ఇప్పుడు అసలు కథ లోకి వద్దాం .అప్పటికి కృష్ణుడికి 10ఏళ్ళు లేక కొంచెం తక్కువ మాత్రమే అని మర్చి పోరాదు.బృందావన గోపికలు ‘’కాత్యాయని వ్రతం ‘’ చేస్తున్నారు .శ్రీ కృష్ణుని’’ తమ పతి’’గా చేసుకోవటానికి చేస్తున్న వ్రతం అది .ఇది చాలా నియమాల తోరణం .తెల్లవారు ఝామున యమునా నదిలో స్నానం ,నది ఒడ్డున ఇసుకతో పార్వతీ దేవి ప్రతిమ తయారు చేసి యధావిధిగా పూజించటం ,నెల రోజుల కార్యక్రమం .చివరి రోజున జరిగిందే గోపికా వస్త్రాపహరణం .కాత్యాయని వ్రత దీక్షలో ఉన్నప్పుడు వారు నగ్నం గా స్నానం చేయరాదని కృష్ణుడు చెప్పాడు .వాళ్ళు వ్రతభంగం చేసినందుకు శిక్షగా’’ చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు ‘’ .తర్వాత వాళ్ళ’’ వలువలు’’ వాళ్ళ కిచ్చి వేశాడు .వారు కోరిన కాత్యాయన వ్రత ఫలంగా-అంటే కృష్ణుని పతిగా పొందే భాగ్య ఫలంగా కొద్దికాలం లోనే వారికి కోర్కె తీరుస్తానని బాస చేశాడు .ఈ సందర్భంగానే ఆయన వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా చెప్పాడు –
‘’ న మయ్యా వేషిత ధియుం కామః కామయ కల్పతే –భర్జితా,ఖచ్చితా ధన ప్రయో బీజయ నేష్యతే’’-అంటే –మీలో ఎవరు మీ మనసు,బుద్ధి నావైపు త్రిప్పి ఉంచారో ,వారిలో కోరిక ,లేక మోహం కలిగి నందువలన అది వేడి చేసిన లేక ఉడకేసిన విత్తనం మొల కెత్తని విధం గా చెడు లేక దోషం కానే కాదు.మన సర్వ వేదాంత గ్రంథాలు కూడా బ్రహ్మ జ్ఞానికి కర్మవాసనలు వేడి చేసిన విత్తనం మొలకెత్తని విధంగా అంటవు,వెంటరావు అనే చెప్పాయన్న సంగతి మర్చిపోరాదు .
గోపికల కాత్యాయని వ్రత ఫలితం అందుకొనే రోజు శరత్ పౌర్ణమి రానే వచ్చింది . ఆయన మాయ చే సృష్టింపబడిన’’ దివ్య లీల’’ ఇది .-‘’యోగమయం ఉపశ్రితః ‘’అన్నాడు అందుకే .పున్నమి నాటి రాత్రి బాలకృష్ణుని సమ్మోహిత మధుర వేణుగానం యమునానదీ తట విపిన సీమలలో ప్రతిధ్వనించి ,ప్రకృతిని సర్వజీవజాలాన్ని పరవశం కలిగిస్తోంది .గోపికల వీనులకు విందుగా ధ్వనించి అద్భుత రసవాహినియై మనసులను, శరీరాన్ని పుల కింప జేస్తోంది .ప్రతివారిని దైనందిన కృత్యాలకుదూరం చేసి ,ఆనంద పారవశ్యం తో యమునా తీరం వైపుకులాక్కు వెడుతోంది .దీనికేవరూ మినహాయింపుగా కనిపించలేదు .చెట్లు లతలు పొదలు పూలు ,ఆకులు పక్షులు జంతువులు మంత్ర ముగ్ధంగా నిలబడి పోయాయి .ఆ దివ్య వేణునాదం అందరి తనువూ మనసులను పులకరి౦ప జేసి, చిత్తరువు బొమ్మలైపోయారు.ఈ మధుర దృశ్యాన్ని కరుణశ్రీ గారు కమ్మని పద్యాలలో పొదిగారు –
‘’ఏది మరొక్కమారు హృదయేశ్వర గుండెలు పుల్కరించగా ఊదగ దోయి, ఊదగ దోయి –యుష్మదీయ వేణూదయ రాగ డోలికలలో జగమ్ము సర్వమ్ము పులకరించిన దోయి ‘’
ఈ సంపూర్ణ మధుర దివ్యనాదం ఆలకించిన గోపికలకు మనసు మనసులో లేదు .పారవశ్యం తో ఎక్కడిపనులక్కడే వదిలేసి భర్త, తండ్రి, అత్తామామ,బంధుత్వాలను కూడా విసర్జించి ,తమను తామే పూర్తిగా మరచిపోయి ఆ నాదం వైపుకు బారులుకట్టి పరుగులు తీశారు .కృష్ణ వేణునాదం ఎరవేసి వాళ్ళను లాక్కు పోయింది .కొందరు గోపికలు ఇంటిపనులు సంసారం వదిలి పెట్టలేక ఇళ్లలోనే ఉంటూ ,బాల కృష్ణుని పై అపార ప్రేమతో ,కళ్ళు మూసుకొని ఏకాగ్ర చిత్తం తో ఆ వేణుగానాన్నివింటూ పరవశించారు .శ్రీకృష్ణుని తో ఎడబాటుకు తల్లడిల్లిపోయారు .దీనితో వారి పాప మంతా దగ్ధమైపోయింది –‘’తీవ్ర పాప ధృత శుభం ‘’ .ద ఆయనపై సంపూర్ణ ధ్యాస,ఆరాధనతో వారు ఆయన పరిష్వంగ సుఖపారవశ్యం పొంది ,వారి భౌతిక భక్తి నశించి ఆధ్య్యాత్మికాన౦ద౦ పొందారు .కృష్ణుడు దేవాది దేవుడై,పరమాత్మయై,తమకు అత్యంత మానస ప్రియుడై ,స్నేహితుడై ,అత్యంత సన్నిహితుడైపోయాడు .వారి కర్మ బంధాలన్నీ చేది౦ప బడ్డాయి.భౌతిక శరీరాలు నశించి ,ఆధ్యాత్మిక శారీరులైనారు .
