- గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం )
12వ శతాబ్దం లో కొంకణ దేశాన్ని పాలించిన అపరార్కాదిత్య మహారాజు ‘’న్యాయముక్తావళి రచించాడు .ఇది యాజ్న్య వల్క్య స్మృతికి వ్యాఖ్యానం .జీమూతవాహనుని వంశం లో విద్యాధర కుటుంబానికి చెందినవాడు
యాజ్ఞవల్క్య స్మృతికి అనేక వ్యాఖ్యానాలున్నాయి .అందులో విశ్వరూప విజనేశ్వర ,అపరార్క ,శూలపాణి ల వ్యాఖ్యానాలు ముఖ్యమైనవి .ఆధునిక శిక్షాస్మృతిలో మితాక్షర ప్రాధాన్యం ఉన్నది కనుక యాజ్ఞావల్క్యుని స్మృతి అన్నటికంటే ఉన్నత స్థాయి పొంది,మార్గ దర్శకమైంది .ఈనాటి శిక్షాస్మృతికి అదే ఆదర్శమైంది .దీనికి సిలహార వంశానికి చెందిన అపరార్కాదిత్య రాసిన ‘’అపరార్క యాజ్ఞవల్క్య ధర్మశాస్త్ర నిబద్ధ ‘’ ను రెండుభాగాలుగా ఆనందాశ్రమం ప్రెస్ ప్రచురించింది .
1-శ్రుతి స్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః –సంయక్సంకల్పజః కామో ధర్మ మూలమిదం స్మృతం ‘’
347-న్యాయ సార పదపంచిక కర్త –వాసుదేవ (10 వ శతాబ్దం )
భా సర్వజ్ఞరాసిన న్యాయ సార కు వాసుదేవ కవి ‘’న్యాయసార పదపంచిక ‘’వ్యాఖ్యానం రాశాడు .ఈయన కాశ్మీరకవి .తండ్రి సూర్య .వాసుదేవ తన వ్యాఖ్యానం ఉపోద్ఘాతం లో తన రచన ‘’న్యాయభూషణం ‘’ వంటి బృహత్ వ్యాఖ్యానాలను అర్ధం చేసుకోలేనివారికోసం రాసినట్లు చెప్పాడు .నిగ్రహస్థానం ,ప్రతిజ్ఞాహాని ల విషయాలు చెప్పాడు .నిగ్రహస్థానం లో ప్రతిజ్ఞా విశేషహాని మొదలైన స్వల్ప భేదాలున్నాయని తన న్యాయ భూషణం లో వివరించి నట్లు చెప్పటం వలన న్యాయభూషణ కర్తకూడా వాసుదేవ అయి ఉండాలి .దీనిలోని విషయాలను జయసి౦హసూరి తరచుగా ఉటంకించాడు . కనుక వాసుదేవ కాలం 10వ శతాబ్దం మధ్య భాగం అని భా సర్వజ్ఞ కు తర్వాత అతి దగ్గర కాలం వాడని చెప్పవచ్చు ,
1-దేవ దేవ మభి వంద్ధ్య శాశ్వతం –యోగ వృంద హృదయైకమందిరం –వాసుదేవ విదుషా విరచ్యతే –న్యాయ సార పదపంచికా పరం ‘’
‘’ప్రణమ్య శంభుం జగతః పతిం పరం సమస్తతత్వార్య విదం స్వభావతః –శిశు ప్రబోదాయ మయాభిదాస్యతే –ప్రమాణ తత్భేధ తదన్య లక్షణం ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-18-ఉయ్యూరు

