గౌతమీ మాహాత్మ్యం-5
ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం
గౌతముడు కైలాసం చేరి దర్భలు పరచుకొని వాక్కును నియంత్రించి శుచియై మహేశ్వర స్తుతి చేయగా పుష్పవర్షం కురిసింది .ప్రీతి చెందిన ఉమాపతి పార్వతీ గణేశులతో ప్రమధగణ౦ తో సహా ప్రత్యక్షమై ‘’నీ స్తోత్రానికి పరవశంకలిగింది .ఎలాంటి కష్టమైన కోరికనైనా తీరుస్తాను ‘’అన్నాడు ఆనందబాష్పాలతో గౌతముడు ‘’మహేశ్వరా !నీ జటాజూటం లో ఉన్న గ౦గను నాకు ఇవ్వు’’అనగానే ముల్లోకాలకు ఉపయోగపడేట్లు కోరిన నీకోరిక సమంజసం .నీకోసం ఏదైనా కోరుకో ‘’అన్నాడు .తాను చేసిన శివ స్తోత్రం చదివిన వారి కోరికలు తీరి ,సకల సంపన్నులయ్యేట్లు చేయమని కోరాడు .తధాస్తుఅని ఇంకేదైనా కోరుకోమన్నాడు శంకరుడు . ‘’జగన్నాథా సదాశివా !లోక పావని అయిన గంగాదేవిని బ్రహ్మగిరిలో వదిలిపెట్టు .ఈ గంగానది సముద్రం చేరేదాకా స్నాన మాత్రం చేత సకలపాపాలు ,బ్రహ్మ హత్యాది పాతకాలు నాశన మయ్యేట్లు ,ఇతర పుణ్య తీర్దాలలో చంద్రగ్రహణ ,సూర్యగ్రహణ,ఉత్తరాయణ ,దక్షిణాయణ,విషువత్ ,సంక్రాంతి ,నైద్రుతి యోగం మొదలైన అన్ని పర్వదినాలలో ఎలాంటి పుణ్యఫలం కలుగుతుందో ,అలాంటి ఫలం గంగా స్మరణమాత్రం చేత కలిగేట్లు వరమివ్వు .ద్వాపరం లో యజ్న్ దానాలు, కలియుగం లో దానం ఒక్కటే గొప్పగా చెప్పబడ్డాయి .సకల యుగ, దేశ ధర్మాలు ,స్నాన దాన తపస్సులవలన వచ్చే పుణ్యం ఈ గౌతెమీనదిని స్మరించిన మాత్రం తో లభించేట్లు చెయ్యి .గౌతమీనదీ ప్రవాహం ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ నువ్వుఉండాలి .గౌతమిలో స్నానం చేసినవారు మహాపాతకులైనా సరే ,లేక పది యోజనాల దూరం లో చనిపోయినా వారి పితరులు ముక్తిపొందాలి .స్వర్గ మర్త్య పాతాళ తీర్దాలలన్నిటికంటే గంగా తీర్ధం శ్రేష్టమై ఉండాలి .ఇంతకంటే నాకోసం ఏమీఅక్కర్లేదు ‘’అనగానే పరమాన౦ద౦ తో పరమ శివుడు అలాగే అని చెపి అంతర్ధానమయ్యాడు .గౌతముడు శివానుగ్రహం తో పూర్ణబలుడై శివుని జటను,అందులోని గంగను తీసుకొని బ్రహ్మగిరి చేరాడు .ముని గణం విప్రజనం జయజయ ధ్వానాలతో స్వాగతం పలికి అర్ఘ్య పాద్యాలతో పూజించారు .
ఏడవ అధ్యాయం –15రూపాలుగా గంగ గమనం
గౌతముడు బ్రహ్మగిరిపై శివ జటాజూటాన్ని ఉంచి శివుని ,గంగను స్మరిస్తూ ‘’త్రిలోచ జటాజూటం నుండి పుట్టిన గంగామాతా !సకలకోర్కేలను తీర్చే తల్లీ క్షమించు , శాంతించు .సుఖంగా ప్రయాణం చేయి లోకహితం కలిగించు .’’అని ప్రార్ధించాడు గంగాదేవి దివ్య రూపం లో కనిపించి ‘’నేను దేవలోకానికి వెళ్ళనా ?బ్రహ్మ కమండల౦ లోకి మళ్ళీ చేరనా,రసాతలం లోకి వెళ్ళనా సత్య వాక్ సంపన్నుడవైన నువ్వే చెప్పు ‘’అన్నది .గౌతముడు ‘’మూడులోకాలకు ఉపకారం చేయటానికే శంకరుని అనుమతితో నిన్ను తెచ్చాను’’అన్నాడు .గంగా దేవి సంతోషించి మూడుభాగాలుగా మారి అందులో స్వర్గం వైపు నాలుగు ప్రవాహాలుగా ,భూలోకం లో ఏడు ప్రవాహాలుగా ,రసాతలం లో నాలుగు పాయలుగా ఉండేట్లుమొత్తం 15రూపాలు ధరించి బయల్దేరి చేరింది .
అన్ని చోట్లా సర్వ ప్రాణికోటి కోర్కెలను తీరుస్తూ ,వేద వినుతయైనది. మానవులు భూలోకం లోని గంగమాత్రమేచూడగలరు .సముద్రం చేరేవరకు దేవ స్వరూపిణిగానే కీర్తి౦ప బడుతోంది .గౌతముడు శివుని పూజించి ‘’గోదావరీ తీర్ధ స్నాన విధి ‘’వివరించమని కోరాడు. ‘’శివుడు ‘’ముందు నాందీముఖ శ్రాద్ధం పెట్టి, దేహ శుద్ధి చేసుకోవాలి. తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారి అనుజ్ఞతో పతితుల వార్తలను మాట్లాడకుండా బ్రహ్మ చర్యం తో, గోదావరీ యాత్ర ప్రారంభించాలి .ఈ యాత్రలో సర్వే౦ద్రియాలు వశం లో ఉండాలి అహంకార మమకారాలు తొలగించుకోవాలి ,,మనసులో దుస్టభావన లేకుండా ధర్మం పైనే పూర్తి శ్రద్ధతో ,దారిలో అలసిపోయిన వారికి సేవలు చేస్తూ ,వీలునిబట్టింనదానాలు చేస్తూ ,దరిద్రులకు ,సాధువులకు వస్త్రాలు కంబళ్ళు అందిస్తూ,హరి గానంతో, హరికి సంబంధించిన కథలు గంగోద్బవ కథలు వింటూ ప్రయాణం చేస్తే సంపూర్ణంగా గంగా తీర్ధ ఫలం పొందుతారు ‘’అని శివుడు గౌతమునికి బోధించాడు’.
సశేషం
నాగపంచమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-11-18-ఉయ్యూరు .
—

