ధ్వని కోణం లో మను చరిత్ర –9
మూడో ఆశ్వాసం లో చంద్రోదయాన్ని వర్ణిస్తూ పెద్దన కవి –‘’మరున కొసంగ గాలము తమశ్చట గాటుకగా ,నవోదయ స్పురదరుణ’’పద్యం లో చీకటులు ముసిరిన వెంటనే ఉదయారుణ కిరణ కాంతులు ఆకాశం లో ప్రసరించి ,అక్కడక్కడ చుక్కలు కనిపించి ,క్రమంగా చంద్రోదయం అయిందని చెప్పాడు. అంటే ,వెంటనే మన్మధుడు విజ్రు౦భి౦చాడని ధ్వని. ఇది వాక్య జ్యోతకమైన వస్తు ధ్వని .’’వలపుల పల్లవుం డొకడు వట్టి చలంబున నేప దీనయై-యలుకలు దీర్చి దీర్చి ‘’అనే స్వరోచిని ఏనుగు పై ఊరేగించే టప్పుడు,పౌరా౦గనలు కుతూహలం ఆపుకోలేక చేసే విలాస చేష్టలను వర్ణించే పద్యం .ఇక్కడ అతని లోకోత్తర సౌందర్యం ధ్వని స్తోంది .దీన్ని ప్రబంధ జ్యోత్య ధ్వని అంటారు శాస్త్రిగారు .సూర్యాస్తమయాన్ని వర్ణిస్తూ చెప్పిన ‘’వికసిల్లం బ్రజ చక్రపాలనము గావి౦ చెం,గార వ్యావృతి౦ ‘’పద్యం లో సూర్యుడికి రాజుకు ఉపమాన ఉపమేయ భావం కల్పించటం చేత ఉపమాలంకార ధ్వని ఏర్పడిందని ,ఇందులో చక్రవాకం అనే పదాన్ని తీసేస్తే అర్ధ స్పూర్తి రాదనీ కనుక ఇది శబ్ద శక్తి మూల ధ్వని అని తేల్చారు డా శాస్త్రి గారు .
‘’అచటి విప్రులు మెచ్చ రఖిల విద్యాప్రౌఢి-ముదిమది దప్పిన మొదటి వేల్పు ‘’సీసపద్యం లో అతి శయోక్తి అలంకారాలు దట్టించాడు కవి .అక్కడి క్షత్రియులు ఇతర దేశ క్షత్రియులకంటే గొప్పవారని ఉత్కర్ష పర్యవసాయక మగు వ్యతిరేకము ధ్వనిస్తోంది .కనుక ఇక్కడ అల౦కారం చే వచ్చేఅలంకార ధ్వని .’’ఉరు దరీ కుహర సుప్తోత్ద శార్దూలముల్ –ఝరవారి,శోణిత శంక ద్రావ’’పద్యంలో సూర్యాస్తమయ వర్ణన ఉంది .శార్దూలాలకు శోణిత భ్రాంతి ,మృగాలకు దావ పావక భీతి ,ముని జనులకు కాషాయ భ్రాంతి ,దేవతలకు హేమాద్రి భ్రాంతి కలిపించటం చేత ఇదంతా భ్రాంతి మదలంకార స౦సృష్టిధ్వని .పర్యాయ అలంకారం ధ్వనిస్తోంది .ఒకేవస్తువు అనేక చోట్ల ఉంటె పర్యాయాలంకారం .మొత్తం మీద ఇందులో కవి ప్రౌఢోక్తి వలన ఏర్పడిన అర్ధ శక్తి మూలక అల౦కార ధ్వని .’’దట్టంపు నీకట్టినట్టి చెంగావికి –బాగుగా లేదని కేల బయట నిమిరె-గోరంబో గోళ్ళ నిక్కువపు గె౦పో?యని – చెయిపట్టి నయమున సెజ్జ సేర్చె’’పద్యంలో మనోరమ ఆలంబ విభావం .ఆమె అతిలోక సౌ౦దర్యలావణ్యాలు ,ఏకాంత ప్రదేశం ఉద్దీపన విభావాలు ,సెజ్జ చేర్చటం ,చెయ్యి పట్టుకోవటం,అధరాస్వాదనం , ఆశ్లేషించటం అనుభావాలు వలన మనోరమపై స్వరోచికి రతి భావం కలిగింది కనుక ఇక్కడ సంభోగ శృంగార ధ్వని ఉందని శాస్త్రి గారి ఉవాచ .’’