గౌతమీ మాహాత్మ్యం -10
17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦
బ్రహ్మ ‘’చక్రతీర్ధం విశేషమైనది .ఇక్కడి స్నానం వైకుంఠ ప్రాప్తి నిస్తుంది .శుక్ల ఏకాదశినాడు గణికా సంగామస్నానం పరమపద హేతువు .పూర్వం విశ్వధరుడనే వైశ్య ధనవంతునికి ముసలితనం లొ ఒక కొడుకు కలిగాడు .సకల సద్గుణరాశి .కాని చిన్నతనం లోనే చనిపోయాడు .ఆ తలి దండ్రుల దుఖం వర్ణనాతీతం .వాడితోపాటే మరణి౦చాలనుకొన్నారు .వారి కడుపుశోకం విన్నయముడు మనసుకరిగి ‘’డ్యూటీ మానేసి’’ గోదావరీ తీరం చేరి నిష్టతో జనార్దన ధ్యానం చేశాడు .దీనితో మరణాల సంఖ్యతగ్గి జనాభావృద్ధి చెంది భూభారం విపరీతంగా పెరిగింది .భరించలేని భూదేవి దేవేంద్రునికి మొరపెట్టి కారణం అడిగింది .తనకు తెలియదన్నాడు .అయితే ప్రజలను సంహరించేట్లు యముని ఆదేశించమని కోరింది .యముడిని త్వరగా తీసుకురమ్మని ఇంద్రుడు సిద్ధ కిన్నరులను పంపాడు .యమపురానికి వెళ్లి యముడు కనపడక ఇంద్రుడికి చెప్పారు .ఇంద్రుడు యముని తండ్రి ఐన సూర్యుని అడుగగా గోదావరీ తీరంలొ తీవ్ర తపస్సులో లొ ఉన్నాడని చెప్పాడు .కారణం మాత్రం తెలీదన్నాడు .ఇంద్రుడు తనపదవికి యముడు ఎసరు పెట్టబోతున్నట్లు భావించి మామూలు ప్రకారం తపోభంగానికి అచ్చరలను పంపాలను కొని వారిలో ఎవరు సమర్ధులు అని అడిగితె వాళ్ళు మాట్లాడలేదు .అప్పుడు తానె దేవ సైన్యం తో వెళ్ళాడు .ఇంద్రుని విషయం తెలిసి శ్రీహరి యమునికి రక్షగా చక్రాన్ని నిలిపాడు .అక్కడ చక్రతీర్ధమేర్పడింది .మేనక స్వామి భక్తితో తాను వెళ్లి తపోభంగం చేస్తానన్నది .సరే పొమ్మన్నాడు .రూపంమార్చి యముని దగ్గరకొచ్చింది .విలాసంగా ,కవ్వింపుగా హిందోళ రాగం తో అవ్యక్త మధురంగా పాడి నాట్యమాడింది .ఇంకేముంది’’ యముండ’’అని ప్రగల్భాలు పలికేవాడి మనసు చంచలమై ,కామాగ్ని దగ్దుడై మేనక పై మరులు చూపగా ,ఆమె అదృశ్యమై, నదీ రూపం పొంది ,గౌతమీ నదిలో చేరి దేవ విమానం లొ స్వర్గానికి బయల్దేరగా యముడు ఆశ్చర్యపోగా ,సూర్యుడు వచ్చి ‘’నీ పరి రక్షణ బాధ్యతమళ్ళీ చేబట్టు .ఎవరి విధి వారు చేయకపోతే జీవిత చక్రం నడవదు .నేనూ బ్రహ్మా భూదేవి మా విధిని ఎన్నడూ వదలలేదు .’’అనగానే యముడు ‘’క్రూరమైన కార్యం చేయల్సి వస్తోంది.చేయలేకపోతున్నాను ‘’అనగా తండ్రి ‘’మేనక గోదావరీ స్నానం చేసి స్వర్గానికి వెళ్ళటం చూశావు కదా .నువ్వు తీవ్ర తపస్సు చేశావు .తపస్సుకు అంతం లేదు .యమపురానికి వెళ్లి మళ్ళీ విధిలో చేరి పాలన సాగించు ‘’అని హితవు చెప్పి ,గౌతమీ స్నానం చేసి స్వర్గం చేరాడు భానుడు .యముడు కూడా గోదావరీ స్నానం చేసి యమపురి చేరాడు . అప్పటిదాకా యముడికి రక్షక చక్రంగాఉన్న విష్ణు చక్రం తన విధి పూర్త యినందున మళ్ళీ శ్రీ మహా విష్ణువును చేరింది .ఈ చక్రతీర్ధ కథవిన్నా, చదివినా ,ఆపదలు నశించి ,దీర్ఘాయుస్సుతో జీవిస్తారని నారదునికి బ్రహ్మ తెలియ జేశాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-18 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru