కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17

1—పద్మ భూషణ్ శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -3( చివరి భాగం )

బాబళ్ళ శాస్త్రి గారి లాగానే, లంకా శాస్త్రి గారు కూడా వేద విక్రయాన్ని సమర్ధించలేదు .భర్త మరణానతరం అనసూయ గారిని తమ దంపతులు అగ్ని స్టోమం చేసిన తర్వాత ఇంకా ఏవైనా శ్రౌతకార్యక్రమాలు చేశారా అని అడిగితే ‘’మా స్వంతిల్లు, వనరులూ ఉన్నా, సరైన ఋత్విజులు లేరు .అన్నీ తెలిసి చేయి౦చగా లిగినవారు నేదునూరు, శ్రీరామ పురాగ్రహారాలలో మా  చిన్న తమ్ముడి తో సహా మాత్రమే కొద్ది మంది మాత్రమే  ఉండేవారు .దువ్వూరి యాజులు మొదలైన పరిణతి చెందినవారు మా వారి దగ్గరే నేర్చుకోవటానికి వచ్చేవారు .దేనికైనా డబ్బు కావాలి కదా . మాకు  తగినంతగా డబ్బు  ఉండేదికాదు .అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది ప్రపంచం .డబ్బు సంపాదించటం ,కూడ బెట్టటమే యావ అయిపొయింది అందరికీ .భారత దేశం లో  డబ్బు  సంస్కృతి పెరిగిపోయింది ..మేము నిత్యం అగ్ని హోత్రం  చేస్తూ దానితోనే  సరిపుచ్చుకొంటూ సంతృప్తిగా గడిపాము ‘’అని చెప్పారు .వేదపండితుడైన శాస్త్రిగారు శ్రౌతంలో ఘనులని పించుకున్నా, వేదపర్య వేక్షకులుగా ,వేద విజ్ఞానాన్నిఅందించే వారుగానే ఉన్నారుకాని ఇంకా క్రతువులు చేసి అదనపు బిరుదులు  అందుకోవాలనే తాపత్రయం అత్యాశ  లేని వారు .నాటక సినీ నటులకు వచ్చినన్ని అవార్డ్ లు రివార్డ్ లు అందుకున్న మహా వేదపండితులు వేదార్ధ సారమతులు శాస్త్రిగారు .

  19 94 మే నెల 7 వ తేదీ న వారికి భారత ప్రభుత్వం ‘’పద్మ భూషణ ‘’  పురస్కారం అందజేసి సత్కరించినదుకు ఆయన భుజాలు ఎగరేసి ‘’ఇదంతా ఒట్టి ఆర్భాటం (ప్రాపగాండా) మాత్రమే ‘’అన్న నిగర్వి శాస్త్రి గారు .

   లంకా శాస్త్రిగారిది  ‘’ తృప్తి చెందని జిజ్ఞాస ‘’ఉన్న వ్యక్తిత్వం ‘’.సోమాన్ని గూర్చి సవివరంగా తెలియ జేస్తూనే ,మధ్యలో అకస్మాత్తుగా కర్మ , దేవుడు ,పుణ్యం ,పాపం ,మనుషుల కర్మలో మానవత్వం లపై సుదీర్ఘంగా చర్చించేవారు .దళితులలో సద్గురువులగురించి,క్రైస్తవం గురించి  అడిగి తెలుసుకొనే వారు  .ఒక్కోసారి ఎదుటితివార్ని ఆశ్చర్యపరుస్తూ ‘’జార్జి రాజు ,విక్టోరియామహా రాణి లు ఎలా ఉన్నారు ‘’? అది అడిగేవారు .అంటే వారి ఉద్దేశ్యం లో 20 వ శతాబ్దం లో ప్రాముఖ్యమైన సంఘటనలు ఏవీ జరగలేదని .విక్టోరియా మహారాణి 19 01 లో,6 వ  జార్జి చక్రవర్తి 19 4 7 వరకు ఇండియాకు కూడా రాజే .1952 లో చనిపోయాడు .