అక్కట !వాడు నాతగుల మారడి సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచి పోయె,దరి జేరగ రాని,వియోగ సాగరం ‘’లో ప్రవరుని చేత తిరస్కృత అయిన వరూధిని ఆత్మనింద ఉంది .అతనిపై ఆమెకున్న రతి కోరిక వ్యన్జనమైంది .కనుక ఇది విప్రలంభ శృంగార రస ధ్వని అని తేల్చారు ..రాక్షసుడు మనోరమ వెంటపడగా ఆక్రోశిస్తూ ఆమె ‘’ఆ విపినా౦తరమున హా –హా వనిత ననాథ,నబల ,నార్త’,విపన్నం’’చెప్పిన కంద పద్యం లో శాస్త్రిగారికి ‘’దయానక ధ్వని ‘’కనిపించింది .దేవాసి అనే గంధర్వుడు పారర్షిని ‘’పోపో విప్రాధమ ‘’మొదలైన తిట్ల దండకం చదవటం లో అతని ఉగ్రతభావం ధ్వనిస్తోందికనుక ‘’నీ వైశిష్ట్యము ,తిట్టులన్ ,మేరయునే నీకంటే’’పద్యం లో భావ ధ్వని ఉందంటారు శాస్త్రీజీ .
మనోరమ యెడల జీర్ణ ముని చూపిన అమానుషత్వాన్ని చెప్పే –‘’జననాథ !ఏమి చెప్పుదు— తన చేతి నాగబెత్తము గొని –పసరము గొట్టినట్లు గొట్టె నదయుడై ‘’లో స్త్రీపట్ల అంతటి క్రోధం చూపటం అనుచితమని రౌద్రరసాభాసం కనిపిస్తోందికనుక ఇక్కడ రౌద్ర రసాభాస ధ్వని ఉందని చెప్పారు డా .కోరిడే ‘’అంతట బ్రాచి నిశాపతి ‘’అనే కంద౦ లోనూ ,ఈ చందమే ఉందన్నారు .‘’అనిన బ్రసన్నుడై ,ముని కరాబ్జములన్ నను నెత్తి వత్స !మ-త్సునిశిత శాప శూల హతి స్రుక్కితిగా’’పద్యం లో బ్రహ్మ మిత్రుడు తన్ను శరణు కోరిన ఇందీవరాక్షు ని అనుగ్రహించే సందర్భం లో భావ శాంతి ధ్వని ఉందన్నారు .’’తెచ్చుటయు కేళిభవనము –చొ చ్చెనొ,చొరదో యనంగ సుదతుల నీడంజొచ్చి ‘’పద్యం మనోరమ లజ్జ ,ప్రేమించిన వాడి అతిలోక సౌందర్యం ఆస్వాదించాలనే ఉత్కంఠ ఉన్నదికనుక ఇక్కడ భావ సంధి ధ్వని ఉందని విశ్లేషించారు .మాయ ప్రవరుని దగ్గరకు వెళ్ళేటప్పుడు-‘’తొలుదొల్త వాని గన్నుల గా౦చి నప్పుడ –పల్లవాధర గుండె జల్లుమనియె-నట రెండు మూడ౦ జల రుగు నప్పుడ కాళ్ళ –బంకజాక్షికి దొట్రు పాటు గదిరె’’’ సీసపద్యం లో ఆమె తడబాటు ,ఆనందం చెమటపట్టటం ,అతడి ముఖం చూసి పొందిన హర్షం ఆన౦ద బాష్పాలు రాలటం మొదలైనవాటిలో ‘’భావ శబలతా ధ్వని ‘’ ఉందని పసిగట్టారు శ్రీ రాజన్న కవి శేఖర ఆలంకారిక మహోదయులు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-19-ఉయ్యూరు

