గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4
352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు –ఆర్ .రామ చంద్రన్ (1960-)
సంస్కృతం లో మహా పండితుడైన ఆర్ .రామ చంద్రన్ 1960లో తమిళనాడు లో జన్మించాడు చెన్నైలో రామకృష్ణ వివేకానంద సంస్కృత శాఖలో పని చేశాడు .దక్షిణ భారత సంస్కృత భారతికి ఉపాధ్యక్షుడు .గొప్ప సంకీర్తనా చార్యుడైన తండ్రికి తగిన వారసుడైన ప్రొఫెసర్ రామ చంద్రన్,చిన్ననాటి నుండి సంస్కృతం ఆసక్తిగా నేర్చాడు .సంస్కృత భాష బోధించటం లో నిష్ణాతుడని పించుకొని విద్యార్దుల అభిమానం గొప్పగా పొందాడు .సంస్కృతం లో లోతైన పాండిత్యం ఉన్నా అతి తేలిక భాషలో సంస్కృతం బోధించటం ఆయన ప్రత్యేకత .సంస్కృత శిబిరాలలో ఆయన ప్రసంగాలు మహా ఆసక్తిగా ఉండేవి .సాధారణ ప్రజలకోసం వాడుక సంస్కృత భాషలో వందలాది శిబిరాలు నిర్వ హించాడు .సంస్కృతం బోధించేటప్పుడు సంస్కృతం మాత్రమే వాడేవాడు .మరే భాష సాయం తీసుకొనే వాడు కాదు .చిన్న పిల్లాడు తల్లి భాష యెంత సహజంగా నేర్చుకొంటాడో ,అంతే సహజం గా రామచంద్రన్ సంస్కృత బోధన చేసి తన ప్రత్యేకత చాటుకొని ,సంస్కృత భారతి కి విపులమైన ప్రచారం చేశాడు .ఆయన చేసిన సంస్కృత భాషా సేవకు ‘’సుందరం ఫైనాన్స్ స్పిరిట్ ఆఫ్ మైలాపూర్ ‘’పురస్కారం అందుకొన్నాడు .
353-సంస్కృత వార్తా పత్రిక –సుధర్మ
సంస్కృతం లో ప్రచురణ పొందుతున్న ఏకైన దిన పత్రిక’’సుధర్మ ‘’కర్ణాటకలోని మైసూర్ నుండి వెలువడుతుంది .1970స్థాపింపబడిన ఈ సంస్కృత వార్తా పత్రిక సర్క్యు లేషన్ అంతా పోస్ట్ ద్వారానే జరగటం మరో విశేషం .దీనికి కారణం పత్రిక స్తాపించినపుడు దీన్ని అమ్మటానికి ఏ న్యూజ్ ఏజెంట్ కూడా ముందుకు రాకపోవటమే .అప్పటినుంచి కావాల్సిన వారికి పత్రికను పోస్ట్ లో పంపటం మొదలు పెట్టారు .అదే ఇప్పటికీ కొనసాగుతోంది .ప్రస్తుతం ఈపత్రిక నిధులు లేక దిన దిన గండంగా నడుస్తోంది
కలాలె నడదూర్ వరద రాజ అయ్యంగార్ సంస్కృత భాషా వ్యాప్తికోసం ‘’సుధర్మ ‘’సంస్కృత దిన పత్రిక ప్రారంభించాడు .సంస్కృత పుస్తక ప్రచురణలో అనుభవమున్న ఆయన ,తనవద్ద పనిలేకుండా పడిఉన్న మెషీన్లకు పని కల్పించే ఉద్దేశ౦ తో ఈ పత్రికా ప్రచురణకు పూనుకొన్నాడు .ఈ విషయాన్ని మిత్రులకు, సన్నిహితులకు చెబితే యెగతాళి చేసి,దిన పత్రిక కు కావలసిన సంస్కృత పదజాలం లేదని ,సాహసం చేయవద్దని నేల విడిచి సాము చేయవద్దని హెచ్చరించారు .కాని అభిన౦దించి,ప్రోత్సహించిన వారిలో కన్నడ దిన పత్రిక సంపాదకుడు అగరం రంగయ్య ,రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ పి.నాగాచార్ ఉన్నారు వీరి ప్రోత్సాహం తో వరద రాజ అయ్యంగార్ ధైర్యంగా మొదటి దిన పత్రిక 1970 జులై 14న మహా రాజా సంస్కృత కాలేజి లో ఉన్న ‘’గణపతి తొట్టి ‘’నుంచి ప్రచురించాడు .దీనితో పాటు నాటి కేంద్ర సమాచార మంత్రి ఐ కే గుజ్రాల్ ను ఒప్పించి రేడియో లో రోజూ సంస్కృత వార్తలు ప్రసారం చేయించటానికి ఒప్పించాడు . ఇలా రెండు మాధ్యమాల ద్వారా సంస్కృత ప్రచారానికి వరద రాజ అయ్యంగార్ దోహద పడినందుకు గీర్వాణ వాణి హృదయపూర్వకం గా ఆయనను అభినందించి ఉండాలి .
