గౌతమీ మాహాత్మ్యం -38
53-పూర్ణాది తీర్ధం
గంగకు ఉత్తరాన పూర్ణ తీర్ధముంది .దీనిలో హరి హరులుంటారు .పూర్వం కల్పం మొదట్లో ఆయువు కుమారుడు ధన్వంతరి ఉండేవాడు .ఆశ్వమేధాది అనేక యజ్ఞాలు చేసి ,ఎన్నో దానాలు ఇచ్చి పుష్కలంగా భోగభాగ్యాలతో వర్ధిల్లి ,చివరికి వైరాగ్యం కలిగి ,గంగా తీరం చేరి తీవ్ర తపస్సు చేశాడు .ఒకప్పుడు ధన్వంతరి రాజు చే ఓడి౦ప బడిన’’ తమాసురుడు’’ అనే రాక్షసుడు భయం తో వెయ్యేళ్ళు సముద్రం లో దాక్కొన్నాడు .ధన్వనతరి వైరాగ్యం ,అతనికొడుకు రాజ్యానికి రావటం తెలిసి వాడు సముద్రం నుంచి బయటికి వచ్చి, తపస్సులో ఉన్న ధన్వంతరిని చంపాలనుకొన్నాడు .
తమాసురుడు స్త్రీ వేషం లో ,రాజు దగ్గరకొచ్చి వివిధ భంగిమలతో ,గాన నాట్యాలతో ఆకర్షించే ప్రయత్నం చేసింది .చాలాకాలం గమనించి ఆమెపై దయకలిగి,ఆమె ఎవరో ఎందుకు ఒంటరిగా అడవిలో ఆనందంగా ఎవరికోసం ఎదురు చూస్తున్నదో అడిగాడు .ఆమె తెలివిగాఅతనికోసమే తన తపన అంతా అన్నది .కరిగిపోయి రాజు ఆమెకు వశమయ్యాడు .అదే అదను అనుకోని తమాసురుడు ధన్వంతరి తపస్సు నాశనం చేసి వెళ్ళిపోగా, బ్రహ్మ తపో భ్రస్టు డైన అతన్ని చేరి ,మనస్తాపం పోగొట్టే మాటలతో ఓదార్చి ,ఇంతటి పనికి పూనుకొన్నవాడు అతని పూర్వ శత్రువైన తముడు అనీ ,అతని దుఖం తీరాలంటే విష్ణు మూర్తి గురించి తపస్సు చేయమని బోధించాడు .
ధన్వంతరి విష్ణుమూర్తి ని ‘’జయ భూతపతే నాద ,జయ పన్నగ శాయినే ,-జయ సర్వగ ,గోవింద జయ విశ్వ కృతేనమః ‘’ ,’’జయ జన్మద జన్మిస్థపరమాత్మన్నమో స్తుతే –జయ ముక్తిద ముక్తిస్త్వం ,జయ భుక్తిజ కేశవ’’-త్వమేవ లోక త్రయ వర్తి జీవన నికాయ సంక్లేశ వినాశన దక్ష –శ్రీ పుండరీకాక్ష కృపానిధే త్వం ,నిధేహి ,పాణిం మమ మూర్ధ్ని విష్ణో’’అంటూ స్తుతించాడు .మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమికావాలని అడిగాడు .’’నాకు స్వర్గ రాజ్యం కావాలి ‘’అన్నాడు .తధాస్తు అని విష్ణువు అంతర్ధానమయ్యాడు .ధన్వ౦తరి స్వర్గ లోకాధిపతి అయ్యాడు .ఇంద్రుడు అప్పటికే మూడు సార్లు పదవి కోల్పోయాడు .మొదటి సారి వృత్రాసుర సంహారం లో నహుషుని చేత ,రెండవసారి సింధు సేనుని వధ కారణంగా ,మూడో సారి అహల్యా జారత్వం వల్ల ఇంద్రపదవి పోగొట్టుకొన్నాడు ..
