సగటు తెలివి తేటల గాంధి సరి సాటి లేని మహాత్ముడయ్యాడు -3 (చివరిభాగం )
గాంధీ గారి అహింసా సిద్ధాంతం ఇండియాకే కాదు ప్రపంచ దేశాన్నిటికీ వర్తి౦ చేదే . మానవాళికి విపరీత శత్రువులైన అసూయ ,భయాలను జయించిన శాంతి వీరుడు గాంధీ .అసూయ పిరికితనం అన్నాడు .బ్రిటిష్ దౌర్జన్యరాజ్యమంటే,కాలనీ దౌస్ట్య మంటే ఉన్న భయాన్నికూకటి వ్రేళ్ళతో సహా ప్రజల మనసులనుండి తొలగించాడు .భారత స్వాతంత్ర్యానికి ఆయన ఇచ్చిన మరో మంత్రం ‘’అభయం ‘’అంటే భయరాహిత్యం .ఆహిస ,పిరికి తనం వ్యతిరేక పదాలు .అహింస అత్యంత గొప్ప సుగుణం ,పిరికితనం అత్యంత దుర్గుణం .అహింస ప్రేమనుంచి ఉద్భవిస్తుంది. పిరికితనం ద్వేషం నుంచి జనిస్తుంది .స్వచ్చమైన అహింస నిరుత్సాహపరచి అవినీతి పనులను చేయించదు . కాని పిరికి తనం అదే చేయిస్తుంది .ఈ రెండిటికీ హస్తి మశాకాంతర భేదం ఉందని స్పష్టంగా చెప్పాడు గాంధి .
గాంధీగారి అహింసా యుత సహాయ నిరాకరణ ఉద్యమం దేశం లో ఉద్ధృతంగా దూసుకొస్తున్న ఉగ్రవాదాన్ని కాండంతో సహా నరికేయటానికే .ఏరూపం లో ఉన్నా టెర్రరిజం దుర్గుణమే భయానకమే ..పరాయి పాలన వ్యతిరేక విషయం తో సహా .అంత్య ఫలం ఎంత ఉదాత్తమైన అవసరమో ,దాన్ని సాధించే మార్గాలు కూడా అంతే ఉదాత్తంగా ఉండటం అవసరం .ఇవాళ సమకాలీన ప్రపంచం లో టెర్రరిజం శాపం ,అశాంతి .ప్రజలు భయ భీభత్సాలమధ్య బతుకుతున్నారు .స్వాతంత్ర్య భారత దేశం లో ప్రముఖ వ్యక్తుల దగ్గరనుంచి సామాన్య రాజకీయ నాయకుడి వరకు ప్రభుత్వ పోలీసు సంరక్షణలో బందీలై బతకటం సిగ్గు చేటు గా ఉంది .ఇందుకేనా మనం స్వేచా స్వాతంత్ర్యం సాధించింది ?గాంధీ చెప్పిన, గురుదేవ్ టాగూర్ రాసిన ‘’వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ‘’గీతా౦జలి పాఠం ఏమైపోయింది ? భయం మధ్య గడిపే జీవితమా మనం కోరుకున్నది ?’’భయరాహిత్యమున్న స్వర్గం లోకి దేవా! నా దేశాన్నిమేల్కొలుపు ‘’అని ప్రార్ధించింది అంతా శుష్క వేదాంతమై పోయిందా ?కనుక ఈ హింసా ,భీభత్సాల మధ్య గడుపుతున్న వారికి తరుణోపాయం గాంధీ అహింస సిద్ధాంతం మాత్రమే . అదే సర్వశ్రేస్ట మార్గం అందరికీ .
