రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4
కృష్ణుడు యెంత నచ్చ చెప్పినా గోపికలు వినలేదు .మొదట భర్తకు ,తర్వాత కుటుంబ విధి అని ఆయన చెప్పినదానికి ఆయనే తమ పతి,తమకే కాక ఎల్లలోకాలకు ఆయనే భర్త అని ,కనుక తమ మొదటికర్తవ్యం శ్రీ కృష్ణుని సేవయే అని ‘’మా హృదయాలు ,శరీరాలు కుటుంబం సర్వం నీకే ఆధీనాలు .నువ్వే వీటినన్నిటినీ లోబరచుకోన్నావు .మా చేతులు ,కళ్ళు బుద్ధి మనసు మావికావు .అవన్నీ నీవే .నీకు కానిపనిని దేనినీ అవి చేయటానికి అంగీకరించటం లేదు .కనుక నీ అధీనులమైనమమ్మల్ని వెనక్కి వెళ్ళమని అనవద్దు స్వామీ .మమ్మల్ని నీసేవకులుగా వినియోగించుకో ప్రభూ ‘’అని వేడుకొన్నారు –
‘’ఇతి వికల వికటం తాసాంశ్రుత్వ యోగేశ్వరేశ్వర-ప్రహస్య సదయం గోపిః ఆత్మా రామో ప్యరిరమత్’’
గోపికల మాటలకు చిరునవ్వు నవ్వి జగత్ ప్రభువు, సర్వ లోక నాధుడు వారందరినీ సంతృప్తి పరచాడు .ఆయన స్వయం సంతృప్తి ఉన్న మహానుభావుడుకదా.ఆయన ఆత్మారాముడు .ఆయన దగ్గర లేనిది లేదు –‘’నానవాప్తం అవాప్తవ్యం ‘’అని గీతలో ఆయనే చెప్పాడు .ఎప్పుడైతే వారిని తనకు అత్యంత సన్నిహితులని భావి౦చాడో అప్పుడు గోపికలు తాము ఉత్కృస్ట జీవులమని భావించారు .తామే భూ ప్రపంచం లో లోఅత్యంత గొప్పవాళ్ళం అనుకొన్నారు .దీనితో వారిలో కించిత్ గర్వ రేఖను స్వామి కనుగొన్నాడు .వారి కి సరైన ఆధ్యాత్మిక బోధ చేయాలని భావించి ,అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు .
బాల కృష్ణుని కోసం గోపికలు అన్ని చోట్లా వెతకటం ప్రారంభించారు .ఆయన ఎడబాటును సహించలేకపోయారు .తట్టుకోలేక పోయారు .బుద్ధి పని చేయటం లేదు .ఆయనంటే విపరీతమైన పిచ్చ పట్టింది .దీనినే విరహం అంటారు .భక్తి లో ఇది ఉత్కృష్ట స్థాయి .అందరికి భగవంతు డంటే ఇష్టమే .కాని ఆయన ఎడబాటును గోపికలు భావి౦ఛి నంతగా మనం అనుభవించలేము .భగవంతుడు మనం ఇచ్చేది స్వీకరించడు అనుకొంటాం .కాని భక్త శబరి ఇచ్చినట్లుగా మనం ఇవ్వగలమా ?.దేవుడు మనమొర ఆలకించి మనల్ని రక్షించడు అని భావిస్తాం ,కాని ద్రౌపది పిలిచిన౦త ఆర్తిగా పిలుస్తామా ?దేవుడు మనకు వరాలివ్వడనుకొంటాం ,కాని రాధ ప్రేమించినంత గాఢంగా ఆయన్ను ప్రేమించగలమా ? అంటే మనం చేసేదాంట్లో తీవ్రత ఉంటేనే ఆయన నుంచి స్పందన ఉంటుంది .ఏదో పూజా నైవేద్యాలతో సరిపెట్టుకొంటే ఆయనా అలాగే ఉపేక్ష భావంతోనే ఉంటాడు .