పదవిలేక ,వ్యాపకం లేక దిగులుతోదేవ గురువు బృహస్పతిని చేరి మొర పెట్టుకొన్నాడు.బ్రహ్మ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాడు ఆయన .ఇద్దరూకలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్లి ప్రార్ధింఛి,బ్రహ్మను ఎందుకు శచీపతికి ఇలా జరుగుతోందని ప్రశ్నించాడు .బ్రహ్మ అంతర్ దృష్టితో చూసి ఇంద్రుడు ‘’ఖండ ధర్మం ‘’అనే దోషం తో పదవి పోగొట్టుకొన్నాడు అన్నాడు .నివారణ ఉపాయం అడిగారు .అన్నిటినీ పరిష్కరించేది గంగానది కనుక అక్కడికి వెళ్లి హరి,హర ధ్యానం చేయమని చెప్పాడు . అల్లాగే చేశారు –
‘’నమో మత్చ్యాయ కూర్మాయ వరాహాయ నమో నమః –నారసింహాయ దేవాయ వామనాయ నమోనమః-నమోస్తు హరరూపాయ ,త్రివిక్రమ నమోస్తుతే –నమోస్తు బుద్ధరూపాయ ,రామ రూపాయ కల్కినే –తావన్నిః శ్రీకతా పుంసాం మాలిన్య౦ దైన్య మేవమే –యాపన్న యాన్తిశరణం హరే త్వాం కరుణార్ణవం’’అని ఇంద్రుడూ –
‘’సూక్ష్మం పరంజ్యోతి రన౦త రూప మోంకార మాత్ర౦ ప్రకృతేఃపరం యత్ –చిద్రూప మానంద మయం సమస్త మేవ౦ వదంతీశ ముముక్ష్వవస్త్వాం –ఆరాధ యంత్యత్ర భవంత మీశం ,మహా మఖైః పంచభి రప్య కామాః-సంసార సింధోః పరమాప్త కామా ,విశన్తి దివ్యం భువనం వపుస్తే ‘’
‘’స్థూలం చ సూక్షం త్వమనాది నిత్యం ,పితా చ మాతా యదసచ్చ సచ్చ-ఏవం స్త్వతో యః శ్రుతిభిః పురాణై ర్నమామి సోమేశ్వర మీశితారం ‘’అంటూ బృహస్పతీ ఇద్దరూ ఒకరి తర్వాత గుక్క తిప్పుకోకుండా స్తుతించారు.ప్రసన్నులైన హరి హరులు వరం కోరుకోమన్నారు .ఇంద్రుడు ‘’శివా !నా రాజ్యం మాటిమాటికీ వస్తో౦ది ,పోతోంది .దీనికి నేను చేసిన పాపం ఏదైనా ఉంటె ఉపశమింప జేసి ,నా సంపద రాజ్యం సుస్థిరంగా ఉండేట్లు అనుగ్రహించు .సరే నని వారిద్దరూ ముగ్గురు దేవతలుకల గౌతమీనది వా౦ఛితాలు తీర్చటానికి సమర్ధురాలు .అందులో
‘’త్రి దైవత్యం మహా తీర్ధం గౌతమీ వాంచిత ప్రదా-తస్యామనేన మంత్రేణ కురుతాం స్నాన మాదరాత్ ‘’-‘’అభిషేకం మహేన్ద్రస్య మంగళాయ బృహస్పతిః –కరోతు సంస్మరన్నాహం సంపదాం స్థైర్య సిద్ధయే ‘’-‘’ఇహ జన్మని పూర్వస్మిన్ యత్కించి త్సు కృతం కృతం –తత్సర్వం పూర్ణతా మేతు గోదావరి నమోస్తుతే ‘’అనే మంత్రాలు చదువుతూ పవిత్ర స్నానాలు చేయామని చెప్పగా వాళ్ళిద్దరూ అలాగే చేశారు .
దేవ గురుడైన బృహస్పతి ఇంద్రునికి మహాభి షేకం చేశాడు .ఇంద్రుని అభిషేక జలం తో పుట్టిన నది ‘’మంగళా ‘’అనే పేరుతొ పిలువబడింది .దానితో కలిసిన గంగా సంగమం పవిత్రమైనది .ఇంద్రుని స్తోత్రానికి శ్రీహరి ప్రత్యక్షమై ఇంద్రుని కోరిక తీర్చగా త్రిలోక సంమితమైన భూమిని పొందాడు .ఈ తీర్ధమే ‘’గోవింద తీర్ధం ‘’.దేవేంద్రుడు సుస్థిరమైన ఇంద్ర పదవికోసం మహేశ్వరుని స్తుతించి ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి అభిషేకించాడు .దీన్ని దేవతలంతా పూజించి అభిషేకించారు .ఇదే పూర్ణ తీర్ధం గా ప్రసిద్ధి చెందింది అని నారదునికి బ్రహ్మ వివరించాడు .
సశేషం
ఉయ్యూరు వీరమ్మతల్లి -తిరునాళ ప్రారంభ శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-2-19-ఉయ్యూరు