1990లో అంటే పత్రిక స్థాపించిన 20ఏళ్ళకే అయ్యంగార్ చనిపోయాడు .అప్పటినుంచి పత్రిక మైసూర్ లోని రామ చంద్ర అగ్రహారం నుండి వెలువడుతోంది .సుధర్మ పత్రిక చందా దారులు సంస్కృతం పండితులు ,సంస్కృత విద్యార్ధులు .పత్రిక సర్క్యులేషన్ 3,500 కాపీలు .వార్షిక చందా 500 రూపాయలు .దేశమంతటా పత్రిక లైబ్రరీలకు,విద్యా సంస్థలకు ,చందాదారులకు పోస్ట్ లోనే పంపబడుతుంది .అమెరికా ,జపాన్ దేశాల కూడా పత్రిక పంపబడుతోంది .వీరికి సాలు సరి చందా రుసుము 50 డాలర్లు .
పత్రిక అమ్మకాలపై వచ్చే లాభం అత్యంత స్వల్పమే .కాని సంస్కృతం పై ఉన్న అభిమానం ,జర్నలిజం పై ఆసక్తి ఉన్న సంపత్ కుమార్ పత్రికను కొనసాగించాలనే దృఢ సంకల్పం లో ఉన్నాడు .పత్రికను లాక్కు రావటానికి కిందా మీదా పడుతున్నాడు .పత్రిక సంస్కృతభాష నేర్వటానికి వ్యాప్తికి ,జ్ఞాన సముపార్జనకు చక్కగా తోడ్పడుతోంది .2011జులై 15న సుధర్మ 42వ వార్షికోత్సవం మైసూర్ లో ఘనంగా నిర్వహించారు .ఈ ఉత్సవం లో వక్తలందరూ సంస్కృతం లోనే సంభాషించి,అరుదైన ప్రత్యేకత చాటారు.సంస్కృత విద్వాంసులను ఘనంగా సత్కరించి భాషపట్ల తమకున్న అభిరుచిని తెలియజేశారు .ఇప్పడు ఈ పత్రిక ఆన్ లైన్ లో కూడా లభ్యమౌతోంది .
ఇప్పుడు సుధర్మ ప్రపంచం లోనే మొట్టమొదటి ‘’ఇ పేపర్’’దినపత్రిక అయి రికార్డ్ సాధించింది .హాయిగా ఉచితంగా చదువుకొనే సౌలభ్యం కలిగించి చరిత్ర సృష్టించింది ..చదువరులకోసం సంస్కృతం లో క్రాస్ వర్డ్ పజిల్ తోపాటు అనేక ఆకర్షణీయ అంశాలు అందిస్తోంది .స్థాపకుడు వరద రాజ అయ్యంగార్ ఆత్మ ఎంతగా పులకిస్తోందో ? ఆ మహామనిషి పూనిక ,సాహసం చిరస్మరణీయ౦ కావాలంటే వదాన్యులైన సంస్కృతాభిమానులు సుధర్మ యాజమాన్యానికి చేదోడుగా నిలవాలని కోరుతున్నాను .
మీ కోసం సుధర్మ వివరాలు
http//sudharma epapertoday .com
Email-sudharma.sanskrit daily @gmail.com
www.sudharma sanskrit daaily .in
సశేషం
క్రిస్మస్ శుభా కా౦క్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-12-18-ఉయ్యూరు .
.

