౦సామరణమా?’’అని కాబోయే భార్య డా సబితా కబీర్ కు రాసిన లేఖలో తెలియ జేశాడు . గాంధీని ‘’స్థిత ప్రజ్ఞ కర్మ యోగి ‘’అని ఐక్యరాజ్య సమితిలో బ్రిటిష్ ప్రతినిధి ఫిలిప్ నోయెల్ బేకర్ అభివర్ణిస్తూ ‘’అత్య౦త బీదలకు గాంధీ గొప్ప మిత్రుడు .అయినా ఏకాకి .ఇప్పుడు కనుమరుగయ్యాడు .ఆయన ఆశించిన విషయాలు ఇంకా అమలులోకి రావాలి ‘’‘’అన్నాడు .కనుక గాంధీ స్మరణ ఔచిత్యమైనదే నేడుకూడా .ఎలాగో చూద్దాం.
జీవిత మూల సూత్రాల విషయం లో మహాత్ముడు ఎన్నడూ రాజీ పడలేదు .ఈనాటి ఇండియా కే కాదు యావత్ ప్రపంచానికీ ఆయన చెప్పిన మూలసూత్రాలు శిరో దార్యాలే .ప్రపంచం లో మొట్టమొదటిసారిగా అణచి వేతకు, హక్కుల హరణకు వ్యతిరేకంగా అహింసా యుత విప్లవం ప్రయోగించాడు .ఇందులో రాజకీయ సాంఘిక ఆర్ధిక సాంస్కృతిక విషయాలలో సామాన్యులకు జరిగిన అన్యాయాలు ,దౌర్జన్యాలపై తిరుగుబాటు ఉన్నది .వీటి సాధనకు సత్యాగ్ర హ ఆయుధాన్ని ప్రయోగించాడు .’’అణచేవాడు అణగ ద్రొక్కబడే వాడుఒకరితో ఒకరు సహకారం తో మెలిగితే అణచి వేత ఉండదు ‘’అని ప్రబోధించాడు .అది పూర్తి సత్యం .ఇదిపాటిస్తే స్థానిక వ్యక్తిగత ,ప్రాంతీయ ,దేశీయ అంతర్జాతీయ స్థాయిలలో మానవ సమూహాలకు సుఖ శాంతులు లభిస్తాయి ‘’అన్నాడు .’’సహాయ నిరాకరణ అతి సామాన్య ప్రజలలో గౌరవ ,అధికారాలకోసం మేల్కొలపటమే .దీనికి వారిని సమాయత్తం చేయటానికి వారిలో రాక్షస శక్తి పై భయం పోగొట్టటం ఒక్కటే మార్గం .అది వారి అంతరాత్మను మేల్కొనేట్లు చేసి తమ కర్తవ్యాన్ని నెరవేర్చేట్లు చేస్తాయి .నేను చేసింది ఈ చిన్నపనిమాత్రమే .వారు జాగృత స్థితి పొందితే సాధించలేనిది ఏదీ ఉండదు .సహకారం ఒక విధి . సహాయ నిరాకరణ కూడా డ్యూటీ తో సమానమే .’’అని వివరించాడు .తప్పు చేసే ప్రభుత్వాన్నీ ,విద్యాలయాలను ,వాణిజ్య వ్యాపార మత రాజకీయ సంస్థలను ,ఫాక్టరీలను, చివరికి వ్యక్తులను , సంఘాన్నీ కుటుంబాలను , కూడా తప్పు తెలుసుకోనేట్లు చేసి , సరైన మార్గం లో పెట్టి ప్రజోపకారంగా పనులు చేయి౦చటమే సత్యాగ్రహముఖ్య లక్షణం అంటాడు గాంధీజీ .
ప్రజా స్వామ్యకంటకుల ,దోపీడీ దార్ల , రాజకీయ నేరగాళ్ళ హక్కులను కాలరాసే వారల కబంధ హస్తాలలో నలిగినప్పుడు భారతీయ సామాన్య ప్రజానీయం నిర్భయంగా శాంతియుతంగా గాంధీగారి విధానాలనే అమలు చేసి తమ కోరికలు సాధించుకొంటున్న చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం.,
ఆధారం –డా.ఎస్ యెన్ దాత్యేసంకలించిన ‘’రీ థింకింగ్ మహాత్మా గాంధీ ‘’లోని జే వి నాయక రచన –‘’రెలవెన్స్ ఆఫ్ గాంధి ‘’ ,
సశేషం
గాంధీ ,లాల్ బహదూర్ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-18 –ఉయ్యూరు .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797

