ధ్వని కోణం లో మనుచరిత్ర –4
స్వరోచి దక్షిణ నాయకత్వం పలు పోకడలు పోయింది .ఆడ లేడి రూపం లో వనదేవత ఆలింగన సౌఖ్యం పొంది ,ఆపని కాగానే స్త్రీగామారి ‘’రాజా !నేను వనదేవతను. సమస్త భూత వన రక్షణాదక్షుడవైన మనువును నీ వలన పొందాలనే కోరికతో నిన్ను చేరాను .నా అనురాగంతో కుమారుని పొంది ,పుణ్యలోక ప్రాప్తి పొందు .’’అని అభ్యర్ధించింది .వెంటనే ఒప్పుకోవటం ఆమె వలన స్వారోచి ని కొడుకుగా పొందటం జరిగిపోయాయి .స్వారోచిషుడు శమదమాలతోతపస్సు చేసి ,భగవదనుగ్రహం తో మనువు అయ్యాడు .ఈయన పాలనలో ప్రజలు సుఖించారు అనే విషయంతో మనుచరిత్ర కావ్యం ముగుస్తుంది .స్వారోచిష మను సంభవం అనే ఈ కథాంశం మొత్తం ప్రభంథానికే కథామూలమై ,శృంగార రస ప్రధానమై సఫలమైంది అంటారు రాజన్న శాస్త్రిగారు .భోగ లాలసుడైనా, స్వరోచి అనురాగానికి అధర్మం జరగనందున శృంగారం ధర్మమే అయి౦ద౦టారు శాస్త్రిగారు .దక్షిణ నాయకత్వం సర్వ సంప్రతి పన్నం అని రసార్ణవం చెప్పింది కనుక రసాభాసం కాదు .లోక వ్యవహారం,శాస్త్ర మర్యాద అతిక్రమించినప్పుడే అనౌచిత్యమౌతుంది .నిజానికి స్త్రీకి బహుపురుషాసక్తి రసాభాసమే కాని ద్రౌపదీ దేవి కి పంచ భర్తలు ధర్మమే అన్నారు వ్యాసాది మహర్షులు .స్వరోచి వేటలో, రాక్షస రూప ఇందీవరాక్షుని తో యుద్ధం లో వీరరసం ,రాక్షసబారి పడిన మనోరమ ‘’హా వనిత, ననాథ,,నబల ,నార్త విపన్నం గావరే ‘’అని విలపించినప్పుడు భయానక ,కరుణ రసాలు ,రాక్షసుడు గంధర్వుడు గా మారినప్పుడు ,హరిణి వనదేవతగా మారినప్పుడు అద్భుత రసం ,ఇందీవరాక్షునితో యుద్ధం లో రౌద్ర రసం ,రాక్షస రూప వర్ణ నలో భయానక రసం,స్వారోచిషుని యందు శాంతరసం పోషి౦పబడ్డాయి .
స్వరోచి కథలో మనోరమాదుల శాపం ,ఇందీవరుని శాపం ,కళావతి వృత్తాంతం అనే మూడు ఉపకథలున్నాయి .మనోరమను శపించి ,నాగబెత్తం తో కొట్టే ప్పుడు ,వంచనతో విద్యపొంది ‘’గుండ్రా డాచిన పెండ్లి ఏమిటికి జిక్కుం గష్టముస్టింపచా ‘’అని నవ్వే ఇందీవరుని శపించే బ్రహ్మ మిత్రునిలో రౌద్రరసం ,దేవాసి అనే గంధర్వుని దేహ వర్ణనలో ,వాడు పారర్షి ని చంపేటప్పుడు భీభత్స రసం ,పుంజికస్థల అనే అప్సరస పారర్షి తపో భంగం చేసేటప్పుడు శృంగారరసం ,పోషింప బడ్డాయి.కాని ఈ శృంగారం తలిదండ్రుల దగ్గర కళావతి వర్ణించి చెప్పటం ఔచిత్య భంగమై రసాభాసమయ్యిందని ,’’జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ‘’అని పించుకున్న ఆది దంపతుల శృంగారాన్ని వర్ణించటం కాళిదాస మహాకవికి ఒక్కడికే చెల్లిందని రాజన్నశాస్త్రి గారు వాక్రుచ్చారు .దీనికి ‘’కావ్యాను శాసనం కు వృత్తి లో చెప్పబడిన శ్లోకాన్ని ఉదాహరించారుకూడా –
‘’కింతు రతిః సంభోగ శృంగార రూపా ,ఉత్తమ దేవతా విషయా న వర్ణనీయా –తద్వర్ణనం హి పిత్రోః సంభోగ వర్ణనమివాత్యంత మనుచితం .యత్తు కుమార సంభవే హర గౌరీ సంభోగ వర్ణనం తత్కవి శక్తి తిరస్కృత తత్వాత్ భూమ్నా న దోషత్వేన ప్రతిభాసతే ‘’.
ఏతావాతా మనుచరిత్ర ప్రబంధం లో వరూధినీ ,స్వరోచి ల వృత్తా౦తాలే ప్రధాన ఇతి వృత్తం .స్వారోచిష మను సంభవమే కథా ఫలం .శృంగారమే ప్రధాన రసం అని తేల్చిమళ్ళీ మళ్ళీ చెప్పారు డా .రాజన్న శాస్త్రిగారు .
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-18-ఉయ్యూరు