నేడు ప్రపంచ రాజకీయం అంతా ‘’ప్రయోజనకర సిద్ధాంతం ‘’,ఆవశ్యకత లపైనే నడుస్తోంది .ఇది మరీ దిగజారి ‘’మాకివిల్లీ విధానం ‘’అమలై , రాజకీయం లో ఏదైనా రైటే,చెల్లు బాటు అవుతుంది అనే స్థితిలోకి వస్తే డేంజర్ గంటలు మోగినట్లే .ఇది నేర ప్రవృత్తికి రాచబాట వేస్తుంది .మనదేశం లో రాజకీయం లో చాలాభాగం మతోన్మాదశక్తుల గుప్పిటలో చిక్కుకు పోయింది .అందుకే మహాత్ముడు బహిరంగ విలువలున్న రాజకీయం కావాలని వా౦ఛించాడు .దానికే మద్దతు పలికాడు . .’’సత్యమే దైవం ‘’అన్నాడు .మానవ క్రియా శూన్యమైన దేది మతంగా ఆయన భావించలేదు .మతం అంటే పిడివాదం, అంధ విశ్వాసం కాదు .అది ‘’జీవన విధానం ‘’అన్నాడు .సామాన్య మానవ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వనిది మతమే కాదన్నాడు ‘’నా మతం సత్యాహింసలపై ఆధార పడింది .సత్యమే నా దైవం .అహింస దాన్ని పొందటానికి సాధనామార్గం ‘’అని విస్పష్టంగా వివరించాడు .1927 లో ‘’ప్రపంచం లోమతాలన్నీ అనేక విషయాలలో విభేదించినా, అందరు ఏకగ్రీవం గా సత్యం ఒక్కటే శాశ్వతం అన్నారు.హేతువుకు నిలబడని, నైతికత లేని మత మూఢ విశ్వాసాలను నేను నమ్మను .ప్రజల యదార్ధ జీవన విధానాన్ని పట్టించుకోని ,వారికి సహాయపడనిది మతమే కాదు .అసహనం హింసకు మరో రూపం .అది అసలు ప్రజాస్వామ్య అభి వృద్ధికి, భావనకు అవరోధం ‘’అని చెప్పాడు .
హిందువు కాకపొతే గాంధీ శూన్యమే .హిందువుల నైతిక ప్రపంచాన్ని నిర్వచిస్తూ గాంధీ దాని సౌందర్యం అంతా అన్నిటినీ ఆహ్వానించి కలుపుకోవటం తనది చేసుకోవటం లోనే ఉంది అన్నాడు .ఇతర మతాలలో ఉన్న విషయం హిందూ మతం లో తప్పక ఉంటుంది .ఇందులో లేనిదాని కోసం వెంపర లాడటం వివేక౦ కాదు .భిన్నభావాలు, నమ్మకాలు, మత విశ్వాసాలున్న భారత్ దేశ ప్రజలను ఏక తాటిపై నడిపించి౦ది ఆయన విశాల భావాలే .అనాదినుంచి ఉన్న ‘’భిన్నత్వం లో ఏకత్వం’’ ఇప్పుడు సాధించి చూపి, దాని శక్తి ఏమిటో బ్రిటిష్ పాలకులకు రుచి చూపించాడు .హిందూ మతంలోని ఉదారతను ఆయన చక్కగా వినియోగించి అందరికి చేరువయ్యాడు లక్ష్యసాధనకు ఇది బాగా తోడ్ప డిందిదికూడా .మత మౌఢ్యం, చాందసవాదం అనే సంకెళ్ళ నుండి విముక్తి కలిగించి సామరస్యంగా ,పరస్పర సహకారం తో జీవించే జీవన శైలిని ఉద్బోధించాడు.
కార్య శీలి గాంధి ప్రయోజనంలేని ,ఉపకరిచని శుష్కవాగ్దానాలు చేయలేదు .అమలు పరచలేని తీర్మానాలూ చేయలేదు .1929 లో అభివృద్ధికోసం ఆయన ’ ‘’అమలు చేసే శక్తి సామర్ధ్యాలు లేని తీర్మానాలపై గంటల తరబడి మాట్లాడి ,వాటిని అనాలోచితంగా ఆమోదించి ప్రజలను మభ్యపరచి మోసం చేయవద్దు .వాళ్ళనమ్మకమే మన బల౦ ‘’అని చెప్పిన మాట ఏనాటికైనా, ఏ పాలకులకైనా కను విప్పు కలిగించే కఠోర సత్యమే
గాంధీ అంటే అత్యంత క్రమశిక్షణ కల వ్యక్తి .తనపై అపారనమ్మకమున్న దేశ ప్రజలకు అనుచరులకు ‘’ఏదిసాధించాలన్నా క్రమశిక్షణ చాలా అవసరం .క్రమశిక్షణ అనేది విద్య, చర్చ వాదాలతో అలవడేదికాదు.వ్యతిరేక పరిస్థితులలో దాన్ని సాధన చేయాలి ‘’అన్నాడు .ప్రపంచం లో చాలాదేశాలు చాలావేగవంతం గా అభి వృద్ధి సాగిస్తుంటే ఇండియా అభి వృద్ధిలో వెనకబడటానికి కారణం అన్ని రంగాలలో క్రమశిక్షణ లేకపోవటమే.ప్రపంచ దేశాల సరసన ,వాటిక౦టే ఉన్నతంగా భారత దేశం నిలబడాలి అంటే గాంధీ బోధించిన, అనుసరించిన క్రమశిక్షణ ను అందరూ తీవ్రంగా తప్పక అనుసరించాలి ,జాగృతమవాలి.
గాంధీకి పాశ్చాత్య విధానాలను గుడ్డిగా అనుసరించటం ,అనుకరించటం ఇష్టం లేదు .నవీన భారతం తన మూల సిద్దా౦తాలపై ,ఎక్కడ మంచి ఉంటే దాన్ని తీసుకొంటూ, కలుపుకుపోతూ అభివృద్ధి చెందాలని అభిలషించాడు .మహాత్ముడు చెప్పిన ఆర్ధిక ఫిలాసఫీ ని తప్పుగా అర్ధం చేసుకున్నారు . యాంత్రిక సాంకేతికతకు ఆయన వ్యతిరేకి కాడు . అయితే యంత్రాలు, సాంకేతికత పారిశ్రామిక సమాజాలలో పెత్తనం చేయరాదు అని ఆయన ఉద్దేశ్యం .ప్రజలు కోరికలు తగ్గించుకోవాలి . అజ్ఞాన వినిమయతత్వం (కన్సూమరిజం ) పెరగకుండా జాగ్రత్త పడాలని కోరాడు .ఆర్ధిక విషయాలపై ఆయనకు ఖచ్చితమైన, నిర్దుష్టమైన భావాలు ఉన్నప్పటికే ,వాటిని తన అనుచరులపై బలవంతంగా రుద్ద లేదు .కేపిటలిజం ,కమ్యూనిజం లపై ఆయనకు ఆసక్తి లేదు .సమానహక్కులు, బాధ్యతలు ,ప్రేమ, పరస్పర సహకారం తో మనుగడ సాగించే సమాజమే ఆయన ధ్యేయం .సమాజం లో అతి బలహీనుడికి కూడా, అత్య౦త బలవంతునికి ఉన్న అవకాశాలు ఉండాలన్నాడు .ఇది ‘’ఉటోపియా ‘’-ఆదర్శ ధామం గా అనిపిస్తుంది .అంటే ఆచరణ సాధ్యంకానిది గా అనిపించినా ,ప్రపంచ దేశాలన్నిటి ధ్యేయం ఇదే .దీనినే’’ రామరాజ్యం’’ అన్నాడు రామ భక్త బాపు .
సమాన న్యాయం సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అంటే గాంధీ చెప్పిన 7 పాపాలు చేయకుండా అందరూ చిత్త శుద్ధితో ఉండాలి .అవి –విలువలు లేని రాజకీయాలు 2-నైతికత లేని వ్యాపారం 3-పని లేనిసంపద 4-శీలం లేని విద్య 5-మానవత్వం లేని విజ్ఞానం 6-మనస్సాక్షి లేని ఆనందం 7-త్యాగం లేని ఆరాధన .
19 వ శతాబ్దం లో భారత దేశం లో నూతనశక్తి(రినసెంట్ ) తో పునర్జన్మ నెత్తిన ముగ్గురు మహా పురుషులలో మహాత్మాగాంధీ ఒకరు. మిగిలిన ఇద్దరు రాజా రామ మోహన రాయ్ ,,జస్టిస్ మహాదేవ గోవింద రానడే .ముగ్గురిదీ ఋషి శీలమే ,సత్యాగ్రహ తత్వమే .ముగ్గురి భావనా ఒకటే –‘’మానవత్వం సమానత్వం ,అధ్యాత్మికోన్నతి ‘’.ఈ సందేశాన్నిగాంధీజీ క్రియా రూపం లో వ్యాపింప జేయటానికి సత్యాగ్రహం అహింస ఆయుధాలుగా చేసుకొన్నాడు .ఈనాటి ‘’థర్మో న్యూక్లియర్ యగం ‘’లో సర్వమానవ వినాశనాన్ని, ,తుదముట్టించటాన్ని(ఎన్నిహిలేషన్ )నివారించి, రక్షించటానికి ఉన్నఎకైక సాధనం సతాగ్రహం అహింసా సిద్ధాంతమే ,ఇదే మహాత్ముడిని ఈ యుగం లో కూడా స్మరించటంలో ఔచిత్యాన్ని తెలియ జేస్తోంది .
సమాప్తం.
ఆధారం – –డా.ఎస్ యెన్ దాత్యేసంకలించిన ‘’రీ థింకింగ్ మహాత్మా గాంధీ ‘’లోని జే వి నాయక్ రచన –‘’రెలవెన్స్ ఆఫ్ గాంధి ‘’ ,
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-18- ఉయ్యూరు
—