గోపికలు ఆ అడవి అంతా గాలించారు .దారిలో ఆయన పాదముద్రల ఆనవాళ్ళు కనిపిస్తే వాటి నాధారంగా వెతికారు .తర్వాత ప్రక్కప్రక్కనేపాదముద్రల ద్వయం కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించాయి .అందులో ఒకటి స్త్రీపాదంగా. రెండోది స్వామి పాదంగా గుర్తించారు .వాళ్లకు అసూయ హద్దు మీరింది .తమలోనే ఎవరో ఆయనతో గడుపుతున్నారని అనుమానమొచ్చింది .ఆమె తమకన్నా గొప్ప అదృష్టవంతురాలు అనుకొన్నారు .కృష్ణస్వామితో ఉన్న ఆ ఒంటరి గోపికకు తమాషా అనుభవం ఎదురైంది .తానె అదృష్టవంతురాలననుకొని ఆయన్ను తనను మోసుకొని వెళ్ళమని కోరింది .నవ్వుతూ సరే అని భుజాలమీద ఎక్కమన్నాడు .ఎక్కే ప్రయత్నం చేస్తుండగా చటుక్కున మాయమయ్యాడు .దీనితో ఆమె గర్వం ఖర్వమైంది .మిగిలిన బృందమంతా వచ్చి చేరగా అందరూ కలిసి మళ్ళీ వెతుకులాట మొదలెట్టారు .ఈ ఏకైక వనిత రాధ అని తర్వాత సాహిత్యకారులు రాశారు .ఆకాశం లో మబ్బులు కమ్మాయి. చంద్రకా౦తి తగ్గింది.అందరు తిరిగి బయలు దేరిన చోటికే చేరుకొన్నారు .తాము కృష్ణుడితో మాట్లాడిమాటలు ,ఆయనతో తిరిగిన ప్రదేశాలు ఆ అనుభవాలు గుర్తు చేసుకొంటూ ,ఇంటిని మరచి ,ఆయన గుణగానం చేస్తూ పరవశించి పోతున్నారు –
‘’తన్ మనస్కాస్ ,తదాలాపాస్ తద్విచేస్టాస్,తదాత్మికాః-తద్గుణమేవ గాయన్త్యః నాత్మాగారాని సస్మరుః’’
ఇదీ గోపికల ఉత్కృస్ట ప్రేమ భక్తి.ఇదే అన్నిభక్తులలో ఉన్నతమైనది.దీనినే గీతలో కృష్ణపరమాత్మ వివరించాడు –
‘’తద్బుద్ధయాస్ తదాత్మనాస్,తన్నిస్టాస్ తత్ పారాయణాః-గచ్చన్త్య పునరా వృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః’’
అంటే ఎవరు తమబుద్ధి మనసు దాని(బ్రహ్మం )పై ఉంచుతారో ,ఎవరి ఆత్మ అదో,దానిపైనే దృష్టి పెడతారో,అదే తమ గమ్యమని భావిస్తారో వారు పునర్జన్మ లేని పరమపదం పొందుతారు .ఇంతటి ఉత్కృస్ట భక్తీ గోపికలది కనుక ఉత్తమ భక్తీ తత్పరులకు గొప్ప ఉదాహరణగా బృందావన గోపికలు నిలబడ్డారు .నిస్వార్ధ భక్తికి గోపికలే ఉదాహరణ .కర్మ కన్నా ఈ జ్ఞానభక్తి వారిని ఉన్నతులను చేసి పరమాత్మ సాన్నిధ్యానికి చేర్చింది .మనసులను గోపికలు అర్పించినట్లుగా ఎవరూ అర్పించేనే లేదు .
నారాయణ ఉపనిషత్ శ్లోకం –
‘’ఐక్యం తే దాన హోమ వ్రతనియమ తపస్సాంఖ్య యోగైర్దురాపం –త్వత్సంఘేనైవ .గోప్యయాః కిల సుకృతి తమః ప్రాపురానంద సంద్రం –భక్తే శ్వన్యే సుభూసస్వపి బహు మనుషే భక్తిం ఏవ త్వమాసాం –తన్మే త్వద్భక్తిం ఏవ దృఢయా హర గదాన్ కృష్ణ వాతాలయః ‘’
దానం జపం తపం నియమ౦ యోగం సాంఖ్యం మొదలైనవి ఏవీ గోపికల ఉత్కృస్ట భక్తికి సాటిరావు .నీతో సామీప్యం ,సఖ్యం వారిని ఏ భక్తునికన్నా సాటి రాని వారిని చేసింది అని గురవాయూర్ కృష్ణుని స్తుతించింది మేల్ పుతూర్ నారాయణ భట్టాత్రి రచించిన ‘’నారాయణీయ౦’’ .
సశేషం
శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-18-ఉయ్యూరు