ఇక్కడే పరీక్షిత్ మహారాజుకు ఒక ధర్మ సందేహం వచ్చి శుకమహర్షిని ‘’మహర్షీ !గోపికలు కృష్ణుని తమ ప్రియుడు అనే భావించారు కాని ,శుద్ధ సత్య స్వరూపం అనే ఎరుకలేదు .వారు తమ స్వస్వరూప భావన వదిలి భౌతిక బంధాలను ఎలా చేది౦చు కోగలిగారు ?’’ఆని అడిగితె శుకుడు ‘’కృష్ణుని ద్వేషించిన శిశుపాలుడే కర్మబంధ విమోచనం పొందితే ,ఆయనను అత్యంత ప్రేమగా ఆరాధించే గోపికలకు విమోచనం కలగటం లో ఆశ్చర్యమేమున్నది ?పరమాత్మ ప్రమాణాలకు అందనివాడు .ఆయన కొరతలేని నిత్య సంపూర్ణుడు .మాయ ఆయన సృష్టి,దాని నియంత్రణ చేసేవాడు కనుక ప్రకృతికి బంధుడు కాదు .ఆయన అవతార పరమార్ధం మానవులకు అత్యంత ప్రయోజనాలు సమకూర్చటమే .కోరిక ,కోపం ,భయం ,రక్షణ ,ఆయనతో తాదాత్మ్యభావం ,ఆయనతో స్నేహం ఉన్నవారందరూ ఆయన స్మరణతో ఆయనలో ఐక్యమైపోతారు .దీనికి ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు .నువ్వు చాలా అదృష్ట వంతుడవు రాజా !నువ్వు గర్భం లో ఉండగానే ఆయన దర్శనం అనుభవించిన పుణ్యా త్ముడవు .’’అని సందేహాలన్నీ నివృత్తి చేశాడు శుకర్షి .
బాలకృష్ణుడు గోపికలంతా బిరబిరా తన వద్దకు రావటం మూగటం గమనించి ,వెనక్కి వెళ్లి పొమ్మని చెప్పాడు .వాళ్ళ మొదటికర్తవ్యం ఇంటి వద్ద భర్తను ఇంటిని పిల్లలను చూసుకోవటం అని చెప్పి ‘’మీకు నాపై అత్యంత ప్రేమాభిమానాలున్నాయి నాతో అనుబంధం ఉందిమీకు .ఇది మీకు సహజమే .ప్రపంచం లో ప్రతిజీవి నాతో ఆనందం అనుభవిస్తారు –‘’ప్రియంతే మయి జనతాః’’.కాని మీ విధి కృత్యం వేరే చోట ఉంది .గౌరవ కుటుంబాలకు చెందిన మీలాంటి స్త్రీలు ఇలా చేయటం దోషం .వారు పతనమై స్వర్గానికి దూరమై , సంఘం లో గౌరవం కోల్పోయి కస్టాలు ,దుఖం అనుభవిస్తారు ‘’అని చెప్పి ఒక గొప్ప శ్లోకం చెప్పాడు దానిని ఆయన మళ్ళీ చెప్పాడు తర్వాత .-
‘’శ్రవణాత్ ,దర్శనాత్,ధ్యానాత్ మయి భావో ను కీర్తనాత్-న తథా,సన్ని కర్షేణప్రతియాత తతో ఘ్రాన్’’-
అంటే –నాపై పారమార్ధిక ప్రేమ కలగటానికి నిరంతరం నన్ను గురించివినటం ,నా ప్రతిమను ఆరాధించటం ,నాపై ధ్యానం ,విశ్వాసంతో నా గుణ గాన కీర్తన చేయటం చేయాలి .నాతో భౌతిక సామీప్యత వలన పై ఫలితం రాదు .కనుక దయచేసి మీ ఇళ్ళకు తిరిగి వెళ్లి పొండి’’అని పరిపరివిధాల నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు కృష్ణుడు .
సశేషం
రేపు 20-12-18 గురువారం మార్గశిర శుద్ధ త్రయోదశి –శ్రీ హనుమద్ వ్రతం శుభాకాంక్షలతో
– మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-18-ఉయ్యూరు