  1991 లో శాస్త్రిగారి కాళ్ళకు నీరు పట్టి అగ్నిహోత్రం లో మంత్రాలు మాత్రమే చదివి ,సరి పుచ్చుకోనేవారు .లేచి నిలబడి క్రియ చేయగలిగే వారు కాదు .దీనిపై జోకులు వేస్తూ ‘’మేము ముగ్గురం ఆహితాగ్నులం .బాబళ్ళ వారికి చెవిలేదు అంటే చెవుడు .యాజులు గారికి కళ్ళు లేవు .అంటే చూడలేరు .నాకు కాళ్ళు లేవు ‘’.కొడుకును  వెంట తీసుకొని విమానం ఎక్కి రాష్ట్రపతి పురస్కారం స్వీకరించటానికి ఢిల్లీ వెళ్ళిన’’ ఏకైక కోన సీమ ఆహితాగ్ని’’పద్మభూషణ్ శ్రీ లంకా వెంకట రామ శాస్త్రి గారు ఒక్కరే .

  తన 72 వ ఏట తనకు మరణం సంభ విస్తుందని శాస్త్రిగారికి రెండు దృష్టాంతాలు కనిపించాయి .ఒకటి ఆయన జాతక చక్రంలో రాహు వీక్షణం తో  మృత్యుచక్ర సూచన .రెండు తమ తండ్రిగారు కూడా 72 వ ఏట రాహు ప్రభావం తో  1947 లో మరణించటం  .అయితే శాస్త్రిగారు తీవ్రంగా రాహు జపం చేసి మరణం నుంచి తప్పించుకొన్నారు .

    కాని ఆరోగ్యం ఇదివరకు లాగా బాగా  లేదు .రెండేళ్ళ తరవాత 36 ఏళ్ళ సుదీర్ఘ అగ్ని హోత్రానికి స్వస్తి పలికారు .దీనిని ‘’జిర్నాదు ‘’అంటారని శాస్త్రి గారే చెప్పారు .వృద్ధాప్య కాలం లో ఇతర వేద పండితులలాగా శాస్త్రిగారికి కూడా అన్నం అరిగేదికాదు  తైత్తిరీయ ఉపనిషత్ లోని ‘’ఆహమన్నమహమన్నం ‘’మంత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోనేవారు .అయినా తగినంత జీర్ణం ఉండేదికాదు .ఆహితాగ్ని దంపతులు తగినంత శారీరక బలం లేనప్పుడు ఏమి చేయాలో ఇతర ఉపాయాలను ఆయన వెతికి  ఆయా మంత్రాలను మననం చేసేవారు .1988 లో మళ్ళీ మృత్యు చక్రం వేయించారు .దీనిప్రకారం ఆయనకు 80 గారంటీ .అంటే అప్పటిదాకా మృత్యువు ఆయన సమీపానికి రాదనీ అర్ధం..కాని ఈ చక్రం లోపభూయిస్ట మై  మృత్యువును మరొక్క  7 ఏళ్ళు వాయిదా వేసింది .శాస్త్రిగారి 80 వ జన్మ దినోత్సవం నాడు’’ సహస్ర చంద్రదర్శనం ‘’ఘనంగా జరుపుకొన్నారు. బొటన వ్రేలి సర్జరీ తో  బాధ పడుతున్నా ముఖం లో చిరునవ్వు తగ్గలేదు , 83 ఏళ్ళ వయసులోకూడా కొత్త స్నాతక విద్యార్ధికి ‘’వ్యాకరణం’’ బోధిస్తూనే ఉన్నారు . ‘’మృత్యువు అనివార్యం .తప్పి౦పరానిది .కాని జీవితేచ్ఛ బలీయమైనది ‘’అన్నారు వేదాంత ధోరణిలో ..చయనులు గారిలాగా అకస్మాత్తుగా కి౦ద పడి చనిపోలేదు.బాబళ్ళ శాస్త్రి,దువ్వూరి యాజులు గార్లలా  అర్ధరాత్రి మరణి౦చ నూలేదు..బాధతో ,జ్ఞాపక శక్తి లేమితో చివరి సంవత్సరాలు గడపాల్సి వచ్చింది .ఆయన సెంటిమెంట్ 72 దాటి ,మరో 15 ఏళ్ళు జీవించి  చివరి రోజుల్లో జ్ఞాపక శక్తి కోల్పోయి, మృత్యువుతో పోరాడి ,   ఆహితాగ్ని , పద్మభూషణ్ , వేదపండితులు బ్రహ్మశ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు 87 వ ఏట 20-6-1999  తెల్లవారుజామున 3 గంటలకు మృత్యుంజయ సన్నిధానం  చేరారు .

