గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి
ప్రవరా నదీ సంగమం లో సిద్దేశ్వర శివుడుంటాడు .ఇక్కడే దేవదానవులకు మహా సంగ్రామం జరిగింది .ఇద్దరి మధ్య సదవగాహన కోసం మేరు పర్వతం చేరి సమాలోచన జరిపారు .అందరూకలిసి అమృతం ఉత్పత్తి చేసి తాగి అమరులై లోకపాలన చేద్దామని ,ఇక యుద్ధాలు చాలిద్దామని ,వైరం వదిలి సఖ్యం తో మెలిగి స్నేహంగా సంతోషంగా ఉందామని ,గతం గతః గ శత్రుత్వాన్ని మర్చిపోదామని ,స్నేహంగా ఉంటే త్రిలోకాధిపత్యం కైవల్యం కూడా సాటి రాదనీ భావించారు .మంధర పర్వతాన్ని కవ్వం గా ,వాసుకిని తాడుగా చేసిసముద్ర మధనం చేయాలని నిశ్చయించి మధించటం ప్రారంభించారు .
సముద్ర మధనం లో ముందుగా అమృతం లభించింది .వారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు ముందు అందరూ కలిసి అమృతం సమానంగా జుర్రేద్దామనుకొన్నారు .మళ్ళీ ఒక చోట శుభముహూర్తం లో చేరి అమృతం పంచుకొందామను కొని వెళ్ళిపోయారు .రాక్షసులు వెళ్ళిపోగా దేవతలు ఎట్టి పరిస్థితి లోనూ అమృతం రాక్షసులకు దక్కరాదనుకొనగా గురువు బృహస్పతి సరే అని ,దానవులకు దక్కకుండా అమృతాన్ని తాగేయమన్నాడు .ఎక్కడ తాగాలని అడుగగా,బ్రహ్మ దగ్గరకు వెళ్ళమన్నాడు బ్రహ్మతోకలిసి హరి దగ్గరకు వెళ్ళగా ,త్రిమూర్తులు దేవతలు ,గంధర్వులుకిన్నెరరాలు మేరు పర్వత గుహ చేరి హరి రక్షకుడుగా అమృత పానం మొదలుపెట్టగా ఆదిత్యుడికి అమృతపానానికి యోగ్యులేవరో నిర్ణ యించేఅధికారమిచ్చారు .శివుడు అమృతం పోసేవాడు .ఈ విషయం అత్యంత రహస్యం .కాని రాహువుకు మాత్రం తెలిసి ,దేవ రూపం పొంది వాళ్ళ సరసన కూర్చున్నాడు .గ్రహించిన సూర్యుడుశివుడికి చెప్పాడు .అప్పటికే సోముడు రాహువుకు అమృతం పోశాడు .శివుడు విష్ణువుకు చెప్పగా చక్రాయుధం తో రాహువు తలనరికాడు .వాడి శిరస్సు అమరమైంది .
శిరస్సు లేని రాహువు శరీరం నేలమీద గౌతమీనది దక్షిణ ఒడ్డు న పడి భూమిని కంపిప జేసింది . రాహుదేహమూ అమృతమైంది .అమిత బలపరాక్రముడైన రాహువు శిరస్సు మొండెము కలిపితే వాడు లోకాన్ని నాశనం చేస్తాడు కనుక వాడి దేహాన్ని దహనం చేద్దామనుకొన్నారు దేవతలు .శివుడు తన అర్ధాంగి ,మాతృకలతో పంపాడు .ఆమె శివుని ఆయుధం ధరించి భూమిపై వాడి దేహం భాక్షించాలను కొన్నది .దేవతలు శిరస్సును మేరు పర్వతం మీద కాపలాకాశారు .రాహు శరీరం తో దేవి చాలాకాలం యుద్ధం చేసి౦ది ..రాహు శిరస్సు దేవతలతో ‘’నా శరీరం చీల్చి అందులోని ధనరాశులను లాగేస్తే నా శరీరం క్షణం లో భస్మమౌతుంది ‘’అని ఉపాయం చెప్పింది .ఆనంది౦చిన సురలు రాహువును గ్రహంగా చేశారు .ఈశ్వరీ శక్తి రాహువు మొ౦డాన్ని చేదించి ధనరాశులు లాగేసి వాడి శరీరాన్ని భక్షించింది .ఈ శక్తికే భద్ర కాళి , కాళరాత్రి అనే పేర్లున్నాయి .అంబిక లో ఉన్న ఉత్కృష్ట రసం ప్రవహించి ప్రవర అనే నది అయింది .ఆ శరీరం లోని లోని అమృతాన్ని దేవి భక్షించింది .
రాహు దీహం నుండి ఉత్పన్నమైన రుద్రుని శక్తితో కూడిన ప్రవరానది అమృత నది అయింది .ఇందులో అయిదు వేల తీర్ధలున్నాయి .అన్నిటిలో శివుడు ఉంటాడు .దేవతలంతా ఆనదిని దీవించారు .ప్రవరా నది గంగతో కలిసిన సంగమం ప్రవరాస౦గమం .ప్రవరా నది మహా నదిగా వర్ధిల్లింది అని బ్రహ్మ నారదుని తెలియజేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-18-ఉయ్యూరు

