గౌతమీ మాహాత్మ్యం-8
పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం
బ్రహ్మ నారదునికి కుశావర్తపు మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు ‘’గౌతమమహర్షి దర్భాలచే త్రిప్పిన తీర్ధమే కుశావర్తం .ఇందులో స్నాన తర్పణ,దానాలు శ్రేష్టం. బ్రహ్మగిరిలో ఒక కిరాతుడు బ్రాహ్మణ, సాధు ,యతులను, గోవులను ,పక్షి మృగాలను విపరీతంగా హింసించేవాడు .వాడి ఆకారం, మాట భీకరం వికృతాకృతి కలవాడు .వాడిభార్యాపిల్లలూ అలాంటి వాళ్ళే .ఒక రోజు కొన్ని పక్షులను పట్టి పంజరం లో బంధించాడు.వేటకు వెళ్లి అలసి ఇంటికి వస్తున్నాడు .అనుకోకుండా రాళ్ళ వర్షం గాలి తో అల్లకల్లోలమైంది .దారి తెలియలేదు .ఒక చెట్టు దగ్గరకు చేరి ,తన పనే ఇలాఉంటే ఇంటిదగ్గర పెళ్ళాం పిల్లలు ఏమి అవస్తపడుతున్నారో అనుకున్నాడు .ఆ చెట్టుపై ఒక కపోతం అంటే పావురం సంతానం తో ఉంటోంది .అతడిభార్యకూడా ఉత్తమగుణాలుకలది .కపోత జంట ఆహారానికి వెళ్ళాయి .మగపావురం తిరిగి వచ్చింది ఆడపావురం వేటగానికి చిక్కింది..మగపావురం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొంటోంది .చీకటి పడింది .ఆడపావురం ఏమైందో భర్తకు తెలియదు .భార్యను గురించి ఆలోచిస్తున్నాడు,ఆమె మంచితనాన్ని పొగుడుతున్నాడు .వేటగానికి చిక్కిన ఆడపావురం తాను కిరాతుని బందీగా ఉన్నానని ,తనభర్త తనను మెచ్చటం ఆమెకెంతో ఊరట కలిగించి౦దని చెప్పింది .భర్తతో భార్యపావురం ‘’నువ్వే నాకు రక్షా నువ్వే వ్రతం ,పరంబ్రహ్మ౦, మోక్షం .నేను చనిపోతానని విచారించకు .నీబుద్ధిని ధర్మ౦పై ఉంచు .నీవల్ల అన్ని భోగాలు అనుభవించాను ‘’అనగా విని కిందకు దిగి మగకపోతం .’’అలసిన కిరాతుడు బాగా నిద్రపోతున్నాడు .పంజరం నుంచి నిన్ను విడిపిస్తాను ‘’అనగా భార్య ‘’భార్యాభర్తల సంబంధం అస్థిర మైంది .లుబ్ధులకు పక్షులు ఆహారం .ఒకప్రాణి మరోదానికి ఆహారం .వీడి తప్పేమీ ఉన్నట్లు నాకు అనిపించలేదు .బ్రాహ్మణులకు అగ్ని దైవం. స్త్రీలకూ పతి దైవం.వీడు మన అతిధి .అభ్యాగతికి అన్నదానం చేస్తే ఇంద్రుడు సంతృప్తి పొందుతాడు. అతనిపాదాలుకడిగితే పితరులు ,అన్నం పెడితే ప్రజాపతి ,ఉపచారాలు చేస్తే లక్ష్మీనారాయణులు పడుకొనే చోటిస్తే సర్వ దేవతలు తృప్తి చెందుతారు.అతిధి దేవుడే అతనిసేవ అన్ని క్రతువులవలన లభించే ఫలానికి సమానం .అపకారికి ఉపకారం చేసి న వాడే సజ్జనుడు’’అని చెప్పింది. మగపావురం’ధర్మబద్ధమైన మాటలు చెప్పావు .నేనుఇప్పుడు ఏమి చేయాలో చెప్పు ‘’అని అడిగాడు.ఆమె ‘’ నిప్పు, నీరు, మంచిమాట, గడ్డి, కట్టెలు అర్ధికి ఇవ్వతగినవి ‘’అని చెప్పగా దూరంగా కనిపించే అగ్నిని ముక్కుతో తెచ్చి అగ్నిని రాజేసి ఎండుపుల్లలు ఏరి తెచ్చి వేసి మంటపెంచి మగపక్షి వాడి చలి తీర్చింది .ఆడపావురం భర్తతో ‘’నన్ను విడిపించవద్దు .నా శరీరం తో వీడి ఆకలి తీర్చి పుణ్యం పొందుతాను ‘’అని భర్తకు చెప్పగా మగపావురం ‘’నేనుండగా అలా కానివ్వను .నేనే అగ్నికి ఆహుతి అయి, వాడి ఆకలి తీరుస్తా’’ అంటూ అగ్నికి మూడు ప్రదక్షిణాలు చేసి మహా విష్ణువును ధ్యాని౦చి అగ్నిలో దూకగా లుబ్ధకుడు ‘’మనిషినైన నా జీవితం వ్యర్ధం .ఈ పక్షి ఎంతో సాహసం చేసింది నాకోసం .అనుకోగా ఆడపక్షి ‘’నాభర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు .నన్ను వదిలిపెట్టు ‘’అంటే వదిలేశాడు. అది కూడా అగ్ని ప్రదక్షణం చేసి నిప్పులో దూకబోతూ .తామిద్దరంస్వర్గానికి వెడుతున్నామని దయతో తమ పిల్లలను ఏమీ చేయక వదిలిపెట్టమనిబోయను ప్రార్ధించగా వాడు ఆశ్చర్యపోయి పిల్లలజోలికి పోలేదు .వెంటనే అగ్నిలోదూకింది . జయాయధ్వానాలు మిన్ను ముట్టాయి .ఆకశం లో దివ్యవిమానం అందులో కపోతజంటకనిపించాయి. ఆనందంతో ఆజంట’’మాకు స్వర్గం రావటానికి కారణమై అతిధి వైన నీకు ధన్యవాదాలు .సెలవివ్వు ‘’అన్నాయి .ఈ సన్నివేశంతో మనసు మారి కిరాతుడు విల్లు అమ్ములు వదిలేసి ‘’అజ్ఞానినైన నాకు బుద్ధిచెప్పారు .నిజంగా మీరే నాకు అతిధులు .నాకు నిష్కృతి చెప్పతగినవారు ‘’అని ప్రార్ధించగా ‘’గౌతమీనదిలో 15రోజులు స్నానం చేస్తే నీపాపాలన్నీ పోతాయి .గౌతమి స్నానం అశ్వమేధయాగ ఫలిత సమానం .నీపాపాలు తొలగాగానే స్వర్గానికి చేరగలవు ‘’అన్నాయి .వాడు అలాగే గౌతమీ స్నానం చేసి పాపాలు పోగొట్టుకొని దివ్య పురుషుడై,దివ్యవిమానం లోస్వర్గం చేరాడు.గౌతమిప్రభావం వలన కపోతద్వయం, వ్యాధుడూ పావనమై స్వర్గం చేరారు .అప్పటిను౦చే ఇది కపోత తీర్ధంగా ప్రసిద్ధి చెందింది .ఇక్కడ స్నాన, దాన ,తర్పణాదులన్నీ ఉత్తమ ఫలితాలనిస్తాయి ‘’అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-18-ఉయ్యూరు