  1995లో  తుఫానుకు కామేశ్వరి అగ్రహారం దెబ్బతినే నాటికి  శాస్త్రి అనసూయ దంపతులకు  ఎనిమిది మంది  సంతానం  .వెంటనే ఎదురుగా ఉన్న ఇంటిని నాలుగవ కుమారుడు  వ్యవసాయ సహకార పరపతి సంఘం మాజీ అధ్యక్షుడు ఆక్రమించాడు .తుఫాను శాంతి౦చాక అ ఇంటినికాంక్రీట్ స్లాబ్ వేసి  పునర్నిర్మించాడు .ఇందులోనే శాస్త్రిగారిభార్య అనసూయ గారు చివరి రోజులు గడిపారు .72 ఏళ్ళ వైవాహిక జీవితం గడిపిన పాత ఇంట్లో మళ్ళీ 1999 లో చేరారు ఇందులో శాస్త్రిగారి మాసికాలు మాత్రమె పెట్టేవారు .సంవత్సరీకాలు జరిగాక మళ్ళీ ఆవాస యోగ్యం చేశారు .భర్త శాస్త్రి గారి గూర్చి చాలామదుర జ్ఞాపకాలున్నట్లు ఆమె చెప్పారు

  భర్త గారి లాగానే అనసూయ గారి అంత్య దశకూడా కష్టాలలో గడిచింది .2005 నాటికి  నేలమీద దుప్పటిపై నిద్రించే ఆమె  అతిదులెవరైనా  వస్తే , పలకరిచటానికి  లేవ లేక పోయేవారు  గుర్తించగలిగే వారు కూడా కాదు .బయటి వారి సంగతి సరేసరి ఇంట్లో తనను అతి జాగ్రత్తగా సంరక్షిస్తున్న కొడుకును, కోడల్ని కూడా గుర్తు పట్టగలిగే వారు కాదు .అప్పటి ఆమె పరిస్థితి ‘’లేడీ మేక్ బెత్’ లాగా ఉండేది . ఎప్పుడూ ఏదో ఆలోచనలో ,ఏదో గొణుగు కొంటూ  ,తికమక గా మాట్లాడుతూ ,ఏదేదో ఊహించుకొంటూ ,చేతి ఉంగరాన్నింని తనకు తెలీకుండానే మరో చేతి అన్ని వేళ్ళకు మారుస్తూ గడిపారు .ఒక్కో సారి అకస్మాత్తుగా ‘’అగ్ని హోత్రా అగ్ని హోత్రా ‘’అని పలవరించేవారు  ఇంత నరక యాతన తెలిసీ తెలియని స్థితిలో అనుభవిస్తూ ఆహితాగ్ని శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి సహ ధర్మచారిణి శ్రీమతి అనసూయ గారు  20 05 డిసెంబర్ 31 మధ్యాహ్నం 2-30 గంటలకు 90 వ ఏట తుది శ్వాస విడిచారు  ..ఆమె సహచరులలో అంతకాలం జీవించిన వారు లేరు .ఇవీ కామేశ్వర పురాగ్రహార ఆహితాగ్ని లంకావారి కుటుంబ విశేషాలు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-18 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.