ధ్వని కోణం లో మనుచరిత్ర
సంస్కృత సాహిత్య రత్న డా.కొరిడె రాజన్న శాస్త్రి గారు తమ పరిశోధన గ్రంథం గా ‘’ధ్వని –మనుచరిత్ర ‘’రచించి ఉస్మానియా యూని వర్సిటీ నుండి పి.హెచ్ .డి.పొందిన సాహితీ మూర్తి .ఈ గ్రంథం తొమ్మిది ప్రకరణాలుగా ఉంది .ప్రఖ్యాత ఆలంకారికుడు ఆనందవర్ధనుడు ప్రవచించిన ధ్వని సిద్ధాంతాన్ని మొదటి 7ప్రకరణాలలో విపులంగా చర్చించి ,8వ ప్రకరణం లో మను చరిత్ర లోని ధ్వనిని కూలంకషంగా చర్చించి వివరించారు .ఈ ప్రకరణం లోని అతి ముఖ్య విషయాలను సరళంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను .
ముందుగా సూక్ష్మం గా ధ్వని అంటే ఏమిటో తెలుసుకొందాం .అర్దా౦తరాన్ని తెలియ జేసే వ్య౦జనమే ధ్వని .అంటే ఒక శబ్దం వలన ,లేక అర్ధం వలన కలిగే వేరొక అర్ధాన్ని ధ్వని అని అన్నాడు ఆనందవర్ధనాచార్యుడు .అనగా ధ్వని అంటే వ్యంగ్యార్ధం .ధ్వని ఉన్నకావ్యమే ఉత్తమకావ్యం అని దాదాపు అందరూఅంగీకరించారు . ధ్వని శబ్దం లో, అర్ధం లో అనేక రకాలుగా ఉంటుంది .మనం ధ్వని కీకారణ్యం లోకి ప్రవేశించకుండా మనుచరిత్ర ప్రబంధం లో పెద్దనామాత్యుడు ప్రదర్శించిన ధ్వని విశేషాలనే తెలుసుకొందాం .
మను చరిత్రకు ‘’స్వారోచిత మను సంభవము ‘’అనే పేరుంది .ఈ ప్రబంధ ఫలం స్వారోచిష మనువు జన్మించటమే.ఉత్తమ గుణ సంపన్నుడైన మనువు జన్మించటానికి పెద్దన గారు రెండు తరాల కథ రాశాడు .ఈ స్వారోచిషుడు శాంతి దా౦తి ,దయా సత్య శౌచ నిరతుడు ,అకాముడు ..కనుకనే మనువు అయ్యే అర్హత పొందాడు .కాని విచిత్రం ఏమిటంటే ఇలాంటి పుత్రుని కన్న తండ్రి స్వరోచి భోగలాలసుడు ,బహు స్త్రీ కాముకుడు .కనుక ఇతనిలో శాంతి దయాదులు మృగ్యాలు .స్వరోచి తలిదండ్రులు వరూధిని అనే దేవలోకకాంత ,గ౦ధర్వ కుమారుడు .వీళ్ళిద్దరూ భోగ లాలసులే ,జితే౦ద్రియులు అసలేకారు .మరి ఇలాంటి వంశం లో జితే౦ద్రియుడైన స్వారోచిషుడు ఎలా జన్మించాడు ?ఈ సందేహం తీర్చటానికే ప్రవరాఖ్యుడు అవసరమయ్యాడు .ప్రవరుని గుణగణాలు వర్ణనాతీతాలు .జితే౦ద్రి యుడు ,నిత్యాగ్ని హోత్రి ఏకపత్నీ వ్రతుడు .ఇతడు ఒక సన్యాసి రాసిన పాద లేపన ప్రభావం వలన హిమాలయం చేరి ,దారికానక వరూధిని కనిపిస్తే దారి అడిగి ,ఆమె వలపు రవ్వలు రువ్వితే లొంగక ,తన పావక ప్రభు ప్రసాదం వలన మళ్ళీ తన అరుణాస్పద పురం చేరాడు .ఇంతటితో ప్రవరుని కథ సమాప్తం .తర్వాత కథలో అతని ప్రమేయం ఏమీలేదు .కాని వరూధిని ప్రవరుడిని వదలలేదు అతని రూపును తనమనసు మందిరం లో స్థిరంగా ప్రతిష్టించు కొన్నది .అతనికోసమే పరితపించింది .ఇదే అదను అనుకొని ,ఎప్పటినుంచో అమెను ప్రేమిస్తున్న ఒక గంధర్వుడు ముమ్మూర్తులా’’ ప్రవర దేహ సమిద్ధిత శిఖి దీప్తితో ,ఆతని రూప లావణ్యాది గుణగణాలతో శా౦భ రీ మహిమతో పొంది , వచ్చి ,ఆమెకు ప్రవరుడు అనే భ్రమకలిగించి ,ఆతనితో పొందు సౌఖ్యం అనుభవించి ,వాడి వంచన తెలియక ,అదే వరప్రసాదమై ,ఆమె మనస్సులో ప్రవరునితో సుఖిస్తున్న భానతోనే ఉండిపోవటం తో ,ఆ భావనకు పటిష్టత కలిగి ,ఆభావనా బలం తో ప్రవరుని శమదమాది గుణాలు ఆయన పౌత్రుడైన స్వారోచిషునికి సంక్రమించాయి .భావనా బలమే కీటకాన్ని భ్రమరంగా మారుస్తుందని మనకు తెలుసు .జన్యు సిద్ధాంతం ప్రకారం కూడా సెకండ్ జనరేషన్ లో ఉత్తమ ఫలితం కలుగుతుంది .
పై విషయాన్ని పెద్దనగారు ‘అనిమేషత్వము మాన్చెబిత్తరచూప స్వేద తా వృత్తిమా –న్చె,నవ స్వేద సమృద్ధి ,బోదకళమాన్చెన్మోహ విభ్రాంతి ,తో
డనె,గీర్వాణ వదూటికిన్,భ్రమర కీటక న్యాయ మోప్పన్ ,మను –ష్యుని భావించుట మానుషత్వమె మెయిం జూపట్టెనా నత్తరిన్ ‘’
ఈ విధంగా స్వారోచిషుడు శాంతి దాంతి మొదలైన గుణ గరిస్టుడవ్వటానికి ,వరూధిని మనసంతా నిండిఉన్న ప్రవరుడే కారణం .కనుక మనువుకు పితామహుడు ప్రవరాఖ్యుడే .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-11-18-ఉయ్యూరు
—

